ప్రైవేట్‌ ఫీజులదోపిడీకి ముకుతాడు!!

 ప్రైవేట్‌ ఫీజులదోపిడీకి ముకుతాడు!!

భూమిపుత్ర,సంపాదకీయం:

విద్యలేనివాడు వింత పశువు అన్నారు.విద్యా దదతి వినయమ్‌ అని సంస్కృత ఆర్యోక్తి. అంటే విద్య ద్వారానే వినయం అబ్బుతుందని పెద్దల మాట. దేశంలో విద్యారంగం బలోపేతం అయితేనే ప్రజలు ఎవరి బతుకులు వారు బతకగలుగుతారు. విద్యారంగాన్ని ,వైద్యరంగాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పం ప్రభుత్వంలో తప్పకుండా ఉండాలి. అప్పుడే సమాజం కూడా బాగుపడుతుంది. విద్యారంగాన్ని మౌళిక సదుపాయంగా గుర్తిస్తేనే దేశం పురోగమిస్తుంది. దాదాపు అన్ని రాష్టాల్ల్రో విద్యను వ్యాపారంగా మార్చారు. ప్రైవేట్‌ రంగంలో పోటీ ఉండడంలో తప్పులేదు కానీ మరీ ప్రజలను పీల్చి పిప్పి చేసేంతగా ప్రైవేట్‌ రంగంలో విద్యను అనుమతించరాదు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో, తెలుగు విూడియంలో చదివిన వారు ఎందరో ఉన్నత శిఖరాలు అందారు.

ప్రైవే ట్ రంగంలో పోటీ పెరిగాక విద్య మొత్తం ఇంగ్లీష్‌ విూడియానికి మారింది. ఈ క్రమంలో ఏపిలో విద్యారంగం బలోపేతం దిశగా సాగుతున్న చర్యలను స్వాగతించాల్సిందే. ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన ఇంగ్లీష్‌ విూడియం విద్యను ప్రవేశ పెట్టాలన్న నిర్ణయాన్ని కూడా స్వాగతిం చాల్సిందే. ఎందుకంటే ప్రైవేట్‌ రంగంలో ఇంగ్లీష్‌ విూడియం చదువులు పేదవారికి భారంగా మారాయి. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వం నాడునేడు కింద పాఠశాలలను పునరుద్దరించడంతో పాటు, ఇంగ్లీష్ విూడియం ప్రవేశ పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో కెజి టూ పిజి ఉచిత విద్య అన్న సిఎం కెసిఆర్‌ ఈ విషయంలో మాత్రం పెద్దగా అడుగు ముందుకు వేయలేక పోతున్నారు. బహుశా ప్రైవేట్‌ రంగం ఒత్తిడి కూడా ఉండివుంటుంది. కానీ ఎపిలో సిఎం జగన్‌ ప్రైవేట్‌ పెత్తనానికి కత్తెర వేస్తూ పాఠశాలలను అభివృద్ది చేస్తున్న తీరు దేశానికి ఆదర్శం కానుందనడంలో సందేహం లేదు.

గత మూడు,నాలుగు దశాబ్దాలుగా విద్యారంగం వ్యాపారంగా మారి కొందరి గుప్పిట్లో రాజ్యమేలుతోంది. ప్రభుత్వాలు కూడా ప్రైవేట్‌ విద్యారంగాన్నే ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా నిర్వీర్యం చేశాయి. ఇక్కడ పెట్టుబడి దండగ అన్న ధోరణిలో పాలకులు ఉన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలు మొదట్లో విశాలమైన స్థలంలో హంగు ఆర్భాటాలతో విద్యార్థులను ఆకర్షించి, ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాలు చేశారు. కాని రానురాను డబ్బుపై మోజుతో ఇక కనీస సామాజిక బాధ్యతలను విస్మరించి డబ్బులు పిండడమే లక్ష్యంగా వ్యవహారం తయారయ్యింది. విద్యా సంస్థల యజమానులు రాజకీయనాయకులుగా మారడంతో పాటు, రాజకీయ పార్టీల నేతలు కూడా విద్యారంగ వ్యాపారంలోకి రావడంతో ఇదంతా ఓ పెద్ద బిజినెస్‌గా మారింది.కొన్ని యాజమాన్యాలు రాజకీయ ప్రాపకం కోసం అధికారంలో ఉన్న పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచారు. మొత్తంగా ఈవ్యవహారం వ్యాపార ధోరణికి దారితీసి ప్రైవేట్‌ విద్య ఫక్తు వ్యాపారంగా మారింది. అప్పటి నుంచే విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం మొదలైంది.

కార్పొరేట్‌ విద్యాసంస్థల దగ్గర లంచాలు తీసుకోవడం అలవాటు చేసుకున్న ప్రభుత్వాలు, పార్టీలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరచడం ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే చదువు రాదనే దురభిప్రాయం కలిగేలా చేశారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు మవ్మిూ డాడీ అని పిలవాలన్న ఆశలో, ఇంగ్లీష్‌ చదువులు కావాలని కలలు కన్నారు. ఇదే అదనుగా అంతా విద్యను వ్యాపారంగా మొదలు పెట్టారు. ఎక్కడా సామాజిక సేవ అన్నది కానరాకుండా చేశారు. టీచర్లను అరకొర జీతాలకు నియమించుకుని వెట్టి చాకిరీ చేయిస్తూ బానిసలుగా మార్చారు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదన్న రీతిలో పాలకులు తయారయ్యారు. ప్రముఖ కార్పొరేట్‌ కళాశాలల యజమానులంతా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నవారే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. తెలంగాణలో ఉన్న కొన్ని సంస్థలు ఏకంగా అధికార పార్టీకి చెందినవారివే కావడం, కొన్నింటిలో వారి వాటా ఉందన్న విషయం జగమెరిగిన సత్యం.

 ప్రైవేట్‌ పెత్తనాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో పాటు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా రంగంలో జాడ్యాన్ని తొలగించడానికి భారీగా కసరత్తు మొదలు పెట్టింది. అందుకు తగ్గట్లుగా నాడునేడు కింద నిధులను వెచ్చించింది. సుమారు 36 వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి పాఠశాలల్లో మౌలిక సదుపా యాలను కలుగజేసింది. మినరల్‌ వాటర్‌, ఆహ్లాదకరమైన రంగులు, ఖరీదైన ఫర్నిచర్‌, ఏసీలు, ఫాన్లు, టాయ్‌లెట్లు, అన్నింటినీ మించి నాణ్యమైన మెనూతో భోజనం, పచ్చదనం మొదలైన సదుపాయాలు సమకూర్చింది. గత రెండేళ్లలో సుమారు 6 లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మళ్ళారని గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల పాఠశాలలను ఆగస్ట్‌ 16నుంచి పునఃప్రారంభించిన సందర్భంలో చూస్తే పాఠశాలల రూపురేఖలు మారాయి. కార్పొరేట్‌ రంగంలోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని, ప్రభుత్వ రంగంలో లేదన్న దురభిప్రాయాలను పటాపంచలు చేస్తూ నాణ్యమైన విద్యకోసం కావాల్సిన మౌళిక వసతులు అన్నీ సమకూర్చారు.

కార్పొరేట్‌ రంగం వైపు తల్లితండ్రులు ఎందుకు మొగ్గు చూపుతున్నారని తర్కించుకున్న సిఎం జగన్‌ ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడమే గాకుండా ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా మళ్లీ పట్టాలకెక్కించారు. దీంతో ఇప్పుడు చదువుల విషయంలో తల్లిదండ్రులకు భోరోసా దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న మౌలిక సదుపాయాలు, రంగుల హంగులు, ఆటస్థలాలు, పరికరాలు, రవాణా వసతి వంటివి విద్యారంగ నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేసేలా మారాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా కల్పించగలిగితే విద్యార్థులను తప్పకుండా ఆకర్షించవచ్చని జగన్‌ ప్రభుత్వం నిరూపించింది. నాణ్యమైన విద్యకు కొరత ఏవిూ లేదన్న భరోసా ఇచ్చింది. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వరంగ ఉపాధ్యాయులకు కూడా శిక్షణనివ్వడం అవసరం. ప్రభుత్వ విద్యారంగం విూద కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే సంకల్పం నెరవేరడంతో పాటు, దేశానికి ఓ మోడల్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *