డా. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత ఆచార్య ‘దార్ల’తో ఇంటర్వ్యూ

 డా. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత  ఆచార్య ‘దార్ల’తో ఇంటర్వ్యూ
 భూమిపుత్ర  శ్రీహరి మూర్తి (శ్రీహరి): భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేసిన ‘డా.అంబేద్కర్ జాతీయ పురస్కారం’ స్వీకరించిన సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. ఇంతకు ముందు అందుకున్న పురస్కారాల కన్నా దీన్ని అందుకోవడం పట్ల ఏమైనా ప్రత్యేకత ఉన్నట్లు భావిస్తున్నారా?
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (దార్ల): మీ శుభాకాంక్షలను నా ధన్యవాదాలు. నిజానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుండి నేను కొన్ని పురస్కారాలను స్వీకరించినా, ఇది నా కుటుంబం అందిస్తున్న పురస్కారంగా భావిస్తున్నాను. నేనెంతో ఇష్టపడే గొప్పమేధామి డా.బి.ఆర్ . అంబేద్కర్ పేరు మీదుగా ఈ పురస్కారం నాకు రావడం నా జాతికి చేస్తున్న సేవను గుర్తించడంగా అనుకుంటున్నాను. దళిత, గిరిజన, మైనారిటీ ముస్లిమ్, అణగారిన వర్గాల ప్రజల గురించి ఆలోచించేవీరిని గుర్తించేవాళ్ళుంటారని చెప్పడానికి నిదర్శనంగా భావిస్తున్నాను. నాతో పాటు మరో ఏడుగురు ఈ యేడాది ఈ జాతీయ పురస్కారాలను అందుకున్నారు. వారు కూడా వివిధ రంగాల్లో విశేషమైన కృషిని చేస్తున్న వారే కావడం నాకు మరింత సంతోషాన్నిచ్చింది.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: ఈ పురస్కారాన్ని ప్రదానం చేసిన భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం, దాని లక్ష్యాల గురించి కొంచెం వివరిస్తారా?
దార్ల: భారతీయ సార్వత్రిక దళిత విశ్వవిద్యాలయాన్ని 1986లో స్థాపించారు. CARDS – Community and Rural Development Society గుంటూరు వారి ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయం నడుస్తుంది. CARDS డైరెక్టర్ గా డా.ఎం. స్వర్ణలతా దేవి, విశ్వవిద్యాలయం వైస్ –ఛాన్సలర్ గా ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వివిధ రంగాల్లో ప్రఖ్యాతులైన వారు ఈ సంస్థ యాజమాన్య సభ్యులుగా ఉన్నారు. దేశ, విదేశాల్లో దళితులు, గిరిజనులు, పీడితుల జీవన విధానాన్ని మెరుగుపర్చడం కోసం ఈ సంస్థ, ఈ విశ్వవిద్యాలయాలు కృషిచేస్తున్నాయి. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఈ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు డా.అంబేద్కర్ భావజాలం ప్రచారానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
దార్ల: డా.బి.ఆర్. అంబేద్కర్ రచనలను, ప్రసంగాలను, ఆయన దార్శనికతను వ్యాప్తిచేయడం, ఆయన రచనలపై పరిశోధనలు చేయడం, ప్రచారం చేయడం, తద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయం ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల మాదిరిగా డిగ్రీలను ప్రదానం చేయదు. అనివార్యకారణాల వల్ల అర్థాంతరంగా చదువు ఆపేసిన దళితులు, గిరిజనులు,పీడిత వర్గాలకు చెందిన వీరిని గుర్తించి మరలా చదువుపట్ల ఆసక్తికి కలిగించి, ఆర్థికంగా కూడా సహాయం చేసి, వీరిని విద్యావంతులను చేస్తుంది. దీనికోసం విద్యావంతులైన దళితులను, స్వచ్ఛందంగా సేవచేసే వీరి సహకారాన్ని తీసుకుంటుంది. అటువంటి వీరిని గుర్తించి ప్రతి యేడాదీ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో డా.అంబేద్కర్ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: మీకు ఏ రంగంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు?
దార్ల: నాకు ‘పరిశోధన-ప్రచురణ’ రంగాల్లో దళితులకు, దళిత సాహిత్యానికి చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారాన్ని ఇచ్చారు.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: అయితే, మీరు దళితులకు, దళిత సాహిత్యానికి చేస్తున్న కృషిని కొద్దిగా వివరిస్తారా?
దార్ల: నాకు ఊహ తెలిసిన నాటి నుండే అంబేద్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగించేవాణ్ణి. ఆ సందర్భంగా కొన్ని కవితలు రాసి, చదివి వినిపించేవాణ్ణి, తర్వాత కాలంలో కవితలతో పాటు దళితుల్ని ఆలోచింపజేసే వ్యాసాల్ని రాసేవాణ్ణి. నాకు సాధ్యమైనంత వరకు వివిధ సమావేశాల్లో, సదస్సుల్లో దళితుల గురించి మాట్లాడ్డం, దళిత సాహిత్యానికి సంబంధించిన పరిశోధన పత్రాలను సమర్పించడం వంటి పనులు చేస్తున్నాను. దీనితో పాటు కవిత్వాన్ని రాస్తున్నాను. దళిత చైతన్యాన్ని నింపే విశ్లేషణాత్మక వ్యాసాల్ని, పుస్తకాలుగా ప్రచురిస్తున్నాను. వాటిని పత్రికల్లోను, ఇంటర్నెట్ లోను అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను.

భూమిపుత్ర శ్రీహరిమూర్తి: మీరు దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ లో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. మీ పరిధిలో దళిత చైతన్యాన్నెలా పెంపొందిస్తునారు?
దార్ల: నేను వృత్తి రీత్యా ఒక విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తుండడం వల్ల, నా దగ్గర పరిశోధన చేయడానికి వివిధ భావజాలాలున్న పరిశోధకులు వస్తుంటారు. వారి అభిరుచుల మేరకే పరిశోధనలు చేయిస్తున్నా, సమకాలీన సాహిత్యానికి సంబంధించిన దళిత సాహిత్యంపై అనేకమంది ఆసక్తితో పరిశోధనలు చేస్తున్నారు. దళితులపై ఆసక్తితో, నిజాయితీగా పరిశోధన చేసేవాళ్ళకు మాత్రమే దళిత సాహిత్యంపై పరిశోధన చేయిస్తున్నాను. మరో విశేషమేమిటంటే, విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.స్థాయిలోనే ఒక ఐచ్చికాంశం (Optional Course)గా చదువుకునేలా ‘దళిత సాహిత్యా’న్ని 2005 నుండీ ఒక కోర్సుగా కూడా ప్రవేశపెట్టాను. దాని తర్వాత దళిత, గిరిజన సాహిత్యాలపై అనేకమంది విస్తృతంగా పరిశోధనలు చేయడానికి ముందుకొస్తున్నారు.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: దళితులు, గిరిజనులను చైతన్య పరచడానికి ఎలాంటి ప్రణాళిక ఉండాలని మీరు భావిస్తున్నారు?
దార్ల: దళితునిగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక మాదిగ కులంలో జన్మించిన నాకు- ఆ జీవితమెలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసు. సమాజంలో దళితులనుభవిస్తున్న అవమానాలు తెలుసు. ఈ అవమానాలకు కారణాల్ని అన్వేషించి, వాటి నిజానిజాల్ని ప్రజలకు తెలియజెప్పినప్పుడు మాత్రమే దళితుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలుగుతాయని నేను పరిపూర్ణంగా నమ్ముతాను. అందువల్ల దళితుల జీవితాల్లో ప్రగతిశీలమైన మార్పు రావాలంటే ముందుగా దళితులకు, తర్వాత ఇతరులకు ఆ వాస్తవాలు తెలియాలి. అవి వివిధ కార్యక్రమాలు, ప్రసంగాలు, రచనల ద్వారా సాధ్యమవుతుందనుకుంటున్నాను.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: దీనికెలాంటి కార్యక్రమాలు అవసరమనుకుంటున్నారు?
దార్ల: ముందుగా మనం పుట్టి పెరిగిన గ్రామం నుండే దళితుల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు ప్రారంభం కావాలి. దళితుల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన వీరి జీవితాలు ముందుగా వీరికి తెలియాలి. దళితులు, గిరిజనులు డా.బి.ఆర్.అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ , కొమరం భీమ్ మొదలైన వారి జయంతులు, వర్ధంతులు చేయడం ద్వారా దళితులు, గిరిజనులను ఒకచోటకు చేర్చగలుగుతాం. అందువల్ల గ్రామ/గూడెం స్థాయి నుండే దళితుల కోసం కృషిచేసిన నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని, ఆ మహాత్ముల జయంతి, వర్ధంతులను జరుపుతూ, ఆ సందర్భంగా దళితులు, గిరిజనులు ముందు కలిసేలా చేయగలగాలి. తమకొక సాంస్కృతిక వారసత్వం ఉందనే విషయాన్ని తెలియజేయాలి. వీరి ఆచార వ్యవహారాల్లోని ఔచిత్యాన్ని, వాస్తవికతను, ఆచరణను, వాటి వెనుకున్న కార్యకారణాల్ని వివరించగలగాలి. అప్పుడు మాత్రమే తమ నాయకుల పట్ల గౌరవం ఏర్పడుతుంది. తమకున్న సంస్కృతిపట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది. అవి తెలియజేయగలిగినప్పుడు మాత్రమే వీరిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి. తమ మూలాలు గట్టివని నమ్మినప్పుడే వాటి గురించి వీరు ఆలోచిస్తారు. వాటి గురించి ప్రచారం చేస్తారు. అవీవీరిని ఏకం చేస్తాయి. అవే వవీరిని సమైక్యపరుస్తాయి. అవే వీరిని బలవంతులుగా మారుస్తాయి. అవే వీరిని ప్రధాన జీవనస్రవంతిలోకి తీసుకొస్తాయి. అవే తమ లక్ష్యాలను సాధించేలా చేస్తాయి.

భూమిపుత్ర శ్రీహరిమూర్తి: సాధారణంగా దళితులు, గిరిజనులు భౌతికవాద దృక్పథాన్ని కలిగి ఉంటారు కదా, మరి వీరు విగ్రహాల్ని నిర్మించడాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి?
దార్ల: నిజమే నండీ.. మంచి ప్రశ్న. అయితే, దళిత, గిరిజనుల్లో విద్యావంతులైన వారు అత్యధిక శాతం భౌతిక వాదులై ఉంటారు. కాబట్టి, వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. కానీ, చారిత్రక వ్యక్తుల విగ్రహనిర్మాణాలను వ్యతిరేకించరు. తమ చారిత్రక విశేషాల్ని భద్రపరుచుకునే ఒక అంశంగానే భావిస్తారు. అంతేకాదు, విగ్రహాల్ని ఏర్పాటు చేసుకున్నా, వాటిని పూజించమని చెప్పరు. తమ సాంస్కృతిక వారసత్వానికి ఒక రూపాన్నిచ్చి, ఆ వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. విగ్రహారాధనకు, తమ నాయకుల విగ్రహాలను నిర్మించుకోవడానికి మధ్య ఈ భేదాన్ని గుర్తించాలి.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: దళితులు, గిరిజనుల చరిత్రలు, వారి వారసత్వం, సంస్కృతి మొదలైన వాటి విషయంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు?
దార్ల: పురాణేతిహాసాల్లో దళితులు, గిరిజనుల పట్ల గల కథలను శాస్త్రీయమైన, చారిత్రక దృష్టితో అధ్యయనం చేస్తూ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరముంది. ఒకానొక చారిత్రక పరిస్థితుల్లో విజేతలై వారు తమగురించి గొప్పగా రాసుకున్నారు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అటువంటప్పుడు ఆధిపత్య కులాలు లేదా వర్గాలు మిగతావాళ్ళను తక్కువగా, అవమానకరంగా, క్రూరంగా వర్ణించి, వాటినే ప్రచారం చేస్తారు. వాటిని మేధావులు జాగ్రత్తగా పరిశీలించి, పునర్ వ్యాఖ్యానం చేసి చెప్పాలి. లేకపోతే దళితేతరులు లేదా ఆధిపత్య, అగ్రవర్ణ స్వభావంతో రాసిన చరిత్రలు, సాంస్కృతిక వారసత్వాలనే దళిత, గిరిజనులు తమ వారసత్వాలుగా భ్రమపడి, తమకు సరైన చరిత్ర, సంస్కృతీ లేవనుకుంటారు. అందుకనే, రామాయణ, భారత, భాగవత, ప్రబంధాల్లో గల సంస్కృతిని పునర్వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఉంది. రామాయణంలో వాలి-సుగ్రీవుల కథ, జాంబవుడు మొదలైన కథలను లోతుగా పరిశీలించాలి. ఈ కథలు నాడు గిరిజనులు, దళితులని పిలవబడకపోయినా, ఆ జాతుల బలాన్నీ, తెలివినీ తెలియజేసే పాత్రలు. ఆ చారిత్రక పరిస్థితుల్ని అధ్యయనం చేసి, వాస్తవిక దృష్టితో పునర్వ్యాఖ్యానించగలగాలి.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: నేటి వరకూ అలాంటి ఆలోచనలతో తమ చరిత్ర, సంస్కృతులను పునర్వ్యాఖ్యానించిన వారు దళిత, గిరిజనుల్లో ఉన్న ప్రముఖుల్ని చెప్పండి?
దార్ల: డా.బి.ఆర్.అంబేద్కర్ తన వాదనలకు వేదాలు, పురాణేతిహాసాల్ని, భారతీయ సాహిత్యాన్నే ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచనలన్నీ ప్రతి దళిత, గిరిజనుల ఇళ్ళల్లో మాత్రమే కాదు, ప్రతి మహిళా కూడా కొని తమ గ్రంథాలయాల్లో పెట్టుకొని చదవాలి. హిందువులకు వేదాలెంత పవిత్రమైనవో, దళిత, గిరిజనులకు ఈ రచనలు అంత విలువైనవిగా భావించాలి. జ్యోతి రావుబా పూలే రచనలు కూడా గొప్ప చైతన్యాన్ని కలిగిస్తాయి. ఇంకా చాలామంది ఈ దిశగా కృషిచేసినవారున్నా, నేటి అవసరాల రీత్యా చదువుకున్న ప్రతి దళితుడూ ఈ దిశగా తమ వంతు కృషి చేయాలి.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: ఈ దృష్టితో మీరు రాసిన ముఖ్యమైన గ్రంథాల్ని చెప్తారా?
దార్ల: నేను కేవలం రచనలన్నింటినీ ఇదే దృష్టితో రాసానని చెప్పలేను; కానీ, నేను రాసిన రచనలు అత్యధిక శాతం పునర్మూల్యాంకన దృక్పథంతోనే రాశాను. వీచిక, పునర్మూల్యాంకనం, దళితసాహిత్యం-మాదిగదృక్పథం, బహుజన సాహిత్య దృక్పథం, ఒక మాదిగ స్మృతి –నాగప్పగారిసుందర్ రాజు పరిచయం, దళితతాత్త్వికుడు, నెమలికన్నులు(కవిత్వం) మొదలైనవన్నింటిలోను ఈ దృక్పథం కనిపిస్తుంది.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: ఇలాంటి దృక్పథంతో పుస్తకాలు, వ్యాసాలు రాసిన మీకు డా.అంబేద్కర్ జాతీయ పురస్కారమే కాకుండా మీకు వచ్చిన మిగతా పురస్కారాల గురించి వివరిస్తారా?
దార్ల: మనం రాసే వాటిలో శాస్త్రీయదృక్పథం ఉన్నప్పుడు, సమస్యను వివరించడంలో మన ‘టోన్’ ని బట్టి కూడా ఇతరులు కూడా స్వీకరించి, దాన్ని అంగీకరిస్తారు. కేవలం ఒకటి, రెండు రచనల్ని చదివినంత మాత్రం చేత ఒక స్థిరమైన లేదా సదభిప్రాయానికి రావడం అంత సులభం కాదు. నా రచనల్ని, నా పరిశోధన పత్రాల్ని చదివి, విని కూడా నన్ను దళిత,గిరిజన, బహుజనులే కాకుండా, ఇతర వర్గాలు, కులాల వాళ్ళు కూడా సహృదయంతో నా వాదనల్ని విన్నారు; నా వాదనల్ని చర్చించారు.అందుకనే వివిధ దళిత, గరిజనేతర సంస్థలు కూడా నాకు వివిధ పురస్కారాలను ఇచ్చి, సన్మానించారు. అలా అంగీకరించడం వల్లనో, నా కృషిని గుర్తించడం వల్లనో నాకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ‘కీర్తి’ పురస్కారాన్ని ( 2012 ), సాహిత్య రంగంలో కృషిచేసే వారికిచ్చే ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం (2012) తో మానస ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు త్యాగరాయ గానసభ, (2012)లో సత్కరించారు. 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారంతో సన్మానించారు. విహంగ అంతర్జాల పత్రిక పురస్కారాన్ని(2017) ఇచ్చి సత్కరించారు. వీటన్నింటికంటే ముందు దళితసాహిత్యంపై చేసిన సేవకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం(2007)తో సత్కరించారు. 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారంతో సన్మానించారు. ఇటీవలే (2019, అక్టోబరులో) ప్రముఖ బహుజన తాత్త్వికుడు బి.యస్.రాములు ప్రతిభా పురస్కారాన్నిచ్చి సత్కరించారు.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: మీరు పనిచేసే సెంట్రల్ యూనివర్సిటి నుండి మీరు అందుకున్న అవార్డులు, రివార్డులు గురించి కూడా చెప్పండి?
దార్ల: నేను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏ. తెలుగు చదువుకోవడానికి అడుగుపెట్టాను. ఎం.ఏ., అత్యధిక మార్కులు రావడం వల్ల మెరిట్ స్కాలర్ షిఫ్ కి ఎంపికయ్యాను. తర్వాత యూజిసి వారి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలో షిఫ్ పొందుతూ ఇదే యూనివర్సిటిలో ఎం.ఫిల్., పిహెచ్.డి. పూర్తిచేశాను. ఇంకా డాక్టరేట్ పూర్తి కాకుండానే రెండు ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన పోటీపరీక్షల్లో ఉత్తీర్ణుడనై, ఇంటర్వ్యూలో విజయం సాధించి, ఎంపికైయ్యాను. అదే సంవత్సరం రోజుల తేడాలో ఎయిడెడ్ కళాశాలలో యూజిసి స్కేలుతో డిగ్రీలెక్చరర్ గా సెలక్ట్ అయ్యాను. మూడేళ్లు పనిచేసిన తర్వాత యూనివర్సిటిలో లెక్చరర్స్ నోటిఫికేషన్ పడింది. దరఖాస్తు చేసి, ఆ ఉద్యోగం పొందాను. ఎంతో నిజాయితీగా నాకు ఆ ఉద్యోగం వచ్చింది. నాకు పాఠం చెప్పిన గురువుల దగ్గరే నేను కూడా ఒక కొలీగ్ గా పనిచేయడం నేను మా యూనివర్సిటీలో పొందిన అతి గొప్ప అవార్డుగా, రివార్డుగా భావిస్తాను. ప్రస్తుతం ప్రొఫెసర్ గా ఉన్నాను. దీనితో పాటు అదనంగా డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ గా పనిచేస్తున్నాను. బోధన, పరిశోధన రంగాల్లో చేసిన సేవను గుర్తిస్తూ యూనివర్సిటీ ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘ఛాన్సలర్స్ అవార్డు’ పొందగలిగాను. దీన్ని 45 సంవత్సరాల లోపులో ఉన్న అధ్యాపకుల పనితీరుని గమనించి, యూనివర్సిటి స్నాతకోత్సవంలో ఒక లక్షరూపాయల పరిశోధన స్పెషల్ గ్రాంటుతో సత్కరిస్తారు.

భూమిపుత్ర శ్రీహరిమూర్తి: దేశంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి ఒకటి కదా! దీనిలో చదువుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
దార్ల: నిజమే, ఇటీవలే ప్రపంచంలో అత్యున్నత ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సెంట్రల్ యూనివర్సిటీ మాది. నేను డిగ్రీలో చదువుకొనేటప్పుడు దీని గొప్పతనం గురించి నాకు తెలియదు. నాకు చిన్నప్పటి నుండే ప్రతి రోజూ ఇంటి దగ్గరైనా, స్కూలులోనైనా, కళాశాలలోనైనా గ్రంథాలయానికి వెళ్లడం అలవాటు. రోజూ ఏదొకటి చదవకపోతే నాకేమీ తోచదు. మాది మేజర్ గ్రామపంచాయితీ. మా పేటకీ, గ్రామ పంచాయితీకీ కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా, రోజూ సాయంత్రమో, ఖాళీ దొరికినప్పుడో అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ పత్రికలు చదివేవాణ్ణి. అప్పటి నుండి పత్రికలు చదివే అలవాటువల్ల కళాశాలలో డిగ్రీఫైనల్ ఇయిర్ చదివేటప్పుడు కూడా పత్రికలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ప్రవేశప్రకటన చూశాను. దానిలో తెలుగు ఎం.ఏ., ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలుంటాయని చదివి, దరఖాస్తు చేశాను. ఎం.ఏ., లో చేరడినికి నెనెన్ని రోజులు కూలిపని చేసి కష్టపడ్డానో గుర్తుకొస్తే కన్నీళ్ళొస్తున్నాయి. ఒక నూట ఇరవై ఐదురూపాయల సూటుకేసు కొనుక్కొని, రెండు జతల బట్టలతో, రబ్బరు చెప్పులతో, జనరల్ బోగీలో టికెట్ కొనుక్కొని హైదరాబాదు వచ్చాను. కేవలం అడ్మిషన్ కి మాత్రమే నా దగ్గరున్న డబ్బులు సరిపోయాయి. హాస్టలు ఉచితంగా ఇస్తారనుకున్నాను. దానికి డిపాజిట్ చేయాలనీ, స్కాలర్ షిఫ్పుగా ఇచ్చే కొద్ది డబ్బులకీ, మరికొంత జమ చేస్తే గాని నెలనెలా మెస్ బిల్లు చెల్లించాలని కూడా తెలియదు. ఆ స్థితిలో నాకు యూనివర్సిటిలో చదువుకుంటున్న రాయలసీమకు చెందిన వీరాస్వామి అనే విద్యార్థి హాస్టలు ఫీజు కట్టాడు. దాన్ని మరలా కట్టడానికి నేను ఎన్నాళ్ళో కష్టపడాల్సివచ్చింది. అది అప్పటి మా ఆర్థిక పరిస్థితి. నిజానికి, మాది చాలా నిరుపేద కుటుంబం. మేము నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి. మా తల్లి దండ్రులు ప్రతిరోజూ కూలిపనికి వెళితే గాని మా కుటుంబం గడిచేది కాదు. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, మిమ్మల్ని తమ కష్టంతో చదివించేవారు. సెలవులు వచ్చినప్పుడల్లా మేము కూడా కూలిపనికి వెళ్ళేవాళ్ళం. నేను కూడా డిగ్రీవరకూ మా గ్రామంలోను, పరిసరగ్రామాల్లోను కూలిపనిచేశాను. మాకున్న ఒకటో రెండో గేదెల్ని మేపుకొచ్చేవాణ్ణి. మాకు తాతల నాటి ఆస్తులేమీ లేవు. నిరంతరం కష్టపడే మా నాన్న మా కోసం అనేక పనులు చేసేవాడు. కేవలం కూలిపనిమాత్రమే కాదు, చెట్లు ఎక్కి కొబ్బరి కాయలు తీసేవాడు. తాటికల్లు గీసేవాడు. చేపలు పట్టేవాడు. ఇతరుల పొలాల్ని శిస్తుకి తీసుకొని పంటపండించేవాడు. మేము కూడా ఆ పనులన్నింటిలోనూ భాగస్వాములయ్యేవాళ్ళం. మాకు గ్రామం కూడా ఎంతో సహకరించేది.

భూమిపుత్ర శ్రీహరిమూర్తి: ఇంత పేదరికంలో ఉండి కూడా డాక్టరేట్ పూర్తి చేయడానికి మీకెలా సాధ్యమైంది?
దార్ల: మేము ఆర్థికంగా పేదవాళ్ళం కావచ్చు; మేము అస్ఫృశ్యకులంలో పుట్టొచ్చు. కానీ ఉన్నతస్థితికి చేరాలనే ఆలోచనలో పేదవాళ్లం కాదు. పేదరికానికి అనేక కారణాలున్నా, తల్లిదండ్రులు ఆలోచనలు, వారి క్రమశిక్షణ, పొదుపు పిల్లల్లో కూడా కలిగేలా ప్రేరణనివ్వాలి. అలా మా తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు. వాళ్ళ కష్టాల్ని దగ్గరుండి చూసేలా చేసి, ఈ కష్టాల్ని అధిగమించాలంటే నిరంతరం కష్టపడాలని, చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రబోధించేవారు. మనం పుట్టిందే కులంలో నైనా అన్ని కులాల వారి ప్రేమా పొందేలా జీవించడమెలాగో నేర్పించారు. ప్రతి పైసా జాగ్రత్తగా అవసరాలకు ఉపయోగించుకోవడమెలాగో నేర్పించారు. అందువల్ల గ్రామంలో పెద్దలు, పాఠశాల్లో చదువుకొనేటప్పుడు మాస్టార్లు మాకు కొన్ని అవకాశాల్ని వివరించేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలనేవారు. ప్రభుత్వం ఉచితంగా విద్యను అందించడమే కాకుండా, స్కాలర్ షిఫ్ లను కూడా అందించడమనేది డా.బి.ఆర్.అంబేద్కర్, మరికొంతమంది పోరాటాల ఫలితం. వాటిని సద్వినియోగం చేసుకుంటూ నేనీ స్థితికొచ్చాను.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: పేదరికాన్ని అలా జయించిన మీరు, కులం వల్ల వచ్చే అవమానాల్ని ఏమైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కుంటే, ఏ వయసు నుండి వాటిని గుర్తించగలిగారు?
దార్ల: నిజానికి నాకు కులం వల్ల ఎదురయ్యే అవమానాలు చిన్నవయసులో తెలియలేదు. అలాగని కులం వల్ల అవమానాలు లేవని కాదు. మిమ్మల్ని దూరంగా పెడుతున్నా, నాకు అది తెలియనితనం వల్ల అది అవమానంగా నాకు అనిపించేది కాదు. మా కులం కాని వాళ్ళ పెళ్ళిళ్లు జరిగినప్పుడు మిమ్మల్ని కూడా భోజనాలకు పిలిచి, మాకు దూరంగా కూర్చోబెట్టి పెట్టేవారు. అది నాకు మా కులస్థులందరికీ మామూలే అన్నట్లుండేది. ఆ రోజుల్లో అన్నం దొరకడమే చాలనుకునే పరిస్థితి ఒక కారణం కావచ్చు. అందువల్ల మాకు ఎక్కడ పెడుతున్నారనేది ఆ వయసులో గమనించలేకపోయేవాణ్ణి. పాఠశాలకు వెళ్ళి చదువుకునే క్రమంలో నా కులస్థుల సహవాసం వల్ల, వాళ్ళు చెప్పే మాటల వల్ల నాకు అంటరానితనం అంటే ఏమిటో తెలియడం మొదలైంది. పాఠశాలల్లో నిర్వహించే డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతులు, వర్థంతుల సందర్భంగా చదువుకున్న మా పెద్దవాళ్లు వచ్చి మాట్లాడే మాటల వల్ల ఆత్మగౌరవం అంటే ఏమిటో అవగతం కావడం ప్రారంభమైంది. అలా దూరంగా, అందరిలో కలవనివ్వకుండా భోజనమెందుకు పెడుతున్నారో తెలియడం ప్రారంభమైంది. క్రమేపీ అలా పెట్టే వాటిని తినకూడదని తెలిసింది. ఆ మాత్రం భోజనాన్ని కూలి పనిచేసుకొనైనా సంపాదించుకోవచ్చనే ఆలోచన వచ్చింది. అంబేద్కరిజమే నాలో కొత్త ఆలోచనల్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది.
భూమిపుత్ర శ్రీహరిమూర్తి: అనేక విషయాలు చెప్పారు. ధన్యవాదాలు చివరిగా మా జాగృతి, భూమిపుత్ర పత్రకల పట్ల మీ అభిప్రాయం?
దార్ల:నిజానికి ఇంత పోటీ ప్రపంచంలో చిన్నపత్రికల్ని నడపడం సాహసంతో కూడిన పని. మీరు ప్రచురిస్తున్న రాయలసీమ జాగృతి మాసపత్రిక చూస్తున్నాను. దానిలో మీరు ప్రకృతి సమతుల్యత కోసం అత్యధికంగా దృష్టిపెడుతున్నారు. అలాగే, రాయలసీమ చరిత్ర, సంస్కృతి, రాజకీయ, సాహిత్య విషయాలపట్ల లోతైన వ్యాసాల్ని ప్రచురిస్తున్నారు. ఇవి మిగతా పత్రికలకంటే భిన్నంగా ఉండి పత్రిక ప్రత్యేకతను నిలుపుతున్నాయి. కేవలం రాయలసీమకే పరిమితం కాకుండా, మిగతా ప్రాంతాలు, మిగతా విషయాల పట్ల ప్రాధాన్యాన్ని బట్టి ప్రచురించడం మీ జాతి సమైక్యతకు నిదర్శనం. అలాగే, భూమిపుత్ర పత్రిక ప్రతిదినం చదువుతున్నాను. తాజా రాజకీయ వార్తలు, విశ్లేషణలతో పాటు, పాత్రికేయ విలువల్ని పాటించడం నాకు ఎంతగానో నచ్చింది. అందుకే మీ పత్రికలో నేను కూడా ఏదైనా ఒక మంచి శీర్షికను నిర్వహిస్తూ రెగ్యులర్ గా రాయాలనే ఆలోచనకూడా ఉంది. నన్ను మీరు ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *