తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం – ఒక చర్చ

 తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం – ఒక చర్చ

భూమిపుత్ర, సాహిత్యం:

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం (1917 – 1935) 

1917 నుండి 1935 వరకూ అంటే సుమారు రెండు సంవత్సరాలు తక్కువైనా రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన తెలుగు సాహిత్యం, ఆ సాహిత్యంపై వచ్చిన విమర్శను విశ్లేషించుకుంటూ, దానిలో మార్క్సిస్టు సాహిత్య విమర్శను అన్వేషించాలి. 1914లో కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శలో ఒక మైలురాయి వంటివాడు. కవిత్వతత్వవిచారం ద్వారా సామాజిక విషయాలకూ, భావుకతకూ ప్రాధాన్యాన్ని ఇవ్వడం కనిపిస్తుంది. విమర్శకుల (పింగళి లక్ష్మీకాంతం) అభిప్రాయంలో ‘బాహిర జగత్తునుండి అంతర జగత్తుకి విమర్శను తీసుకెళ్ళిన వాడు సి.ఆర్.రెడ్డి. శాబ్దిక చర్చల నుండి తాత్త్విక మీమాంసకు మార్గం వేశాడు. దేశకాల ప్రభావాలు సాహిత్యం మీద ఉంటాయని చెప్పిన గ్రంథం కూడా కవిత్వతత్త్వవిచారమే. కాబట్టి మార్క్సిజంలోని చారిత్రక దృష్టితో చూసే అవకాశం ఈ గ్రంథంతోనే కనిపించే అవకాశం ఉన్నా, 1917నే ఎందుకు తీసుకున్నారనేది చర్చలోకి తీసుకోవాలి.

1917 రష్యా విప్లవం… సామ్రాజ్యవాదానికి, భూస్వామ్య వ్యవస్థకూ, నియంతృత్వ ధోరణులకీ వ్యతిరేకంగా పోరాడిన విజయసంకేతంగా ఈ సంవత్సారాన్ని తీసుకున్నారా? లేకపోతే తెలుగు సాహిత్యంలో ఈ సంవత్సరంలో మార్క్సిస్టు సాహిత్య విమర్శలో మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందా? దీన్ని మనం చర్చించుకోవాలి. తెలుగులో 1917 సి.పి.బ్రౌన్ ప్రవేశం…అంటే భారతదేశం రావడం… పరిశోధన, విమర్శ రంగాల్లో నూతన వెలుగులు ప్రారంభం. జాను తెలుగు ద్వారా సాహిత్యాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం, సామాన్య ప్రజల్ని కూడా సాహిత్యంలో వస్తువుగా తీసుకోవడం వంటివన్నీ సమాజా శివకవులకు దక్కుతుందంటూ ఆయన వీరశైవం గురించి రాసిన వ్యాసాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారేమో! 1935-36 భారతదేశంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు.దీని లక్ష్యం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం. అభ్యుదయ సాహిత్యానిని నేపథ్యమంతా మార్క్సిస్టు భావజాలమే అందిస్తుంది. కనుక, 1917 నుండి 1935 వరకు వచ్చిన సాహిత్యం, సాహిత్య విమర్శలో మార్క్సిస్టు సాహిత్య ఆరంభం కనిపిస్తుందనేది ఒక ప్రతిపాదన కావచ్చు. మరి ఈ కాలంలో తెలుగు సాహిత్య స్థితిగతులు, విమర్శ స్వరూప స్వభావాలు ఎలాగున్నాయో కూడా చూడాలి.

కారల్ మార్క్స్ (1818-1883), ఏంగిల్స్ తదితరుల భావాలు, ఆలోచనలు, సిద్ధాంతాల భూమికతో సాహిత్యాన్ని విలువ కట్టే విధానాన్ని సాధారణంగా మార్క్సిస్టు విమర్శ అని అంటారు. (పుట.89)దీన్నే గతితార్కిక చారిత్రక భౌతిక వాదం అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం- ఈ ప్రకృతినీ, ఈ సమాజ పరిణామాన్నీ భౌతిక వాస్తవిక దృక్పథంతో అవగాహన చేసే ప్రయత్నం చేసింది. అంతవరకు భావ వాదంతో ఈ సృష్టి అంతా భగవంతుని సృష్టి అని నమ్మినటువంటి వాళ్లు కూడా తార్కికంగా, చారిత్రిక వాస్తవిక దృష్టితో భౌతికవాద దృక్పథాన్ని అవగాహన చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సమాజం , అభివృద్ధి ఒక సర్పిలాకార పద్ధతిలో అభివృద్ధి చెంది, పరిణామం చెందాయని గ్రహించారు. దీన్ని చారిత్రికంగా నిరూపించగలుగుతున్నారు. అందువల్ల ఇది శాస్త్రీయ దృక్పథంగా అభివృద్ధి చెందింది. కార్ల్ మార్క్స్ గానీ, ఏంగిల్స్ కానీ కళా సాహిత్యాల గురించి ప్రత్యేకంగా రాయకపోయినా, వారి సిద్ధాంతాలు సమకాలీన కవులు కళాకారులు రచయితలు వాళ్లతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలలో కళా సాహిత్యాలకు సంబంధించిన అనేక నూతన విషయాలు, నూతన ప్రతిపాదనలు కనిపించాయి. ఈ సైద్ధాంతిక భావజాలంతో తెలిసి సాహిత్య విమర్శ చేశారా? తమ జీవితానుభవాల లోతుల్లో నుండి ఆ సాహిత్యాన్ని విశ్లేషించారా? అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉంది.

సాహిత్యాన్ని రాసేటప్పుడు తనకి మార్క్సిజం అంటే ఏమిటో తెలియదని స్వయంగా శ్రీశ్రీ యే చెప్పాడు. ఇదే పరిస్థితి మన తెలుగు సాహిత్య విమర్శ తొలిదశలో కూడా చూడవచ్చనుకుంటున్నాను. కాబట్టి, తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభాన్ని గుర్తించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా మార్క్సిస్టు సాహిత్యంగాను, దానిపై జరిగే మూల్యాంకనలు, విశ్లేషణలను మార్స్సిస్టు సాహిత్య విమర్శగానూ గుర్తించే వీలుందా అనేదొక చర్చ.మద్దుకూరి చంద్రశేఖర రావు 1944 లో రాసిన ‘ఆంధ్ర సాహిత్యంలో కొత్త పోకడలు’ వ్యాసంతో తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభమైందని పరిశోధకులు భావిస్తున్నారు. ‘‘1930ల మధ్యనుంచీ తెలుగు సాహిత్యంలోకి మార్క్సిస్టు భావాల ప్రవేశం ఉన్నప్పటికీ, 1930లలోనే కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు, జి.వి.కృష్ణారావు రాసిన వ్యాసాలు, ‘కావ్యజగత్తు’ పుస్తకం ఉన్నప్పటికీ, మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన, 1944లో అచ్చయిన రెండు వ్యాసాలను తెలుగులో మెరుగయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ప్రారంభంగా గుర్తించవచ్చు. వేణుగోపాల్, ఎన్. తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ – పునరాలోచనలు వ్యాసం, (పుట.96) (https://kadalitaraga.wordpress.com/2007/03/12/telugulo_marksist_sahitya_vimarsha_punaralochanalu/)
ఇంకొంతమంది 1930 నుండి చూడాలనుకుంటున్నారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాల్లో అభ్యుదయ భావజాలం, ఆ భావజాలానికి తాత్వికనేపథ్యంమంతా మార్క్సిస్టు సిద్ధాంతాలే. కాబట్టి అక్కడ నుండి మార్క్సిస్టు విమర్శ ప్రారంభాన్ని తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారేమో అనుకుంటున్నాను.

ఈ ప్రసంగ పరంపరకు సంబంధించిన కాన్సెప్ట్ పేపర్ ని నాకు ఆచార్య కాత్యాయనీ విద్మహే గారు పంపించారు. దానిలో ‘‘మార్క్సిస్ట్ దృక్పథంతో సాహిత్య విమర్శకు ఏర్పడిన దారులను, సూత్రాలను గుర్తించడం’’, ‘‘ తెలుగు సాహిత్య విమర్శలో మార్క్సిస్టు మార్గం రూపొందిన క్రమాన్ని అధ్యయనం చేయడం’’ లక్ష్యంగా ఈ ప్రసంగాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘1875 నుండి 2020 వరకు145 ఏళ్ల కాలంలో తెలుగు సాహిత్య విమర్శలో అభివృద్ధి చెందిన మార్క్సిస్టు ధోరణులను, మార్క్సిస్ట్ పద్ధతిని మదింపు చేయటానికి ఈ ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నట్లు’’ కూడా స్ఫష్టంగా ప్రకటించారు.‘‘1875 నుండి 1916 , 1917 నుండి 1935, 1936 నుండి 1955,1956 నుండి 1970, 1971 నుండి 1985 ,1986 నుండి 2000, 2000 నుండి 2020 వరకు నిర్దిష్ట కాల పరిధిలో వచ్చిన విమర్శను మొత్తంగా స్థూల పరిచయం చేస్తూ ప్రత్యేకంగా మార్క్సిస్టు విమర్శ ఆయా కాలాల్లో ఎలా అభివృద్ధి చెందిందో వివరించటం వీటి ఉద్దేశం.’’ అని కూడా వివరించారు.

తెలుగు సాహిత్య విమర్శలో కందుకూరి వీరేశలింగం గారి ‘విగ్రహతంత్రవిమర్శనము’ (1874-1876) ఒక మైలురాయి. కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు ‘విగ్రహతంత్రవిమర్శము’ (1872) రాసి, దానికి శివశంకరపాండ్యా టిప్పణము రాసి 1875లో అనుబంధంగా ప్రచురించారు. దానిలో చిన్నయసూరి వచనంలో దోషాలున్నాయనీ, వేంకటరత్నం పంతులుగారి ‘విగ్రహము’ ను అనుసరించి చూస్తే, వీరేశలింగంగారి ‘విగ్రహతంత్రము’ ఎడమచేతి వ్రాతలా ఉందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా కందుకూరి వీరేశలింగం గారు వివేకవర్ధిని పత్రిక (1876) లో ‘విగ్రహతంత్రవిమర్శనము’ ప్రతివిమర్శ రాశారు. శివశంకరపాండ్యా పేరుతో టిప్పణము వ్రాసినవారెవరో కాదనీ, కొక్కొండవేంకటరత్నం పంతులుగారేనని ఆ చేతిరాతను బట్టి వీరేశలింగంగారు నిరూపించారు. ఇక్కడ చర్చనీయాంశమేమిటంటే, 1875 వ సంవత్సరం కంటే, తెలుగు సాహిత్య విమర్శ ఆరంభమైన సంవత్సరంగా 1874 లేదా 1876 గా భావిస్తే బాగుంటుంది.

సాహిత్యంలో మార్క్సిస్టు సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం వంటి వాటిని కాలంతో నిమిత్తంలేకుండా ఏ కాలంలో వెలువడిన సాహిత్యంతో నైనా అనువర్తించి విశ్లేషించుకోవచ్చు. ఒక సిద్ధాంతంగా ఏర్పడిన నాటి నుండే కాకుండా అంతకు ముందు ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా ఆ సిద్ధాంతాలతో అన్వయించుకొని విశ్లేషించుకొనే అవకాశం ఉంది. అప్పుడది విమర్శదృక్పథమే తప్ప, ఆ సాహిత్య వేత్తల దృక్పథం అవుతుందా? అటువంటప్పుడు ఆ రచయితలు ఆ సిద్ధాంతం తెలిసి రాశారని మనం అనుకోలేం. కానీ, వాళ్లు జీవించిన ఆ సమాజం, ఆ చారిత్రక పరిస్థితులు, ఆ రకమైనటువంటి జీవనాన్ని వాళ్ళకి నేర్పాయని మనం అవగాహన చేసుకునే అవకాశం ఉంది. ఇలా చూసినప్పుడు తెలుగులో మార్క్సిస్టు విమర్శ ప్రారంభాన్ని ఎక్కడినుంచైనా చూడొచ్చు. అయితే, మార్క్సిస్టు దృక్పథంతోనో, మనోవిశ్లేషణ పద్ధతితో నో ఆ సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు ఆ సాహిత్యానికి ఉన్నటువంటి పరిమితుల్ని మనం గుర్తించాలి. లేకపోతే సిద్ధాంతానికి సంబంధించిన అన్ని అంశాలూ ఆ రచనల్లో కనిపించడం లేదనీ, ఆ రచయితలకు స్ఫష్టమైన దృక్పథం లేదనే సూత్రీకరణలు చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

ఆ సాహిత్యాన్ని విశ్లేషిస్తున్న మార్క్సిస్టు విమర్శకులు కొన్ని సూత్రీకరణలు చేస్తున్నారు. ఆ సూత్రీకరణలు అన్నీ కూడా ఆ సాహిత్యానికి లేదా కొన్ని కాలాల్లో వెలువడిన సాహిత్యానికి అనువర్తిత కాకపోవచ్చు. ‘‘ఒక సాహిత్య విమర్శ రచనను మార్క్సిస్టు సాహిత్య విమర్శగా గుర్తించడానికి కనీసం ఐదు ప్రధాన ప్రాతిపదికలు ఉండాలి. అవి 1. మార్క్సిస్టు సాహిత్య విమర్శా సిద్ధాంతం, 2. మార్క్సిస్టు సాహిత్యవిమర్శా పద్ధతి, 3. సమాజసాహిత్యసంబంధాల అవగాహన, అది విమర్శలో వ్యక్తమయే తీరు, 4. వస్తుశిల్పాల చర్చ, విశ్లేషణ, 5. సాహిత్యానికి గల తక్షణ – దీర్ఘకాలిక ప్రయోజనాల స్పృహ.’’ అని వేణుగోపాల్ కొన్ని సూత్రీకరణలను వివరించారు.వీటన్నిటినీ బట్టి ఈరోజు మనం మాట్లాడుకునే 1917 నుండి 1935 వరకు వచ్చినటువంటి సాహిత్యంలో మార్క్సిస్టు భావాలు లేదా మార్క్సిస్టు విమర్శ గురించి కూడా ఈ సూత్రీకరణ అవగాహన చేసుకోవడం అవసరమేమో అనుకుంటున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖాధిపతి, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

     హైదరాబాద్. 9182685231

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *