భయాందోళనలు రేకెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్

 భయాందోళనలు రేకెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్

భూమిపుత్ర,ఆరోగ్యం :

మూలిగే నక్క విూద తాటిపండు పడ్డట్లుగా ఉంది ఇప్పుడు ప్రజల పరిస్థితి. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌తో వేలాది మంది మృత్యువాత పడుతున్న వేళ బ్లాక్‌ ఫంగస్‌ విరుచుకుపడుతోంది. అక్కడక్కడా కొన్నిచోట్ల కనిపించిన ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు మెల్లగా చాపకింద నీరులా దేశం మొత్తానికి వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సన్నద్దమై శారీరకంగా, మాసినంగా పోరాడుతున్న వేళ బ్లాంక్‌ ఫంగస్‌ గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఈ వ్యాధి వ్యాప్తి చెందడం, అదికూడా కరోనా నుంచి కోలుకుంటున్న వారికి చుట్టుకోవడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఒక వ్యాధిని అదుపు చేసేందుకు, ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న వేళ సరికొత్త వ్యాధి తరుముకుని రావడం మన వైద్య రంగానికి సవాల్‌గా భావించాలి.

కరోనా సమయంలో అనుసరించిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా ఇప్పుడు పాలకులు దీనిపైనా ప్రత్యేక శ్రద పెట్టాల్సి ఉంది. ఇది మహమ్మారిలా విరుచుకు పడకముందే ప్రజలకు అవసరమైన హెచ్చరికలు చేయాలి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయి. తొలుత తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో గుర్తించారు. ఇప్పుడు ఎపిలోని కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ దీని ఆనవాళ్లు బయట పడ్డాయి. ఓ వైపు కరోనాతో చచ్చిపోతుంటే ..కరోనా వచ్చిపోయిన వారివిూద దీనిప్రభావం చూపుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో పలువురు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్నారనేది వాస్తవం. ఓ వైపు కరోనా వైరస్‌ తో ప్రజలు అల్లాడుతుంటే..మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కలవరపెడుతోంది. ఈ ఫంగస్‌ తో పలువురు మృతి చెందుతున్నారని వార్తలు వెలువడుతుండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.

ప్రధానంగా మధుమేహ వ్యాధి గ్రస్థులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే.. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకుంటే బ్లాక్‌ ఫంగస్‌ గురించి భయప డాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శ్వాస సరిగా ఆడక పోవడం, ముక్కు పుటాలు పూర్తిగా మూసుకుని పోయినట్టుగా మారడం, చీమిడిలో నల్లని చారలు అంటే బ్లాక్‌ స్పాట్స్‌ గానీ పడుతుంటే బ్లాక్‌ఫంగస్‌ అని నిర్దారించవచ్చు. తలనొప్పి, జ్వరం, కండ్ల మంట లక్షణాలు కూడా ఉంటాయి. ప్రాథమిక దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయడం ద్వారా దీనిని నియంత్రించ వచ్చని వైద్యులు అన్నారు. ఆదిలోనే గుర్తిస్తే ముందుగా ఎండోస్కోపీ ద్వారా ముక్కులో నుంచి బ్లాక్‌ఫంగస్‌ను పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుంది. తర్వాత దాదాపు వారంపాటు రోజూ డ్రెస్సింగ్‌ చేసుకుంటూ.. యాంటీ ఫంగస్‌ చికిత్సను కొనసాగిస్తే కండ్లు, మెదడుకు ఫంగస్‌ చేరకుండా నిలువరించవచ్చంటున్నారు.

షుగర్‌ ను కంట్రోల్‌ ఉంచుకోవాలంటే..ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని, పలు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాని నిపుణులు సూచిస్తున్నారు. జొన్న, కొర్రలు, రాగులు, అండుకొర్రలతో చేసిన ఆహారం, బీరకాయ, సోరకాయ, గోరు చిక్కుడు, చిక్కుడు కాయల్లో పీచు ఎక్కువగా ఉంటుందని, వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్స్‌ లెవల్స్‌ పెరగవని అంటున్నారు. అలాగే.. పైనాపిల్‌, నిమ్మ, జామపండ్లు తీసుకోవాంటున్నారు. వీటిల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. బియ్యంతో చేసిన ఇడ్లీలు, దోశలు, అన్నం, బంగాళ దుంప వంటి వాటికి దూరంగా ఉండాలి. కరోనా సోకిన తర్వాత స్టెరాయిడ్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో షుగర్‌ ఎక్కవవుతుందని, మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు వెల్లడిస్తున్నారు. షుగర్‌ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్‌ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్‌ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ అంటే మ్యూకరోమైకోసిస్‌ అనే రైజోఫస్‌ జాతికి చెందినది. ఇది మనుషులకు హాని చేసే శిలీంధ్రం. ఇది చెత్తచెదారం, కూరగాయు, పండ్లు, చెక్క, పేడ లాంటి ప్రదేశాలలో ఉంటుంది. మనం గాలి పీల్చినపుడు ముక్కులోని సైనసు అనే గాలిబుడగలోకి చేరి అక్కడ పెరుగుతుంది. కళ్ళకు, మెదడుకు వ్యాపిస్తే చాలా ప్రమాదం. ఆరోగ్య వంతులైన మనుషుల ముక్కులో కూడా ఉంటుంది. హాని చేయదు. కాని ఇమ్యూనిటీ తగ్గితే దాడి చేస్తుంది. ఇది ఇంతకు మునుపు కిడ్నీ మార్పిడి వారికి, కాన్సరు వారికి, హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వారికి, ఇమ్యునో సప్రెషన్‌ మందు వాడేవారికి వచ్చేది. డయాబెటిస్‌ వారికి అరుదుగా వస్తుంది.

కోవిడ్‌లో సైటోకైన్‌ స్టార్మ్‌తో కేసు చేరినపుడు అది మన ఇమ్యూనిటీ ఓవర్‌ రియాక్షన్‌ వల్ల వస్తుంది. దానిని తగ్గించడానికి స్టెరాయిడ్స్‌ అధిక మోతాదులో ఇస్తారు. ఇదే సమయంలో చక్కెర స్థాయిలు డయాబెటిక్‌లో పెరగతాయి. అప్పుడు మన కణజాలాల్లో ఈ ఫంగస్‌ పెరగతుంది. షుగర్‌ అదుపులో ఉంటే ఏమి కాదు. చాలామందికి 12-15 రోజులు కరోనా రికవరీ తరువాత వస్తోంది. ముక్కు దిబ్బడ, ముక్కు చుట్టు బ్లాక్‌ పాచు, రక్తం కారడం, కళ్ళువాపు, నొప్పి, కనుబొమ్మ వాలిపోవడం, చూపు మందగించడం. వ్యాధి సోకితే ఆఖరుకు కన్ను తీసివేయవలసి రావచ్చును. మెదడుకు పాకవచ్చును. దీనికి ఆంటిఫంగల్‌ మందు నరానికి ఆంఫోటెరిసిన్‌ 3500 అయ్యే సూదులు రోజు ఒకటి 6-8 వారాలు వాడాలి. ఫెస్‌ అనే పద్దతి ద్వారా ఎండోస్కోపి ఉపయోగించి ఫంగస్‌ను ముక్కు లోంచి తీసేస్తారు. ఇది పెద్ద సమస్య కాకపోయినా ఇలా కేసులు చాలా చోట్ల బయటపడడం ఒక సమస్యాత్మకం అవుతోంది. షుగర్‌ లేని వారికొస్తే ముక్కులో బిటాడిన్‌ స్వాబ్‌తో రెండుపూటలా శుభ్రపరచుకోవాలి. మొత్తానికి బ్లాక్‌ ఫంగస్‌కు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు మరోసారి చెబుతున్నారు. అయితే కరోనాతో ఒళ్లు,ఇల్లు గుల్ల చేసుకున్న వారికి ఈ వ్యాధి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. దీనిపై తక్షణ చర్యలకు ఆరోగ్యరంగం నడుం బిగించాలి. అప్పుడే ప్రజలు నిశ్చింతగా ఉండగలరు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *