జాతీయ జల విధానం రూపొందించుకోకపోతే జలజగడాలు తప్పవు

 జాతీయ జల విధానం రూపొందించుకోకపోతే జలజగడాలు తప్పవు

భూమిపుత్ర,సంపాదకీయం:

వర్షాల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. వరదలను నివారించి, నీటిని నిల్వ చేసుకునే పద్దతలను అవలంబించాలి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో మళ్లీ సముద్రంలోకి నీరు చేరుతోంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో నీటి యాజమాన్యం సరిగా లేదని ఏటా కురుస్తున్న వర్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు అనేక జలాశయాల్లో పూడిక పేరుకుని పోతోంది. ఏటేటా వర్షాలతో ఒండ్రు చేరుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి వరదలకు ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా అనేక నదులు ఉప్పొంగాయి. చివరకు మళ్లీ నీరు సముద్రానికి చేరింది. తాజాగా కూడా అలాంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు జాతీయ జలవిధానం రూపొందించాల్సి ఉంది. అలాగే వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచి వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి.

వ్యవసాయం పై కూడా జాతీయ విధానంతో ముందుకు సాగాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా, దిగుబడులు తగ్గించు కుని మన రైతులను ప్రోత్సహించేలా చూసుకోవాలి. కరోనా నేర్పిన గుణపాఠం మనకు అనుభవం కావాలి. వివిధ రాష్ట్రాల్లో చెరువులను మింగిన పాపానికి ఇటీవల కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. ఇదంతా పాలకుల పాపం కాక మరోటి కాదు. ఈ క్రమంలో గొలుసుకట్టు చెరువులను రక్షించు కోవాలి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పటి నుంచయినా నీటి అవసరాలను గుర్తించి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇకపోతే కరోనా నేపథ్యంలో మనం మన వ్యవసాయాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఆలోచనలు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను పెంచి విదేశాలకు ఎగుమతులు చేసే విధంగా సన్నద్దం కావాలి. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ కేంద్రం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి.

వ్యవసాయరంగం పురోగమిస్తే, ధాన్యం దిగుబడులు తగ్గితే తప్ప భారత ఆర్థికరంగం పురోగ మించదు. ఇప్పటికే వరిధాన్యం ఇబ్బడిముబ్బడిగా పండించడం వల్ల గోదాముల్లో మగ్గి పోతోంది. వాటిని వాడుకునే విధంగా కార్యక్రమాలు అమలు చేసుకోవాలి. అదేపనిగా వరి పండించకుండా ఇతర పంటలపైనా ప్రోత్సాహం కల్పించాలి. ఆధునిక వ్యవసాయం దిశగా పురోగమించాలి. కరోనాతో ఇప్పుడు నిరుద్యోగం పెరిగడంతో ప్రజలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. వారిని వ్యవసాయం వైపు మళ్లించేలా పథకాలు చేపట్టాలి. తక్షణ ఉపాధికి ఇదొక్కటే ప్రత్యామ్నాయం కాగలదు. దీంతో ఆహార ఉత్పత్తులు కూడా పెరగ గలవు. కరువులు వచ్చినా, అధికంగా వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితుల లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారు తున్నారు.

చిన్నాచితక వ్యాపారాలతో తోపుడు బళ్లు నడుపుతున్నారు. ఇప్పుడు వారంతా కరోనా భయంతో తిరిగి గ్రామాలకు చేరారు. వారిని వ్యవసాయంలో స్థిరపడేలా చేయాలి. వ్యవసాయ భూమి లేని కూలీలు కౌలు నిషేధించుకుని, దేశీయంగా పండించుకునేలా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కనీసం ఓ పదేళ్ల పాటు వ్యవసాయరంగ ఉత్పత్తులపై దృష్టి సారిస్తే భారతదేశం ఆర్థికంగా మళ్లీ పుంజుకోగలదు. కరోనాతో ఇప్పుడు అనేకమంది మళ్లీ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించు కునేలా చేయాలి. ఈ క్రమంలో విదేశాలకు భారీగా ఎగుమతి చేసేలా పంటలు పండి0చగలగాలి. దీంతో మనకు విదేశీమారకం కూడా ఆదా కాగలదు. అలా పంటలు పండించే సత్తా మన రైతాంగానికి ఉందని గుర్తుంచుకోవాలి. మన రైతులనే ప్రోత్సహించి మన పంటలనే కాపాడుకునేలా రైతాంగ విధానాలు వస్తే తప్ప వారు బతికి బట్ట కట్టేలా లేరు.

రైతుల సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా ఒక విధానంగా గాకుండా, రుణ మాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్దిగా ఎదిగేలా చేయాలి. విత్తనాలు, పురుగు మందుల వ్యాపారస్థులు నకిలీలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. బ్యాంకు అధికారులు, ఏజెంట్లు కలిసి రైతులకిచ్చే ఋణాలలో కోత పెడుతున్నారు. కవిూషన్‌ ఏజెంట్లు, మార్కెట్‌ అధికారులు, అంతిమంగా అందరూ రైతులను ముంచడానికే సిద్దంగా ఉంటున్నారు. రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. గిట్టుబాటు ధరలు లేక వచ్చిన ఆదాయం కూలీల ఖర్చుకు సరిపోతుంది. లక్షలాది మంది రైతులు వర్షాలు కురిసి కాలం కలసివచ్చినా ధరలు రాక నష్టపోతున్నారు.

వర్షాలు పడని సంవత్సరంలో పంటలు ఎండిపోయి నష్టపోతున్నారు. కాలం అయినా గాని, కరువు అయినా గాని రైతుకు మిగిలేది అప్పులే. మార్కెట్‌లో రైతును దోచుకునే శక్తులు నిరాటంకంగా విజృంభిస్తూనే ఉన్నాయి. రైతులను రైతులకి మేలు చేస్తానన్న ప్రభుత్వాల ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. అంతెందుకు రైతులకు గిట్టుబాటును మించి ధరలు దక్కేలా చేస్తామన్న ప్రధాని మోడీ వాగ్దానాన్ని నెరవేర్చగలగాలి. వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు అనేక రెట్లు పెరిగిపోవడంతో పాటు విత్తనాల దగ్గర నుంచి నకిలీలు రైతులను కుంగదీస్తున్నాయి. ఈ విధానాలకు స్వస్తి పలికి నిపుణుల సలహాతో వ్యవసాయరంగాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ది చేయాలి. అందుకు జాతీయ జలవిధానం కూడా అవసరమని గుర్తించాలి. జలవిధానంతో నదులను దారి మళ్లించగలిగితే నీటి కటకటలు రావు. ఈ యేడు వర్షాలు విపరీతంగా పడడమే గాకుండా వరదలు పొంగి నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. ఈ దశలో నీటి సంరక్షణతో పాటు, రైతు సంక్షేమానికి చర్యలు తీసుకునే ప్రణాళికలు ముందుకు సాగాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *