కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

 కరోనాను  ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

భూమిపుత్ర,ముంబై:

కరోనా నేపధ్యంలో ’హెల్త్‌ సెక్యూరిటీ’ కోసం రూ. 50 వేల కోట్ల మేర టర్మ్‌ లిక్విడిటీ సౌకర్యాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు కరోనాకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, సేవల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. కరోనా నేపధ్యంలో రుణాలిచ్చేందుకు బ్యాంకులకు ఈ మొత్తంతో వెసులుబాటును కల్పించారు. దీని కింద బ్యాంకులు, వాక్సిన్‌ తయారీదారులు, వైద్య సదుపాయాలు, ఆసుపత్రులు, రోగులతో సహా సంస్థలకు మద్దతు లభించనుంది.

ఈ పథకం కింద బ్యాంకులు కోవిడ్‌ లోన్‌ బుక్‌ను తీసుకు రావాలి. అలాగే, ఇండివిడ్యువల్స్‌కు, ఎంఎస్‌ఎంఈ రుణగ్రహీతలకు వన్‌ టైమ్‌ రీ స్ట్రక్చరింగ్ కు మరోసారి అనుమతి లభించింది. వన్‌ టైమ్‌ రీస్ట్రక్చరింగ్ కు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు వెసులుబాటు కల్పించింది. ఇక మారటోరియం కాలాన్ని మొత్తంగా రెండేళ్ల వరకు పొడిగించవచ్చని సమాచారం. 500 కోట్ల రూపాయల వరకు ఆస్తి పరిమాణం కలిగిన సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రుణాలనిచ్చేందుకు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు అనుమతించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్‌ రంగం సిద్ధంగా ఉండాని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా కరోనా కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని అన్నారు. గత రెండేళ్లుగా మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతోపాటు అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామని శక్తికాంతదాస్‌ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి వరకు కొవిడ్‌ సంబంధిత మౌలిక వసతుల కోసం రూ. 50 వేల కోట్ల కేటాయింపులు చేస్తామన్నారు. చిన్న తరహా ఫైనాన్స్‌ బ్యాంకుల కోసం ప్రస్తుత రెపో రేటుకు రూ. 10 వేల కోట్లు, రుణ గ్రహీతకు రూ. 10 లక్షల వరకు తాజా రుణాలు అందిస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబరు 31 వరకు ఈ సదుపాయం అందిస్తామన్నారు.ఏడాది పాటూ, ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్‌ డౌన్‌ లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని.. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని అన్నారు. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో కనిపించిన వేళ, భారత్‌ బలంగా ఉందని, ఇప్పుడు భారత్‌ పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. ఈ మహమ్మారి నుంచి భారతావని బయట పడుతుందన్న నమ్మకం ఉందని శక్తికాంత దాస్‌ అన్నారు.

ఇదే సమయంలో ఏప్రిల్‌ లో జరిగిన మధ్యంతర పరపతి సవిూక్షలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా తామేవిూ సంచలన నిర్ణయాలు తీసుకోవాలని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. రుణ అవసరాల నిమిత్తం చూసేవారికి సులువుగా రుణాలను అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా ప్రాధాన్యతా అవసరాను బట్టి రుణాలను అందించాలని శక్తికాంత దాస్‌ బ్యాంకులను కోరారు. ఇండియా తరఫున విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం 588 బిలియన్‌ డాలర్లు ఉన్నాయని, అదే దేశాన్ని కరోనా నుంచి కాపాడుతుందన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.

Related News

Leave a Reply

Your email address will not be published.