పంజాబ్‌ సిఎంగా చరణ్‌జిత్‌ సంగ్‌ చన్నీ ప్రమాణం

 పంజాబ్‌ సిఎంగా చరణ్‌జిత్‌ సంగ్‌ చన్నీ ప్రమాణం

కీలక సమయంలో కాంగ్రెస్ రణతంత్రం

భూమిపుత్ర,చండీగఢ్‌:

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ చన్నీతో ప్రమాణం చేయించారు. ఆయన తర్వాత కాంగ్రెస్‌ నేతలు సుఖిందర్‌ ఎస్‌ రంధ్వానా, ఓపీ సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కెప్టెన్‌ అమరీందర్‌ రాజీనామాతో ఛన్నీని కాంగ్రెస్‌ తదుపరి సిఎంగా ప్రకటించింది. దీంతో ఆయన ఉదయం ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పంజాబ్‌ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు చరణ్‌జిత్‌ చన్నీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ను కలిసి అక్కడి నుంచి రాజ్‌భవన్‌ చేరుకున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి దళిత నేత చన్నీనే కావడం విశేషం.

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామాతో పంజాబ్‌ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ స్థానంలో ఎవరికి అవకాశం కల్పించాలనే విషయంలో కాంగ్రెస్‌ కొంత మల్లగుల్లాలు పడింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత చివరకు చన్నీని ఎంపిక చేసింది. ఇక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక సవిూకరణాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు కల్పించింది. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన చన్నీ.. సిద్ధూకు అత్యంత సన్నిహితుడు. చామ్‌కౌర్‌సాహిబ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా మూడుసార్లు, మున్సిపల్‌ ఛైర్మన్‌గా రెండుసార్లు సేవలందించారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చన్నీని మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ చన్నీని కెప్టెన్‌ భోజనానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మాజీ సీఎం ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *