మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

 మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

జాన్‌ థాంసన్‌ స్థానంలో సత్య నియామకం

ఆమోదం తెలిపిన మైక్రోసాఫ్ట్‌ బోర్టు

భూమిపుత్ర,సాంకేతికం:

భారత సంతతికి చెందిన, తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ నూతన ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ థామ్సన్‌ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త ఛైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. 2014 లోమైక్రోసాప్ట్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తరువాత చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన థామ్సన్‌ లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్టీవ్‌ బాల్‌మెర్‌ నుండి 2014 లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల, లింక్డ్‌ఇన్‌, న్యూయాన్స్‌ కమ్యూనికేషన్స్‌, జెనిమాక్స్‌ లాంటి బిలియన్‌ డాలర్ల కొనుగోళ్లు, అనేక డీల్స్‌తో మైక్రోసాప్ట్‌ వృద్దిలో కీలకపాత్ర పోషించారు.అయితే దాతృత్వ పనులు నిమిత్తం బోర్డు నుంచి వైదొలగుతానని బిల్‌గేట్స్‌ ప్రకటించిన సంవత్సరం తరువాత ఉన్నత స్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ల మార్పులు చోటుచేసుకున్నాయి.

మరోవైపు బిల్‌గేట్స్‌ విడాకులు, ఉద్యోగితో గేట్స్‌ సంబంధాలపై దర్యాప్తు జరిపినట్లు కంపెనీ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గేట్స్‌ను బోర్డునుంచి తొలగిస్తుందా అనే దానిపై స్పందించడానికి మైక్రోసాప్ట్‌ నిరాకరించింది. ఇలా టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ బోర్డులో కీలక మార్పులు జరిగాయి. ప్రస్తుత సీఈవో సత్యనాదెళ్లకు మరిన్ని కీలక అధికారాలు కట్టబెట్టారు. ఆయన్ను బోర్డు ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఈ మేరకు ఏకగ్రీవంగా సత్య నాదెళ్ల పేరుకు ఆమోదం తెలిపారు. దీంతో బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం ఆయనకు దక్కనుంది. వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు ఆయనకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుందని మైక్రోసాప్ట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. నాదెళ్లవచ్చాక మైక్రోసాప్ట్‌లో కీలక మార్పులు చోటు చేసుకొన్నాయి. కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. అంతేకాకుండా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పనిచేసింది. దీంతో మొబైల్‌ రంగంపై ఎక్కువ దృష్టిపెట్టింది. అప్పటికే ఈ విభాగంలో ఆపిల్‌, గూగుల్‌ పనిచేస్తున్నాయి. 1975లో ప్రారంభించిన మైక్రోసాప్ట్‌లో నాదెళ్ల బాధ్యతలు చేపట్టాక భారీగా మార్పులు చోటు చేసుకొన్నాయి. చాలా కాలం పాటు కంపెనీ పర్సనల్‌ కంప్యూటర్ల సాప్ట్‌వేర్‌ ప్యాకేజీలను తయారు చేయడంపైనే దృష్టిపెట్టింది. కానీ, సత్య నాదెళ్ల మొబైల్‌ రంగం వైపు కూడా సంస్థను నడిపించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *