భూసంస్కరణలకు ఆద్యుడు స్వర్గీయ పివి

 భూసంస్కరణలకు ఆద్యుడు స్వర్గీయ పివి

పీవీ నరసింహారావు శతజయంతి

ఆర్థిక సంస్కరణలతో దేశానికి బలమైన ఆర్థిక పునాది

భూస్వామ్య వస్యవస్థను నిర్వీర్యం చేసిన పివి నిర్ణయాలు

భూమిపుత్ర,సంపాదకీయం:

పీవీ శత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం

సమైక్య ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యాభై సంవత్సరాల క్రితమే భూసంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ పీవీ సొంతం. పీవీ తీసుకుని వచ్చిన భూసంస్కర ణలు భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి బాటలు వేశాయి. భూమిలేని పేదలు చిన్న చిన్న కమతాల యజమానులుగా మారడానికి సహాయపడ్డాయి. పేద వారికి సమాజంలో గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. దున్నేవారికే భూమి ఎందుకు ఇవ్వాలో పీవీ సవివరంగా తెలియచెప్పారు.1969లో ప్రత్యేక తెలంగాణ రాష్టోద్య్రమ సెగవల్ల కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, 1971లో పీవీ ముఖ్యమంత్రిగా నియుక్తులయ్యారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో పీవీ భారీ మెజారిటీ సాధించి భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.

అయితే తెలంగాణలోని భూస్వాములకు పీవీ సంస్కరణలు నచ్చక, ఆయనకు వ్యతిరేకంగా కేంద్రంలో హై కమాండ్‌ను కలిసి, పీవీ వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని ప్రచారం చేశారు. అయితే భూ సంస్కరణలు ఆవశ్యకతను సోదాహరణంగా వివరించి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని మెప్పించారు. 1970లో ఆంధప్రదేశ్‌ హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుతాయని ఇచ్చిన తీర్పును, 1972 ఫిబ్రవరి 4న హైకోర్టు ధర్మాసనం రద్దు చేయటంతో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలైంది. అది రాను రాను పీవీ వ్యతిరేక ఉద్యమంగా మారటంతో 1973 జనవరి 17న పీవీ ప్రభుత్వం రాజీనామా చేసింది. దాంతో పీవీ శకం ముగిసిందని, పీవీ వ్యతిరేక వర్గం సంతోషించింది. భూ సంస్కరణల చట్టం తెచ్చి పీవీ ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడని చాలామంది ప్రచారం చేశారు. ఆంధ్రోద్యమం వల్లనే పీవీ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం రాష్ట్రపతి పాలన విధించారుగానీ పీవీ బదులు వేరే ముఖ్యమంత్రిని నియమించలేదు. కాని వారి సంతోషం ఎంతో కాలం నిలువలేదు. పీవీ వంటి మేధావి సేవలు రాష్ట్రస్థాయి కన్న అఖిల భారత స్థాయిలోనే అవసరమని భావించి, ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

రాజకీయాల నుండి దాదాపు తప్పుకుంటున్న దశలో అనుకోకుండానే పివి ప్రధాని అయ్యారు. నెహ్రూ- గాంధీల కుటుంబానికి చెందని, పూర్తి అయిదు సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన మొదటి వ్యక్తి పీవీ. తీరికలేని రాజకీయ కార్యకలాపాలు ఉన్నప్పటికీ, అన్ని భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. ఆయన 18 భాషలలో నిష్ణాతులు. స్థితప్రజ్ఞతకి, మూర్తీభవించిన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. పి.వి ఎంత ఎదిగినా, ఎంత పాండితీ విభవ సంపన్నులైనా వినమ్రత ఆయన సొత్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తెలంగాణ నుంచి ఎంపికైన తొలి ముఖ్యమంత్రిగా తెలుగు జాతి అంతా సగర్వంగా చెప్పుకునేలా దక్షిణ భారతదేశం నుంచే ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి వ్యక్తిగా పీవీ నరసింహారావు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం పొందారు. ఒక్క రాజకీయ రంగమే కాదు, సాహిత్యంలోనూ ఆయన సృజన ఎంతో గొప్పది.. కవిగా, కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాద రచయితగా, విమర్శకునిగా ఆయన విశ్వరూపం బహుముఖం.

పద్దెనిమిది భాషలలోఆయన పాండితీ ప్రకర్ష కలిగిన వారు. అర్థశాస్త్రంలో ఎంత పట్టుందో, ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే పట్టుంది. ఈ శతాబ్ది దేశ చరిత్రలో ఇంతటి విశిష్ట విలక్షణ, బహుముఖ ప్రతిభాశాలి పీవీ ఒక్కరే. మనజాతి గౌరవాన్ని,ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన తెలంగాణ విలక్షణ నేత దివంగత పివి నరసింహారవు.పీవీ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. సామాన్యుడు మాన్యునిగా ఎదగడం అన్నది పివికి మాత్రమే దక్కిన అరుదైన అదృష్టంగా చూడాలి. పీవీ రాజకీయ ప్రస్థానం 1952 సాధారణ ఎలక్షన్లతో మొదలైంది. అలా 1962లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలిసారి న్యాయశాఖ, జైళ్లు, సమాచారశాఖ మంత్రిగా చేరి తన సంస్కరణల పర్వానికి తెరదీశారు. తదుపరి దేవాదాయ శాఖ వైద్య ఆరోగ్య శాఖ, విద్యామంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించారు. పీయూసీకి బదులు మళ్లీ ఇంటర్మీడియట్‌ను తెలుగు విూడియంతో ప్రవేశపెట్టడమే కాదు, తెలుగు అకాడమికి రూపకల్పన చేసారు.

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో పీవీని రాజకీయంగా దూరం చేయడానికి కొందరు అవకాశంగా వాడుకోవాలనుకున్నారు. నట్వర్‌సింగ్‌, అర్జున్‌సింగ్‌, ఎన్డీ తివారీ ప్రభృతులు ఇందులో ఉన్నారు. పీవీతో రాజీనామా చేయించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తానికి ఐదేండ్ల కాలంలో పీవీ దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని, పాలనను ఇచ్చారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠను ఇనుమడిరప చేశారు. మహరాష్ట్రలో ఉండగా గోపాల కృష్ణ గోఖలె ప్రభృతుల ఉపన్యాసాలు, మహారాష్ట్రలో వీరసావర్కర్‌ ప్రబోధాలు అక్కడి సంస్కృతి పీవీ జీవిత లక్ష్యాన్ని స్వాతంత్యోద్యమ్రం వైపు మరల్చాయి. ఆ సమయంలో మరాఠి కన్నడ భాషల్లో పట్టుసాధించిన పీవీ హరినారాయణ్‌ ఆప్టె రచనలు, సంత్‌ తుకారాం అభంగాలు చదివి అనువాదాలకు ఉపక్రమించారు. బీఎస్సీ యూనివర్సిటీ ఫస్ట్‌గా నిలిచిన పీవీ నాగపూర్‌ యూనివర్సిటీలో లా చదివి, న్యాయవిద్యలోనూ సర్వోన్నత శ్రేణి సాధించారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం పీవీ ప్రతిభను ప్రశంసించి, జుడిషియల్‌ సర్వీస్‌లో చేరాలని ఆహ్వానించగా తిరస్కరించి, హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల నిర్మాతలలో ప్రముఖంగా పేర్కొనదగిన బూర్గుల రామకృష్ణారావు వ్యక్తిత్వం పీవీని ఆకర్షించింది. ఆయన వద్ద జూనియర్‌గా చేరి న్యాయవాద వృత్తిని కొంతకాలం కొనసాగించారు. స్వామి రామానంద తీర్థ పిలుపునందుకొని వకాలత్‌ వృత్తికి స్వస్తి చెప్పి హైదరాబాద్‌ రాష్ట్ర స్వాతంత్య సమరంలో పాల్గొన్నారు.

పివికి భారతరత్న ఇచ్చివుంటే బిజెపి గౌరవం ఇనుమడించేది

అరుదైన రాజకీయ వ్యక్తిత్వం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఆయనను తలచు కోకుండా ఆయన పుటను పరిశీలించకుండా ఆధునిక భారత రాజకీయాలను చూడలేం. మనిషి ఎంత నెమ్మదస్తుడే అంత ఘటికుడు. ఆయన ఆర్థిక సంస్కరణలే నేటికీ భారత్‌ ఊపిరిని కాపాడుతున్నాయి. ఏడేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చివరకు పివి మంత్రివర్గంలో పనిచేసిన దివంగత ప్రణబ్‌ ముఖర్జీకి కూడా భారతరత్నను అందచేశారు. కానీ పివిని మాత్రం మరచిపోవడం దారుణమైన విషయంగానే చూడాలి. కాంగ్రెస్‌ ఎలాగూ పివిని గుర్తించలేదు. కనీసం బిజెపి అయినా గుర్తించక పోవడం ఆ పార్టీ దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. పివికి భారతరత్న ఇవ్వడమన్నది మనలను మనం గౌరవించుకున్నట్లే. మోడీ సర్కార్‌ పివిని తక్కువ చేసి చూసినంత మాత్రాన పివి వ్యక్తిత్వానికి వచ్చిన నష్టం ఏవిూ లేదు.

పివి శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ద్వారా తెలంగాణ సిఎం కెసిర్‌ ఆ మహానుభావుడి పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు. ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు చేస్తూ పోయారు. నెక్లెస్‌ రోడ్డ పేరును పివి మార్గ్‌ నామకరణం చేసి, ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రాంభించారు. ఆయనకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఇలా చేస్తున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు కనీసంగా కూడా స్మరించకపోవడం దారుణం కాక మరోటి కాదు. ఎగిరెగిరి పడే బిజెపి నేతలు కూడా పివి గురించి మాట్లాడకపోవడం మరింత విస్మయానికి గురి చేస్తోంది. తెలంగాణకు అదిచేసాం.ఇది చేసామని గొప్పలు చెబుతున్న వారెవరూ పివికి భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టలేదు. ఒకవేళ పివిని కాంగ్రెస్‌ నేతగా చూసి ఆయనను విస్మరిస్తే అది బీజేపీ భావదారిద్యం తప్ప మరోటి కాదు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వాలు కలిగిన వారు బహు అరుదుగా ఉంటారనడానికి పివి జీవితమే ఓ పాఠం. పదవుల కోసం,రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే నేతలున్న రోజుల్లో భారత్‌కు ఓ అణిముత్యం లాంటి నేత దొరికాడంటే అది ఓ పివి తప్ప మరొకరు కాదు.

లాల్‌బహదూర్‌ శాస్త్రి తరవాత అంతటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడు పివి మాత్రమే. అలాగే పదవుల కోసం వెంపర్లాడుతున్న నేటి రాజకీయాల్లో పదవులు వాటంతటవే వెతుక్కుంటూ రావడం…వాటికి వన్నె తేవడం కూడా బహు అరుదు. ప్రపంచ దేశాల్లో పరువు పోయేలా భారత ఆర్థికస్థితి చిక్కుకున్న దశలో దానిని కాపాడేందుకే వచ్చాడా అన్న రీతిలో మహానుభావుడి రూపంలో పివి భారతదేశానికి ప్రధాని కావడం అన్నది మనదేశం చేసుకున్న సుకృతం కాక మరోటి కాదు. ప్రధాని రూపంలో కష్టకాలంలో మన రాజకీయాల్లో పివి సాక్షాత్కరించడం కూడా దేశం చేసుకున్న అదృష్టంగా చూడాలి. భారతదేశ ఆర్థికి స్థితిగతులను బేరీజు వేసుకున్నప్పుడు పివికి ముందు పివి తరవాత అన్న లెక్కలు వేసుకునే స్థితి మనది.

రాజకీయాల్లో రాణించడం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ..ఎదుటి వారిని బురిడీ కొట్టించడం అవసరమైతే ప్రత్యర్థులను మట్టుపెట్టడం లాంటి నేటి రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు దివంగత పివి నరసింహారావు. ఆయన రాజకీయాల్లో స్వశక్తితతో,ప్రతిభతో రాణించారే తప్ప అడుగులకు మడుగులు ఒత్తి రాలేదు. ఆ మహానభావుడు మన తెలుగు వాడైనందుకు మనమంతా గర్వపడాలి. అలాంటి రాజకీయవేత్త ఒకరు భారత ప్రధాని అయినందుకు మనమంతా ఎంతో అదృష్టవంతులం. అలాంటి వ్యక్తిని నీచాతినీచంగా చూసిన ఘనత సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీది. పివి కాంగ్రెస్‌కు ఎంతో పేరు తెచ్చారు. ఆయన పాలనా సంస్కరణలతో దేశానికి అలాగే కాంగ్రెస్‌ పార్టీకి చరిత్రలో లిఖించదగ్గ ఘట్టాలను అందించారు. అలాంటి మహానుభావుడి సేవలను కాదని ఆయనను తృణీకరించిన తీరుకు ఇప్పుడు కాంగ్రెస్‌ తగిన మూల్యాన్నే చెల్లించుకుంటోంది.

పీవీ జీవిత కాలంలో అనేక సందర్భాలలో, ఆయనను తక్కువగా అంచనా వేసిన కాంగ్రెస్‌ ఇక ఎప్పటికీ కోలుకోదు. ఆయనకు చేసిన అవమానం అంతాఇంతా కాదు. ఇందిర అయినా రాజీవ్‌ అయినా ఆయనలోని అపార ప్రతిభను గుర్తించి చేరదీసారే తప్ప మరోటి కాదు. రాజకీయాల్లో స్థితప్రజ్ఞత ఉన్న అరుదైన నేతల్లో పివి ముందుంటారు. ఆయన స్వార్థం కోసం ఏనాడూ రాజకీయాలు చేయలేదు. అలాగే ఆయనలోని స్వార్థం దేశానికి మంచి చేయాలన్న తపన తప్ప మరోటి కాదు. అపర చాణుక్యుడు అంటూ ఆయనను కీర్తించినా రాజకీయాల కోసం తన చాణక్యాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. సానుకూల, ప్రతికూల రాజకీయాలను ఆమూలాగ్రం ఔపోసన పట్టిన ఘటికుడు ఆయన. అందుకే వాటిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పాలన చేసి తిరుగలేని నేతగా రుజువు చేసుకున్నారు. నిజానికి పివి హయాం తరవాత సంకీర్ణాలు మొదలయ్యాయి. పివి కూడా ఆనాడు సంకీర్ణ రాజకీయాలకు తెరతీసి ఉంటే దేవెగౌడ స్థానంలో మళ్లీ పివియే ప్రధాని అయ్యేవారు.

కుళ్లు రాజకీయాలు మోయడం ఇష్టం లేకే ఆయన అలాంటి ప్రతిపాదనలు చేసి ఉండక పోవచ్చు.అయినా ఆయన పాలనా కాలం ఓ స్వర్ణయుగం. ముఖ్యమంత్రిగా,కేంద్రమంత్రిగా,ప్రధాన మంత్రిగా,ఆర్థిక సంస్కరణ లను అద్వితీయంగా అమలు పరిచిన పాలనాదక్షుడు పీవీ నరసింహరావు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ,ఊహించని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్‌ సరళీకరణ విధానాన్ని రూపొందించి భారత్‌కు మార్గాన్ని చూపారు.ఇప్పుడా మార్గంలోనే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఆయన చూపిన బాట నుంచి పక్కకు తప్పినప్పుడల్లా మళ్లీ సంక్షోభాలు ఎదుర్కొంటున్నాం. అప్పుడు ప్రతి ఒక్కరికీ పీవీ ఆర్థిక సంస్కరణలే గుర్తుకు వస్తాయి. ఇప్పటికైనా పివిని గుర్తుంచుకునేలా కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వడంతో పాటు, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచే కార్యక్రమాలను చేపట్టాలి. అది బిజెపికే గౌరవం కాగలదు.

సమర్థ నాయకుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి పివి

ఆర్థిక సంస్కరణలతో దేశానికి బలమైన ఆర్థిక పునాది

ప్రాచీన గ్రీకు తాత్వికుడు ప్లేటో చెప్పినట్లు తత్త్వవేత్తలే పాలనలో న్యాయాన్ని ధర్మాన్ని సమానంగా స్వీకరిస్తారని అంటారు. గీతాచార్యుడు కూడా అలగా అంటాడు. స్థితప్రజ్ఞత ఉంటే ఏదైనా సాధించగలరని. అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడి అభిప్రాయం ప్రకారం మంచి, చెడు రెండిరటినీ ఒకే కోణంలో చూసినప్పుడు మంచి నాయకుడు కాగలడు. ఆయన రూపకల్పన చేసిన ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ విధానాలను తదనంతర ప్రభుత్వాలు కొనసాగించలేకపోయాయి. పీవీ మేధో సంపత్తి గురించి ఆయనను అనుసరించిన వారందరికీ తెలుసు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించే దార్శనికుడని ఆయనతో పనిచేసిన వారు ఎదుగుదురు. యావత్‌ ప్రపంచం కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరీక్షా కాలంలో సామాన్య మానవుడి మనుగడే ప్రశ్నార్థక మవుతున్నది. కరోనా సంక్షోభ సమయంలో, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ పీవీ ఆర్థిక సంస్కరణలే గుర్తుకు వస్తాయి.

ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ను తీసుకుని వచ్చి ఆయన ద్వారా తన ఆలోచనలను అమలు చేయించి దేశానికి దిశను చూపారు. అదే మన్మోహన్‌ పదేళ్ల కాలం దేశాన్ని ఏలినా అంతటి ప్రతిభ కనబర్చలేక పోయారు. కేవలం పివిని విస్మరించడం వల్ల వచ్చిన విమర్శలను తట్టుకునేందుకు మాత్రమే సోనియా మన్మోహన్‌ను తెరపైకి తెచ్చి తన కుటిల రాజకీయాలను నడిపారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలా చేసి ఎన్నో స్కామ్‌లను మూటకట్టుకున్నారు. రాజనీతిజ్ఞత, ఆర్థిక సంస్కరణాభిలాష అన్నవి ప్రతిభ ఉండి అమలు చేయగల ధైర్యం ఉన్న నేతకు మాత్రమే సొంతం అని పివి నిరూపించు కున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశాన్ని కుదిపి వేస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని చాకచక్యంగా పరిష్కరించి, దేశానికి బంగారు బాట వేసిన ధీశాలి పివి నరసింహారావు.

దేశానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలతో ముందుకు సాగిన రాజనీతిజ్ఞుడు పీవీ. ఆయన పాలనా ఫలితాలు, ఫలాలు నేటికీమనమంతా అనుభవి స్తూనే ఉన్నాం. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడంలో మాత్రం వెనకబడి ఉన్నాం. భారత రాజకీయాలకు కొత్త అర్థాలు చెప్పి దేశం కోసం పనిచేయడమే కర్తవ్యంగా భావించిన సదా స్మరణీయుడు మన పివి. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరణీయం. ఆయన జయంతి సందర్భంగా శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం మనకు దక్కిన అరుదైన అవకాశంగా చూడాలి. అందుకే పీవీని స్మరించుకోవటం మన కర్తవ్యమే కాకుండా బాధ్యతగా చూడాలి. పివి నర్సింహారావు కేంద్రంలో మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారు. అనేక కార్యక్రమాలను అమలు చేశారు. అందులో నవోదయ విద్యాలయాల ఏర్పాటు కూడా ఒకటి. ఇప్పుడు నవోదయలో చదివిన విద్యార్థులు అన్నిరంగాల్లో రాటుదేలుతున్నారు.

దీనిని జాతీయ స్థాయిలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనదే. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న రోజుల్లో జాతీయ విద్యా విధానం రూపొందించిన మహా విద్యావేత్త మన పివి నరసింహారావు. ఒక విద్యావేత్తగా తత్త్వవేత్తగా, ఆర్థిక వేత్తగా, సామాజిక వేత్తగా, రాజకీయవేత్తగా, భాషావేత్తగా, అభ్యుదయ వేత్తగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశీలిగా పీవీ ఘనమైన చరిత్ర కలిగిన మహాను భావుడు. అందుకే తనకు ఏ మంత్రిపదవి అప్పగించినా అందులో రాటుదేలడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే నవోదయ విద్యావిధానం ఆయన బుర్రలోంచి బయటకు వచ్చింది. అందుకే ఆయన నవోదయాలను తమకూ కావాలని ఇప్పటికీ అనేక రాష్ట్రాలు కోరుతున్నాయి. ఉమ్మడి అంధప్రదేశ్‌ లో విద్యాశాఖ మంత్రిగా పేదలకు రెసిడెన్షియల్‌ విద్యావ్యవస్థను తొలిసారిగా పరిచయం చేసిన ఘనత ఆయనదే.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *