రగులుకుంటున్న రఫెల్‌ రాజకీయం

 రగులుకుంటున్న రఫెల్‌ రాజకీయం

భూమిపుత్ర,సంపాదకీయం:

చైనా నుండి పెరుగుతున్న భద్రతాపరమైన సవాళ్ల దృష్ట్యా అత్యాధునిక రఫెల్‌ యుద్ధ విమానాలను సమకూర్చుకోవడం భారత్‌ కు కీలకంగా మారింది. అందుకోసం యుపిఎ హయాంలో పక్రియ ప్రారంభమైన వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. నలుగురు రక్షణ మంత్రులు మారిన తర్వాత చివరికి క్రమంగా కార్యరూపం దాల్చుతూ వచ్చింది. భారత దేశంలో అవినీతి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నా ఆయుధాల కొనుగోలులో జరుగుతున్న భారీ అవినీతి మాత్రం నివురుగప్పిన నిప్పు వలె ఉంటూ వస్తున్నది. పలు ఆరోపణలు వచ్చినా, ఇప్పటికి నిర్దిష్టంగా ఏ ఒక్క ఆరోపణపై సాధికారికంగా చర్య తీసుకోలేక పోయారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వమును కాటేసిన బోఫోర్స్‌ కుంభకోణం ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన పలు ఆరోపణలతో పోల్చుకొంటే చాలా చిన్నది. అయితే రాజకీయంగా అందులో రాజీవ్‌ గాంధీ భారీ మూల్యం చెల్లించిన విధంగా, మరే ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి జవాబుదారీతనం ప్రదర్శింపలేదు. యుపిఎ హయాంలో రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందంకు రంగం సిద్ధమైనా నాటి ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయలేదో ఇప్పటివరకు చిదంబర రహస్యంగానే ఉంటూ వచ్చింది.

ఆ తర్వాత హడావుడిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకొన్నా, అందులో పారదర్శకత లోపించిందని విమర్శలు చెలరేగాయి.ఇప్పటివరకు కేవలం మోదీ ప్రభుత్వమే పలు అనుమానాలకు తావిస్తుండగా తాజాగా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం మరో మలుపు తిరిగింది. ముడుపుల చెల్లింపుల కోసం తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించినట్లు ఫ్రెంచి వెబ్‌సైట్‌ ‘విూడియాపార్ట్‌ ‘ వెల్లడించడంతో యుపిఎ ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. 2007-2012 మధ్య కాలంలో, అత్యంత ప్రభావితం చేయగలిగిన రక్షణ దళారీ సుషేన్‌ గుప్తాకు వైమానిక సంస్థ డసాల్ట్‌ ఏవియేషన్‌ 75లక్షల యూరోలకు పైగా ముడుపులు చెల్లించేందుకు ఈ నకిలీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగించారని విూడియాపార్ట్‌ వెల్లడించడంతో యుపిఎ హయాంలో అవినీతి జరిగిన్నట్లు స్పష్టంగా భావించవలసి వస్తున్నది. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం యుపిఎ హయాంలో ముడుపులిచ్చినట్లుగా పత్రాలు అందుబాటులో వున్నప్పటికీ వీటిపై దర్యాప్తు చేయడంలో భారత దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని విూడియాపార్ట్‌ నివేదికలో పేర్కొనడం గమనార్హం. రాఫెల్‌ జెట్‌ల అమ్మకం కోసం సుషేన్‌ గుప్తాకు దసాల్‌ ముడుపులు చెల్లించినట్లు సిబిఐ, ఇడిల దగ్గర 2018 అక్టోబరు నుండి సాక్ష్యాధారాలు వున్నాయని, అయినా దర్యాప్తునకు అవి సిద్ధం కావడం లేదని నివేదిక విమర్శించింది.

ఈ నివేదికపై ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కనీసం అప్పుడు అధికారంలో ఉన్న యుపిఎ అధినేతలు గాని, ఇటు బిజెపి నేతలు గాని నోరు విప్పడం లేదు.కేవలం బిజెపి అధికార ప్రతినిధి సంబిట్‌ పాత్ర మాత్రం ఈ అవినీతి చిరునామా 10 జన్ పథ్ అని ఆరోపించారు. ఐఎన్‌సి అంటే నేషనల్‌ కాంగ్రెస్‌ కాదని, ‘ఐ నీడ్‌ కమిషన్‌’ అని ఎద్దేవా చేశారు. అయితే ఈ ఆరోపణలపై లోతయిన విచారణ జరగాలని ఆయన కూడా భారత ప్రభుత్వాన్ని కోరకపోవడం గమనార్హం. ఈ మధ్యనే సోనియాగాంధి కుటుంబానికి ప్రత్యక్ష ప్రమేయం గల పలు అవినీతి ఆరోపణలపై దర్యాప్తు విషయంలో మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని బిజెపి ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి ఆరోపించడం గమనార్హం. 2018 అక్టోబర్‌ 11 న మారుషియన్‌ ప్రభుత్వం సీబీఐకి అన్ని సాక్ష్యాధారాలు ఇచ్చినట్లు ఇప్పుడు ఈ కధనం వెల్లడిస్తున్నది. అంతకు ఒక వారం రోజుల ముందే, ఈ కుటంబకోణంపై విచారణ జరపాలని సిబిఐ డైరెక్టర్‌ ను కలసి మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, ప్రముఖ్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోరారు. అక్టోబర్‌ 23, 2018 అర్ధరాత్రి అర్ధాంతరంగా సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ ను బదిలీ చేశారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయనను ప్రభుత్వం వేధిస్తున్నది.

ఈ కుంభకోణంపై దర్యాప్తుకు ఆయన సిద్దపడటమే అందుకు కారణమని అప్పట్లో కధనాలు వచ్చాయి. రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై ఎవ్వరు ఏ ప్రశ్న లేవనెత్తిన దేశభద్రతకు విఘాతం అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అయితే ఆ విమానాల నాణ్యత విషయంలో ఎవ్వరు ప్రశ్నలు లేవనెత్తడం లేదు.కేవలం ఒప్పందం చేసుకున్న తీరు, అందుకు చెల్లించడానికి ఒప్పుకున్న మొత్తంలపైననే ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యుపిఎ హయాంలో జరిగిన అవినీతిని ప్రస్తుత ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం మరిన్ని అనుమానాలకు దారితీస్తున్నది. నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ తో సంబంధం లేకుండా మొత్తం ప్రధాన మంత్రి కార్యాలయం నుండే వ్యవహారం నడపడంలోనే అన్ని అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతున్నది. 2012లో 126 యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు, సాంకేతిక పరిజ్ఞానంను మనకు బదిలీ చేసే విధంగా చేసుకున్న ఒప్పందంను ప్రస్తుత ప్రభుత్వం మార్చి, ఇప్పుడు 36 యుద్ధ విమానాలను మాత్రమే, అంతకన్నా ఎక్కువ ధరకు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ప్రసక్తి లేకుండా కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంతోనే అనుమానాలు చెలరేగడం ప్రారంభమైనది. నవంబర్‌, 2018లో ఈ ఒప్పందంలో ఎటువంటి అక్రమం, అవినీతి జరగలేదని సుప్రీం కోర్ట్‌ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై సవిూక్షకు తర్వాత నిరాకరించింది.

అయితే అందుకు ఒప్పుకున్న ధర విషయంలో కేంద్రం సీల్‌ కవర్‌ లో అఫిడవిడ్‌ సమర్పించడం, ఆ కవర్‌ లో ఏముందో ఎవ్వరు చూడకుండానే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించినట్లు కనిపిస్తున్నది. భారత న్యాయవ్యవస్థలో ఈ విధంగా అంతకు ముందెన్నడూ జరగనే లేదు.యుపిఎ -1 హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం పనితీరును చూపే 2009 ఎన్నికలలో విజయం సాధించారు. స్వతంత్ర భారత దేశంలో ప్రభుత్వ పనితీరు ఆధారంగా, ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ఒక ప్రభుత్వం ఎన్నికలలో గెలుపొందడం 2009లో మాత్రమే జరిగింది. అయితే ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి కుంభకోణాలు ఆ తదుపరి తెరపైకి వచ్చాయి. దానితో అవినీతి వ్యతిరేక పోరాటం’ నినాదంతో 2014లో నరేంద్ర మోదీ ఘన విజయం సాధింపగలిగారని ఈ సందర్భంగా గుర్తించాలి.

Related News

1 Comment

  • Super 👌👍

Leave a Reply

Your email address will not be published.