సిద్దూ రాజకీయ భవితవ్యంపై అనుమానాలు!!

 సిద్దూ రాజకీయ భవితవ్యంపై అనుమానాలు!!

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ:

పంజాబ్‌లో రాజకీయ పరిణామాలను బిజెపి అధిష్టానం నిశితంగా గమనిస్తోన్నట్లుంది. అక్కడ సిఎం అమరీందర్‌తో మాజీ మంత్రి నవజోత్ సింగ్‌ సిద్దూకు పొసగడం లేదు. రైతుల సమస్యలను ప్రోత్సహించడం ద్వారా అమరీందర్‌ ఇటీవల వారి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చేయేడు పంజాబ్‌ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బిజెపి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. సిఎం అమరీందర్‌తో ఉన్న విభేదాల కారణంగా సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు బిజెపికి ఆనందం కలిగించేవిగా ఉన్నాయి. ఆయన ఇప్పటికే కాంగ్రెస్‌కు దూరమైనట్లే కనిపిస్తుంది. దీంతో అక్కడ కాంగ్రెస్‌ బలహీనపడగలదని బిజెపి నేతలు భావిస్తున్నారు.

కొంత కాలంగా ఆయన పార్టీని వీడతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యేలు ముగ్గురిని అమరీందర్‌ కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అరవింద్‌ కేజ్రివాల్‌,సిద్దూ రావాలనుకుంటే మా పార్టీ ఆయనకు స్వాగతం పలుకుతుందన్నారు. 2017 ఎన్నికల సమయానికి బీజేపీ నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరిన సిద్దూ ఎన్నికల్లో గెలిచి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ తర్వాత ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో వచ్చిన విబేధాల కారణంగా పార్టీ సమావేశాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లడంతో కూడా సిద్దూ ఇరుకున పడ్డారు. ఆ తరవాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

అయితే ఎన్నికలకు ముందుగానే ఆమ్‌ ఆద్మీలోకి రావాల్సిందిగా సిద్దూకు ఆఫర్‌ అందింది. అయితే కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా అప్పుడు చేరలేదు. అప్పటి ఎన్నికల్లో సిద్దూ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్‌ కిషోర్‌ ప్రస్తుతం పార్టీ మారే విషయంలోనూ కీలకంగా మారారు. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఐడి), బిజెపిలను ఓడించి కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 117 స్థానాల్లో 77 సీట్లు గెలిచి అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.ఈ దశలో సిద్దూ పార్టీని వీడితే కాంగ్రెస్‌ దెబ్బతింటుందని అంటున్నారు. అలాగే సిద్దూ మళ్లీ బిజెపిలో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. బిజెపిని వీడాక ఆయన పెద్దగా రాజకీయంగా కుదురుకోలేదు. అలాగే మోడీని వ్యతిరేకించడం వల్ల లాభం పొందింది కూడా లేదు. ఈ క్రమంలో పంజాబ్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌, బిజెపిలు ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *