ధాన్యం సేకరణే అసలు సమస్య !!

 ధాన్యం సేకరణే  అసలు సమస్య !!

భూమిపుత్ర,వ్యవసాయం:

కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజల కోసం నిరంతరం తపించే పాలకులు పుడుతారు. మనం పాలన చేసేది ప్రజలకోసమే అన్న ఆలోచనతో ముందుకు సాగుతారు. అందుకు అనుగుణంగా పథకాలు రచిస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారం చేసి జనం నోళ్లల్లో నానుతారు. ఔరా ఎంత మంచి నాయకుడని అనిపించుకుంటారు. పాతతరంలో నాయకులు అలానే చేసే వారు. ఎంతో త్యాగబుద్దితో ముందుకు సాగేవారు. తమ సర్వస్వం త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి, అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌ లాంటి వారు ఎందరో ఈ దేశానికి తమ సేవలు అందించారు. మోడీ ప్రధాని అయిన తొలినాళ్ల లో అంతా మన భాగ్యం అనుకున్నారు. ఒక నిస్వార్థ సేవకుడు పుట్టుకుని వచ్చారని, భారత ప్రజలను ఉద్దరిస్తాడని అనుకున్నారు.

తెలంగాణలో కెసిఆర్‌, ఎపిలో జగన్‌ కూడా ప్రజల బాగోగులు గ్రహిస్తారని అంతా భావించారు. కానీ వీరి పాలన ఎలా ఉన్నా సమస్యలపై మాత్రం దృష్టి దోషంతో ఉన్నారు. ఏ సమస్య అయినా లోతుగా అధ్యయనం చేయడం, దానిని పరిష్కరించాలన్న తపన పడడం కానరావడం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వీరు చేపట్టిన పథకాలు పక్కాగా ఫలితాలు ఇవ్వడం లేదు. పథకాలు మంచివే అయినా క్షేత్రస్థాయిలో అమలు తీరులో లోపాలు కనిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే ధాన్యం కొనుగోళ్లు అన్నది ఏటేటా సమస్యల పుట్టగా మారుతోంది. తెలంగాణలో కొంత బాధ్యతగా వ్యవహరిస్తున్నా ఏపీ లో ఇంకా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. నిజానికి ఏపీ లో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు పూర్వాశ్రమంలో జర్నలిస్ట్‌. సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి. క్షేత్రస్థాయిలో ధాన్యం పండించడం, రైతుల బాధలు, అమ్మకాల్లో ఉన్న ఇబ్బందులు తెలుసు. అయినా ఎందుకనో అక్కడా రైతులు సంతృప్తి చెందేలా కొనుగోళ్లు సాగడం లేదు.

ఇప్పటికీ కల్లాల్లో ధాన్యం రాశులు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే రైతులను దోచుకునే క్రమంలో ఎక్కడైనా మిల్లర్లు, దళారీలు సిద్దంగా ఉంటున్నారు. తరుగు పేరుతో, తాలు పేరుతో వారిని నిండా ముంచుతున్నారు. ఇదిలా వుంటే తెలంగాణలో కూడా ఇంచుమించు ఇవే సమస్యలు ఉన్నాయి. కాకపోతే రైతులకు పెట్టుబడి కింద ఎకరాకు పదివేలు ఏటా ఓ మారు అందుతోంది. ఇది ఏ మేరకు వారికి ఉపయోగపడుతుందన్నది పక్కన పెడితే రైతులు ఇవేవీ కోరుకోవడం లేదు. పండించిన పంటలను ఎలాంటి ఇక్కట్లు లేకుండా కొనాలని చూస్తున్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావాలని కోరుకుంటున్నారు. చివరి గింజవరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనాలని కోరుకుంటున్నారు. వర్షాలు వచ్చి ధాన్యం తడిస్తే అదీ కొనాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోళ్ల కోసం ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. సకాలంలో పంటలు కొనుగోళ్లు చేయాలని వారు కోరుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ యేడు ప్రస్తుత సీజన్‌లో వరి ఉత్పత్తి పెరిగింది.

మార్కెట్లకు విపరీతంగా ధాన్యం వచ్చి చేరుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరి ధాన్యం సేకరణ ప్రారంభం అయ్యింది. ఈ దశలో గిట్టుబాటు ధరలు చెల్లించి వచ్చిన ధాన్యం వచ్చినట్లుగా, మద్దతు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తేనే రైతులకు ఊరట దక్కనుంది. తెలంగాణ మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల విధానాల కారణంగా పంట దిగుబడులు పెరిగాయి. అలాగే ఏపీలోనూ ఈ సీజన్‌లో వరి దిగుబడి పెరిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే మద్దతు ధరలతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారుల బెడద లేకుండా రైతులకు అండగా అధికారులు నిలవాలి. అలాగే ఇటీవలి వడగళ్లు, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కూడా కొంటేనే రైతులకు ఊరట. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో రైతుల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన వ్యవసాయిక విధానం లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ఫ్రీ మార్కెట్‌ అనేది ఒక అభూత కల్పన మాత్రమే అయ్యింది.

దేశ ఆర్థిక వ్యవస్థ 8నుంచి 9శాతం వరకూ వృద్ధి జరుగుతున్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతన్నా రైతుల ఆర్థిక వ్యవస్థ మాత్రం బాగుపడడం లేదు. అవసరం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా ఆహారధాన్యాలను దిగు మతి చేసుకోవడం కూడా రైతులకు శరాఘాతంగా మారింది. కల్తీలు కూడా రైతును కాటేస్తున్నాయి. మన అసవరాలకు సరిపడా కందులు, మిరప, ఇతర పంటలను రైతులు చెమటోడ్చి పండించినా వాటిని కొను గోలు చేయడం లేదు.రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా రైతుల సమస్యలను ప్రధాన ఎజెండాగా ప్రచారం చేయలేదు. గిట్టుబాటు ధరలు లేక వచ్చిన ఆదాయం కూలీల ఖర్చుకు సరిపోతుంది. ఎపిలో ప్రతి ఎకరాకు కౌలు 10 వేల నుంచి 25 వేల రూపాయల వరకు భూమి యజమానులకు చెల్లించవలసి వస్తుంది. లక్షలాది మంది రైతులు వర్షాలు కురిసి కాలం మంచిగా అయినప్పటికీ ధరలు రాక నష్టపోతున్నారు. వర్షాలు లేని సంవత్స రంలో పంటలు ఎండిపోయి నష్ట పోతున్నారు. మార్కెట్‌లో రైతులను దోచుకునే శక్తులు నిరాటంకంగా విజృంభిస్తూనే ఉన్నాయి. రైతులకి మేలు చేస్తానన్న ప్రభుత్వాల ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. అంతెందుకు రైతులకు గిట్టుబాటును మించి ధరలు దక్కేలా చేస్తామన్న ప్రధాని మోడీ కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు. క్షేత్రస్థాయిలో వీటిపై అధ్యయనం జరగాలి. రైతులు ఏమి కోరుకుంటు న్నారన్నది విస్తృతంగా వారి నోటి నుంచి రాబట్టాలి. అప్పుడే పథకాల అమలు ఫలితాలు ఇస్తాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *