జయ జయ జయహే “విశ్వకవి” రవీంద్రనాథ్ ఠాగూర్

 జయ జయ జయహే “విశ్వకవి” రవీంద్రనాథ్ ఠాగూర్

రవీంద్రనాథ్ ఠాగూర్ {మే 7,1861- ఆగస్టు 7,1941}

నేడు సాహిత్య శిఖరం రవీంద్రుని జయంతి

భూమిపుత్ర,సాహిత్యం:

జయ జయ జయహే “ జనగణమన అధినాయక జయహే .. ‘ అంటూ ఏ మూల నుండి సుమధురమైన ఆ శబ్ద తరంగాలు వినపడినా రోమాంచితం కాని భారతీయుడెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు . విద్యార్థి దశలో ఓ భాగంగా నిలిచిపోయిన ఆ గీతానికి నిత్య నీరాజనాలర్పించేలా చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ను స్మరించుకోవడం మనందరి కనీస బాధ్యత . కాకతాళీయంగా ఆయన జయంతి రోజున విద్యార్థులు హాయిగా సెలవులలో గడుపుతూ ఉన్నరోజుల్లో , జాతీయ గీతానికి కాస్తంత విరామమిచ్చే సమయంలో రావడం వల్ల కూడా ఇతర జాతీయ నాయకుల మాదిరి ఆయన జయంతి , వర్ధంతులను పెద్దగా తలచుకునే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి .

విశ్వకవి గా , శాంతి నికేతన్ వ్యవస్థాపకునిగా , ఉపాధ్యాయునిగా , చిత్రకారునిగా , సుస్వరాలు పలికించే సంగీత విద్వాంసునిగా విభిన్న ప్రతిభావంతుడైన రాగూర్ 1861 మే 7 న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా మహానగరంలో జన్మించారు . ఆయన రచించిన ‘ గీతాంజలి ‘ గ్రంథానికి నోబెల్ బహుమతి వచ్చిన విషయం మనందరికి తెలిసిందే . ఆ గ్రంథంలోని సుప్రసిద్ధ గీతమే ‘ జనగణమన ‘ అనే జాతీయ గీతంగా స్థిరపడింది . 1896 లో రాజ్యాంగ నిర్మాణ సభలో దీనిని ఆయన ఆలపించారు . స్వాతంత్ర్యానంతరం 1950 జనవరి 24 న ఈ గీతాన్ని అధికారికంగా జాతీయ గీతంగా ఆమోదించారు . ఇందులో ఆసక్తికరమైన విషయమేమంటే సుమధురంగా వినిపించే ఈ గీతానికి తొలుత ఆంగ్లేయ మహిళ మార్గరేట్ కజిన్స్ స్వరకల్పన చేసిందని స్వయంగా ఆమె స్వీయ చరిత్రలో చెప్పుకుంది . మన జాతీయ గీతంలో మొత్తం ఐదు చరణాలుంటాయి . అయితే మొదటి ఎనిమిది ఫంక్తులను మాత్రమే జాతీయ గీతంగా భారత ప్రభుత్వం గుర్తించింది . దీనిని లయబద్ధంగా పాడేందుకు 52 సెకండ్లు పడుతుంది . అంతకంటే ఎక్కువ తక్కువలున్నాయంటే మనం శృతి తప్పుతున్నామన్నమాటే .

ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ గీతాన్ని రవీంద్రుడు అవిభక్త భారతదేశంగా ఉన్నప్పుడు రచించారు . కాబట్టి అప్పటి దేశం లోని రాష్ట్రాలను కలుపుతూ గీతం సాగిపోతుంది . ఉదాహరణకు గీతంలోని ‘ సింధు ‘ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది . ఇక మరాఠ అంటే మహారాష్ట్ర , ద్రావిడ అంటే తెలుగు , తమిళ , కర్ణాటక , కేరళ ప్రాంతాలని , ఉత్కళ అంటే ఒడిశా , వంగ అంటే బెంగాల్ అని అర్థం . వాస్తవానికి వీటిన్నింటిని పాఠశాలల్లో జాతీయ గీతం శ్రద్ధగా పాడుతున్నప్పుడే ఉపాధ్యాయులు చెప్పాల్సి ఉంటుంది . కానీ ఆ కోణంలో మన విద్యావ్యవస్థ సాగిన దాఖలాలు మనకు మచ్చుకైన కనపడవు . ఒక మహనీయుని కలం నుండి జాలువారిన జాతీయ గీతం వెనుక ఉన్న శ్రమ ఇప్పటి తరం వారికి చాలా వరకు తెలియదంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఉండదు.

సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక ఆసియా వాసి రవీంద్రనాథ్ ఠాగూర్. యూరప్‌కు చెందని తొలి వ్యక్తి కూడా ఆయనే. 20వ శతాబ్దంలో భారతదేశం అందించిన గొప్ప కవి, దార్శనికుడు అని ఆయన్ను అభివర్ణిస్తుంటారు.సాహిత్య రంగంలోనే కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, శాస్త్రీయ రంగాల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైన, బెంగాల్ పునరుజ్జీవనంపైన ఠాగూర్ కుటుంబం తనదైన ముద్ర వేసింది.రవీంద్రనాథ్ ఠాగూర్ ముత్తాత జైరామ్ ఠాగూర్ 18వ శతాబ్ధంలో ఈస్టిండియా కంపెనీలో రెవెన్యూ కలెక్టర్‌గా పనిచేశారు. రవీంద్రనాథ్ తాత ద్వారకానాథ్ ఠాగూర్ 19వ శతాబ్ధం ప్రారంభంలో కలకత్తాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందారు. అప్పట్లో కలకత్తా నగరం ఈస్టిండియా కంపెనీకి రాజధానిగా ఉండేది.ఈస్టిండియా భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్లో-ఇండియన్ కంపెనీ ‘ఠాగూర్ కార్స్ అండ్ సన్స్’ను ఏర్పాటు చేసింది కూడా ఆయన పేరిటేనని చరిత్రకారుల అభిప్రాయం.రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ఆయన్ను 1913లో నామినేట్ చేసిన వ్యక్తి థామస్ స్టుర్జ్ మూరే. అప్పట్లో ఆయన లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్‌లో సభ్యుడిగా ఉన్నారు. ”ఆ సమయంలో ఠాగూర్ బ్రిటన్ నుంచి అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా నవంబర్‌లో భారతదేశానికి వచ్చారు. నోబెల్ బహుమతి వచ్చిందని తెలిసినప్పుడు అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపోయింది ఠాగూరే” అని చంద్రికా కౌల్ వెల్లడించారు.బ్రిటిష్ ప్రభుత్వం ఠాగూర్‌ను 1915 జూన్ 3వ తేదీన నైట్‌హుడ్‌ పురస్కారంతో సత్కరించింది. అయితే, 1919లో జలియన్‌వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో బ్రిటిష్ వైఖరికి నిరసనగా, అప్పటికే భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్న భారతీయులకు మద్దతుగా ఈ బిరుదును ఉపసంహరించుకుంటున్నానని ఠాగూర్ ప్రకటించారు.

విద్యా విధానంపై ఠాగూర్ ఆలోచనలు:

1901వ సంవత్సరంలో ఠాగూర్ శాంతినికేతన్ విద్యాలయాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రాచీనమైన తపోవన విద్యావిధానాన్ని ఆయన ప్రోత్సహించారు. గురువు, శిష్యులు ప్రకృతికి దగ్గరగా ఉండే, ఎలాంటి గోడలు లేని విద్యావిధానమే మేలని భావించారు. ఇక్కడ సాహిత్యం, కళలతో పాటు తర్వాత సైన్స్‌ను కూడా బోధించేవారు.శాంతి నికేతన్‌కు అవసరమైన నిధుల కోసం ఆయన విదేశాల్లో ప్రసంగాలు చేసి, విరాళాలు స్వీకరించేవారు.

విద్యా విధానంపై వందేళ్ల కిందట ఠాగూర్ రాసిన ‘బంగారు పంజరంలో చిలుక’ కథ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యావిధానంలోని లోపాలను గుర్తు చేస్తుంది. ఆ కథలో ఒక రాజు స్వేచ్ఛగా తిరిగే చిలుకకు చదువు చెప్పాలని ఆదేశాలు జారీ చేస్తాడు. బంగారు పంజరం కట్టి, పనివాళ్లను, పండితుల్ని నియమించి, పుస్తకాలను చిలుక నోట్లో కుక్కుతుంటారు.రాజు కూడా చిలుక చదువుకు చేసిన ఏర్పాట్లపైనే దృష్టి పెడతాడు తప్ప చిలుక ఏం నేర్చుకుంటోంది? అది సరైన పనేనా? కాదా? అన్నవి పట్టించుకోడు. ఈ విధానాన్ని ఎత్తిచూపిన వ్యక్తిని కూడా శిక్షిస్తాడు. చివరకు చిలుక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది. దాని స్వేచ్ఛను కోల్పోతుంది.సహజ లక్షణాలను ప్రోత్సహించకుండా యాంత్రిక చదువులు సరికాదనే అర్థంతో సరిగ్గా వందేళ్ల కిందట 1918వ సంవత్సరంలో ఠాగూర్ ఈ కథను రాశారు.

మరొక కోణంలో ఇంకొక విషయం చెప్పాలంటే ప్రతి దానిని వివాదాస్పదం చేయడమనేది ఇప్పుడంటే నిత్యం చూస్తున్నాము కానీ ఆ రోజుల్లో కూడా ఉండేవంటే అదీ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం విషయంలో అంటే ఒకింత ఆశ్చర్యం అనిపించక మానదు . నిజమే మరి . రవీంద్రుడు రాసింది . భారత జాతి గొప్పతనం ఉద్దేశించింది కాదని , దేశాన్ని పాలిస్తున్న క్వీన్ ఎలిజిబెత్ గురించి అని ఇప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవకుల ప్రగాఢ విశ్వాసం . దానిని వారు ప్రచారం చేస్తుంటారు కూడా . బెంగాలీలో రాసిన గీతాంజలి గ్రంథాన్ని ఓ సముద్రపు ప్రయాణంలో ఉబుసు పోక ఇంగ్లీష్ లో తర్జుమా చేశానని , కానీ మాతృకలో వచ్చిన మాధుర్యం రాలేదని స్వయంగా ఠాగూర్ అన్న మాటలు మనం మరవరాదు . అలా రాసిన ఇంగ్లీష్ అనువాదానికే నోబెల్ అంతటి గొప్ప గుర్తింపు లభించిందంటే ఇక మాతృకలో మరెంత సాహిత్య గుబాళింపులుంటాయో స్వయంగా ఆ భాష పరిచయమున్నవారికే తెలుస్తుంది . ఏది ఏమైనా జాతినంతటిని ఏక తాటిపైకి తెచ్చిన ఓ మహనీయుని ఆదర్శప్రాయమైన జీవితం గురించి సంక్షిప్తంగానైనా స్మరించుకునే అవకాశం , అదృష్టం రావడం మాత్రం మహద్భాగ్యం . ప్రతి కార్యాన్ని జాతీయ గీతంలో ముగించినట్టే ఇక్కడ కూడా ‘ జయ జయ జయహే ‘ అంటూ ముగింపు పలికేద్దాం.

                                                                                     

– గుంటి మురళీకృష్ణ భరద్వాజ్

 ( సీనియర్ పాత్రికేయులు  )

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *