ప్రజల నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తోందా!!

భూమిపుత్ర,సంపాదకీయం:

కరోనా వ్యాప్తి కి ప్రధానంగా ప్రజల నిర్లక్ష్యమే కారణమని గతేడాదిగా జరుగుతున్న పరిణమాలను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఏడాదయినా ప్రజలు జాగరూకతలను పాటించడం లేదు . పోలీసులు ఫైన్ వేస్తామని హెచ్చరించడం లేదా లాఠీ ఝళిపించడం చేయాల్సి వస్తోంది . చలానా విధిస్తారన్న భయం లేకుండా పోతోంది . తాజా కేసులు చూస్తుంటే కరోనా ఉధృతి మరోమారు తీవ్రంగా ఉంది . వ్యాక్సిన్ వచ్చినా ఫ్రీగా వేస్తున్నా కూడా ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది . కేసులు పెరగడం , వ్యాక్సిన్ తీసుకోక పోవడం ప్రజల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం . వ్యాక్సిన్ వేసుకోవడంలో దుష్ప్రచారాలతో గడపడం కూడా మరింత బాధ్యతారాహిత్యంగానే గుర్తించాలి . ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకుని దేశాన్ని ప్రమాదం నుంచి తప్పించాలి . ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు నేటికీ తమకు వ్యాక్సిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు . ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు గమనించి ప్రజలంతా త్వరగా టీకా వేసుకోవాలి . మాస్కులు ధరించాలి . ముప్పు రాగానే ప్రభుత్వాలను తిట్టడం మానుకుని మనమెంత వరకు సక్రమంగా ఉన్నామో గమనించాలి జనాభా లో కేవలం 10 శాతం మందికే తొలి టీకా డోసు లభించింది . ఐరోపా సమాఖ్యలో టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థపై తాజాగా తీవ్ర విమర్శలు చేసింది . వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగడం అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదని , దీని వల్ల కరోనా సంక్షోభం మరింత కాలంపాటు కొనసాగుతుం దంటూ ఐరోపా దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది . నాలుగు శాతం మందే పూర్తి డోసులను తీసుకున్నారని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా శాఖ అధిపతి హాన్స్ క్లాజ్ తెలిపారు . మునుపటితో పోలిస్తే ప్రస్తుతం ఐరోపాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు . టీకా ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి టీకా కార్యక్రమానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలని ఆయన సూచించారు . ప్రస్తుత ఐరోపాలో ఉన్న ప్రతి టీకా ట్రయల్ ను వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు . టీకా కార్యక్రమంలో అమెరికా బ్రిటన్ ల కంటే ఐరోపా బాగా వెనకబడిన విషయం తెలిసిందే . టీకాల కోసం ఆర్డర్లు పెట్టడంతో పాటూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడంలో ఐరోపా దేశాలు ఆలస్యం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ఇకపోతే మనదగ్గరేమో టీకా ఇస్తున్నా ముందుకు రాకపోవడంతో ఉత్పత్తి వ్యర్థం అవుతోంది . నిజానికి ప్రభుత్వం వ్యాపారదృష్టితో ఆలోచించి వ్యాక్సిన్ ఎగుమతి చేస్తే మనకు ఇచ్చే దిక్కుకూడా ఉండదని ప్రజలు గమనించాలి . నిజానికి తొలినాళ్లలో వచ్చిన హెచ్చరికలను అలాగే కొనసాగించి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది . గతేడాది భారత్ లో ప్రవేశించిన కరోనా వైరస్ శరవేగంగా తన ప్రతాపం చూపించింది . ఆరు నెలలు తిరిగే సరికి ఉగ్రరూపం దాల్చింది . లక్షల కొద్దీ కేసులు వేలకొద్దీ మరణాలతో విరుచుకుపడింది . అయితే ఆ తర్వాత నుంచి కాస్త తగ్గినట్లే కన్పించిన ఈ మాయదారి మహమ్మారి తాజాగా మళ్లీ విరుచుకుపడుతోంది . ఇటీవలి కాలంలో మళ్లీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది . ఆరు నెలల తర్వాత రోజువారీ కేసులు మళ్లీ 80 వేలు దాటడం కలవరానికి గురిచేస్తోంది . అయితే కరోనా తిరగబడుతున్నప్పటికీ వ్యాక్సిన్ పంపిణీ కాస్త ఊరటనిస్తోంది . గతేడాది సెప్టెంబరులో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకుంది . ఆ నెలలో ఏకంగా 11 సార్లు రోజువారీ కేసులు 90 వేల పైనే నమోదయ్యాయి . ఆ తర్వాత అక్టోబరు నుంచి వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది . మాస్క్లు , సామాజిక దూరం వంటి నిబంధనలతో పాటు జనవరి నుంచి వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడంతో కొత్త కేసుల సంఖ్య నానాటికీ పడిపోయింది . ఈ ఏడాది ఫిబ్రవరి 15 న రోజువారీ పాజిటివ్స్ సంఖ్య ఏకంగా 10 వేల దిగువకు చేరింది . ఆ రోజున 9,139 కొత్త కేసులు నమోదయ్యాయి . ఈ ఏడాది ఆరంభంలో కరోనాను తరిమికొట్టేందుకు దేశీయంగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది . అలాగే ఆస్ట్రోజెనెకాతో కలసి సీరం సంస్థ కోవీ షీల్డ్ ను రూపొందించింది . ఇలా రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి . జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టారు . అయితే టీకాల రాకతో ప్రజల్లో భరోసాతో పాటు నిర్లక్ష్యం కూడా పెరిగింది . కరోనా మహమ్మారిన్ని తరిమికొట్టాలంటే మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ . ప్రస్తుతం మన దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది . కరోనా ఉదృతి దృష్ట్యా వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది . ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందిస్తోంది . అయితే వ్యాక్సిన్‌తో పాటు జాగ్రత్తలు కూడా అవసరమే అని ప్రభుత్వం , నిపుణులు చెబుతున్నారు . టీకాలు తీసుకున్నప్పటికీ మాస్క్ లు , ధరించడం , సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను మర్చిపోవద్దని సూచిస్తున్నారు . లేదంటే పరిస్థితి చేయి దాటే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు . ఇకపోతే కరోనా నిబంధనలను పట్టించుకోక పోవడంతో ఇటీవల మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో వైరస్ మళ్లీ విజృంభించింది . దీంతో గత నెలన్నర రోజుల నుంచి కేసులు వేగంగా పెరుగుతున్నాయి . ఇక మహారాష్ట్ర లో అయితే పరిస్థితి ఆందోళనకర రీతిలో ఉంది . దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో అధికశాతం ఆ ఒక్కరాష్ట్రంలోనే ఉంటున్నాయి . అయితే భారత్ లో అత్యధిక రోజువారీ కేసులు నమోదైంది మాత్రం గతేడాది సెప్టెంబరులోనే . అప్పుడు కేసుల సంఖ్య ఏకంగా లక్షకు చేరువై .. ప్రజలను తీవ్ర భయాందోళన లోకి నెట్టేసింది . అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీలు కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుండటం ఊరటనిస్తోంది . గతేడాది సెప్టెంబరు నాటి పరిస్థితిని చూస్తే .. ఆ నెలలో రోజువారీ మరణాలు వెయ్యికి పైనే నమోదయ్యాయి . అత్యధికంగా గతేడాది జూన్ 16 న ఒక్కరోజే 2000 మందికి పైగా వైరకు బలయ్యారు . అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది . ఈ లెక్కలు చూసి కాకుండా ప్రజలు ఎవరికి వారు తమ వ్యక్తిగత భద్రతను ఆలోచిస్తే సమాజం బాగుంటుంది . వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *