ఇసుక వ్యాపారంలో కోట్లు గడిస్తున్న నేతలు

 ఇసుక వ్యాపారంలో కోట్లు గడిస్తున్న నేతలు

ఇసుక రీచ్ లు

భూమిపుత్ర,విజయవాడ:

కరోనాతో ఇంతకాలం ఇసుక వ్యవహారం పక్కకు పోయింది. నిర్మాణాలకు ఇసుక అలభ్యత కారణంగా పనులు నిలచిపోయాయి. అలాగే ఇసుకను వైకాపా నాయకులు తమ ఆదాయ వనరుగా మార్చకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మెల్లగా నిర్మాణ కార్యకలాపాలు మొదలు కావడంతో ఇప్పుడు మళ్లీ ఇసుక వ్యవహారం కలకలం రేపుతోంది. ఇసుక అక్రమాలపై మళ్లీ టిడిపి గళమెత్తుతోంది. అక్రమాలకు వైకాపా నేతలే కారణమని చెబుతున్నారు. గతంలో ఇసుక రీచ్‌ నుంచి లారీలలో నేరుగా లోడింగ్‌ అయి బుకింగ్‌ చేసుకొన్న వారి ఇళ్లకు చేరేది. నేడు రీచ్‌ నుంచి స్టాక్‌యార్డు, స్టాక్‌డిపోకు చేరుస్తోండటం, అక్కడినుంచి వినియోగదారుడికి వెళ్లాల్సి ఉండటంతో మార్గమధ్యలో దారి మళ్లుతోంది.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడి జరిగిందని అదేపనిగా ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వారి పరిపాలనలోనూ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. అకౌంటబిలిటీ, ట్రాకింగ్‌ విధానంలో లోపాల వలన ఇసుకని ఇసుకాసురులు దారి మళ్లించి సొమ్ము చేసుకొంటున్నారు. గత ఏడాది ఇసుక నూతన విధానం తీసుకురావడంలో జాప్యం జరిగింది. గతంలో మైనింగ్‌, ఏపీఎండీసీ, మైనింగ్‌ విజిలెన్స్‌, పోలీసు, రెవెన్యూ విభాగాలు ఇసుక రవాణాని పర్యవేక్షించినా అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోనైనా దీనికి ఫుల్‌స్టాప్‌ పెడుతుందో లేదోనన్న చర్చ జరుగుతోంది.ఇసుక రీచ్‌లకు అనుమతి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో కొన్ని రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

పట్టాభూముల్లో ఇసుకమేటల తొలగింపునకు అనుమతులు మంజూరు చేయగా తవ్వకాలు జరుగుతు న్నాయి. ఈ నేపథ్యంలో మిగతా ఐదింటిలో సాధ్యమైనంత త్వరగా తవ్వకాలు ప్రారంభించకపోతే నిలిపేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీరా పాలసీ వచ్చేసరికి కృష్ణానదికి మూడునెలల పాటు వరద కొనసాగడంతో ఇసుకని తోడలేకపోయారు. దాంతో భవన నిర్మాణం రంగం పూర్తిగా స్తంభించిపోయి లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ముందుగానే స్టాక్‌యార్డులు, డిపోలలో ఇసుక నిల్వ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇందులోనూ ఇసుక పక్కదారి పట్టింది. లాక్‌డౌన్‌ సమయంలో రీచ్‌ నుంచి తవ్విన ఇసుకని దారి మళ్లించడంతో పోలీసులు దాడులు చేసి పట్టుకొని వాహనాలను సీజ్‌ చేశారు. వర్షాలు కురవడం ప్రారంభం అయ్యే లోపు మిగతా ఇసుకని డిపోలకు చేర్చాల్సి ఉంది. ప్రభుత్వం మరోసారి ఇసుక విధానాన్ని సవరించి నూతనంగా తీసుకురావాలని నిర్ణయించింది. దీని దృష్ట్యా ఇసుక పక్కదారి పట్టకుండా స్పెషల్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ బ్యూరో రంగంలోకి దిగింది. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇసుక దారి మళ్లింపులో భాగస్వామ్యమై ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఇసుక అక్రమరవాణా జరుగుతోందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు అక్షరాలా నిజమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *