సోమవారం నుంచి కరోనా మందు పంపిణీ !!

 సోమవారం నుంచి కరోనా మందు పంపిణీ !!

భూమిపుత్ర,నెల్లూరు:

కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కరోనా మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. అయితే మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి తరలించారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడవిూలో ఇకపై ఆనందయ్య మందు తయారీ కానుంది. కృష్ణపట్నంలో మందు తయారీ చేస్తే భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని, దాంతో సమస్యలు రావొచ్చని మందు తయారీ ప్రాంతాన్ని మార్చారు. ఆనందయ్యతో చర్చించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆనందయ్య మందు తయారీకి కావాల్సిన ముడి సరుకులు, వంట సామాగ్రిని పోర్టు ప్రాంతానికి తరలించారు.

మరోవైపు ఆన్‌ లైన్‌ లోనూ మందు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్లూడార్ట్‌ కొరియర్‌ సంస్థతో మాట్లాడారు. 50శాతం రాయితీతో సర్వీస్‌ ఇస్తామని బ్లూడార్ట్‌ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఒకేచోట కాకుండా మూడు నాలుగు కేంద్రాల ద్వారా మందు పంపిణీ చేయాలని చూస్తున్నారు. కంట్లో వేసే మందుకి తప్పిస్తే ఆనందయ్య తయారు చేసిన ఇతర మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. కేంద్ర ఆయుష్‌ విభాగం నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదిక రాలేదు. అందుకు మరో మూడు వారాలు పట్టే చాన్సుంది. ఆనందయ్య ఇతర మందుల్లో హానికర పదార్దాలు లేవని నివేదికలు తేల్చాయి. అదే సమయంలో ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదని వెల్లడించారు.

డాక్టర్లు ఇచ్చిన మందులతో పాటు ఆనందయ్య మందులు వాడాలని ప్రభుత్వం సూచించింది.మందు తయారీ సమయంలో భద్రత తదితర విషయాల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్‌కు ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. తయారీకి కావలసిన మూలికలు ఔషధాలు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని కోరారు. అవసరమైతే గిరిజన కార్పొరేషన్‌ సొసైటీ నుంచి తేనే సరఫరా చేస్తామని కలెక్టర్‌ చక్రధర బాబు తెలిపారు.ఆనందయ్య మందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌లో కస్టమర్‌ దరఖాస్తు చేసుకుంటే కొరియర్‌ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆనందయ్య బృందం తెలిపింది. సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *