ఆత్మగౌరవ పోరాట దివిటీ – నాగప్ప గారి సుందర రాజు

 ఆత్మగౌరవ పోరాట దివిటీ – నాగప్ప గారి సుందర రాజు

నేడు డా. నాగప్పగారి సుందర్ రాజు 53 వ జయంతి 

భూమిపుత్ర ,సాహిత్యం:

సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ దళిత కథా రచయిత డా. నాగప్పగారి సుందర్ రాజును తలచుకోవడం , తెలుగు సాహితీ కవితా ప్రియులకు ముఖ్య కర్తవ్యం.దళిత ఆత్మగౌరవ పోరాటం నుంచి పుట్టిన కవి,వక్త ,విద్యావేత్త,అక్షర యోధుడు మన సుందరరాజు. అట్టడుగు కులమైన మాదిగల అంతరంగాలను మధించి కథలుగా వినిపించిన రచయిత. వ్యక్తిగత సంబందాలు చెడిపోకుండా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళే క్రమంలో మాదిగ తత్వాన్ని విశ్వజనీనం చేయాలని , దళిత సాహిత్యం తనను తాను దగ్ధం చేసుకొని ఆ బూడిదలోంచి మండే సూర్యుడిలా వికసిస్తుందని దళిత వాద సాహిత్యానికి గొప్ప చేర్పుగా మాదిగ సాహిత్య వేదిక ను 1997 వ సం ఆవిర్భవింప చేశాడు.ఆధునిక దళిత సాహిత్యానికి ఆద్యుడు సుందరరాజు అని చెప్పవచ్చు.

ద్రావిడ భాషా సంస్కృతి మూలాలను ప్రశ్నించి తెలుగు – మాండలికాలతో తన రచనల ద్వారా నూతన శకాన్ని ఆవిర్భవింపచేశాడు.ఈ సమాజంలో సాహిత్యంలో మా స్థానంఏది అని ,మా జీవిత విధానాలు ఎక్కడ అని పిలకపట్టి నిలదీసి సాహిత్య పరిశోధకుడిగా,కవిగా,కథకుడిగా ఎదిగిన ఈయన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సెంట్రల్ యూనివర్సిటీలో నిలువెత్తు ప్రశ్నగా మారి ఉద్యమమై విజృంభించాడు.బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా,రాజకీయ,ఆర్థిక,సామాజికంగా వెనుక బడిన బహుజనులను చైతన్యం చేయడానికి “మా ఊరి మైసమ్మ” నవలను రచించాడు.

బాల్యం – విద్యాభ్యాసం:

కర్నూలు జిల్లా అలూరు తాలుకాలో పెద్ద నరసమ్మ , రంగన్న దంపతులకు మే 30 , 1968 వ సంవత్సరంలో నేమకల్లు అనే గ్రామంలో జన్మించాడు.1 నుండి 5 వ తరగతి వరకు తన పుట్టిన ఊరిలోనే చదివాడు.డిగ్రీ బి.ఎ. అనంతపురము ఆర్ట్స్ కళాశాలలో చదివాడు.యం.ఏ,యం.ఫిల్ ,పీ.హెచ్.డీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేశాడు.అక్కడే జె.ఆర్.ఎఫ్ సాధించాడు. 1999 వ సంలో తెలుగు ఆచార్యులుగా అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో ఉద్యోగంలో చేరారు.అ ఆల స్థానం నుంచి ఆచార్యులు స్థాయి వరకు ఎదిగిన క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆత్మగౌరవ పోరాటాలు చేశారు. ఈయన హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో చదివేటప్పుడు,తన విద్యను,తన ఎదుగుదలను ఓర్వలేని సనాతన బ్రాహ్మణవాదం మీద విరుచుకు పడ్డాడు.తనకు పి.హెచ్.డి. లో సీటు ఇవ్వకుండా వున్నందుకు ఆచార్యులతో వాదనకు దిగాడు.దానికి బదులు దేశద్రోహి అనే బిరుదు నిచ్చారు. ఈ క్రమంలో ఈ విధంగా తన చండాల చాటింపు కథలో చెప్తాడు.
అమ్మ చెమటను అక్షరాలుగా చేసుకొని                                                                                                                   అయ్యవార్లకు అంజలి ఘటించా
అందుకే నేను దేశ ద్రోహిని ,
వెనక్కి వెళ్ళమంటే వినకుండా – ముందడుగేశాను  అందుకే నేను దేశద్రోహిని
చెప్పులు చేతిలో పట్టుకొని నడవాల్సిన వాడిని
బూట్లు వేసుకొని స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నా
అందుకే నేను దేశద్రోహిని ,
ఊరు వదిలి పొమ్మంటే ఊరెవ్వరిదని ప్రశ్నించా ?
అందుకే నేను దేశద్రోహినీ
అని తన ఆవేదనను ఆక్రోశాన్ని బయట పెట్టాడు.ఆ అవమానాలు, అవస్థల నుంచి పుట్టిందే దళిత సాహిత్యం.మాదిగ సాహిత్యం అప్పటివరకు ఉనికిలో ఉన్న తెలుగు సాహిత్యం,దళిత సాహిత్యం నుంచి జూలు విదుల్చుకొని గర్జించే సింహంలా వచ్చిందే మాదిగ సాహిత్యం.అచ్చం మాదిగల జీవితం,వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ యాసైన భాష,వేష ధారణలను మాదిగోడు అనే కథా సంకలనంలో వివరించారు.ఈ మాదిగోడు పుస్తకం 10 కథల సంకలనం. దీనిని 1997 డిసెంబర్ నెలలో రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు మాట్లాడుతూ “మాదిగ సాహిత్యం – అనేది ఒక సృష్టి మెరుపు కాదు, సూర్యోదయం అని వ్యాఖ్యానించారు.

 

మాదిగోడు కథలు ఒక విప్లవ కెరటం , ఒక సుందర చైతన్యం ప్రముఖ రచయిత , విమర్శకులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు పేర్కొన్నారు.రాజధాని నగరంలో ఎంతోమంది ప్రముఖుల మధ్యలో ఒక స్వీపర్ చేత ఈ పుస్తకం ఆవిష్కరింపచేయడమనేది సుందర్ రాజు గారి ప్రత్యేకతను చాటుతుంది.అగ్రవర్ణాల కుల అహంకారానికి అణచివేయబడి , అంటరాని వాళ్ళు వెలి వేయబడి ఎన్నో అవమానాలను భరిస్తూ ఎన్నో ఆటంకాలను దాటుకొని పైకి ఎదిగే క్రమంలో సుందర్ రాజు అనుభవించి రచించిన స్వీయ అనుభవాల సారమే ఈ మాదిగోడు కథలు. భారతదేశంలో కులం నిజం .కులం వాస్తవం.కులాన్ని కొలవవచ్చు.కులాన్ని తూకం వేయవచ్చు.కులాన్ని పదును చేసి విత్తువేసి పంట తీయవచ్చు.కులం ప్రాణం వున్న జీవి.కులం మాట్లాడుతుంది,వింటుంది,చూస్తుంది.కులం ఈ దేశంలో ఏమైనా చేయగలదు.చెప్పులకు పట్టాభిషేకం చేసిన ఈ పుణ్యభూమిలో పందిని దశావతారాల్లో చేర్చి పూజించే ఈ పవిత్ర భూమిలో సాటి మనిషిని అంటరాని వాడని హీనంగా చూడటం ఎంత భాదకర విషయమని ఈ కుల వర్గాలను తెచ్చిందెవరనీ ఈయన ఆవేశంగా ప్రశ్నిస్తాడు.

ఈయన మాటల్లోను కవిత్వం లోనూ,రాయలసీమ కసి,కరుకుదనం మాదిగోడి నిర్భయత్వం,నిక్కచ్చి తత్వం కనిపిస్తాయి.మాదిగ శబ్దాన్ని తిరుమంత్రంలా మారు మ్రోగించి అటు వైదిక సాహిత్యానికి,ఇటు మాదిగ సాహిత్యాన్ని ప్రత్యామ్నాయంగా నిలబెట్టాడు . గుండెడప్పు సంకలనంలో దళిత ధ్వనిని వినిపిస్తూ పరుగుల ప్రపంచంలో అడుగులు నేర్చుకుంటున్న వాడిని…
ఓర్పుతో నేర్పుతో ఔరా అనదగిన అస్త్ర విద్యా వైద్యున్ని ….

గురుదేవుడు పరుగున వచ్చి భిక్షాందేహి – అంటే ,భవిష్యత్తును బందించి బ్రొటనవేలితో మహాభారతానికి నాంది వాక్యం రాశాను.అయినా ఈ నాలుగు శతాబ్దాల నగరం నన్ను గుర్తించలేదని వాపోతాడు.

పూచే పువ్వు గంధం నేను –
వీచేగాలి కదలికను నేను –
నడిచే చరిత్ర రచయితను నేను అంటారు . నేను అన్నమాట దళితులకెప్పుడూ బహువచనమే. ఏకవచనాలు ఏకచత్రాధిపత్యాలు తెలియని వాళ్ళం మేము. మందిలోనే మా ప్రతిబింబాన్ని చూసుకొనే వాళ్ళం . మా “ఆత్మ గౌరవంలో ఎవరికైనా అహంకారం కనిపిస్తే అది వారి వర్ణ అంధత్వం అయి వుండాలి అని చెప్తారు . భారతదేశంలో మొట్టమొదటి సారిగా కుల ప్రాతిపదికన సాహిత్య వేదికను స్థాపించి,సాహిత్య ఉద్యమాన్ని నడిపిన ఘనత మాదిగ సాహిత్య వేదికకే దక్కింది.1995 వ సం లో గుండెడప్పు – కవితా సంకలనాన్ని ఆవిష్కరించాడు.డప్పు కొట్టిన చేత్తో డొక్క విలుస్తాం చెప్పులు కుట్టిన చేత్తో చరిత్రను తిరగరాస్తాం అవమానింప బడ్డ చోట – అరికాళ్ళకు అధికారమిస్తాం. అంటూ మాదిగ సాహిత్య వేదిక చాలా స్పష్టంగా తన మానిఫెస్టోని ప్రకటించింది .

ఈ గుండెడప్పు సంకలనం ద్వారా ఎంతోమంది దళిత యువ కవులను పరిచయం చేశాడు. కవి సమ్మేళనాలు నిర్వహించాడు.డా. కత్తి పద్మారావు వంటి వారు సైతం ఇదొక చారిత్రక నేపధ్యం గల దళిత సభ అని ప్రకటించాడు.ఈయన రచనలు తక్కువే అయిన ప్రతిదీ ఒక సంచలనమే.

నేను సిద్ధున్ని కాను బుద్దున్ని కాను.నన్ను రెచ్చగొట్టకండ్రా
గాలిని నిర్భందిస్తే సుడిగాలిని సృష్టిస్తానంటూ ఆత్మ గౌరవ పోరాటాన్ని నడిపి – చైతన్య రథాన్ని లాగి , నిజాల నిప్పుల తప్పెటతో అక్షరాల చాటింపు‌ వేసి,అంటరాని జీవితాలను అక్షరీకరించి , మాండలికాలకు మహారథం పట్టి వాటిని నీలాకాశంలో ధృవతారల్లా మెరిపించాడు.దళిత సాహిత్య మంటల్లోంచి మాదిగ సాహిత్యం నిప్పు కణికలను రగిలించి.రంగరించిన మాదిగ వైతాళికుడు .మాదిగల మణిదీపం డా.కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు. కులాన్ని బహిర్గతం చేసుకోవడానికే న్యూనతా భావంతో – కృంగిపోయే అట్టడుగు కులాల వారికి సుందరరాజు ఓ చైతన్య దీపిక. తను అనుభవించి రచించి మనకు పంచిన ఈ సాహిత్య సంపదను మనం కాపాడుకుంటూ భావి తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా వుంది.ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక కొత్త కోణాన్ని చూపిన సుందరరాజు మనందరికి ఆదర్శం కావాలి .

సుందర్రాజు కథలు – వాటి వివరణ :

మాదిగోడు కథా సంకలనం మాదిగల జీవిత కథలు రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతం జన వ్యవహార భాషలో రాశారు.ఆదోని,ఆస్పరి,పత్తికొండ,చిప్పగిరి,మద్దికెర,గుంతకల్ మండలాలను చుట్టి ముట్టి వున్న అలూరు మండల కేంద్రంగా వున్న మొలగవల్లి కొట్టాల నేమకల్ గ్రామ నేపథ్యంగా ఈ కథలు సాగుతాయి.ఈ గ్రామ ప్రజలు కర్నూలు జిల్లా వాసులు అయినప్పటికీ వీటికి దగ్గర్లో వున్న అనంతపురము జిల్లా కర్నాటక రాష్ట్రంతోనూ సంబంధ బాంధవ్యాలు వుండటం వలన ఆయా ప్రాంతాల జన వ్యవహారశైలి,సాంస్కృంతిక జీవన విధానం వీరిలో కూడా కనిపిస్తుంది.ఈ మాదిగోడు కథా సంకలనంలో ప్రతి కథలోను రచయిత పాత్ర మనకు కన్పిస్తుంది.కథానాయకుడు అలంకరించుకొని ముస్తాబైన సన్నివేశాలు మనకు కనిపిస్తాయి.దళిత స్త్రీ తన పెద్దకొడుకును 5 సం.రాల వరకు జడ వేసి , పూలు పెట్టి, బొట్టు కాటుకతో సింగారించి తన ముచ్చటను తీర్చుకొనే దృశ్యాలు మనకి ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కన్పిస్తుంది .“ నల్లగున్నా నాణ్యంగా వుంటానంట నన్ను అందరూ మెచ్చుకొంటారు అని కథకుడు తనను తాను వర్ణించుకొంటాడు

ఈ కథలలో నాన్నకంటే అమ్మ పాత్రే ఎక్కువ డామినేట్ చేస్తుంది. స్త్రీ వాదిగా వుండే కథానాయకుడి తల్లిని మనం చూస్తాము.చిన్నప్పటి నుండి ధైర్యాన్ని నూరిపోసి అన్ని పనులను నేర్పించి కష్టాలను ఓర్చుకోగలిగేలా పెంచి,వ్యక్తిత్వాన్ని నేర్పిన స్త్రీ పాత్రను మనం అభినందించవచ్చు.ఈ కథలలో వరసైన వాళ్ళ మద్య జరిగే సరసమైన సంభాషణలు ఎంతో ఆప్యాయంగా,రసవత్తరంగా వుంటాయి.కథలలో కథానాయకుడు తెలిసీ తెలియక చేసే పనులు అతడు చూపించే ధైర్య సాహసాలు వరస అయ్యే వాళ్ళతో అతడి చిలిపి ప్రవర్తన పాఠకులకు నవ్వు తెప్పిస్తూ చాలా ఆకట్టుకుంటాయి. దళిత స్త్రీని లోబరచుకునే క్రమంలో అగ్రవర్ణాలవాళ్ళు పెద్ద మనిషి కాకనే ఆ అమ్మాయిని బసివిరాండ్రుగా మార్చే క్రమాన్ని ఆ తంతును పెద్ద ఉత్సవంగా జరిపే విషయాన్ని ” నడిమింటి బోడెక్క బసివరాలయ్యేదా”అనే కథలో కళ్ళకు కట్టినట్లు చూయిస్తాడు రచయిత అప్పుడు దేవాదాయ వ్యవస్థ , ఇప్పుడు బసివిని వ్యవస్థ . అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సాంఘిక దురాచారాలకు దళిత మహిళలు మాత్రమే బలి అవుతున్నారు. గొప్పోళ్ళ చిన్న బుద్దుల నుంచి పెద్దోళ్ళ పరదాల సరదాల నుండి పుట్టుకొచ్చిందే ఈ దేవాదాసీ,బసివినీ వ్యవస్థ.వీటిని పూర్తిగా రూపుమాపాలంటే ప్రతీ దళిత అమ్మాయి ఖచ్చితంగా చదువుకోవాలి.ఎన్ని అణచివేతలకు గురి అవుతున్నా దళితుల్లో కూడా సహజంగా వుండే కోరికలు,అగ్రవర్ణ స్త్రీల పట్ల వుండే ఆకర్షణలు సుందరరాజు – ఈరారెడ్డి మనుమరాలు మింద మొనుసుండాది కథలో వాస్తవికంగా చూయించాడు.

కథానాయకుడు ఉమ మీద పెట్టుకొన్న ప్రేమ,దానిని ఆరాధనగా మలచుకొని మిగుల్చుకోవటం అందరి బాల్యంలో సహజంగా వుండే స్థితే. వెట్టి చేయలేక పెద్దోళ్ళ అహంకారానికి వెట్టి చాకిరికి బలై, నిస్సహాయ స్థితిలో వ్యధకు లోనై చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలొదిలిన ” జొరేసావు” కథ అందరిలో ఆలోచనను రేకెత్తిస్తుంది. వెలివాడు,సొట్టకాళ్ళ సద్దుగుణము ,గుండెలక్క మొగుడు ఇవి కథలు.కథలో ఇవి కథానాయకుడికి వుండే అడ్డపేర్లు.గ్రామాలలో ఇవి కొంతమంది ముద్దుగా అప్యాయంగా పిలుచుకునే పేర్లు.కొందరికి ఇవి రాను రాను ఇంటిపేర్లుగా స్థిరపడి పిలవ బడుతాయి.సుందర్రాజు మాదిగోడు కథలో అగ్రవర్ణాల దౌష్ట్యాన్ని మాత్రమే కాకుండా దళిత సంస్కృతి ,సాంప్రదాయాలను వాళ్ళలో వుండే కళాత్మకతను కూడా వివరించాడు.తెలుగు కథలో,తెలుగు సాహిత్యంలో కొత్త కథలను,కొత్త కోణాన్ని కొత్త సాహిత్య శిల్పాన్ని తీసుకువచ్చి ఆధునిక తెలుగు – సాహిత్యాన్ని కొత్త మలుపు తిప్పాడు. ఈయన కథలు చదవడం ద్వారా దళిత జీవితాలను మరింత క్షుణ్ణంగా అర్ధం చేసుకోవచ్చు.ప్రతి తెలుగు సాహిత్య విద్యార్థి ఈ కథలను ఖచ్చితంగా చదవాలి .మాండలికాలకు మహారథం పట్టి,మేము నిజం మా జీవితాలు నిజం మా జీవన విధానమిది ,మా భాష నుడికారం ఇది,చేతనైతే అర్థ చేసుకొండి అని ధైర్యంగా తన యాసను,భాషను దైనందిన జీవితాన్ని ,వ్యవహారిక శైలిని ఆహారపు అలవాట్లను తనదైన శైలిలో కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడం ఒక్క నాగప్పగారి సుందర రాజుకే చెల్లింది.

కే.అరుణ.,ఉపన్యాసకులు.

ఎన్.ఎస్.బీ.ఎన్.జూనియర్ కళాశాల . ,అనంతపురం .

Related News

4 Comments

  • సమగ్రం

  • మానవతా వాది, మంచి మనిషి నాగప్ప గారి సుందర్రాజు గురించి చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది అలాగే సార్ గారు ఆశించిన తన జాతి మాదిగ ల ఆత్మగౌరవం మరింత నిలబెట్టేలా ఉంది మేడం గారు కనుమరుగయ్యే రచనలను అందించిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు జై భీమ్ జై జై భీమ్ 👌👌👏👏

  • Very good article & it will be the remarkable milestone article to young generation. Thanks to the Editor too.

    • thank you so mch anna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *