ఇంటర్నెట్‌ సదుపాయాలు లేక న్యాయసేవల్లో జాప్యం

 ఇంటర్నెట్‌ సదుపాయాలు లేక న్యాయసేవల్లో జాప్యం

అనామలీస్‌ ఇన్‌ లా అండ్‌ జస్టిస్‌’ పుస్తకాన్నిఆవిష్కరించిన సిజె

న్యాయవృత్తిలో ఉన్నవారిని కరోనా యోధులుగా గుర్తించాలి – సుప్రీంకోర్టు చీఫ్‌ ఎన్వీ రమణ

భూమిపుత్ర,న్యూఢిల్లీ:

గ్రావిూణ, గిరిజన, మారుమూల, కొండ ప్రాంతాల్లో బలహీనమైన డిజిటల్‌ అనుసంధానత వల్ల న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ఈ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. సాంకేతిక సౌకర్యాల కల్పనలో అసమానతల వల్ల ఒక తరం న్యాయవాదులు వ్యవస్థ నుంచి నెట్టివేయబడుతున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు సీజేఐ తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ రాసిన ‘అనామలీస్‌ ఇన్‌ లా అండ్‌ జస్టిస్‌’ పుస్తకాన్ని సీజేఐ ఆవిష్కరించారు. వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో కనెక్టివిటీ సమస్య ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలిపారు.

దీని వల్ల బాధితులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతున్నదని, దేశవ్యాప్తంగా వేలాది మంది లాయర్లు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో జీవనోపాధి కోల్పోయిన న్యాయవాదులకు సహాయం అందించాలని మంత్రికి రాసిన లేఖలో కోరారు. న్యాయ వృత్తిలో ఉన్నవారిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ప్రకటించాల్సిన అవసరాన్ని సీజేఐ వివరించారు. వారికి ప్రాధాన్యతనిచ్చి కరోనా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు.చట్టంలో లోపాలను, వాటిని అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తించి రిటైర్డ్‌ జస్టిస్‌ రవీంద్రన్‌ సామాన్యులకు అర్థమయ్యేలా పుస్తకం రాశారని జస్టిస్‌ రమణ కొనియాడారు. తద్వారా న్యాయ వ్యవస్థపై సామాన్యులు నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎంఎన్‌ వెంకటాచలయ్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాను చదువుకునే రోజుల నుంచి జస్టిస్‌ వెంకటాచలయ్య తనకు స్ఫూర్తి అని సీజేఐ తెలిపారు. మరోవైపు, 1980లలో హైదరాబాద్‌, బాంబే హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ కొండా మాధవరెడ్డి సతీమణి జయలతాదేవి మృతిపట్ల జస్టిస్‌ రమణ సంతాపం వ్యక్తం చేశారు. తాను న్యాయవాద వృతిలో ప్రవేశించినప్పుడు తన లాంటి యువ లాయర్లను జస్టిస్‌ మాధవరెడ్డి ప్రోత్సహించారని అన్నారు. ఆమె మృతి పట్ల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published.