కరోనా కర్ఫ్యూ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం

 కరోనా కర్ఫ్యూ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం

సడలింపు సమయంలో గుంపుగా వీధుల్లో ప్రత్యక్షం

ఇలాగే ఉంటే కేసులు తగ్గవంటున్న అధికారగణం

భూమిపుత్ర,అనంతపురం:

కరోనా మహమ్మారి కట్టడికోసం ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. వరుసగా పెరుగుతున్న పాజిటివ్ లు, మరణాల సంఖ్యను చూస్తుంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గకపోగా మరింత పెరుగు తున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగు తుండటం
ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు కర్ఫ్యూను నెలాఖరువరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు బయట తిరిగేందుకు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ పాక్షిక లాక్‌డౌన్‌ మూలంగా కొంత వరకైనా కేసులను అదుపు చేయవచ్చని భావించగా చివరకు చూస్తే విఫలయత్నమే మిగిలిందని నిపుణులు చెబుతున్నారు. దీని మూలంగా ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక అధికార యంత్రాంగం బర్మన్‌ షెడ్ల వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నా ప్రజల్లో మాత్రం ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అధికార యంత్రాంగం కర్ఫ్యూ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతుండడానికి ఈ నిర్లక్ష్యమే కారణమని వారు విశ్లేషిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు ప్రజలు ఇష్టానుసారం బయట తిరిగేస్తున్నారు. ఎక్కడా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వ్యాపార దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరుతున్నారు. మాస్కు ధరించడంపై అందరిలో అవగాహన వచ్చినా భౌతిక దూరం అన్నమాట మరిచిపోయారు. ఈ కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని నిపుణుల అంచనా వేస్తున్నారు. మొదటి వేవ్‌ సమయంలో లాక్‌డౌన్‌లో కొన్ని గంటల సడలింపు ఇచ్చినా అప్పుడు కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమయ్యాయి. ఇప్పుడు అవేమీ కానరావడం లేదు. చాలా వరకు కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌ వస్తే దాదాపుగా మిగిలిన వారూ పాజిటివ్‌గా తేలుతున్నారు.

బయటకు వెళ్లిన వ్యక్తి నిర్లక్ష్యం ప్రదర్శించడం మూలంగా ఆ కుటుంబం మొత్తం ఇంట్లో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. కరోనా అదుపులోకి రాకపోవడంతో ఈ నెలాఖరుకు వరకు కర్ఫ్యూ పొడగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు గంటల సమయాన్ని మరింత కుదించాలని రాష్ట్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి ఇంకా ఎటువంటి విధివిధానాలు అధికారులకు అందలేదు. కాగా రానున్న రోజుల్లో కర్ఫ్యూ ఆంక్షలను మరింత గట్టిగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తాము బయట తిరుగుతున్న వారిని అడ్డుకోవడం ఒక్కటే కరోనా నివారణకు మార్గం కాదని ప్రజల్లో మరింత అవగాహన రావాలని అధికార యంత్రాంగం కోరుతోంది. కరోనా రెండో దశలో భారీగా కేసులు నమోదు అవుతున్నా, ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కర్య్ఫూతో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంట వరకే దుకాణాలు తెరుస్తుండటంతో ప్రజల తాకిడి మరింత పెరిగింది. దుకాణాల వద్ద ప్రజు గుంపు గుంపులుగా చేరి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ స్తంభించి జనం కిటకిట లాడుతున్నారు. ప్రజలు నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా గుంపు గుంపుగా ఒకరిపై ఒకరు పడుతున్నారు. కరోనా నిబంధనలను దుకాణదారులు, ప్రజలు పాటించడం లేదు. నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *