జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ వచ్చే నెలలో ప్రారంభం

 జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ వచ్చే నెలలో ప్రారంభం

ప్రాజెక్టును సందర్శించిన మంత్రి బొత్స

భూమిపుత్ర,గుంటూరు:

జిందాల్‌ ప్లాంట్‌ 2016లో ప్రారంభించి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలన్నారని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్‌ ప్రారంభ దశకు వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెలలో ప్లాంట్‌ ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రభుత్వమే యూనిట్‌ రూ.6.18 కొనుగోలు చేస్తామని చెప్పారు. కాలుష్యం సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోని చెత్తను ఈ ప్లాంట్‌కి తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ ప్లాంట్‌కి నీటి సమస్య ఉందని ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్పోరేషన్‌ పరిధిలో యుజిడి వర్క్స్‌ పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా శివారు ఓబులనాయుడు పాలెం వద్ద జిందాల్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.

గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో వచ్చే చెత్తతో జిందాల్‌ ప్రాజెక్టు పవర్‌ తయారు చేయనుంది. ప్రాజెక్ట్‌ నిర్వహణపై కంపెనీ ప్రతినిధులతో మంత్రి బొత్స సవిూక్ష జరిపారు. మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, కమిషనర్‌ అనురాధ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జిందాల్‌ ప్లాంట్‌ పనులు 2016లో ప్రారంభమయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 10 శాతం పనులే చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక ప్లాంట్‌ పనులు వేగవంతం చేశామని అన్నారు. వచ్చేనెలలో ప్లాంట్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గుంటూరు, విజయవాడ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్‌ సహా మరో 6 మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను ఉపయోగిస్తాం. విశాఖలోనూ ఈ తరహా ప్లాంట్‌ నిర్మాణంలో ఉంది. ఈ ప్లాంట్‌ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. చెత్త నిర్వహణకు విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణమే ప్రధానమన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *