ఈశాన్య రాష్ట్రాలలో కనుమరుగవుతున్న కాంగ్రెస్!!

 ఈశాన్య రాష్ట్రాలలో కనుమరుగవుతున్న కాంగ్రెస్!!

భూమిపుత్ర,సంపాదకీయం:

మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదే. కాంగ్రెస్‌కు దెబ్బ విూద దెబ్బ. అసలే దాని పరిస్థితి బాగా లేదు. దేశంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడింది. తొలి నుంచి ఈశాన్య భారతం కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతోంది. బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మేఘాలయ కూడా చేయి దాటి పోయింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలలో హస్తం పని అయిపోయింది అనే భావన కలిగిస్తోంది.మేఘాలయలో 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో పన్నెండు మంది పార్టీ ఫిరాయించారు. మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా నేతృత్వంలో ఇది జరిగింది. ఈ విభజనతో దాని ప్రతిపక్ష హోదా గల్లంతైంది. మరొక రాష్ట్రంలో కాంగ్రెస్‌ క్షీణతను ఇది సూచిస్తోంది. ఐతే కాంగ్రెస్‌ వారు ఈ సారి ఫిరాయించింది బీజేపీలోకి కాదు. బీజేపీకి మరో ప్రత్యర్థి అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి. ఇది కాంగ్రెస్‌ పార్టీని మరింత క్షోభకు గురిచేసే విషయం.అంతకు ముందు, 2016లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు మరీ ఘోరం. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి పెమా ఖండూతో సహా 43 మంది కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌లో చేరి అధికారంలో కొనసాగారు.

ఆరు నెలల తర్వాత ఖండూతో పాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్‌ చేయటం అరుణాచల్‌ ప్రదేశ్‌కు అలవాటే. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అలా అనే సరిపెట్టుకుంది. కానీ మేఘాలయ విషయంలో అలా సరిపెట్టుకోలేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.మేఘాలయ సీఎల్పీ నేత సంగ్మా గత ఆగస్టు నుంచి అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా లింగ్డో స్థానంలో షిల్లాంగ్‌ ఎంపీ విన్సెంట్‌ పాల్ ను నియమించటమే దానికి కారణం. ఈ నేపథ్యంలో, గత సెప్టెంబర్‌లో విన్సెంట్‌ సన్మాన సభ జరిగింది. సంగ్మాతో పాటు డజను మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మాకొట్టి తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు.గత నెల మొదట్లో సంగ్మా కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడిని, అలాగే గౌహతిలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఆ ఆరోపణలను ఆయన వాటిని ఖండించారు. తరువాత అధిష్టానం సంగ్మాతో పాటు మొత్తం రాష్ట్ర నాయకులను ఢిల్లీ కి పిలిపించింది. ఢిల్లీ పెద్దలు వీరిని పిలిపించటానికి కారణం మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు ముందు ఐక్యత సందేశాన్ని ఇవ్వటం. ఐతే, మూడు చోట్ల హస్తం పార్టీ ఓటమి పాలైంది.

మరోవైపు, సంగ్మాను నార్త్‌ ఈస్ట్‌ కో ఆర్డినేషన్‌ కాంగ్రెస్‌ కమిటీకి పార్టీ చైర్మన్‌గా చేసినప్పటికీ పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిధుల సమస్య కూడా వెంటాడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి పెద్దగా నిధులు సమకూర్చలేదని భావించారు. అదే సమయంలో తృణమూల్‌లో ఆ సమస్య ఉండదని సంగ్మా విశ్వసించారు. తృణమూల్‌ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీం రెండు నెలల పాటు షిల్లాంగ్‌లో మకాం వేసి కథ నడిపించినట్టు తెలుస్తోంది.మరోవైపు, ఇదంతా పార్టీ అధిష్టానానికి తెలుసని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఏఐసీసీ ప్రతినిధులు కేసీ వేణుగోపాల్‌ , మనీష్‌ చత్రత్‌ లను సయోధ్య కోసం మేఘాలయకు పంపింది. నవంబర్‌ 18న వారు సంగ్మా, పాలాతో పాటు పలువురు సీనియర్‌ నేతలను కలిశారు. సమావేశం తర్వాత, సంగ్మా, పాలా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తలెత్తే అడ్డంకులు, సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి పార్టీ అన్ని బలాలను ఏకీకృతం చేయాలని తీర్మానం చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐతే, అప్పటికే సంగ్మా పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పార్టీకి ఇప్పుడు అర్థమైంది.గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజిన్హో ఫలేరోతో పాటు మరికొందరిని తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో ప్రశాంత్‌ కిషోర్‌ పాత్ర ఉందని చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, కిషోర్‌ కొన్ని నెలల క్రితం రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో టచ్‌లో ఉన్నాడు. కాంగ్రెస్‌లో చేరాలని కూడా అనుకున్నాడు. కానీ కిషోర్‌ చేరిక పార్టీ సీనియర్లకు ఇష్టం లేదు. అంతే కాదు పీకే పెట్టిన షరతులు కూడా ఆమోదయోగ్యంగా లేవని పార్టీ భావించింది. పార్టీ ప్రచార బాధ్యతలను పూర్తిగా తనకు అప్పగించాలని పీకే షరతు పెట్టినట్టు సమాచారం. దాంతో పాటు మరికొన్ని షరతులను కూడా పార్టీ ముందు ఉంచారని..అందుకే ఆ ప్రతిపాదనను సోనియా పక్కన పెట్టారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ 60 మంది సభ్యుల సభలో 21 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాన్రాడ్‌ సంగ్మా కు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కాంగ్రెస్‌కు అధికారాన్ని అందకుండా చేసేందుకు ఎన్‌పిపితో పాటు కొన్ని చిన్న పార్టీలు , ఒక స్వతంత్ర ఎమ్మెల్యేను బిజెపి ఒక్కటి చేసింది.దాంతో కాంగ్రెస్‌ అగ్రనేతలు దివంగత అహ్మద్‌ పటేల్‌, అప్పటి రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ పీసీ జోషితో పాటు సీనియర్‌ నాయకులు ముకుల్‌ వాస్నిక్‌, కమల్‌ నాథ్‌లను అధిష్టానం హుటాహుటిన షిల్లాంగ్‌ వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అవకాశాలను అన్వేషించింది. ఐతే, హిమంత బిస్వా శర్మ మంత్రాంగం ముందు వారు నిలవలేకపోయారు.

ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోవటంతో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తన ఇంటిని కూడా చక్కదిద్దుకోలేక పోతుందనే భావనకు మరింత బలం ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో మళ్లీ పుంజుకునేందుకు కాంగ్రెస్‌ పోరాడుతోంది. కానీ మేఘాలయలో అది తిరిగి నిలబడటం కష్టమే.కాంగ్రెస్‌లో జరిగిన ఈ విభజన మేఘాలయలో రాజకీయ సవిూకరణాలను మార్చేసిదిలా వుంది. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎదుగుదలకు ఇది ఆరంభం అవుతుంది. తృణమూల్‌కు నిధుల కొరత లేదు. అలాగే పీకే వంటి ఎన్నికల వ్యూహకర్త దాని పక్కన ఉన్నాడు. రాబోవు రోజులలో అధికారాన్ని సవాలు చేయవచ్చు. ప్రస్తుతం బెంగాల్‌ కు మాత్రమే పరిమితమైన తృణమూల్‌ దేశ వ్యాప్తంగా విస్తరించాలని బలంగా కోరుకుంటోంది. అందుకే ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది.

బిజెపిలో చేరడానికి సైద్ధాంతిక విభేదాలు ఉన్న అసంతృప్త కాంగ్రెస్‌ నాయకులకు లౌకిక ప్రత్యామ్నాయంగా కనిపించాలనేది టీఎంసీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే మేఘాలయ పరిణామాలను చూడవచ్చు. కాంగ్రెస్‌ను వీడినా తమకు మరో లౌకిక ప్రత్యామ్నాయం ఉందని చెప్పినట్టయింది. ఇతర అంశాల పరంగా చూసినా కాంగ్రెస్‌ కన్నా తృణమూల్‌ కాంగ్రెస్‌ మెరుగ్గా కనిపిస్తోంది. బెంగాల్‌ వంటి ఓ పెద్ద రాష్ట్రంలో అధికారంలో ఉంది. నిధుల కొరత లేదు. బిజెపిని కాంగ్రెస్‌ కన్నా దూకుడుగా ఎదుర్కొంటోందన్న పేరు ఉంది.తమ పార్టీ నేతలకు గాలం వేస్తోందని, ప్రభుత్వాలను అస్థిరపరుస్తోందని కాంగ్రెస్‌ ఎప్పుడూ బిజెపిపై దాడికి దిగుతుంది. కానీ ఇప్పుడు తన తోటి ప్రతిపక్షం నుంచే ఆ ముప్పు ఎదుర్కొంటోంది. ఇది కాంగ్రెస్‌`తృణమూల్‌ బంధాన్ని మరింత దెబ్బతీస్తుంది. పార్లమెంటులో ప్రతిపక్షాల సమన్వయంపై నీలినీడలు కమ్ముతాయి. అన్నిటిని మించి బీజేపీ వ్యతిరేకుల ఐక్యతకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. మమత ఆడుతున్న ఈ ఆట చివరకు బీజేపీకి వరంగా మారుతుంది. అందులో సందేహమే లేదు!!

Related News

Leave a Reply

Your email address will not be published.