లింగవివక్ష లేనపుడే దేశ పురోగతి సాధ్యం

 లింగవివక్ష లేనపుడే దేశ పురోగతి సాధ్యం

భూమిపుత్ర,సంపాదకీయం:

భారతదేశంలోని ప్రధాన సమస్యలలో లింగవివక్ష ఒకటి. లింగ వివక్ష అనాదిగా దేశంలో కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంది. దీనిని అరికట్టేందుకు లింగ భేదం లేకుండా అన్ని వర్గాలకు సమానావకాశాలు కల్పించేలా ఐక్యరాజ్య సమితి విధించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో లింగ సమానత్వ సాధన 5 వ లక్ష్యంగా విధించారు. తదనుగుణంగా లింగ సమానత్వం సాధన దిశగా ప్రపంచమంతా పరుగులు తీస్తున్నది. లింగ సమానత్వపు సాధనలో లింగ నిష్పత్తి ఒక ప్రధానమైన అంశం. గత 12 సంవత్సరాల జనాభా గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో లింగ నిష్పత్తి క్రమంగా పడిపోయింది. గత రెండు గణాంకాల్లో స్వల్పంగా వృద్ధిలోకి వచ్చింది. 1901లో 972 గా ఉన్న లింగ నిష్పత్తి 2011 కి వచ్చేసరికి 940 కి పడిపోయింది. లింగ నిష్పత్తి ఇలా పడిపోవడం లింగ అసమానతకు నిదర్శనం.మహిళా సాధికారతలో ఆర్థిక స్వాతంత్య్రం కూడా అతి ప్రధానమైనదే. ఆ అంశంలో దేశం ఇంకా వెనుకబడే ఉంది.

ఉపాధి కల్పనలోనూ మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో నేటికీ సమాన పనికి సమాన వేతనం నేటికీ అమలు కావడం లేదు. ఆరోగ్యపరమైన అంశంలోనూ స్పష్టంగా మహిళల వెనుకబాటు కనబడుతున్నది. ప్రతి ఇద్దరిలో ఒకరు ఐరన్‌ లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. అధిక సంఖ్యలో మహిళలు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో లింగ సమానత్వాన్ని సాధించడానికి ప్రభుత్వాలు మరింత ప్రణాళికా బద్ధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. లింగనిష్పత్తి పెరుగుదల దేశంలో బాలికల పట్ల ధోరణి మారుతుందనడానికి ఒక మంచి సంకేతమే.పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడు అనే ధోరణి తల్లిదండ్రుల్లో బలీయంగా నాటుకుపోయింది.పైగా వివాహం తర్వాత ఆడపిల్లలు తమతో ఉండరనే భావనతో బాలికల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు, శిశుహత్యలు అధికమయ్యాయి. అన్ని వర్గాలు, మతాలు, కులాలలోనూ ఈ విధానం కొనసాగింది.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రావిూణ ప్రాంతాలలో పుత్ర వాత్సల్యం అధికంగా ఉండి ఆడపిల్లలు నిరాదరణకు గురయ్యారనేది వాస్తవం. అయితే కాలానుగుణంగా ప్రజల ఆలోచనల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. ఆలోచనా ధోరణి మార్చుకుంటూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. తాజాగా ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ -5) వెలువరించిన గణాంకాల ప్రకారం భారతదేశం లింగనిష్పత్తిలో గణనీయమైన వృద్ధిరేటు నమోదు చేసింది. మహిళల జనాభా పురుషులను దాటి 1020కి చేరింది. అంచనాలను పటాపంచలు చేస్తూ పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి ఇంకా వెయ్యి తక్కువగానే ఉండగా, గ్రావిూణ ప్రాంతాలు మెరుగైన లింగ నిష్పత్తిని నమోదు చేయడం ఒక విప్లవాత్మకమైన మార్పు. ప్రభుత్వాలు అమలు పరుస్తున్న బేటీ బచావో – బేటీ పడావో, బంగారుతల్లి వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ గణాంకాలు దేశంలో లింగ సమానత్వం సాధనలో నూతన ఆశలు రేకెత్తిస్తున్నాయి.నిజానికి గత దశాబ్ద కాలంగా భారతదేశంలో లింగ నిష్పత్తిలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. 2011 జనాభా లెక్కల్లో 940 నుండి 2014 – 15లో నిర్వహించిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ – 4)లో లింగనిష్పత్తి 991కి పెరిగింది. తాజాగా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 5లో 1020కి చేరుకుంది.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా, బ్రెజిల్‌, రష్యా, జపాన్‌ వంటి దేశాలలో ఈ సంఖ్య ఎప్పుడో 1000 దాటింది.అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు పరుస్తున్న చైనాలో మాత్రం లింగ నిష్పత్తి ఇంకా తక్కువగానే నమోదయింది. అయితే ఇక్కడ కేవలం లింగ నిష్పత్తి పెరిగినంత మాత్రాన లింగ సమానత్వం సాధన దిశగా సాగుతున్నామని అనగలమా అనేది ఆలోచించాల్సిన ప్రశ్నే. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో నేటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. గత ఏప్రిల్లో వెలువడిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం 156 దేశాలపై జరిపిన అధ్యయనంలో గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ గణాంకాలలో భారతదేశం 146 స్థానంలో నిలవడం లింగ సమానత్వంలో మనమెంతగా వెనుకబడి ఉన్నామో అర్ధం అవుతుంది.కేవలం 22 శాతం మంది మహిళలు మాత్రమే రాజకీయ రంగంలో అవకాశాలు పొందుతున్నారు. స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించినా పెద్దగా ఉపయోగకరంగా లేవు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా చోట్ల నిర్ణయాధికారం కుటుంబ సభ్యులదే ఉంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పిస్తున్న దేశాలలో భారతదేశం 51వ స్థానంలో నిలిచింది.

లింగ సమానత్వంలో మరొక ప్రధానమైన అంశం విద్యారంగం. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 4వ లక్ష్యంగా అందరికీ నాణ్యమైన విద్యను గుర్తించారు.భారతదేశంలో స్త్రీలు చదువుకోవడం నిషేధించిన కాలంలో లింగవివక్షకు వ్యతిరేకంగా ఫూలే దంపతులు, రనడే, అంబేడ్కర్‌, సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ వంటి సామాజిక ఉద్యమకారులు మహిళల విద్యకై ఉద్యమించారు. ఫలితంగా దేశంలో విద్యావకాశాలు మెరుగుపడ్డాయి.కానీ నేటికీ విద్యారంగంలో దేశంలో లింగవివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో ఈ రంగంలో దేశం 114 వ స్థానంలో నిలిచింది. తాజా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌- 5 సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైందిబాలికల అక్షరాస్యత శాతం క్రమంగా పెరుగుతున్నప్పటికీ ఉన్నత విద్యకు వచ్చేసరికి ఆ సంఖ్య తగ్గుతోంది. తాజాగా జరిగిన సర్వేలో కేవలం 41 శాతం మంది మహిళలు మాత్రమే పదవ తరగతి దాటి చదువుతున్నారు. గ్రావిూణ ప్రాంతాలలో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. కేవలం 33.7 శాతం మంది మాత్రమే పదవ తరగతి దాటి చదువుతున్నారు. విద్య అవకాశాలు గణనీయంగా మెరుగుపడిన ప్రస్తుత తరుణంలోనూ మహిళ విద్యార్థుల శాతం పడిపోవడం ఆశ్చర్యమే.

యునైటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ 2019- 20 గణాంకాల ప్రకారం ప్రాథమిక స్థాయిలో సగటు విద్యార్థి నమోదు నిష్పత్తి 97.8 నుండి స్థాయికి వచ్చేసరికి 51.4 శాతానికి పడిపోతుంది. ఇక్కడ సానుకూలమైన అంశం ఏంటంటే 2019- 20 అఖిల భారత ఉన్నత విద్యసర్వే గణాంకాల ప్రకారం ఉన్నత విద్యలో బాలుర శాతం 26.9 మాత్రమే కాగా, బాలికల శాతం కొంత అధికంగా 27.6 శాతం నమోదైందిబాలికల కోసం ఎన్ని చట్టాలు చేసినా ఐ.సి.డి.ఎస్‌, ఐ.సి.పి.ఎస్‌, చైల్డ్‌ లైన్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, మరెన్నో ప్రభుత్వేతర సంస్థలు బాల్య వివాహాలను నిరోధానికి కృషి చేస్తున్నప్పటికీ ఇంతటి స్థాయిలో బాల్య వివాహాలు నమోదుకావడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సాంకేతిక యుగంలో కేవలం 33.3 శాతం మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం పొందగలుగుతున్నారు. కరోనా విపత్తులో లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ విద్యా విధానమే ప్రత్యామ్నాయంగా మారింది. ఈ సమయంలో బాలికల పట్ల వివక్ష కొనసాగింది.కుమారుల విషయంలో ఆన్‌లైన్‌ విద్యకు అవసరమయ్యే పరికరాలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు కుమార్తెల విషయంలో మాత్రం కాస్త వివక్షాపూరిత ధోరణితోనే మెదిలారు. ఈ సందర్భంగా పెరిగిన డ్రాపౌట్‌ సంఖ్యలో ఎక్కువ మంది బాలికలే. పుత్ర వాత్సల్యంతో బాలురను అన్ని హంగులూ ఉన్న విద్యాలయాలకు పంపిస్తూ, బాలికలపట్ల వివక్ష చూపడం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published.