మన నిర్లక్ష్యమే మన ప్రాణాలకు ముప్పు!!

 మన నిర్లక్ష్యమే మన ప్రాణాలకు ముప్పు!!

భూమిపుత్ర,సంపాదకీయం:

దేశంలో కరోనా సృష్టించిన గందరగోళం ఇంకా తొలగిపోలేదు.ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ లు విధించి చేతులు దులుపుకుంటున్నాయి. నిర్లక్ష్యం జాడ్యం నుంచి ప్రభుత్వాలు బయటపడడం లేదు.అధికారుల ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ నాయకులు అంతా బాగుందని మిన్నకుంటున్నారు. కరోనా కట్టడి చర్యలపై సుప్రీంకోర్టు, ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రభుత్వాలను గట్టిగానే నిలదీస్తు న్నాయి.అయినా ప్రైవేట్‌ ఆస్పత్రులు యధావిధిగానే తమ వసూళ్లను మరింత ముమ్మరం చేస్తున్నాయి.కేసు వస్తే చాలు నొక్కేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.ఇక చనిపోతే కరోనా జాబితాలో వేసి మేమేం చేసేదిలేదని చేతులు దులుపుకుంటున్నాయి.బతికితే పేషెంట్‌ అదృష్టంగా, డాక్టర్ల కృషిగా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా కరోనా రెండవదశ ఎందరినో మింగేసింది.

ఇంకా థర్డ్‌వేవ్‌, మరిన్ని వేవ్‌లు, కొత్తకొత్త వేరియంట్లు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది.ఈ పరిస్థితుల్లో మిగతా దేశాల పరిస్థితి ఎలాగుందో తెలియదు కానీ భారత దేశంలో పుట్టినందుకు ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు ప్రజలు మాత్రం రోగాలతో చస్తున్నారు.కరోనా కావచ్చు,ఇకముందు వచ్చే అంటు రోగాలు కావచ్చు,ప్రజలు మాత్రం వ్యక్తిగత భద్రత,శ్రద్ద తీసుకోకుంటే ఎవరు కూడా ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలి.నిత్యం డబుల్‌ మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం పాటించడం నిత్య జీవన విధానం కావాలని వైద్యనిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.ఇలా చేయనంత వరకు ప్రభుత్వాలు కూడా ఏవిూ చేయలేవని, మన ప్రాణాలకు గ్యారెంటీ ఉండదని కూడా అంటున్నారు.వ్యాక్సిన్‌ తీసుకున్న 15 రోజుల దాకా యాంటీబాడీలు అభివృద్ధి చెందవు. ఈలోగా వైరస్‌ బారిన పడితే ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.ప్రాణాపాయ స్థితినీ ఎదుర్కోవాల్సి రావచ్చు.

అలాగే వ్యాక్సిన్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోయినా,తగు సమయంలో ఇవ్వకపోయినా నష్టం వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికే. కాబట్టి సమస్య ఏ రూపంలో అయినా రావచ్చని, అసలు రాకుండా ఉండాలంటే అప్రమత్తతే ముఖ్యమని వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మనకు ఎదురొచ్చే వారిలో ఎవరికి ఏ కొత్త వేరియంట్‌ సోకిందో తెలియదు. కాబట్టి భౌతిక దూరం పాటించడం, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే డబుల్‌ మాస్కులు, శానిటైజర్‌ను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలం కన్నా, టీకా వల్ల వచ్చిన యాంటీబాడీల బలం కన్నా కొత్త వేరియంట్‌ బలం ఎక్కువైతే ఇన్ఫెక్షన్‌ తీవ్రమయ్యే ముప్పుంది.ఇకపోతే వ్యాక్సిన్‌ వేసుకుంటే ముప్పు తొలిగిందన్న ధీమాలో ఉంటున్నారు. అదికూడా సరికాదని హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా రెండు డోసుల టీకా వేసుకున్న కోట్లాది మందిలో అతి తక్కువ మంది మాత్రమే వైరస్‌ వల్ల కొంత ఇబ్బంది పడ్డారు.అందుకే అప్రమత్తతే అసలైన వ్యాక్సిన్‌ అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.అత్యధికుల్లో ధైర్యం నింపుతున్న వ్యాక్సినేషన్‌ కొందరిలో మాత్రం అనవసర ధీమాను, ఎక్కడలేని నిర్లక్ష్యాన్నీ పెంచుతోందని, ఈ ధోరణి పెరిగితే ముప్పేనని వారు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే ఇక కరోనాను జయించి నట్టేనని చాలా మంది భావిస్తున్నారు.వ్యాక్సిన్‌ వైరస్‌ను చంపేసే బ్రహ్మాస్త్రం కాదని గుర్తించడం లేదు.నిమిషాల్లో వైరస్ ను అంతం చేసి, ప్రాణాలను కాపాడే సంజీవని అంతకంటే కాదు. కేవలం కరోనా వైరస్ ను తట్టుకునే శక్తి సామర్థ్యాలను మాత్రమే అది శరీరానికి అందిస్తుంది. వైరస్‌ సోకితే ఇన్ఫెక్షన్‌ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. ఆస్పత్రి పాలయ్యే అగత్యాన్ని.. ప్రాణాపాయ ముప్పును తగ్గిస్తుంది. ఈ విషయం తెలియక చాలా మంది టీకాలు వేయించుకున్నాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ నిర్లక్ష్యమే అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలికాలంలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ టీకాలు తీసుకున్న వారంతా తమకేం కాదులే అన్న ధోరణితో వ్యవహరించడమే సమస్యకు, వైరస్‌ వ్యాప్తి పెరగడానికి కారణమవుతోంది. ఆ ధోరణితో వారు వైరస్‌ బారిన పడడమే కాక కుటుంబసభ్యులకు, చుట్టూ ఉండేవారికి వ్యాపించడానికి కారణమవుతున్నారు.ఇలా వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా బారిన పడినవారిలో చాలా మంది స్వల్ప లక్షణాలతోనే బయటపడ్డారు. తక్కువ మందిలో కొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్సతో ఇంటికి చేరుకున్నారు. మరికొందరు ఆక్సిజన్‌ సపోర్టు దాకా వెళ్లగా ఇంకొందరికి వెంటిలేటర్‌ చికిత్స అవసరమైంది.దురదృష్ట వశాత్తూ అతికొద్దిమంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు.వ్యాక్సిన్‌ ఒక్కొక్కరి శరీర తీరును బట్టి ఒక్కొక్కలా పనిచేయడమే ఈ మరణాలకు కారణం.ముఖ్యంగా 65 ఏళ్లు దాటినవారిలో టీకా రక్షణ దాదాపు 50శాతమే ఉంటోందని,యువతలో ఆ రక్షణ 89 శాతందాకా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్టు వైద్యులు గుర్తుచేస్తున్నారు.

 కొత్త వేరియంట్లు కూడా రీఇన్ఫెక్షన్లకు కారణమవు తున్నాయని వారు తెలిపారు.సెకండ్‌వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపిన వేరియంట్‌ చాలా వేగంగా దూసుకుని రావడం వల్లనే తీవ్రత కూడా పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు.అందుకే దేశంలో వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వేరియంట్‌కు టీకా వల్ల కలిగే రక్షణను తప్పించుకోగల సామర్థ్యం ఉందని గుర్తుచేస్తున్నారు.పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ చేసిన ఒక అధ్యయనం ప్రకారం డెల్టా వేరియంట్‌పై సింగిల్‌ డోసు టీకా ప్రభావశీలత కేవలం 33శాతం మాత్రమేనని తేలింది. ప్రస్తుతం తీవ్రంగా వ్యాప్తిలో ఉన్న వేరియంట్లకు తోడు దేశవ్యాప్తంగా నిత్యం లక్షల మందికి వైరస్‌ సోకుతుండడం వల్ల వైరస్‌ లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్నా కూడా అలాంటి కొత్త వేరియంట్లకు ఎక్స్‌పోజ్‌ అయితే ఇన్ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువని హెచ్చరిస్తు న్నారు.అప్పుడూ టీకా వల్ల కొంత రక్షణ ఉంటుందే తప్ప మొత్తంగా ప్రమాదం ఉండదని చెప్పలేమని అంటున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *