ఒలింపిక్స్‌ కు కౌంట్‌డౌన్‌ షురూ

 ఒలింపిక్స్‌ కు కౌంట్‌డౌన్‌ షురూ

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతతో మళ్లీ అనుమానాలు

భూమిపుత్ర,క్రీడలు:
టోక్యో ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే టోక్యో విశ్వక్రీడలు మొదలయ్యేది మరో వంద రోజుల్లోనే. షెడ్యూల్‌ ప్రకారం నిరుడు జరగాల్సిన ఈ క్రీడలు కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మెగా ఈవెంట్‌ జూలై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ -19 విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ క్రీడ నిర్వహణపై ఇంకా అనిశ్చితి తొలిగిపోలేదు. కరోనా కారణంతో ఉత్తర కొరియా విశ్వక్రీడకు తాము రావడం లేదని ఇప్పటికే ప్రకటించింది. కానీ.. ఈసారి ఎలాగైనా ఈవెంట్‌ జరుగుతుందని ఆతిథ్య దేశం జపాన్‌, అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) స్పష్టం చేస్తోంది. అందుకు తగ్గట్టే.. బుధవారం విశ్వక్రీడ కౌంట్‌డౌన్‌ షురూ చేశారు. మరో వంద రోజుల్లో విశ్వ సంరంభాన్ని చూడబోతున్నామంటూ టోక్యో నగర వీధులను ఒలింపిక్‌ రంగుల మయం చేశారు.

ఏదేమైనా.. షెడ్యూల్‌కు అనుగుణంగా మొదలైతే ఒలింపిక్స్‌లో సత్తాచాటి విశ్వ వేదికపై తమ జాతీయ జెండాను రెపరెపలాడించాలని అథ్లెట్లు కోరుకుంటున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ జరిగితే.. భారత అథ్లెట్లు పతకాల పంట పండించనున్నారని అంటున్నారు. . ప్రముఖ క్రీడా టోర్నమెంట్ల గణాంకాల సంస్థ గ్రేస్‌నోట్‌ ప్రకారం.. ఈసారి భారత్‌కు 17 పతకాలు రావొచ్చట. ఇందులో నాుగు స్వర్ణాలు కూడా ఉంటాయని ఆ సంస్థ ఊహిస్తోంది. ప్రధానంగా షూటింగ్‌లో ఎనిమిది, బాక్సింగ్‌లో నాలుగు, రెజ్లింగ్‌లో మూడు, ఆర్చరీ, వెయిట్‌లిప్టింగ్‌ ఈవెంట్లలో ఒక్కో పతకం భారత్‌ ఖాతాలో చేరుతాయని గ్రేస్‌నోట్‌ తెలిపింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *