పార్లమెంట్ సభ్యుల పంచాయతీ పరిష్కారమయ్యేదెప్పుడు?

 పార్లమెంట్ సభ్యుల పంచాయతీ పరిష్కారమయ్యేదెప్పుడు?

భూమిపుత్ర, అనంతపురం:

వైసీపీలో మళ్లీ ఎంపీల మధ్య అలకలు తెరమీదకి వచ్చాయి.కొన్నాళ్ల కిందట ఎంపీల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు సీఎం జగన్ పంచాయితీ చేశారు.అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు సీమలో ఒకరు ఉత్తరాంధ్రలో ఒకరు ఎంపీలు పార్టీ పై గుస్సాగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.వీరిలో ఒకరు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.మరొకరు అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. వీరిద్దరూ కూడా ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా అంటీముట్టనట్టు వ్యవహరించారు.మరి దీనికి ప్రధాన కారణం ఏంటి ? అంటే వారి వారి నియోజకవర్గాల్లో ఆధిపత్య రాజకీయాలేనని సమాచారం.విజయనగరం పార్లమెంటు పరిధిలో ఎంపీ మాటను ఎవరూ పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.కేవలం ఎంపీ అంటే ఇక్కడ ఉత్సవ విగ్రహమేనని ఆయనను ఎవరూ ఖాతరు చేయడం లేదని అంటున్నారు.మంత్రి బొత్స కుటుంబం ఇక్కడ చక్రం తిప్పుతుండడంతో ఎంపీ హర్ట్ అవుతున్నారు.పార్లమెంటు పరిధిలో మూడు చోట్ల బొత్స బంధువులే ఉన్నారు.అక్కడ ఎంపీని పట్టించుకునే వాళ్లే లేరు.ఇక నియోజకవర్గ కేంద్రమైన విజయనగరంలో కోలగట్ల , బొత్స వర్గాలు బలంగా ఉన్నాయి.అక్కడ ఎంపీని పిలిచే వాళ్లే లేరు.అసలు ప్రొటోకాలే లేదు.

పైగా వచ్చే ఎన్నికల్లో బెల్లానకు టికెట్ రాదనే అంతర్గత ప్రచారం జరుగుతుండడం మంత్రి బొత్స పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి ఎంపీకి ఆహ్వానం లేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎంపీ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.దీనికి తోడు బెల్లాన కూడా వచ్చే ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ సీట్లలో ఓ అసెంబ్లీ సీటుపై కన్నేశారన్న ప్రచారంతో ఆయన్ను పూర్తిగా అణగదొక్కేస్తున్నారట.ఇక హిందూపురం నియోజకవర్గంలో మరో వాదన ఉంది.ఇక్కడ ఎంపీ మాధవ్ తనకు సంబంధం లేకపోయినా చాలా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని పార్టీనేతల మధ్య చర్చ నడుస్తోంది.హిందూపురం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ స్థాయి కార్యక్రమాలే కాకుండా ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన జోక్యం పెరిగిపోయిందంటున్నారు.అందుకే ఎమ్మెల్యేలు మాధవ్ ను పూర్తిగా సైడ్ చేసేస్తున్నారట.దీనిపై పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డికి ఫిర్యాదులు అందడంతో ఆయన వీటిని ఇటీవల సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో కొంచెం తగ్గాలంటూ సీఎం జగన్ సూచన ప్రాయంగా మాధవ్ ను హెచ్చరించారని సమాచారం.దీంతో పార్లమెంటు సమావేశాల్లో మౌనంగా ఉన్నారని అంటున్నారు.మొత్తానికి వైసీపీ లో ఈ ఇద్దరు ఎంపీల వ్యవహారం వైసీపీలో చర్చగా మారడం గమనార్హం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *