ఒలింపిక్ క్రీడలపై నీలి నీడలు!!

 ఒలింపిక్ క్రీడలపై నీలి నీడలు!!

భూమిపుత్ర,క్రీడలు:

కరోనా మహమ్మారి జపాన్‌లో విజృంభిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఆదేశంలో జూన్‌ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్‌ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్‌ వేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘టోక్యో ఒలింపిక్స్‌’ వచ్చే నెలలో ప్రారంభం అవుతాయా లేదా అనేది సందేహంగా మారింది. గతేడాది జరగాల్సిన విశ్వ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్‌ టోక్యో వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఒలింపిక్స్‌ నిర్వహణపై తుది నిర్ణయం జూన్‌ చివరి వారంలోనే తీసుకునే అవకాశం ఉందని ఐవోసీ సీనియర్‌ సభ్యుడు రిచర్డ్‌ పౌండ్‌ చెప్పాడు.ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని ఆతిథ్య నగర ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం మాత్రం విశ్వక్రీడలను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.

మెగా ఈవెంట్‌ను రద్దు చేయాలని ప్రముఖ జపాన్‌ దినపత్రిక అసహి శింబున్‌ డిమాండ్‌ చేస్తోంది. విశ్వక్రీడలను నిర్వహించొద్దంటూ అక్కడి ప్రజలతో పాటు డాక్టర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్‌ గేమ్స్‌ వద్దు అంటూ దేశంలోని 80 శాతం ప్రజలు కోరుకుంటున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.కొవిడ్‌-19 మహమ్మారి వల్ల ప్రపంచానికి విశ్వక్రీడలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. విదేశీయులను జపాన్‌లోకి అనుమతించకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా బయో సెక్యూర్‌ బబుల్‌లో క్రీడలు నిర్వహించినా వైరస్‌ దరిచేరదనే నమ్మకం లేకపోవడంతో నిర్వహకుల్లోనూ ఒకింత ఆందోళన కనిపిస్తున్నది. వైరస్‌ ముప్పు పొంచిఉండే ప్రమాదం ఉండటంతో ఒలింపిక్స్‌ వంటి మెగా టోర్నీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.కరోనా కారణంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ రద్దయితే జపాన్‌ 17 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.12.36 లక్షల కోట్లు) నష్టపోతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

విశ్వక్రీడలు జరుగకపోతే జపాన్‌ ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుందంటూ నొమూరా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తేల్చిందని క్యోడో న్యూస్‌ వెల్లడిరచింది. క్రీడల నిర్వహణ కోసం అంచనా వ్యయం సుమారు రూ.18.28 లక్షల కోట్లుగా లెక్కిస్తున్నారు.ఒకవేళ ఒలింపిక్స్‌ రద్దయితే ఐవోసీ కూడా భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఒలింపిక్స్‌ను నిర్వహించాలని జపాన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. జపాన్‌ ప్రధాని యోషిహైడ్‌ సుగా సైతం గేమ్స్‌ నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈవెంట్‌ నిర్వహిస్తే భారీగా ఆదాయం సమకూరుతుందని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒలింపిక్‌ క్రీడలు కచ్చితంగా ప్రారంభమవుతాయని టోక్యో 2020 అధ్యక్షుడు సీకో హషిమోటో ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నా, నిర్వాహకులు మాత్రం క్రీడలను నిర్వహించాలన్న పట్టుదలతోనే ఉన్నారు.

టీకా ప్రక్రియను జెట్‌ స్పీడ్‌లో నిర్వహిస్తోంది. టీకా కేంద్రాలను పెంచింది. అలాగే ముందుగా 65 ఏళ్లు దాటిన వారికి టీకాలు అందిస్తోంది. జులై 23న ఒలింపిక్స్‌ మొదలవుతాయి. ఆ లోపు 65 ఏళ్లు పైబడిన వాళ్లకు టీకాలు ఇచ్చేందుకు సైన్యానికి చెందిన వైద్య సిబ్బంది సాయం కూడా తీసుకుంటోంది ప్రభుత్వం. వచ్చే మూడు నెలలలో అందరికీ టీకా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న టోక్యో నగరంలో రోజుకు పది వేల మందికి, ఒసాకాలో రోజుకు అయిదు వేల మందికి వ్యాక్సిన్‌ అందించే ప్రయత్నం చేస్తున్నారు. జపాన్‌ తల్చుకుంటే అయిపోతుంది కూడా!కరోనా విలయతాండవం చేస్తున్న ఇలాంటి సమయంలో ఒలింపిక్స్‌ను నిర్వహించడం సరికాదంటూ జపాన్‌ ప్రజలు అంటున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. మెజారిటీ ప్రజల మనోగతం ఇదే.. అయినప్పటికీ ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే గట్టి పట్టుదలతో ప్రధానమంత్రి యోషిహిదే సుగా ఉన్నారు. ఇప్పుడు నిర్వహించకుంటే లక్షల కోట్ల రూపాయాలు వృధా అవుతాయన్నది ఆయన ఆలోచన!

జులై చివరి నాటికి జపాన్‌లో దాదాసు మూడున్నర కోట్ల వృద్ధులకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇప్పటి వరకు టీకా ప్రక్రియ చాలా మందకొడిగా సాగింది. అందుకే ఆ దేశ జనాభాలో రెండు శాతం మందికి కూడా టీకా అందలేదు. ఇప్పుడు ప్రజల భయం అదే! చాలా మందికి ఇంకా టీకాలు అందలేదని, ఇలాంటి సమయంలో ఒలింపిక్స్‌ను నిర్వహించి తమ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదంటున్నారు. ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తున్నదని విమర్శిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఇప్పటికే జపాన్‌లో కఠిన ఆంక్షలు ఉన్నాయి. టోక్యో నగరంతో పాటు మరో ఆరు ప్రాంతాలలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకూడదని, అంతా సజావుగానే జరుగుతుందని ప్రధాని సుగా భరోసా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని, అందరికీ టీకాను అందిస్తామని ఆయన చెబుతున్నారు.

దేశ జనాభాలోని 80 నుంచి 90 శాతం మందికి టీకాలు అందితే అప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహించవచ్చని అంటున్నారు. అయితే అది సాధ్యమేనా? కేవలం రెండు నెలల వ్యవధిలో అంతమందికి టీకాలు ఇవ్వగలరా? సరిపడినంత వైద్య సిబ్బంది కూడా లేని పరిస్థితులలో టీకాలు ఎలా ఇప్పించగలరు? ఇవన్నీ ప్రశ్నలే!టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులకు వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ మొదలైంది. జాతీయ క్రీడా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ఒలింపిక్స్‌ సంఘం (ఐవోఏ) వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మొత్తంగా 90 మందికి పైగా భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 80% మంది క్రీడాకారులు వ్యాక్సిన్‌ తీసుకొని ఉంటారని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) అంచనా వేస్తున్నది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *