సమకాలీనతను విస్మరించని శ్రీ ప్రసన్నాంజనేయ శతకం

 సమకాలీనతను విస్మరించని  శ్రీ ప్రసన్నాంజనేయ శతకం

భూమిపుత్ర,సాహిత్యం:

శ్రీరామ నామం పలికినా, రాసినా పుణ్యమొస్తుందనేది మన భారతీయులకున్న గాఢమైన విశ్వాసం. శ్రీరాముణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో కొలిచిన వాడు శ్రీ ఆంజనేయుడు. సాధారణంగా సీతారాముల చిత్రపటంలో ఎల్లప్పుడూ లక్ష్మణుడితో పాటు శ్రీ ఆంజనేయుడు కూడా కలిసి ఉండటం ఒక విశేషం.

ఇటీవల కాలంలో శ్రీరాముడి భక్తుడైన శ్రీ ఆంజనేయుడు వార్తల్లోకి వచ్చాడు. ఆయన కులాన్ని, దాన్ని ధ్రువీకరించే పత్రాలను జారీ చేయమనే వరకు ఆ దుమారం చెలరేగింది. మరో వైపు ఆంజనేయుని జన్మస్థలం తిరుపతి అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఒక పరిశోధకుడు పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చాడని టిటిడి ప్రకటించింది. ఇదిలా ఉండగా కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల వారు కూడా ఆంజనేయుని జన్మస్థలం గురించి ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీ ఆంజనేయుని భక్తిని ప్రశంసిస్తూ ప్రముఖ పద్యకవి గోవిందుని గోవర్ధన్ “పాలెం శ్రీ ప్రసన్నాంజనేయ శతకం” రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మిత్రుడు గోవిందుని గోవర్ధన్ మంచి భక్తుడు. స్థానిక దేవాలయాలు, వాటిని పోషించేవారినీ మర్చిపోకూడదనే సహృదయ స్వభావం గలవాడు. ఒక యేడాది దసరా సెలవుల్లో ఏం చేస్తున్నారన్నప్పుడు ఈ శతకం రాస్తున్నానని కేవలం వారం రోజుల్లో ఈ శతకాన్ని మన ముందుకు తెచ్చాడు. ఈ శతకాన్ని రాస్తున్నన్ని రోజులు గోవర్ధన్ నిరంతరం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, శ్రీ ఆంజనేయుడు వారి మాహాత్మ్యాల్ని స్మరించుకుంటూ, వర్ణించుకుంటూనే ఆయన గడిపిన రోజుల్ని నేనెన్నో గమనించాను. ఆయన రాసిన పద్యాలను వాట్సాఫ్ లో నాకు ఎప్పటికప్పుడు పంపించి, వాటిని తాజాగా చదివే అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించాడు. ఆ పద్యాల్లో ఒక ప్రవాహంతో పదాలు ఉరికి పడుతున్నట్లు, ఒక క్రమంతో తమ భక్తి పారవశ్యం తొణికిసలాడినట్లు నాకు అనిపించింది. నిజంగానే ఆ స్వాములు ఆయన చేత ఈ శతకాన్ని రాయిస్తున్నారేమోనని కూడా అనిపించింది.

ఎప్పుడు చదివినా పద్యానికి సంబంధించిన విశేషాల్ని అప్పుడే నాకు తోచిన అంశాల్ని మిత్రుడితో పంచుకునేవాడిని. నాకు మాత్రమే కాకుండా, ఈ పద్యాల్ని ప్రముఖ పద్య కవులు, ఛందస్సులో పండితులైన డాక్టర్ వెలుదండ సత్యనారాయణ గారికి పంపించి సలహాల్ని, సూచనల్ని పొందే వాడినని నాతో చెప్పేవాడు. “పండిత కవినాడు పద్య గురువు యైన వెలుదండ వారిని వేడుకొంటి మారుతిరాయుని మకుటము నిలుపను సూచననందించే చూడుమనుచు” అని తాను ఈ శతకం రాయడంలోను, మకుటాన్ని నిర్ణయించుకోవడం లోనూ డాక్టర్ వెలుదండ సత్యనారాయణ గారి సహాయం తీసుకున్నానని సవినయంగా కూడా చెప్పుకున్నాడు కవి. వీరితోపాటు మరికొందరి ప్రోత్సాహం కూడా విస్మరించకుండా శతకంలో స్మరించుకున్నాడు కవి. నిజానికిది కావ్యంలో అవతారిక స్వభావాన్ని సంతరించుకున్న శతకంగా వర్ణించాడు కవి.

‘‘ ప్రస్తుతించెద పాలము భక్తవరద! అభయమొసగుమా శ్రీ ప్రసన్నాంజనేయ!” అనే మకుటముతో కొనసాగిన ఈ శతకం కేవలం భక్తి శతకం మాత్రమే కాదు, సమకాలీన సమస్యల్ని ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించుకోవడానికి ఉత్తమ సంస్కారాన్ని ప్రసాదించమని కోరడం వల్ల ఈ శకతం ప్రత్యక్షంగా సామాజిక ప్రయోజనాన్ని కూడా ఆకాంక్షిస్తుందని చెప్పవచ్చు. ప్రసిద్ధ అవధాని, ఎంతోమందిని తన శంకరాభరణం గ్రూపు ద్వారా పద్యాలు రాయిస్తున్న కంది శంకరయ్య గారు ఈ శతకం గురించి రాస్తూ రామనామ మహిమను వర్ణిస్తూనే మరొక పార్శ్వంలో ‘‘ సామాజిక చైతన్యాన్ని అభిలషించే పద్యాల’’తో కవి గోవిందుని గోవర్థన్ ‘సమర్థ పదప్రయోగంతో, చక్కని ధారతో, మనోహరమైన నడకతో రచించారని ప్రశంసించారు.

స్తోత్రపాఠకులోలె మిత్రబృందము కొంత
పొగడు చుందురెపుడు పొందికగను
అటనుండి కదలుచు నటనతో కల్పితా
లల్లుచుందురుగద కొల్లలుగను
మోసకారులెపుడు ముందర నమ్మించి
యెగతాళి చేయుదు రెరుగనటుల
వమ్ముచేసెడివార నమ్ముచు నెందరో
నిందల నొందుచు కుందిరిగద
మిత్రుడెపుడు మారునో శత్రువునిగ
తెలియరాకున్నదీనాడు తేటముగను
ప్రస్తుతించెద పాలెము భక్త వరద
నభయమొసగుమా శ్రీ ప్రసన్నాంజనేయ’’

(పద్యం: 10) ఒక పద్యంలో కపట స్నేహితుల గురించి ఆవేదన చెందుతాడుకవి. దీనిలో స్వార్థ రాజకీయాల్ని తూర్పారబడుతూ డబ్బు సంపాదించడానికే పాలనా పగ్గాలు చేపడుతున్నారు తప్ప, ప్రజా శ్రేయస్సు పట్టించుకోవడం లేదనీ, అటువంటి వాళ్లను ప్రజా ప్రతినిథులుగా పొరపాటున ఎన్నుకున్నా వాళ్లను చైతన్యవంతమైన ప్రజలు గుర్తించి త్వరలోనే మరలా వాళ్ల అధికారాన్ని తొలగిస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు కవి. అలా ప్రజలు మంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి ధైర్యాన్ని ఇవ్వమనడం భక్తిని ఆధునిక భావాలకు ముడిపెట్టే నిష్కళంకమైన పని కూడా నిజమైన ధైర్యాన్ని ఇస్తుందని పాఠకుల్లో నవ్యోత్సాహాన్ని నింపుతున్నాడు కవి.

రైతులు వివిధ పంటలు పండించి వాటిని మార్కెట్లో అమ్ముకునే సమయానికి దళారులు ప్రవేశించి తగిన ధరలు లేకుండా చేస్తుంటారు. దీన్ని పాలకులు అడ్డుకోవాల్సింది పోయి వాళ్లకు అండగా ఉండటాన్ని గమనించిన కవి…
తెల్ల బంగారము తృప్తిగా పండించి
అప్పు సప్పులు తీర్చ నడుగులిడిరి
మధ్య దళారుల మాయమాటలు నమ్మి
గిట్టుబాటు ధరకు మెట్టు దిగిరి
విధిరాత యనుకొని విక్రయింపగ వారి
కష్టార్జితము కొంత నష్టమాయె
తూకాన మోసాలు కాకి లెక్కలతోడ
రైతుల దోచిరి రాక్షసముగ
చేయి కలిపిరి యేలికల్ చింతలేక
అన్నదాతల మేలుకై యడుగులిడరు
ప్రస్తుతించెద పాలెము భక్తవరద
అభయమొసగుమా శ్రీ ప్రసన్నాంజనేయ!”

(పద్యం: 13) అని ధైర్యంగా వర్ణించగలిగాడు కవి.

ఉద్యోగాలు లేక కొంతమంది వాటికోసం ఎంతోమంది నిరీక్షిస్తుంటే ఉద్యోగాలు పొందిన వాళ్లు ఆ విధుల్ని నిర్లక్ష్యంగా నిర్వర్తిస్తున్నవాళ్లనూ ఈ శతకంలో వదల్లేదు. ఉద్యోగాలు చేసే వాళ్లు తమకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉండే పట్టణాలు నగరాల్లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. నిజానికి అన్నీ అందుబాటులో ఉన్నట్లు అనిపించినా ఇళ్ళ అద్దె, పనిమనిషి, ప్రయాణం.. ఇలా అన్నీ ఖరీదే. కానీ, ఖర్చు పెట్టిన అందుబాటులో లేని పరిస్థితి పల్లెటూరిది. ఇప్పుడు ఇన్వర్టర్స్ వచ్చిన తర్వాత కరెంట్ సమస్య పెద్దగా లేకపోయినా సరైన వైద్యం అందుబాటులో ఉండదు. కొన్ని సార్లు డబ్బులున్నా పాలు, గ్యాస్, కూరగాయలు వంటి కనీస అవసరాలు కూడా లేని ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఉద్యోగులు కనీసం మున్సిపాలిటి స్థాయి పొందిన పట్టణాలకైనా బదిలీలపై వెళ్లిపోతుంటారు. అందువల్ల పల్లెటూళ్లలో చదువుకునే వాళ్ల పరిస్థితి చాలా దుర్భరంగా తయారవుతుంది. ఒక వేళపల్లెటూళ్లలో పాఠాలు చెబుతున్నా, ఆ ఉద్యోగులు పట్టణాల నుండి వస్తుంటారు. ఈ పరిస్థితిని గమనించిన కవి కదిలిపోతూ…
“బదిలిపై నీనాడు ముదముతో నెల్లరు
పట్టణా లరిగిరి వరుస కట్టి
పంతులయ్యలు లేక పల్లె విద్యాలయాల్
చదువులు సాగక చతికిలబడె
దీనాతిదీనమై దిక్కులన్ పరికించె
నాదుకొనెడి వారు నండలేరు
విద్యాధికారులు విన్నపా లందినన్
పెడచెవి నుంచిరి ప్రేమలేక
పోరు సల్పరు విద్యార్థి పోర లెవరు
పాలకులకైన నిసుమంత పట్టకుండె
ప్రస్తుతించెద పాలెము భక్త వరద
అభయ మొసగుమా శ్రీ ప్రసన్నాంజనేయ!”

(పద్యం: 15)అని ఆవేదన పడుతూ శ్రీ ఆంజనేయునకు విన్నవించుకుంటాడు కవి.

పల్లెటూళ్లలో పని చేసే వైద్యులకు ఉన్నత చదువులు చదువుకోవడంలోనూ, ఇతర అవకాశాల్లోను రిజర్వేషన్లు ఇస్తున్నారు. అలాగే, ఉపాధ్యాయులకు కూడా పల్లెటూళ్లలో పని చేసే వాళ్లకు హెచ్ఐర్ఎ ఎక్కువగాను, పట్టణాలు, నగరాల్లో పని చేసే వారికి తక్కువగా నిర్ణయిస్తే కొంత మార్పు రావచ్చునేమో. తాను ప్రత్యక్షంగా బోధనా రంగంలో ఉండటం వల్ల తాను గమనించిన అవకతవకల్ని అనేక కోణాల్లో వర్ణించాడు కవి.

నేడు ఆంగ్లమాద్యమం పేరుతో జరుగుతున్న విద్యాబోధన పల్లెటూళ్లలో మొదటికే మోసాన్ని తెచ్చి పెడుతుందనీ, కేవలం తమ మాతృభాషలోనే చదివించుకోలేని పేదవాళ్లు ఆంగ్లంలో చదివించడం ఎంత వరకు సాధ్యమనీ కవి ఆవేదన చెందుతున్నాడు. మాతృభాషతో పాటు ఆంగ్లం కూడా ఉండాలి. మనకీ త్రిభాషాసూత్రం ఉండనే ఉంది. దాన్ని ప్రతిష్టంగా అమలు చేస్తే సత్ఫలితాల్ని సాధించవచ్చు. కానీ వెర్రిగా అక్షరాలు నేర్చుకునే వయసు నుండే ఆంగ్ల భాష, ఆంగ్ల మాధ్యమాలు అంటూ చేసే వితండ వాదనలు సమాజానికి ఎలాంటి పరిణామాలను తీసుకువస్తాయో ఆలోచించాల్సిందేనని కవి వాదిస్తున్నాడు. ఇలా అనేక అంశాల పట్ల కవి స్పందించాడు. ప్రభుత్వాధికారులు పరోక్షంగా వీటిని విన్నపాలుగా గ్రహించి సంస్కరణలు చేపడితే బాగుంటుంది.

కవి గోవిందుని గోవర్ధన్ గారు నాగర్ కర్నూల్లోని నృసింహస్వామి ఆశీస్సులతో ముక్తి కోసం శ్రీప్రసన్నాంజనేయ శతకం రాసినట్లు తెలుస్తుంది. అయితే పల్లె పాలెములో విగ్రహ ప్రతిష్ట గురించి ఒక చక్కని పద్యాన్ని వర్ణిస్తూ…
పల్లె పాలెమునందు ప్రముఖు లెల్లరు కూడి
వ్యవసాయ కేంద్రాన వైభవముగ
కంటికి రెప్పయై కాపాడు ప్రభు వని
నిష్ఠతో మిమ్ము ప్రతిష్ఠచేసి
ప్రత్యేక శ్రద్ధతో నిత్యము పూజించి
వేడ్కలు జరిపిరి విరివిగాను
ఆశీస్సులను పొంది యానంద నిలయాన
కొనసాగుచుండిరి కొరతలేక
బాటసారులు నరుదెంచి భక్తులైరి
ముడుపులను గట్టుచున్నారు ముదముతోడ
ప్రస్తుతించెద పాలెము భక్త వరద
అభయమొసగుమా శ్రీ ప్రసన్నాంజనేయ!

(పద్యం: 5) అని ఆ ఊరికి ఆంజనేయుణ్ణి రక్షకుడిగా భావిస్తున్న స్థితిని తెలియజేశాడు కవి.

ఇది ప్రసన్నాంజనేయ శతకం అయినప్పటికీ ప్రతి పద్యంలోను సమ కాలిన సమాజం. దర్పణంలో కనిపిస్తుంది. ప్రతి పద్యం కంఠస్థం పట్టాలనిపిస్తుంది. ఒక సారి ఒక పరిశోధనా పత్రికకు వ్యాసం రాయమని గోవర్ధనన్ను అడిగితే “నేను వ్యాసం రాయలేను పద్యం తప్ప” అన్నారు. నిజానికి వ్యాసం రాయలేక కాదు పద్యం పట్ల తనకున్న ప్రేమ అటువంటింది. అలాంటి ప్రేమతో, అలాంటి ఇష్టంతో సమాజంలో జరుగుతున్న అనేక విషయాల్ని చూస్తూ ఉండలేక పద్యాల్లో ఆ సమస్యల్ని దైవానికి విన్నవిస్తున్నాడు కవి. ప్రపంచీకరణను మనంవద్దన్నా మన ఇంటిలో దాని ప్రభావం కనిపిస్తుంది. అది కేవలం వస్తు వ్యామోహంగా కాదు. కుటుంబాలు విచ్చిన్నమవడంలో కూడా కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబాలు నేడు వ్యష్టి కుటుంబాలు అయిపోతున్నాయి. నూటికో, కోటికో ఒక్కోఉమ్మడి కుటుంబం ఉంటుందేమో. ప్రస్తుతం చదువుల కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో సొంత ఊరు, సొంత ఇంటిని వదిలి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. “స్వేచ్ఛ” విచ్చలవిడి తనానికి దారి తీస్తుంది. నేడు కొన్ని ఉద్యోగాలు చేసే వాళ్లు “సహజీవనాలు” చేస్తున్నారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో డేటింగ్, సహజీవనం వంటి వాటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యేవారు. నేడు భారతదేశంలో కూడా వాటిని సహజంగా భావించే స్థితికి వచ్చేస్తున్నారు. అందువల్ల స్త్రీపురుష సంబంధాల్లో శాశ్వతత్వం అనేది క్రమేపీ కనుమరుగైపోతుంది. దీని పట్ల కవి తీవ్రంగా కలత చెందుతున్నాడు.
వసుధపై నేడు వైవాహిక బంధాలు
సాగకున్నవి కొన్ని శాశ్వతముగ
ఆలు మగలమధ్య నంతరాలను చూసి
విధి రాత లందురు విజ్ఞులెల్ల
ఊహల పల్లకి నూరేగుదు మనుచు
భ్రమ చెందిన యువత బంధము విడి
క్షణకాల సుఖము లక్షణముగా భావించి
కోర్కెతో కాపురాల్ కూల్చుకొనిరి

దంపతుల మధ్య చక్కని తలపు లుంచి
నిలుపు సంసార చక్రమున్ నెనరు చూపి
ప్రస్తుతించెద పాలెము భక్త వరద
అభయ మొసగుమా శ్రీ ప్రసన్నాంజనేయ!

(పద్యం:21) అనడం వెనుక కవి సమకాలీన, ప్రపంచీకరణ యుగంలో స్త్రీపురుష సంబంధాల్ని మనముందుంచే ప్రయత్నం చేస్తున్నాడు కవి.ఉమ్మడి కుటుంబం విచ్చిన్నం కావడం వల్ల వచ్చిన దుష్పరిణామాల వల్ల అనేక మంది వృద్ధాశ్రమాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సామాజిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలుగా మారిన తర్వాత విలువలనేవి ప్రశ్నార్థకమవుతాయి. అమ్మాయి చదువుకున్నా కట్నం, ఆస్తి పాస్తుల వాటాలు ఇవ్వనిదే వివాహాలు అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువయ్యాయి. వాటి వల్ల క్రమేపీ ఒంటరితనం, ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాల పట్ల కూడ కవి స్పందించాడు.
ఇలా సమకాలీన సమాజంలో మనచుట్టు జరుగుతున్న అనేక సమస్యల్ని శ్రీ ప్రసన్నాంజనేయునికి నివేదించి వాటిని సక్రమ మార్గంలో పెట్టాలని వాంఛించడమనేది ఒకరకంగా సమాజ కల్యాణాన్ని ఆకాంక్షించడమే. పద్యాన్ని సులభంగా సరళంగా అర్థమయ్యే శైలిలో రాయడం ఎలాగో ఈశకతం చదివితే ఒక చక్కని అవగాహన కలుగుతుంది. ఈయన రాసే పద్యాల్లో చక్కనిధార ఉంటుంది. చక్కని భావం ఉంటుంది. మరిన్ని పద్యాలతో శతకాలు, కావ్యాలు వర్ణించి తెలుగు సాహిత్య చర్రితలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సాధించుకోవాలని కోరుతూ మిత్రుడు గోవిందుని గోవర్ధనికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగు శాఖ,సెంట్రల్ యూనివర్సిటీ,

హైదరాబాద్ – 500046.

9182685231

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *