భారతీయ అథ్లెట్లకు ప్రేరణ మిల్కాసింగ్‌!!

 భారతీయ అథ్లెట్లకు ప్రేరణ మిల్కాసింగ్‌!!

భూమిపుత్ర, జాతీయం:

భారతీయ కీర్తిపతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుఎళ్లిన మేరునగధీరుడు ఆయన.మన హిమాలయాలంతగా కీర్తి శిఖరాలను అధిరోహించిన పరుగుల వీరుడతడు.అతనే మన పరుగుల యంత్రం మిల్కా సింగ్‌. అతడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతగా చెప్పుకుంటే అంతగా మనలను మనం గౌరవించుకునే అద్భుత క్రీడాకారుడా అథ్లెట్‌. ఇండియన్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో అగ్రగణ్యుడిగా పేరొందిన మిల్కా సింగ్‌ మరణం భారతజాతికి విషాదాన్ని కలిగించే విషయం. దేశంలో నేటితరం క్రీడాకారులకు ఆయన జీవితం ఓ పాఠం. మనదేశంలో క్రీడాకారులను తయారు చేయరు. ప్రోత్సహించరు కూడా. ఎవరికి వారు తమ ప్రతిభతో పేరు తెచ్చుకుంటే అలాంటి వారిని అప్పుడు మెచ్చుకుని గుర్తిస్తారు. చైనా,జపాన్‌,రష్యా లాగా మనదేశంలో క్రీడలకు ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యతను పాలకులు గుర్తిస్తే మంచిది.

మిల్కాసింగ్‌ కూడా తన ప్రతిభతోనే పైకి ఎదిగారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఉత్తమ క్రీడాకారుడిగా ఎదిగారు. స్వతంత్య్ర భారతావనిలో అమోఘ ప్రతిభ కలిగిన స్పిర్రటర్‌గా దేశ విభజన సమయంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నా అత్యున్నత క్రీడాకారుడిగా ఎదిగిన మిల్కాసింగ్‌ జీవిత చరిత్ర ఎంతో ప్రేరణాత్మకం. చిన్న నాటి నుంచి ట్రాక్‌ అంటే మిల్కాకు ఎనలేని ఇష్టం. పరుగులు తీయడం ఆయనకు అతి సులువైన పని. కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నా రన్నింగ్‌ టాలెంట్‌ను మాత్రం ఆయన ఎన్నడూ మరవలేదు. మిల్కా అందుకున్న మెడల్స్‌ ఆయన ఘనతను చాటుతాయి. లెజండరీ అథ్లెట్‌గా రూపుదిద్దు కున్న మిల్కా ఏషియన్‌ గేమ్స్‌లో నాలుగు సార్లు గోల్డ్‌ మెడల్స్‌ సాధించాడు. 1958లో కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్‌లోనూ మెడల్‌ పట్టేశాడు. అయితే 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌ మిల్కా జీవితంలో మరుపురాని రోజు. ఆ ఈవెంట్‌లో 400 విూటర్ల ఫైనల్లో పాల్గొన్న ప్లయింగ్‌ సిక్‌ కేవలం ఒకే ఒక సెకను తేడాతో కాంస్య పతకాన్ని మిస్‌ అయ్యాడు.

పతకాన్ని అందుకోలేకపోయినా మిల్కా ప్రదర్శన క్రీడా పోరాట స్పూర్తి అనిర్వచనీయమని క్రీడాపండితులు కీర్తించారు. రోమ్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయన నెలకొల్పిన రికార్డు దాదాపు 38 ఏళ్ల పాటు జాతీయ రికార్డుగానే మిగిలిపోయింది. లక్షలాది మంది అథ్లెట్లకు ప్రేరణగా నిలిచిన మిల్కాకు 1959లో పద్మ శ్రీ అవార్డు దక్కింది. అథ్లెటిక్స్‌ క్రీడారంగంలో భారతీయ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటింది మిల్కానే. 1958లో జరిగిన బ్రిటీష్‌ అండ్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో 440 యార్డ్స్‌ రేసులో ఆయన గోల్డ్‌ మెడల్‌ సాధించారు. దాంతో ఇండియా కీర్తి అన్ని దిశలూ వ్యాపించింది. వ్యక్తిగత ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడు మిల్కానే. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని నెహ్రూ ఆయన్ను సన్మానించారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మిల్కా రికార్డు మహాద్భుతం. 80 రేసుల్లో పాల్గొన్న మిల్కా 77 సార్లు గెలిచాడు.

రోమ్‌ ఒలింపిక్స్‌లో 400విూటర్ల ఫైనల్ ను కేవలం 45.6 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 0.1 సెకన్ల తేడాతో బ్రాంజ్‌ మెడల్‌ కోల్పోయాడు. రోమ్‌లో మిల్కా సాధించిన రికార్డు 38 ఏళ్లు అలాగే ఉండిపోయింది. అయితే 1998లో కోల్‌కతాలో జరిగిన జాతీయ విూట్‌లో ఆ రికార్డును పరంజీత్‌ సింగ్‌ బ్రేక్‌ చేశాడు. తన రికార్డును బద్దలు చేసిన వాళ్లకు రెండు లక్షలు ఇస్తానన్నాడు. కానీ ఆ వాగ్దానాన్ని మిల్కా నిలబెట్టుకోలేదు. ఎందుకంటే విదేశీ పోటీల్లో ఆ రికార్డు బ్రేక్‌ కాలేదన్నారు. పంజాబ్‌లోని గోవింద్‌ పురాలో పుట్టిన మిల్కా 15 ఏళ్లకు పాక్‌ నుంచి పారిపోయి ఢిల్లీ చేరుకున్నాడు. దేశ విభజన సమయంలో జరిగిన ఘర్షణల్లో పేరెంట్స్‌ను కోల్పోయాడు. బూట్లు పాలిష్‌ చేశాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో షాపు క్లీనర్‌గా చేశాడు. 1952లో నాలుగవ ప్రయత్నంలో అతను ఆర్మీలో చేరాడు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో క్రాస్‌ కంట్రీ రేసులో పాల్గొన్న మిల్కా.. అక్కడ నుంచి తన దశను మార్చేశాడు.

కోచ్ గురుదేవ్‌ సింగ్‌ నేతృత్వంలో రాటుదేలాడు. ఆర్మీ క్యాంపులో టాప్‌ 10లో నిలిచి ఒక అదనపు గ్లాసు పాలను గిప్ట్‌గా గెలుచుకున్నాడు. 1956 ఒలింపిక్స్‌కు ఎంపికైన మిల్కా హాట్స్‌లోనే వెనుదిరిగాడు. కానీ ఆ అనుభవం ఎంతో ఉపకరించింది. 400 విూటర్స్‌ విన్నర్‌ చార్లెస్‌ జెన్‌కిన్స్‌ నుంచి శిక్షణ పద్ధతులను నేర్చుకున్నాడు.తీవ్రమైన శిక్షణ చేస్తున్న సమయంలో కొన్ని సార్లు రక్తం కక్కినట్లు తన ఆటోబయోగ్రఫీలో మిల్కా చెప్పాడు. అయితే రోమ్‌ ఒలింపిక్స్‌కు ముందు 1960లో జరిగిన ఇండో- పాక్‌ స్పోర్ట్స్‌ విూట్‌ ప్రత్యేకమైంది. ఈ పోటీల్లో పాకిస్థాన్‌ స్పింటర్‌ అబ్దుల్‌ ఖాలిక్‌ను మిల్కా ఓడించిన తీరు అసాధారణం. ఆ సమయంలో ఆసియా ఫాస్టెస్ట్‌ మ్యాన్‌గా ఖాలిక్‌ను భావిస్తుండేవారు. 1958 ఆసియా క్రీడల్లో 100విూటర్ల ఈవెంట్‌లో గోల్డ్‌, 400 విూటర్ల ఈవెంట్‌లోనూ ఖాలిక్‌ గోల్డ్‌ సాధించాడు.

అయితే ఇండో-పాక్‌ స్పోర్ట్స్‌ విూట్‌లో అబ్దుల్‌ ఖాలిక్‌ను మిల్కా ఓడిరచడంతో అతని ఖ్యాతి మరింత పెరిగింది. 200 విూటర్ల రేసులో పాక్‌ అథ్లెట్‌ ఖాలిక్‌ను ఓడిరచిన తర్వాత అప్పటి పాక్‌ అధ్యక్షుడు జనరల్‌ అయూబ్‌ ఖాన్‌.. మిల్కా సింగ్‌ను ద ప్లయింగ్‌ సిక్కు అంటూ గ్రీట్‌ చేశారు. 1964 ఒలింపిక్స్‌ తర్వాత మిల్కా రిటైర్‌ అయ్యారు. పంజాబ్‌ ప్రభుత్వంలో కొన్నాళ్లు స్పోర్ట్స్‌ డైరక్టర్‌గా చేశారు. ఇండియన్‌ ఆర్మీని వదిలేసిన తర్వాత ఢిల్లీ నుంచి చంఢీఘడ్‌కు మకాం మార్చేశాడు. స్కూల్స్‌లో కచ్చితంగా గేమ్స్‌ పీరియడ్‌ ఉండాలని 1991లో మిల్కా ఓ ప్రతిపాదన చేశారు. భారత వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌ నిర్మల్‌ కౌర్‌ను 1963లో మిల్కా సింగ్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో నేటి తరం భారత అథ్లెట్లకు మిల్కా సింగ్‌ నిస్సందేహంగా ఆదర్శుడు. ఆయన క్రీడాస్ఫూర్తి,జీవితం ప్రేరణాత్మకం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *