పట్టాలకెక్కని కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం

 పట్టాలకెక్కని కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం

ప్రతిపాదనల దశల్లోనే కాలయాపన

భూమిపుత్ర,నెల్లూరు:

కోర్టు కేసుల నుంచి కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి గతేడాది మార్గం సుగమమైనా దీని నిర్మాణంపై ఇప్పటికీ స్పష్టత రావడంలేదు. దీంతో తాజాగా అంచనాలు తయారు చేసి రూ.58 కోట్లు అవసరమంటూ కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎట్టకేలకు నూతన పరిపాలన కేంద్రం తథ్యమని అందరూ భావించారు. కానీ నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. ఎప్పటికి అనుమతులు వస్తాయో.. అసలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంతకాలం ఎదురుచూసిన అధికారులు ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా కలెక్టరేట్‌ భవనంలో మరమ్మతులు చేస్తున్నారు. కాగా ఈ అంశంపై డీఆర్వో చిన ఓబులేసు మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అనుమతులు రాలేదని చెప్పారు. వందేళ్ల క్రితం బ్రిటీషు కాలంలో నిర్మించిన భవనం నుంచే ఇంకా పరిపాలన సాగుతోంది.

మారుతున్న పాలనకు అనుగుణంగా అవసరాలు పెరుగుతుండటంతో ప్రస్తుతమున్న కలెక్టరేట్‌ భవనం ఇరుకుగా మారింది. మొన్నటిదాకా జేసీనే ఉండగా ఇప్పుడు అదనంగా మరో ఇద్దరు జేసీలు వచ్చారు. రికార్డులు కూడా సక్రమంగా పెట్టుకోలేక అధికారులు అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే నీరు కారడం, పెచ్చులు ఊడుతుండటంతో ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి కూడా అధునాతన హంగులతో కొత్త భవనాన్ని నిర్మించారు. పలు శాఖల కార్యాలయాలను, పోలీసు స్టేషన్లను కూడా నూతనంగా నిర్మించారు. కానీ జిల్లా పరిపాలన కార్యాలయానికి మాత్రం మోక్షం లభించలేదు. నెల్లూరులోని పాత టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టరేట్‌ను నిర్మిస్తే పాలనా పరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని ఎనిమిదేళ్ల క్రితం అప్పటి అధికార వర్గాలు భావించాయి. అందుకు రూ.35 కోట్లతో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ స్థలం, టెండర్ల వ్యవహారాలు కోర్టు మెట్లక్కెడంతో కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి బ్రేక్‌ పడింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *