తిరుపతి ఉపపోరులో మాటల తూటాలు

 తిరుపతి ఉపపోరులో మాటల తూటాలు

తిరుపతి ఉప ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకుంటున్న ప్రజలు

కలకలం రేపుతోన్న దొంగ ఓటర్ల ఆరోపణలు
టిడిపి అబద్దాల ప్రచారం చేస్తోందన్న వైసిపి
వైసిపి ఓటర్లను బస్సుల్లో తరలించిందన్న టిడిపి
కావాలనే ఆరోపణలన్న మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందన్న బాబు
తక్షణమే తిరుపతి ఎన్నిక నిలిపి వేయాలన్న పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌

భూమిపుత్ర ,తిరుపతి:

తిరుపతిలో దొంగ ఓటర్లను దించారని, వారితో ఓట్లు వేయిస్తున్నారని టిడిపి ఆరోపిస్తే..తిరుపతికి ఎవరు వచ్చినా దొంగ ఓటర్లని ఎలా అంటారని వైసిపి ఎదురుదాడికి దిగింది. తక్షణమే ఎన్నికలు ఆపేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పోలింగ్‌పై టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో విూడియాతో మాట్లాడుతూ, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పుణ్యక్షేత్రమైన తిరుపతికి పర్యాటకులు వస్తే బస్సులో చేరి వారిని దొంగ ఓటర్లు అని ఎలా అంటారని మండిపడ్డారు. కావాలనే దుష్పచ్రారం చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకు వెతుక్కుంటోం దన్నారు. ప్రజా బలం లేకే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని, రాజకీయ లబ్ది కోసం వైఎస్సార్‌సీపీ పై అభాండాలు వేస్తున్నారని అన్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటమికి చంద్రబాబు కారణాలు వెతుక్కుంటున్నారని.. ఇకనైనా ఆయన తన తప్పు తెలుసుకుంటే ప్రజల్లో ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. ఇదిలావుంటే తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం చంద్రబాబు విూడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తిరుపతి ఉపఎన్నికకు వంద బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు సరిహద్దు మూసివేసి తనిఖీలు చేసి పంపాల్సి ఉండగా ఎందుకు చెక్‌పోస్టును ఎత్తివేశారని నిలదీశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అభ్యర్థి గురుమూర్తి

తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో వేల మందిని ఉంచితే.. పోలీసులు నిద్రపోతున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నేత శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారన్నారు. దొంగ ఓటర్లను పట్టిస్తే టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. బందిపోట్లను మైమరిపించేలా వైసీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. వైసీపీ మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా అని నిదీశారు. ఎక్కడి నుంచో ముఠాలను దించి తిరుపతిపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై అరాచకాలు చేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఏం పని?.. ఎందుకు ప్రెస్‌విూట్‌ పెట్టారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు.. వైసీపీ మరో వైపు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ పంపిన మైక్రో అబ్జర్వర్లు ఏమయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతి ఉపఎన్నికను తక్షణమే నిలిపివేయాని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైజానాథ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం వైసీపీకి మద్దతుగా పనిచేస్తోందన్నారు. వైసీపీ ప్రభత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాని చెప్పారు. వైసీపీకి ఓటేయాలంటూ వలంటీర్లు ప్రలోభపెడుతున్నారని శైలజానాథ్‌ అన్నారు. వైసీపీ నేతలు ఎన్నికలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్ 47.42 గా నమోదయినట్లు అధికారిక సమాచారం.

ఎన్నికలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ఎం.హరినారాయణ్

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *