“మాన్సాస్ ట్రస్ట్” వివాదాలు ఇప్పట్లో తేలేనా!!

 “మాన్సాస్ ట్రస్ట్” వివాదాలు ఇప్పట్లో తేలేనా!!

భూమిపుత్ర, విజయనగరం:

విజయనగరం జిల్లాలోని ‘మాన్సాస్‌’ట్రస్టు దేశంలోనే విద్యారంగంలో ప్రయివేటుగా నడిచే పెద్ద ధార్మిక సంస్థల్లో ఒకటి. వారసత్వ పోరు, అంత: కలహాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తో వచ్చి పడిన వివాదం ట్రస్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. సంస్థపై ముసురుకున్న విమర్శలు, అపరిమితమైన ఆస్తులు, భూముల దుర్వినియోగం, రాజకీయ కారణాలు వెరసి ‘మాన్సాస్‌’ తేనె తుట్టె ను కదిలిస్తున్నాయి. 18 వ శతాబ్దంలో ఒడిసా నుంచి గోదావరి జిల్లాల వరకూ తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంది విజయనగర సామ్రాజ్యం. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. గత వైభవ సంకేతంగా ఇప్పటికి నిలిచిన ఏకైక చిహ్నం మాన్సాస్‌ ట్రస్టు మాత్రమే. దీని చుట్టూ రకరకాల అభియోగాలు కమ్ముకుంటున్నాయి. పూర్తిగా నిరూపితం కాకపోయినప్పటికీ అరవై సంవత్సరాల ట్రస్టు చరిత్రలో గత వైభవం క్రమేపీ మరుగున పడుతోంది.

ట్రస్టు పరిధిలో ని 14వేల ఎకరాల భూముల విలువ 60 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. వాటి సద్వినియోగంపై సందేహాలున్నాయి. సంస్థకు ఛైర్మన్‌ గా ఉన్న తెలుగుదేశం నాయకుడు అశోక్‌ గజపతిరాజును ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందేనని ప్రభుత్వం పట్టుబట్టి కూర్చుంది. మరో వారసురాలు సంచయితకు మద్దతునిచ్చి గద్దెనెక్కించినా న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ అశోక్‌ గజపతిరాజు అధిపతి అయ్యాడు. అయినప్పటకీ ప్రభుత్వ పెద్దలు ఇది తాత్కాలికమే, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. మరో మార్గంలో ఛైర్మన్‌ ను పదవీ చ్యుతుడిని చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.తన సోదరుడైన ఆనంద గజపతి మరణానంతరం అశోక్‌ గజపతి రాజు 2016లో మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు దాదాపు 20 ఏళ్లపాటు ట్రస్టు మొత్తం కార్యనిర్వహణ అంతా ఆనంద గజపతే చూసుకున్నారు.

అశోక్‌ గజపతిరాజు పూర్తిగా రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలేవారు. 2020 వరకూ నాలుగేళ్లు ఛైర్మన్‌ గా కొనసాగినప్పటికీ ట్రస్టు పై పూర్తి అదుపు సాధించలేకపోయారు . ఆస్తుల్లో పదివేల ఎకరాలకు సంబంధించి వివాదాలున్నాయి. ట్రస్టు నియంత్రణలో భూముల లీజులు, కౌలు వసూళ్లు సక్రమంగా లేవు. రికార్డులూ అస్తవ్యస్తమే అనేది అభియోగం. అదే విధంగా సింహాచలం దేవస్థానం సహా 108 ఆలయాలకూ ఆయన ధర్మకర్త. వ్యక్తిగతంగా అశోక్‌ పై ఆరోపణలు లేవు. కానీ సమర్థతపై స్థానికులే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. చూసీ చూడనట్లు పోవడం, పట్టించుకోకపోవడంతో ట్రస్టుపై యాజమాన్యం నియంత్రణ కోల్పోయింది. తొలి నాళ్ల నుంచి తెలుగుదేశానికి అనుబంధంగా ఉంటూ వచ్చారు అశోక్‌ గజపతిరాజు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అదును చూసి వేటు వేసింది.

గత అరవై సంవత్సరాలుగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ‘మాన్సాస్‌’ట్రస్టు విద్యాసేవలు అందిస్తోంది. ఇంజనీరింగ్‌, న్యాయ విద్య సహా 13 విద్యాలయాలను నిర్వహిస్తోంది. తాజా వివాదాలతో వాటి భవితవ్యంపైనా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.ఆనందగజపతి మొదటి భార్య ఉమా దేవి కుమార్తె సంచయిత. 2020 వ సంవత్సరం వరకూ ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 1991లోనే ఉమతో ఆనందగజపతి విడాకులు తీసుకున్నారు. బీజేపీలో ఢిల్లీ లో యాక్టివ్‌ గా స్వచ్చంద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవారు సంచయిత. 2019లో వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మాన్సాస్‌ ఛైర్మన్‌ పదవి పై పావులు కదిపారు. అశోక్‌ గజపతి రాజును నేరుగా పదవి నుంచి తప్పిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తుతుంది. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి. అందుకే సంచయితను వారసురాలిగా గుర్తించి వైసీపీ ప్రభుత్వం అశోక్‌ ను గద్దె దించి ఆమెకు పట్టం గట్టింది.

హైకోర్టు తీర్పుతో ఆమె పదవీచ్యుతురాలైంది. వ్యక్తిగతంగా తిరిగి ఆమె న్యాయపోరాటం చేస్తారో లేదో స్పష్టత లేదు. ప్రభుత్వమే ఆమె తరఫున పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఉదంతంలో ఆనంద గజపతి రెండో భార్య సుధా, ఆమె కుమార్తె ఊర్మిళ సైతం రంగంలోకి దిగడం విశేషం. మాన్సాస్‌ ట్రస్టుకు తామే వారసులమంటూ వారు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అటు ప్రభుత్వం , ఇటు రాజకీయ పార్టీలు వారిని పెద్దగా పట్టించుకోలేదు.ప్రభుత్వం ఏ ఉద్దేశంతో రంగంలోకి దిగినప్పటికీ మాన్సాస్‌ ట్రస్టును కాపాడటం మాత్రం అవసరం. వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం కావడం , పదేళ్లుగా ఆడిట్‌ లేక జవాబుదారీతనం కోల్పోవడం లోపాలుగా కనిపిస్తున్నాయి. ట్రస్టు ఆస్తుల విషయంలో అశోక్‌ గజపతి రాజుకి పెద్దగా అవగాహన లేదు. ఆయన మొత్తం వ్యవహారాలను తన నియంత్రణలోకి తెచ్చుకోవడం కష్టమేనని స్థానికులు చెబుతున్నారు.

అలాగని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఒరిగేదేవిూ ఉండదు. భూముల విక్రయంతో సొమ్ము చేసుకోవడం మినహా దాతల ఆశయం మట్టిగొట్టుకుపోతుంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎలాగూ ఉండనే ఉంటాయి. అందువల్ల మాన్సాస్‌ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణ జరిపి లోపాలను నిగ్గు తేల్చాలి. ఒక కుటుంబం అధీనంలో అంత పెద్ద సంస్థను గాలికి వదిలేయడమూ సముచితం కాదు. అందుకే సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న విద్యావేత్తల ఆధ్వర్యంలో కమిటీని వేయడం మంచిది. నిర్వహణ బాధ్యతలు కమిటీకి అప్పగించాలి. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అశోక్‌ గజపతి రాజుని ఛైర్మన్‌ గా గౌరవ హోదాకు పరిమితం చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *