నీరుగారుతున్న సమాచార హక్కు చట్టం

 నీరుగారుతున్న సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం అమలయ్యి నేటితో 16 ఏళ్ళు

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్:

చట్టం -నేపథ్యం:

ప్రభుత్వ పరిపాలనలో ఏమిజరుగుతుందో ప్రజలు తెలుసుకునేందుకు వచ్చిన చట్టం సమాచార హక్కు చట్టం-2005. పరిపాలనలో పారదర్శకత పెంపొందించడంద్వారా ప్రజలకు జవాబుదారీతనం పాలకులకు పెరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలెవరూ కోరకుండానే ప్రతి ప్రభుత్వ కార్యాలయం స్వచ్ఛందంగా వెల్లడించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం క్రింద ప్రతి సంవత్సరం సుమారు 40 నుండి 60 లక్షల దరఖాస్తులు దాఖలు చేయబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్క చట్టం కింద దరఖాస్తులు చేసిన వారిలో 93% పురుషులు, 7% మహిళలు మాత్రమే వినియోగిస్తున్నట్లు ఇటీవల యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ కాంపేన్, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ప్రతి పౌరునికి భావప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాల్లోనే సమాచారం పొందే హక్కు కూడా ఉందని 1973వ సం.లో బెన్నెట్ కాలమన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. అదే విధంగా 1975లో ఇందిరాగాంధీ పై పోటీచేసిన రాజ్ నారాణ్ వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కేసులో కూడా సుప్రీం కోర్టు అదే విషయాన్ని పునర్ఘాటించింది.1977వ సంవత్సరంలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో అప్పటి జనతాపార్టీ నేత మొరార్జీదేశాయ్ తాము అధికారంలోకి వస్తే అధికార రహస్యాల చట్టం-1923 ను సవరణ చేస్తామని చెప్పారు. దానిద్వారా ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రజలు ప్రశ్నించేందుకు అవకాశం కల్పించవచ్చని వారు పేర్కొనడం జరిగింది.

రామన్ మెగసెసే అవార్డూ గ్రహీత, సామాజిక కార్యకర్తయిన అరుణారాయ్ నేత్రుత్వంలో 1987లో కిసాన్ మజ్ధూర్ శక్తి సంఘటన్ (ఎమ్.కె.ఎస్.ఎస్.) అనే సంస్థ సమాచార హక్కు చట్టం కావాలని పోరాటం ప్రారంభించింది. రాజస్థాన్ లో పనికి ఉపాధిహామీ పథకంలో తగినంత కూలీ దక్కడం లేదని, అందుకు ప్రజావాణి (జన్ సున్ వాయి)ను నిర్వహించి, అక్కడే సంబంధిత అధికారి నుంచి డబ్బులు ఇప్పించడం జరిగింది. ఎమ్.కె.ఎస్.ఎస్. ఉపాధిహామీని చట్టంగా కావాలని, డబ్బులు మావి, మాకు లెక్కలు తెలియాలి (హమారా పైసా.. హమారా హిసాబ్) అని అందుకు సమాచార హక్కు చట్టం కావాలని అనేక సభలు, సమావేశాలు, ర్యాలీలు చేయడం జరిగింది. అప్పటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) సంస్థకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న న్యాయమూర్తి పి.బి.సావంత్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.) నందు ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిల్ -1977 సదస్సు నిర్వహించి, ప్రభుత్వానికి అందచేశారు. ఇదే తొలి ముసాయిదా బిల్లు. ఆ బిల్లు ఆమోదం పొందలేదు. ప్రజల నుండి వస్తున్న ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచార హక్కుకు సంబంధించి హెచ్.డి. శౌరినేతృత్వంలో ఒక ముసాయిదా బిల్లును రూపొందించి మే24, 1997న ప్రభుత్వానికి సమర్పించారు. అదేరోజున డిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో “ప్రభావపూరిత, ప్రతిస్పందనా ప్రభుత్వం” అనే దానితో సమాచార హక్కు చట్టాన్ని చేయాల్సిన ఆవశ్యకతను వారు గుర్తించారు. అయితే దానిని ఆచరణలోకి తీసుకురాలేదు.

మొట్టమొదటిగా భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి 1997లో ముఖ్యమంత్రి కరుణానిధి తమిళనాడులో అమలులోకి తెచ్చారు. అయితే పిసిఐ చైర్మన్ పి.బి.సావంత్ రూపొందించిన బిల్లుపై ఆధారపడి ఎన్నో మినహాయింపులు, లోపాలతో ఈ చట్టాన్ని తమిళనాడులో అమలులోకి తెచ్చారు. 1999లో ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక పరిపాలక ఉత్తర్వును జారీచేస్తూ “తమ మంత్రిత్వ శాఖకు చెందిన ఏ కాగితాలనైనా, విధాన నిర్ణయాలకు సంబంధించినవైనా సరే ఏ పైరుడైనా తీసుకోవచ్చంటూ” పేర్కొన్నారు. అందుకు సుప్రీం కోర్టు గతంలో సమాచార హక్కు చట్టంపై ఇచ్చిన తీర్పులే కారణమని వెల్లడించారు. అయితే, అప్పటి ప్రధానమంత్రి కేబినెట్ సెక్రెటరీ అలా ఇవ్వడం కుదరదని అడ్డుకున్నారు. దీనీపై హెడి. సౌరీ నేత్రుత్వంలోని కామన్ కాజ్ సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం రూపొందించే పనిలోనే ఉందని జవాబిచ్చింది. అనేక ఒత్తిళ్ళ ఫలితంగా 2000వ సం. జులై 25న పార్లమెంట్ లో ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిల్లు -2000ను ప్రవేశపెట్టింది. వెంటనే ఆబిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది.
గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, డిల్లీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. 2002 డిసెంబర్ లో పార్లమెంట్ ఉభయ సభలు ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ చట్టం – 2002ను ఆమోదించాయి.

ప్రతి పౌరుడికి సమాచారాన్ని కోరే స్వేచ్చ ఉందన్నది ఇందులోని ప్రధాన అంశం. అయితే ఈ చట్టంలో పౌరుడు సమాచారాన్ని పొందకుండా పలు మినహాయింపులను చేర్చారు. అందుకు సమాచారాన్ని వెల్లడించకుండా జోక్యం చేసుకునేందుకు అత్యున్నత స్థాయి అధికారులకు వీలు కల్పించారు. అందువలన ఆ చట్టం అంతగా ప్రజలకు ఉపయోగపడలేదు. ఆతర్వాత కాంగ్రేస్ సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యు.పి.ఏ.) కనీస ఉమ్మడి కర్యాచరణ ఎజెండాను రూపొందించింది. ఈ ఎజెండాలో ఒక ప్రధానాంశంగా మెరుగైన సమాచార హక్కు చట్టం తీసుకురావాలని పేర్కొనడం జరిగింది. కనీస ఉమ్మడి కార్యాచరణ కోసం జాతీయ సలహా మండలి (నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్-ఎన్ఎసి)ని ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ గా సోనియాగాందీ వ్యవహరించారు. అందులో సలహాదార్లుగా ఉన్న అరుణారాయ్, జితేంద్ర జీ లు సమాచార హక్కు చట్టం త్వరగా తీసుకురావాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎందరో మేధావులు, సామాజిక కార్యకర్తలు, మాజీ ఐఏఎస్ అధికారుల కృషితో 2004సం.లో ముసాయిదా రూపకల్పన జరిగింది. 2004, డిసెంబరు 23న లోక్ సభలో సమాచార హక్కు ముసాయిదాను ప్రవేశపెట్టారు. 2005, మే 11న లోక్ సభ, మే 12న రాజ్యసభ ఆమోదం పొందింది. 2005, జూన్ 15న రాష్ట్రపతి ఆమోదంతో ఆరోజు నుండి చట్టం అమలులోకి వచ్చింది. 2005, జూన్ 21న గజిట్ ప్రకటించారు. అయితే జూన్ 15, 2005 నుండి కొన్ని సెక్షన్లకు 120 రోజులు అమలు నుంచి మినహాయింపు ఇచ్చారు. అందువలన అక్టోబర్ 12, 2005 నుండి సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది.

ఎన్నో అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన చట్టం

సమాచార హక్కు చట్టం వచ్చిన తొలిరోజుల్లోనే 2జి స్ప్రెక్టమ్ కుంభకోణం, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, టాటా ట్రక్కుల కుంభకోణం, కామన్వెల్త్ ఆటల నిర్వహణలో కుంభకోణం, ఆదర్శ అపార్ట్మెంట్ కుంభకోణం, కర్ణాటకలో భూముల కేటాయింపు వంటి కుంభకోణాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఉపాధిహామీ పనుల్లో, కాంట్రాక్టుల్లో, ఉద్యోగాల నియామకాలలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు ప్రజలకు మంచి ఆయుధం దొరికినట్లయింది. దాంతో సమాచార హక్కు చట్టం ప్రజలచేతిలో బ్రహ్మాస్త్రం అయ్యింది. తమ భూమి హక్కులను, తమ గ్రామానికి, మండలానికి వచ్చే నిధుల వివరాలను, తమ ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టుల వివరాలను, తాము వ్రాసిన పరీక్షా పత్రాలను, ఉద్యోగాల ఎంపిక, నియామకాలకు సంబంధించిన వివరాలను స్వయంగా తెలుసుకునే అవకాశం కల్పించింది సమాచార హక్కు చట్టం.

బీహార్, రాజస్థాన్ లలో చట్టం అమలు

బీహార్ రాష్ట్రంలో జాన్ కారీ అనే వ్యవస్థ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేశారు. అక్కడ ఫోన్ ద్వారానే సమాచార హక్కు క్రింద సమచారం కోరవచ్చు. అందుకు సంబంధించిన దరఖాస్తు రుసుముగా ఫోన్ చేయగానే రూ.10/-ల బిల్లు పడుతుంది. ఎటువంటి సమాచారం కావాలో, ఏ శాఖకు సంబంధించిన సమాచారం కావాలో వారే సంబంధిత అధికార యంత్రాంగానికి పంపి దరఖాస్త దారునకు సమచారం అందచేస్తారు. రాజస్థాన్ లో సమచారం వెబ్సైట్ లలో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. త్వరలో అక్కడ ఏటిఎం మిషన్ల ద్వారా నగదు పొందినట్లు.. కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిల్లో అక్కడే తగిన రుసుము చెల్లించి, తగిన సమాచారాన్ని పొందేందుకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

చట్టం అమలు – కోర్టులు, కమిషన్ల తీర్పులు

దేశంలో సమాచార హక్కు చట్టం అమలు ప్రశ్నార్ధకంగా మారింది. కోర్టుల తీర్పులు, కమిషనర్ల ఆదేశాలతో చట్టంలో అనేక లొసుగులు వెలుగులోకి వచ్చాయి. స.హ. చట్టంలో ఉన్న పారదర్శకత అమలులో కనిపించడంలేదు. వ్యక్తిగత సమాచారం, మూడవ పక్షానికి చెందిన సమాచారం అంటూ అనేక ఉత్తర్వులతో స.హ. చట్టం అమలు లక్ష్యం నెరవేరడంలేదు.

గిరీష్ రామ్ చంద్ర దేశ్ పాండే వర్సెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కేసుకు సంబంధించి 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన స.హ. చట్టాన్ని నీరుగార్చిందనే చెప్పవచ్చు. ఈ కేసులో ఒక అధికారి వ్యక్తిగతంగా వేసిన (స్పెషల్ లీవ్ పిటిషన్) కేసు మాత్రమే. అయినప్పటికీ ఆ కేసులో ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలతో దేశమంతటా నేడు వర్తిస్తుంది. దానితో సమాచార హక్కు చట్టం కన్నా ఆ ఉత్తర్వులనే చట్టంగా భావించే అధికారులు ఎక్కువయ్యారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వర్సెస్ ఆదిత్యబంధోపాద్యాయ కేసులో “సమాచారం” అంటే ఏమిటో నిర్వచనాన్ని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. సమాచారం అంటే ఊహించి ఇచ్చేదో, పరిశోదించి ఇచ్చేదో కాదని, ఆకార్యాలయములోని రికార్డులలో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్న రూపంలో అందించడమేనని స్పష్ట చేసింది. అయినప్పటికీ నేటికీ ఆ కేసును అధికారులు పరిగణలోనికి తీసుకోవడం లేదు. సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపులు ఉన్నప్పటికీ అవినీతి కేసుల వివరాలు వెల్లడించాల్సిందేనని సిబిఐ ని సైతం సమాచార కమిషన్ ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్టు కేసులో ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక శాసన సభ్యుడు ఎటువంటి సమాచారం పొందగలడో అటువంటి సమాచారం సాధారణ పౌరుడుకూడా పొందవచ్చని తేల్చి చెప్పింది.

దరఖాస్తు దారుడు కోరిన సమాచారం (సంబంధిత కార్యాలయములో ఉన్నది, ఉండవలసినది) కనిపించకపోయినా, దొంగలింపబడినా సంబంధిత రికార్డు సంరక్షకునిపై కేసు నమోదు చేసి, ఆ ఎఫ్.ఐ.ఆర్. నఖలు దరఖాస్తు దారునికి ఇవ్వాలని పలు కేసుల్లో కేంద్ర సమాచార కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలు వెలువరించింది.

తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పి. ముత్యన్ కేసులో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయని అధికారులను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించింది.

మినహాయింపులు

సమాచార హక్కు చట్టాన్ని మరింత బలోపేతం చేయవలసిన రాజకీయపార్టీలు తమదగ్గరకొచ్చే సరికి మినహాయింపులు కావాలంటూ 2013లో సమాచార హక్కు చట్టాన్నే మార్చేశాయి. తాము పొందుతున్న విరాళాల వివరాలు వెల్లడి చేయడానికి రాజకీయపార్టీలు ఈ సవరణకు శ్రీకారం చుట్టాయి.

రాజేంద్రనాథ్ గౌడ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో దేవాలయాలు, చారిటీలు, మిషనరీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.తళప్పాళం సర్వీస్ కో ఆపరేటీవ్ బ్యాంక్ వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు సమాచార హక్కు చట్టం పరిధిలోకి కో ఆపరేటీవ్ బ్యాంకు రాదని ఉత్తర్వులు వెలువరించింది.ఈ కేసును అడ్డంపెట్టుకుని మన రాష్ట్రంలో కోఆపరేటీవ్ సొసైటీలు, కార్యాలయాలు సమాచార హక్కుక చట్టం పరిధిలోకి రావంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్, ఏసిబి శాఖలూ అదే విధంగా చేస్తున్నాయి. గవర్నర్ కార్యాలయం కూడా సహపరిధి నుండి మినహాయించాలని కోర్టును ఆశ్రయించారు. అది నేటికీ పెండింగ్ లో ఉంది.

పరిశీలన

అవినీతి, అక్రమాలకు సంబంధించిన సమాచారం అయితే అసలు సమాచారం వెల్లడించడంలేదు. పైగా దరఖాస్తు దారుల వివరాలు వెల్లడించకూడదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. అవినీతికి సంబంధించిన సమాచారం కోరిన దరఖాస్తుదారుల వివరాలు సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు, రాజకీయ నేతలకు అందచేస్తున్నాయి. ఫలితంగా దరఖాస్తు దారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇప్పటికే సమాచార హక్కు దరఖాస్తుదారులు అనేక మంది హత్యకుగురయ్యారు, హత్యాయత్నానికి, దాడులకు లోనయ్యారు. దరఖాస్తు దారులకు రక్షణ కల్పించాలని ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలౌతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి నెల జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు సూపరిండెంట్, పోలీస్ కమిషనర్లతో దరఖాస్తు దారులపై దాడులకు సంబంధించి సమీక్ష నిర్వహించాలి. కానీ నేటికీ అవి ఎక్కడా అమలు కాలేదు. అవినీతి కేసుల్లో ఎక్కవ మంది పౌర సమాచార అధికారులు సమాచారం లేదని ఇచ్చే స్థితికి దిగజారారు. తద్వారా అవినీతిని వారు దాచి ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార దరఖాస్తును నేరుగా స్వీకరించి,ముట్టినట్లు రశీదులు ఇవ్వడంలేదు. నగదు రూపంలో దరఖాస్తు రుసుము, సమాచారం స్వీకరించే రుసుము చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ విధంగా నగదును స్వీకరించేందుకు పౌరసమాచార అధికారులు సిద్దపడటం లేదు.
ప్రజలు తమను ప్రశ్నించడాన్ని, వివరాలు కోరడాన్ని కొందరు అధికారులు, నేతలు సహించలేకపోతున్నారు. తమ అవినీతి అక్రమాలకు సంబంధించిన విషయాలు కోరితే దరఖాస్తు దారులను నయానో.. భయానో.. ఒప్పందం చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే అక్రమ కేసులు పెట్టేందుకు సిద్దపడుతునారు. ఇప్పటికే కొందరు దరఖాస్తు దారులు హత్యకు గురయ్యారు. అనేక మందిపై హత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
సమాచార హక్కు చట్టం అమలు చేయడం కొందరు అధికారులకు తలనొప్పిగా మారింది. కార్యాలయాలలో పౌరసమాచార అధికారుల వివరాలతో ఏర్పాటు చేయాల్సిన బోర్డులు ఏర్పాటు చేయడంలేదు. స్వయంగా దరఖాస్తులు తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. కొందరు అధికారులు తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే సమాచారం, అసంపూర్తి సమాచారం అందచేస్తూ.. ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కువ మంది అధికారులకు నేటి వరకు సమాచార హక్కు చట్టం పై శిక్షణ, అవగాహన లేకపోవడం కూడా బాధాకరం.

కాని, సమాచార హక్కు చట్టం స్పూర్తి వేరు. ఎవరూ కోరకుండానే వెల్లడించాల్సిన (4 (1)(బి)) సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగం నేటికీ స్వచ్ఛందంగా వెల్లడించడంలేదు. అనేక కార్యాలయాల్లో పౌర సమాచార అధికారుల వివరాలతో కూడిన బోర్డులను నేటికీ ఏర్పాటు చేయలేదు. చేసిన చోటా ఎప్పటికప్పుడు ఆదునీకరించడం లేదు. నేడు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా ఈ-ఆఫీసులు నడుస్తున్నప్పటికీ, స్వచ్చందంగా అంతర్జాలంలో ఉంచవలసిన సమాచారం వారు వెల్లడించడంలేదు.

సమాచార కమిషన్ల తీరు

దేశంలో 29 రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు ఉన్నయి. పూర్తి స్థాయిలో కమిషనర్ల మాత్రం నేటికీ నియామకం చేపట్టలేదు. కమిషన్ వెబ్ సైట్లు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదు. కమిషన్లకు వచ్చే అప్పీళ్ళు లేక పిర్యాదులు విచారణకు చాలా సమయం పడుతుంది. ప్రధాన సమాచార కమిషనర్లుగా 84%, సమాచార కమిషనర్లుగా 59% విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులనే నియమిస్తున్నారు. 11% జ్యుడిషరీ/న్యాయవాదులు, 8% జర్నలిస్టులు, 6% విద్యావేత్తలు, విశ్రాంత న్యాయమూర్తులు 3%, సామాజిక కార్యకర్తలు 3%, రాజకీయనాయకులు 2%, రక్షణ శాఖ నుంచి 1%, డాక్టర్లు1%ను సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నారు. పురుషులు 93%, మహిళలు 7% కమిషనర్లుగా నియామకం జరుగుతున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్లో 8 మంది సమచార కమిషనర్లు నియామకం జరిగినా వారిలో ఒక్కరు కూడా మహిళలు లేకపోవడం విచారకరం.

జూలై 30, 2020 నాటికి 20 సమాచార కమిషన్లలో 2,21,568 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర సమాచార కమిషన నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరంలో 3,10,110 దరఖాస్తులు అందినట్లు, వాటిలో ప్రాథమిక స్థాయిలోనే 58,634 దరఖాస్తులు తిరస్కరించారు. సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపు ఉన్నట్లు పేర్కొంటూ 62,123 దరఖాస్తులు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. నేటికి కేంద్ర సమాచార కమిషన్ వద్ద 37,225 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు కేంద్ర సమాచార కమిషన్ వెబ్సైట్ నందు పేర్కొనడం జరిగింది.

18 సమాచార కమిషన్లు 1,995 కేసుల్లో రూ.2.53 కోట్లు జరిమానా విధించాయి. అత్యధికంగా హర్యానా సమాచార కమిషన్ రూ.65.43 లక్షలు, మధ్యప్రదేశ్ రూ.43.33 లక్షలు, ఉత్తరాఖండ్ రూ.35.73 లక్షలు జరిమానా వేయగా, కేంద్ర సమాచార కమిషన్ మాత్రం రూ.12.22 లక్షల జరిమానా మాత్రమే విధించింది. కేవలం 2.2 శాతం కేసుల్లో మాత్రమే సమాచార కమిషన్లు జరిమానా విధిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ విషయానికి వస్తే ఇటీవల యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ కేంపేన్ సంస్థ చేసిన సర్వే పరిశీలిస్తే జనవరి 2021 వరకు 13,972 అప్పీళ్లు, పిర్యాదులను కమిషన్ స్వీకరించింది. అందులో 10,010 కేసులను పరిష్కరించింది. 3,962 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి రూ. 2,23,000 జరిమానా, రూ.41,500 నష్టపరిహారం క్రింద విధించింది. అంటే కేవలం 3 శాతం కేసుల్లో మాత్రమే జరిమానా విధిస్తున్నారు.

సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసేవారూ ఉన్నారు. అయితే వారు కేవలం ఒక్క శాతం మాత్రమేనని గత సంవత్సరం కొన్ని సంస్థలు కలసి నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సమాచార హక్క చట్టాన్ని వినియోగించుకుంటున్నవారిలో ఎక్కవ మంది విశ్రాంత ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు వినియోగించుకుంటున్నారు. సాధారణ పౌరులు అతి తక్కువ మందే ఈ చట్టంద్వారా సమాచారం కోరుతున్నారు.

సమచార హక్కు చట్టానికి సమాచార కమిషనర్లే శత్రువులు మాదిరిగా తయారవుతున్నారన్న మాజీ సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ మాటలు నేడు నిజమౌబోతున్నాయి. చట్టంలో విస్తృత పరిధి నిర్వచనాన్ని కుంచించుతూ.. అనేక మినహాయింపుల పేరుతో ఉత్తర్వులు ఇవ్వడం చూస్తే నిజమేననిపిస్తుంది. సమాచార దరఖాస్తు దారులకు సమాచారం మాత్రమే ఇప్పించి, రక్షణ కల్పించవలసిన బాధ్యత సమాచార కమిషనర్లపై ఉంది. అయినప్పటికీ వారు అధికారుల పక్షానే నిలబడుతున్నారు. అప్పీలు దారులను నిలబెట్టి, అధికారుల ముందు దూషిస్తుండటాన్ని, పోలీసులను పిలిచి అరెస్టు చేయిస్తామని బెదిరింపులకు దిగుతున్న కమిషనర్లను నేడు చూస్తున్నాము. ఇది సమాచార హక్కు చట్టం రక్షణకే ప్రమాదంగా తయారైంది. నేడు దేశంలో 5000 చట్టాలు పైబడి ఉన్నప్పటికీ.. ప్రజలు పాలనలో ఏమిజరుగుతుందో తెలుసుకునేందుకు, హక్కుగా సంక్షేమ పథకాలు, భూమి హక్కులు పొందేందుకు ఉన్న ఏకైక చట్టం మాత్రం సమాచార హక్కు చట్టం మాత్రమే. దీనిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రజలపై ముఖ్యంగా సామాజిక కార్యకర్తలపై, మేధావులపై ఉంది.

దాసరి ఇమ్మానియేలు
సామాజిక కార్యకర్త
9059990345

Related News

1 Comment

  • సార్ బాగుందండి రాష్ట్రంలో కేంద్రంలో రెండు ప్రభుత్వాలు కూడా సమాచార చట్టాన్ని పూర్తిస్థాయిలో లో వాడికి కావలసినటువంటి అధికారులు మాత్రమే కమిషనర్గా నియమించుకున్నారు చాలా అన్యాయంగా నియామకం జరుగుతున్నది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో వాళ్ళనే కమిషనర్ లో లో ఉంటున్నారు మనం ముందుగా దానికి దృష్టిపెట్టాలని తెలుపుతున్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *