భారతీయ సామాజిక దార్శనికుడు డా.బాబూ జగ్జీవ న్ రామ్

 భారతీయ సామాజిక దార్శనికుడు  డా.బాబూ జగ్జీవ న్ రామ్

భూమిపుత్ర,జాతీయం:

“కొలిమి జ్వాలల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్ రామ్ పట్ల నా ‘ఆత్మ’ గౌరవాభిమానాలతో ఉప్పొంగుతున్నది. జగ్జీవన్ రామ్ ‘అమూల్య రత్నం’ – గాంధీ

ఓ బాపూజీ మన ‘బాబూజీ’ని గురించి రాసుకున్న మాటలివి. నవభారత నిర్మాణానికి నాంది పలికిన అగ్రశ్రేణి జాతీయ నాయకులలో డా. బాబూ జగ్జీవన్ రామ్ ఎంత ముఖ్యుడన్నది ఆయన మాటల్లోని సారాంశం తెలియజేస్తుంది. పిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. బానిసత్వ సంకెళ్ళ నుంచి భారత దేశ విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు. దళితులు, అనగారిన వర్గాలు, పేదల హక్కుల కోసం పాటుపడ్డ ఆత్మ బంధువు. భారతదేశ రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న పరిపాలనాదక్షుడు. జాతి సమస్తం ప్రేమగా ‘బాబూజీ’ అనిపించుకున్న ఒకే ఒక్క ప్రజా నాయకుడు డా.బాబూ జగ్జీవన్ రామ్. కుల రహిత సమాజం కొరకు అహర్నిశలు కృషి సల్పిన పోరాటయోధుడు. సంక్షేమ రాజ్య స్థాపనకు అనేక సంస్కరణలకు నాంది పలికిన గొప్ప రాజనీతిజ్ఞుడు. బడుగు, అడుగు వర్గాల ప్రజల ఆశాదీపమై బతుకంతా పోరాడిన వైతాళికుడు డా.బాబు జగ్జీవన్ రామ్. స్వాతంత్రోద్యమం, కుల నిర్మూలనోద్యమం, రాజకీయ ఉద్యమాలను ప్రభావవంతంగా నడిపిన కార్యాచరణ వాది డా.బాబూ జగ్జీవన్ రామ్. సామాజిక సమానత్వం, అనగారిన వర్గాల హక్కుల కోసం, దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సవ్యసాచి. జాతీయవాది డా.బాబూ జగ్జీవన్ రామ్.

జననం:
కులాలను కన్నతల్లి, పెంచి పెద్ద చేసిన ధర్మపత్ని, వేద భూమిగా పిలువబడుతున్న భారతదేశం. కుల పట్టింపులు తీవ్రంగా ఉన్న భారత భూభాగంలోని బీహార్ రాష్ట్రంలో షాబాద్ (ప్రస్తుత భోజ్ పూర్)జిల్లా చాంద్వా గ్రామంలోని దళిత కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న డా. బాబూ జగ్జీవన్ రామ్ జన్మించాడు. తల్లి బసంతీదేవి తండ్రి షోభిరామ్. సామాన్య కుటుంబం. చర్మకార కులం.

బాల్యం – విద్యాభ్యాసం :
ఆరేళ్ళ వయసు (1914)లో జగ్జీవన్‌ రామ్‌ గ్రామ పాఠశాలో చదువుకివెళ్ళాడు. చిన్ననాడే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇబ్బందుల మధ్య తల్లి భసంతీదేవి సంరక్షణలో జగ్జీవన్‌ రామ్‌ తన చదువును కొనసాగించాడు. తన తల్లి యొక్క సాటిలేని ప్రేమ మరియు మార్గదర్శకత్వంలో, బాబు జగ్జీవన్ రామ్ తన పదకొండవ ఏట 1919లో ఏడవ తరగతి పాసయ్యాడు.1920లో ఆరా పట్టణంలోని ఇంగ్లీషు మీడియం మాధ్యమిక పాఠశాలో జగ్జీవన్‌ రామ్‌ ఎనిమిదవ తరగతిలో చేరాడు. రాత్రింబవళ్ళు పట్టుదతో చదివి, ఇంగ్లీషు భాషపై మంచిపట్టు సంపాదించాడు. అణగారిన కులాల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను తీసుకోవడానికి నిరాకరించాడు. అదే సమయంలో విద్యలో ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్ ను పొందాడు. జగ్జీవన్‌రామ్‌ చిన్న నాడే భోజ్‌పురితోపాటు హిందీ, ఇంగ్లీషు, బెంగాలి, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.జగ్జీవన్‌రామ్‌ 1922లో ఆరా టౌన్‌ స్కూల్‌లో చేరాడు. ఇక్కడ మంచినీళ్ళకుండని ముట్టనివ్వని ఘటనతో మొదటిసారిగా అంటరానితనం, కుల అణచివేత జగ్జీవన్‌రామ్‌కి ఎదురయ్యింది. తరతరాలుగా తన కుల జీవితాలకు విధించబడుతున్న సామాజిక నిషేధాలే ఇక్కడ జగ్జీవన్‌రామ్‌పైనా అమలు జరిగాయి. జగ్జీవన్‌రామ్‌ ముట్టుకున్న కుండలోని నీరును తాగడానికి కొందరు ఆధిపత్య కులాల విద్యార్థులు నిరాకరించారు. దీంతో ఎస్సీ కులాల విద్యార్థులకు స్కూల్లో ప్రత్యేక మంచినీటి కుండను ఏర్పాటు చేశారు. ఈ అవమానాన్ని సహించలేని జగ్జీవన్‌రామ్‌, పెట్టిన ప్రతి కుండను పగులగొట్టసాగాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూు హెడ్మాష్టర్‌ చివరికి అందరికీ ఒక్కటే మంచినీటి కుండని ఏర్పాటు చేశారు. తాను ఎదుర్కోవలసి వచ్చిన ఈ వివక్షాపూరిత విధానాలకు తీవ్ర ఆవేదన, ఆగ్రహం జగ్జీవన్‌రామ్‌ మనసులో రగిలింది. స్కూల్లో అందరు విద్యార్థులకంటె మిన్నగా గణితం, సంస్కృతాల్లో వందశాతం మార్కులతో మెట్రిక్యులేషన్‌ మొదటి శ్రేణిలో పాసయ్యాడు. దీనివల్ల అందరిలో జగ్జీవన్‌రామ్‌కు గౌరవ ప్రతిషల్టు పెరిగాయి.

విశ్వవిద్యాలయ ప్రవేశం:
ప్రతిభతో విద్యలో రాణించడంతో పాటు మంచి ఉపన్యాసాలు ఇవ్వడం విద్యార్థి దశ నుండే అలవడింది. 1925లో ఆరా పట్టణంలో జరిగిన ఒక సభకు జగ్జీవన్‌రామ్‌ స్వాగతం పలికాడు. ఆ సభలో పాల్గొన్న పండిత మదన్‌మోహన్‌ మాలవ్య జగ్జీవన్ రామ్ ను చూసి ముగ్ధుడై బనారస్‌ హిందూ విశ్వవిద్యాయం (బి.హెచ్‌.యు.)లో చదువుకోవటానికి రావల్సిందిగా జగ్జీవన్‌రామ్‌ని ఆహ్వానించాడు. అతను ప్రతిష్టాత్మక బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ అతనికి బిర్లా స్కాలర్‌షిప్ లభించింది. బి.హెచ్‌.యు.లో ఇంటర్‌ పాసైన తర్వాత జగ్జీవన్‌రామ్‌ కలకత్తాలోని విద్యాసాగర్‌ కాలేజీ డిగ్రీలో ప్రవేశించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిస్టింక్షన్‌లో బిఎస్సీ డిగ్రీ పట్టభద్రుడయ్యాడు.

విశ్వవిద్యాలయంలో వివక్ష:
విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో మంగలివారు అతని జుట్టును కత్తిరించడానికి నిరాకరించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆదర్శప్రాయమైన విద్యార్థిగా చదువులో రాణిస్తున్నప్పటికీ అతనికి విద్యార్థి సౌకర్యాలు మరియు ఇతర సౌకర్యాలు నిరాకరించబడ్డాయి. ఈ సంఘటనలన్నీ అతన్ని విశ్వవిద్యాలయంలో ప్రాంగణంలో షెడ్యూల్డ్ కుల జనాభాను ఏకీకృతం చేయడానికి మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో కొనసాగించిన వివిధ రూపాల అసమానత మరియు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసనలను నిర్వహించడానికి దారితీసింది.

కార్మిక ఉద్యమం – సోషలిజం భావాలు:
జగ్జీవన్‌రామ్‌ కలకత్తావచ్చిన ఆరు నెలల్లోనే 1928లో విల్లింగ్టన్‌ స్క్వేర్‌లో ముప్పై ఐదువేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించాడు. ఈ విజయంతో జగ్జీవన్‌రామ్‌ సుభాష్‌చంద్రబోస్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి చాలామంది జాతీయ నాయకుల దృష్టికి వచ్చాడు. దళిత హక్కుల కోసం మాట్లాడడం, రాజకీయ ప్రదర్శనలలో పాల్గొనడమే కాకుండా బాబూ జగ్జీవన్ రామ్ మానవతా ప్రయత్నాలలో పాల్గొనడం వారిని మరింత ఆలోచించేలా చేసింది. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతోపాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశాడు. అప్పటికే కులరహిత, వర్గరహిత భావజాలం కలిగిన జగ్జీవన్‌రామ్‌పై ఇది ఎంతగానో ప్రభావం చూపింది. బ్రిటిష్‌వలసవాద సంకెళ్ళుతెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని జగ్జీవన్‌రామ్‌ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నాడు.

అఖిల భారతీయ రవిదాస్‌ మహాసభ స్థాపన:
1934లో డా.బాబూ జగ్జీవన్‌ రామ్‌ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్‌ మహాసభను స్థాపించాడు. గురు రవిదాస్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్‌ సమ్మేళనాలు నిర్వహించాడు. సాంఘిక సంస్కరణ కోసం వ్యవసాయ కార్మికుల మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌లీగ్‌ మొదలైన సంఘాలను స్థాపించాడు. షెడ్యూల్డ్ కులాల నాయకులను ఐక్యంచేసి, ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ, మరోవైపు సాంఘిక సంస్కరణ కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించాడు.

బీహార్ భూకంపం – మానవతా విలువలు:
బీహారులో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టాడు. తన బృందంతో అహోరాత్రులు శ్రమించాడు. ఆహారం, బటల్టు, ఔషధాలు, మంచినీరు, ఆశ్రయం మొదలగు సౌకర్యాలు బాధితులకు అందే విధంగా సహాయ శిబిరాలు జగ్జీవన్‌రామ్‌ నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా గాంధీని జగ్జీవన్‌రామ్‌ కలుసుకోవడం జరిగింది.

ఆల్ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ స్థాపన:
సామాజిక సమానత్వాన్ని నొక్కిచెప్పాలనే తపనతో, 1934 లో కలకత్తాలోని ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ పునాది వేశారు. ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాసెస్ లీగ్ ప్రధానంగా కుల ప్రవర్తన సమాజాలలో అంటరాని వారికి సంక్షేమం మరియు సమానత్వం అందించడానికి ప్రయత్నించింది. 1935లో కాన్పూర్‌లో జరిగిన ఆల్ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌లీగ్‌ కాన్ఫరెన్స్‌కు జగ్జీవన్‌రామ్‌ అధ్యక్షత వహించాడు. ఈ సంస్థకు 1936నుంచి 1942వరకు జగ్జీవన్‌రామ్‌ అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

వివాహం:
1935 జూన్‌ ఒకటిన కాన్పూర్‌కి చెందిన సంఘసేవకుడు డాక్టర్‌ బీర్బల్‌ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్‌రామ్‌ వివాహం జరిగింది. ఇంద్రాణిదేవి స్వాతంత్య్ర సమరయోధురాలు మాత్రమేగాక, విద్యావేత్తకూడా. స్వాతంత్య్రోద్యమ కాలమంతా భర్తతో తోడుగా కలిసి పోరాడింది. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. కుమారుడు సురేష్‌. కుమార్తె మీరాకుమార్. తండ్రి జగ్జీవన్‌రామ్‌ ఆదర్శాలతో మీరాకుమార్‌ కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి సేవలందించారు.

ఓటు హక్కు మరియు దళిత హక్కుల కోసం పోరాటం:
బ్రిటిష్ వలస రాజ్యాల అధికారులపై ఆయన నిరంతర పోరాటం చేశాడు. సాంఘిక సంస్కరణ కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలవారికి ఓటు హక్కు కావాలని 1935 అక్టోబర్‌ 19న రాంచి వచ్చిన హేమండ్‌ కమిటీ ముందు జగ్జీవన్‌రామ్‌ ప్రాతినిధ్యం వహించాడు. 1946లో సిమ్లాలో బ్రిటిష్‌ కేబినెట్‌ మిషన్‌ముందు అణగారిన వర్గాల హక్కులకు ప్రతినిధిగా గొంతువిప్పాడు. 1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యవసిందిగా బ్రిటిష్‌ వైస్రాయి ప్రభువు ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల్లో జగ్జీవన్‌రామ్‌ ఒకరు. అనేక విధానాలు మరియు సంస్కరణలను రూపొందించాడు. 1947 ఆగస్టు 16 న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో శ్రామికుల సంక్షేమం కొరకు భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

సమాంతరంగా స్వాతంత్ర్య – రాజకీయ – సామాజిక పోరాటాల నిర్వహణ; రాజకీయ ప్రస్థానం:
1935లో 27 ఏళ్ల వయసులో బీహారు శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1937లో బీహార్లోని షాబాద్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. ఇది మొదలుకొని అర్ధ శతాబ్ద కాలం పాటు చట్టసభల్లో కొనసాగిన ఏకైక నేతగా చరిత్రకెక్కాడు. 1937లో బీహారు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌లీగ్‌ నుంచి 14 రిజర్వుడు స్థానాలకు జగ్జీవన్‌రామ్‌ అభ్యర్థులను పోటీకి నిలిపాడు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా 14మంది అభ్యర్థులు గెలవడంతో జగ్జీవన్‌రామ్‌ ఒక రాజకీయ నిర్ణయాత్మకశక్తిగా, కింగ్‌మేకర్‌గా ఎదిగాడు. ఇది ఆనాడు రాజకీయ ప్రక్షాళనలు కింది కులాల పునాదిగా జరగడానికి తొలిమెట్టు అయ్యింది.ఈ సమయంలోనే, తమతో చేతులు కలపవలసిందిగా జగ్జీవన్‌రామ్‌కి కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆహ్వానం అందింది.1937 బీహార్‌ శాసనసభలో వ్యవసాయం, సహకార, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలకు పార్లమెంటరీ సెక్రటరీగా జగ్జీవన్‌రామ్‌ నియమింపబడ్డాడు.

శాసనోల్లంఘన, సత్యాగ్రహ ఉద్యమాలు – జైలు జీవితం – విడుదల: గాంధీతో కలిసి ఉద్యమం:
సత్యాగ్రహ ఉద్యమాల్లో లాఠీ దెబ్బలు తిన్నాడు. అండమాన్‌ ఖైదీపట్ల, భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి దించాలని నిర్ణయించిన బ్రిటిషు విధానాలకు నిరసనగా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 1940 డిసెంబర్‌ 10న ఆరాలో జగ్జీవన్‌రామ్‌ అరెస్టు అయ్యాడు. హజారీబాగ్‌ జైలుకు పంపబడ్డాడు. ఆనాడు రాజకీయ ఖైదీలకు జైళ్ళు శిక్షణా కేంద్రాలుగా ఉండేవి. సాటి సోషలిస్టు ఖైదీతో మార్క్సిజం నుంచి అనేక అంశాలపై జరిపిన లోతైన చర్చల ప్రభావం జగ్జీవన్‌రామ్‌లో బలంగా ఉండేది. జగ్జీవన్‌రామ్‌ జైలునుంచి విడుదల అయ్యాక శాసనోల్లంఘన, సత్యాగ్రహ ఉద్యమాల్లో పూర్తిగా మునిగిపోయాడు. వాటితో స్ఫూర్తి పొందాడు. వార్దా వెళ్ళాడు. అక్కడ గాంధీ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాడు.జగ్జీవన్‌రామ్‌, గాంధీ పొద్దున్నే నడుస్తూ అనేక అంశాలపై చర్చించుకునేవారు. మూఢనమ్మకాలు, సామాజిక వివక్షలు, అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజ నిర్మాణం జగ్జీవన్‌రామ్‌ దార్శనికతలో రూపుదిద్దుకున్నది.

కాంగ్రెస్ పార్టీలో చేరిక – క్విట్ ఇండియా ఉద్యమం:
1942లో జగ్జీవన్‌రామ్‌ బొంబాయిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. అప్పుడే, కాంగ్రెస్‌ పార్టీ క్విట్‌ ఇండియా తీర్మానం చేసింది. ‘స్వాతంత్య్రమో లేక మరణమో!’, ‘సాధించు లేక మరణించు!’ నినాదాలు దేశమంతా మిన్నంటాయి. ఆల్ ఇండియా ‘డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌’ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది.క్విట్‌ ఇండియా ఉద్యమంలో జగ్జీవన్‌రామ్‌ పాత్ర మకుటాయమానమయింది. బీహార్‌లో గొప్ప ప్రజా ఉద్యమాన్ని నడిపాడు. 1942 ఆగస్టు 19న పాట్నాలోని స్వగృహంలో జగ్జీవన్‌రామ్‌ అరెస్టు అయ్యాడు. 1943 అక్టోబర్‌ 5న జైలునుంచి విడుదలయ్యాడు. జగ్జీవన్‌రామ్‌ ఈ సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వ అణచివేతల్ని ఖండిస్తూ దేశ స్వాతంత్య్ర సాధనకోసం అనేక సభలు, సమావేశాలు, ర్యాలీలను నిర్వహించాడు.1940 నుండి 1977 సంవత్సరం వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కు అనుబంధ సంస్థ అయ్యాడు. 1948 సంవత్సరం నుండి 1977 సంవత్సరం వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ప్రతినిధిగా కూడా పనిచేశాడు. 1969లో అధికార కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడయినాడు.

ఏకగ్రీవ ఎన్నిక – అవిశ్రాంత కృషి వలుడు – అరుదైన రికార్డులు:
ప్రజల పట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్థ సేవ ఆయనను అనేక శిఖరాలు అధిరోహించడానికి కారణాలయినాయి. 1946లో జరిగిన కేంద్ర ఎన్నికల్లో ఈస్ట్‌ సెంట్రల్‌ షాబాద్‌ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా జగ్జీవన్‌రామ్‌ ఎన్నికయ్యాడు. ఇది మొదలుకొని చట్టసభలకు మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించాడు డా.బాబూ జగ్జీవన్ రామ్.ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒకే నియోజకవర్గం నుంచి పది సార్లు ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడ్డ ఏకైక నేత డా.బాబూ జగ్జీవన్ రామ్. 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఓటమెరుగని నేత. అవిశ్రాంత కృషి వలుడు. 30 సంవత్సరాలకు పైగా పాటు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా అరుదైన రికార్డు ఆయనకు మాత్రమే సొంతం. చివరి వరకు ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన అవిశ్రాంత కృషి వలుడు. అర శతాబ్దానికి పైగా రాజకీయ చరిత్రలో చెరగని ముద్రవేసుకున్నాడు.

తొలి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ‘బేబీ మినిస్టర్’:
1946లో ఏర్పడిన నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో తొలి మంత్రిగా ప్రమాణం చేశాడు. తిరిగి 1947లో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశాడు. తొలి మంత్రివర్గంలో పిన్న వయస్కుడు డా. జగ్జీవన్ రామ్. అందరిలో పిన్న వయస్కుడు కావడం వలన అందరూ ఆయన్ను ‘బేబీ మినిస్టర్’ అని గౌరవంగా పిలుచుకునేవారు.

డా. బాబూ జగ్జీవన్ రామ్ నిర్వహించిన పదవులు:
మూడు దశాబ్దాల కాలం పాటు కేబినెట్ మంత్రిగా కొనసాగిన సాటిలేని మేటి నేత నేటికీ జగ్జీవన్ రామ్ ఒక్కరే కావడం విశేషం. భారతదేశంలో ఎక్కువ కాలం ముప్పై మూడు సంవత్సరాల కాలం పనిచేసిన క్యాబినెట్ మంత్రిగా రికార్డు సృష్టించాడు. ఆయన కేంద్ర కార్మిక శాఖా మంత్రిగా 1946 నుండి 1952 సంవత్సరం వరకు ఉన్నాడు.1952 నుండి 1956 సంవత్సరం వరకు కేంద్ర సమాచార శాఖా మంత్రిగా ఉన్నాడు. 1956 నుండి 1962 వరకు కేంద్ర రవాణా, రైల్వే శాఖల మంత్రిగా పనిచేశాడు. 1962 నుండి 1963 సంవత్సరం వరకు కేంద్ర రవాణా మరియు సమాచార శాఖల మంత్రిగా ఉన్నాడు.1966 నుండి 1967 సంవత్సరం వరకు కేంద్ర కార్మిక, ఉపాధి మరియు ఉపాధి, పునరావాస శాఖల మంత్రిగా పనిచేశాడు. 1967 నుండి 1970 వరకు కేంద్ర ఆహార మరియు వ్యవసాయ శాఖల మంత్రిగా ఉన్నాడు. 1970 నుండి 1974 వరకు కేంద్ర రక్షణ శాఖామంత్రిగా పనిచేశాడు. 1974 నుండి 1977 వరకు కేంద్ర వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖల మంత్రిగా పనిచేశాడు. భారత ఉప ప్రధానమంత్రిగా 1977 మార్చి 24 నుండి 1979 జూలై 29 వరకు పనిచేశాడు. ఈ కాలంలోనే ఉప ప్రధాని హోదాలో కేంద్ర రక్షణశాఖా మంత్రిగా (రెండవసారి) దేశానికి సేవలందించాడు. అతను సెప్టెంబర్ 1976 నుండి 1983 ఏప్రిల్ వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

జాతి నిర్మాత:
దేశాన్ని తీవ్ర దుర్భిక్ష పాలనుంచి తప్పించి మొదటిసారి హరిత విప్లవం వైపు నడిపించాడు. ఆహార రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధి రంగాల వైపు నడిపించిందీ జగ్జీవన్ రామ్ మే. అంతేకాదు జనసామాన్యానికి తక్కువ ధరకు నిత్యవసర వస్తువులు అందేలా పౌర పంపిణీ వ్యవస్థను అప్పట్లోనే తీర్చిదిద్దాడు. సస్యశ్యామల పదంలో దేశాన్ని ముందుకు నడిపించిన ఘనత కేవలం జగ్జీవన్ రామ్ దే. తాత్కాలిక చర్యలే గాక దీర్ఘకాలిక చర్యలు అమలుపరిచాడు.రవాణా మరియు సమాచార వ్యవస్థల పురోగతే దేశ పురోగతి అని గుర్తించిన జగ్జీవన్ రామ్ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాడు. అంతేగాక అప్పటి ప్రైవేటు విమానయాన సంస్థలను ప్రభుత్వీకరించి, ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్ మరియు ఎయిరిండియా ఇంటర్నేషనల్ సంస్థలను నెలకొల్పాడు.పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం, ప్రావిడెంట్ ఫండ్, పౌర పంపిణీ, వంటి చారిత్రాత్మక చట్టాలను అమలులోకి తెచ్చి కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా, సమన్యాయం చేకూర్చాడు. జెనీవాలో నిర్వహించబడ్డ అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి భారత దేశ కేంద్ర కార్మిక శాఖ మంత్రి డా.బాబూ జగ్జీవన్ రామ్.1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం సమయంలో శరీరం సహకరించకపోయినా యుద్ధభూమికి వెళ్లి సైనికులకు స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని, నైతిక స్థైర్యాన్ని నింపిన రక్షణ శాఖా మంత్రి డా.బాబూ జగ్జీవన్ రామ్. ఈ యుద్ధంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కు మార్గం సుగమం చేసింది డా.బాబూ జగ్జీవన్ రామ్. కానీ నీ ఆ క్రెడిట్ అంతా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఖాతాలోకి వెళ్ళింది. ఆమె తన హయాంలోనే “భారతరత్న” పురస్కారాన్ని అందుకున్నారు. కానీ ఇంతటి ఘన విజయానికి కారణమైన ఆనాటి రక్షణ శాఖ మంత్రి డా.బాబూ జగ్జీవన్ రామ్ ఘనత నేటికీ విస్మరణకు గురవుతూ వస్తుంది. బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ నుంచి విముక్తి కలిగించి పాకిస్తాన్ సేనలను బేషరతుగా లొంగిపోయేలా చేసిన అసమాన ప్రజ్ఞాశాలి.ఆలస్యమైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం 2012వ సంవత్సరంలో “ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్” పురస్కారాన్ని ఇచ్చి గౌరవించి కృతజ్ఞత చాటుతున్నది.

రాజనీతిజ్ఞుడు:
ఆశయ సాధనలో కఠోరమైన పరిశ్రమికుడు. ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న స్వాప్నికుడు. గనుకనే అతడు ఎన్నో రాజకీయ శిఖరాల్నీ అధిరోహించగలిగాడు. ఆనాడు దేశ రాజకీయాల్లో ఉద్దండులు అనబడు వారు సైతం ఆయన మాటను పాఠంగా ఒప్పుకునేంత ఉన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. ఐదు దశాబ్దాల కాలంపాటు రాజకీయాల్లో ఓటమెరుగని ప్రజానేతగా కొనసాగడంమంటే మామూలు విషయం కాదు. భారత రిపబ్లిక్‌ తొలి లోక్‌సభ (1952)లో ప్రవేశించిన డా.బాబూ జగ్జీవన్‌ రామ్‌ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచాడు. ముప్ఫైమూడు సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా భారతదేశ సమగ్ర అభివృద్ధికి విశిష్ట సేవలందించిన రాజకీయ దురంధరుడు మరొకరు ఈనాటికీ లేరు. మొదటి శ్రేణి పార్లమెంటేరియన్‌గా నిలిచాడు. ఏ శాఖామంత్రిగా ఉన్న ఆ శాఖకు వన్నె తెచ్చిన నేత. డా.బాబూ జగ్జీవన్ రామ్ నేతృత్వం వహించిన శాఖల్లో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ఈనాటికీ ఆమోదయోగ్యమైనవిగా మనుగడలో ఉండడం ఆయన దూరదృష్టికి తార్కాణాలు. దేశం క్లిష్ట పరిస్థితుల్నీ ఎదుర్కొంటున్న ప్రతీసారి ఆయన పనితనం ప్రపంచం ప్రశంసించే స్థాయిలో ఆయన్ను నిలబెట్టింది.

మచ్చలేని నాయకుడు:
అఖండ భారత రాజకీయాలకి విలువలని ప్రసాదించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. రాజకీయాలని విశాలమైన పరిధిలో అంచనా వేయగలిగిన తొలితరం రాజకీయ నేత. పరిపాలనాదక్షుడు. మచ్చలేని నేత. విమర్శలు ఎదుర్కొని నేత. దూరదృష్టి, దీర్ఘకాలిక ప్రణాళికా రచనలు చేయడంలో తిరుగులేని నాయకుడు. స్వాతంత్ర్యానంతరం తొలినాళ్ళలోనే భారత ఆధునిక రాజకీయ, సామాజిక రంగాల చరిత్రలో చెరగని ఎన్నో అధ్యాయాలను నెలకొల్పిన రాజనీతిజ్ఞుడు. ఆత్మాభిమానం, నిజాయితీ, అంకితభావం, సేవాతత్పరత ఆయనను జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన నాయకుడిగా చిరస్థాయిగా నిలిపాయి. మానవ సమాజ నిర్మాణానికి అంకితమై నడిచిన ‘విజనరీ లీడర్’ డా.బాబూ జగ్జీవన్ రామ్.

ఇందిరాగాంధీతో విభేదాలు – కొత్త పార్టీ ఏర్పాటు:
1969లో అధికార కాంగ్రెస్ పార్టీకి డా.బాబూ జగ్జీవన్ రామ్ అధ్యక్షుడయ్యాడు. 1977 ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పై తిరుగుబాటు గళాన్ని విప్పిన ధీశాలి. ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాలతో విభేదించిన డా.బాబూ జగ్జీవన్ రామ్ 1977లో ప్రజాస్వామ్య కాంగ్రెస్ (కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ)ను స్థాపించాడు. జనతా పార్టీలో విలీనం చేశాడు. 1980 లో కాంగ్రెస్ (జె) పేరుతో పార్టీని స్థాపించాడు.

భిన్నమైన వ్యక్తిత్వం:
డా.బాబూ జగ్జీవన్ రామ్ చాలా భిన్నమైన వ్యక్తిత్వం, రాజకీయ ఒరవడి కలిగిన నేత. గాంధేయ వాదిగా స్వాతంత్ర పోరాటంలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక భూమిక పోషించి అగ్ర భాగాన నిలిచాడు. నవ భారత నిర్మాణానికి నాంది పలికిన నాయకులలో ఒకడు. కుల అసమానతల నిర్మూలనలో, దళిత హక్కుల పరిరక్షణలో డా.అంబేద్కర్ కు కొనసాగింపుగా ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగించిన విలక్షణ నేత. వీరిద్దరి రాజకీయ దారులు వేరైనప్పటికీ పరస్పరం గౌరవించుకునే విధానం నేటి తరాలకు ఆదర్శం.

మూడు దశలు:
డా.బాబూ జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్ర ముఖ్యంగా మూడు దశలుగా విభజించి చూస్తే గాని పూర్తిగా ఆయన్ని అందుకోలేము. అర్థం చేసుకోలేము. అలా సదృష్టితో శోధించకపోతే ప్రయోజనం వయోజనం కాలేదు. అందులో మొదటిది స్వాతంత్ర పోరాటంలో జాతీయస్థాయి అగ్రశ్రేణి నాయకులలో ఒకడిగా ముందుండి పోరాటం చేయడం. రెండవది రాజ్యాంగ ధర్మాసన సభలో సభ్యుడిగా ఆయన నిర్వహించిన పాత్ర. డా. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఉన్నదున్నట్లు ఆమోదం పొందేలా చట్టసభల్లో పోరాటం చేయడం. జీవితాంతం దళిత హక్కుల పరిరక్షకుడుగా పోరాటం. మూడవది నవభారత నిర్మాణానికి, సమగ్రాభివృద్ధికి పునాదులు వేసిన దేశ పరిపాలనాదక్షుడు. ఈ మూడు ప్రధాన దశలను పరికించి చూస్తే గాని ఆయన జీవితం, వ్యక్తిత్వం, రాజకీయ పంథా అవగతమవడం సాధ్యపడదు.

రాజ్యాంగంలో దళిత హక్కుల ఆమోదంకై కృషి:
భారత రాజ్యాంగంలోప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయం సూత్రాల యొక్క ప్రాముఖ్యతపై చాలా బలమైన ప్రాధాన్యత ఇచ్చిన కొద్దిమందిలో డా.బాబూ జాగ్జీవన్ రామ్ ముఖ్యుడు. కొత్త స్వతంత్ర భారతదేశంలో, బహుశా పార్లమెంటరీ జీవితంలో బాబు జగ్జీవన్ రామ్ సాధించిన అతి ముఖ్యమైన పని రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన చేసిన పాత్ర. సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో స్వేచ్ఛ, అవకాశాల సమానత్వం మరియు సోదరభావం యొక్క విలువలను సమర్థించే సరికొత్త రాజ్యాంగాన్ని రాయడం రాజ్యాంగ అసెంబ్లీకి చాలా ముఖ్యమైన పని. పౌరులందరూ ఈ విలువలను సమర్థించటానికి మరియు భారత ప్రజలకు న్యాయమైన సమాజాన్ని కల్పించడానికి, భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు బాబూ జగ్జీవన్ రామ్ దళిత జనాభా యొక్క సామాజిక మరియు రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాదించాడు. భారత రాజ్యాంగంలో దళిత హక్కుల ఆమోదంకై పోరాడిన తిరుగులేని నేతగా నిలిచాడు. భారత రాజ్యాంగం ఆమోదం పొందే దశలో దళితులకు కల్పించిన హక్కుల పట్ల అభ్యంతరాలను స్పష్టమైన సమాధానాలతో ఎదురుకున్నాడు. అడ్డంకులకు ఎదురు నిలబడి గర్జించాడు. డా. అంబేద్కర్ రూపొందించి, అందించిన రాజ్యాంగాన్ని ఉన్నదున్నట్లు ఆమోదింప చేశాడు. రాజ్యాంగంలో పొందుపరిచిన దళితుల హక్కులకు భంగం కల్పిస్తే మంత్రివర్గంలో నుండి వెళ్లడానికి సిద్ధపడ్డ నిబద్ధుడు డా.బాబూ జగ్జీవన్ రామ్. కాంగ్రెస్ పార్టీకి విధేయుడు అయినప్పటికీ ఏనాడు తలవంచలేదు.

రిజర్వేషన్ల పరిరక్షకుడు:
ఎస్సీ రిజర్వేషన్లు పది సంవత్సరాల అమలు అనంతరం రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? అన్న అంశం పార్లమెంటులో చర్చకు వచ్చిన సందర్భంలో అగ్రకుల నాయకుల కుట్రలు తిప్పికొడుతూ “ఈ దేశంలో కుల పీడన, దోపిడీ, అణచివేతలు కొనసాగినంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పట్టుబట్టి చట్ట సవరణ చేయించిన దళిత జాతి వైతాళికుడు. తన ప్రజలకి గడ్డుకాలం సంభవించిన ప్రతీసారి పరిస్థితుల్ని అధిగమించడానికి ఎంత దూరమైనా వెళ్లడంలో డా.బాబూ జగ్జీవన్ రామ్ కృతనిశ్చయంతో సాగిపోయేవాడు. సాధించేవాడు. దళితుల హక్కులతో పాటు మానవ హక్కుల రక్షకుడుగా కూడా డా.బాబూ జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్ తో అనుబంధం:
డా.బాబూ జగ్జీవన్ రామ్ కు హైదరాబాద్ తో కూడా ప్రత్యేక అనుబంధం కలదు. ముదిగొండ లక్ష్మయ్య, టి.వి.నారాయణ, తెలంగాణ ఉక్కు మహిళా టి.ఎన్. సదాలక్ష్మీ వంటి నేతలు జగ్జీవన్ రామ్ తో కలిసి నడిచారు. 1949లో హైదరాబాద్ ను సందర్శించాడు. దామోదరం సంజీవయ్యను పిసిసి అధ్యక్షుడుగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటంలో జగ్జీవన్ రామ్ కీలకపాత్ర నిర్వహించాడు. 1950లో సికింద్రాబాద్ కర్బలా మైదానంలో జరిగిన గొప్ప బహిరంగ సభలో పాల్గొన్నాడు. 1952లో నాటి హైదరాబాద్ స్టేట్ లో బూర్గుల రామకృష్ణారావు కేబినెట్లో మంత్రిగా శంకర్ దేవ్ అనే దళిత నేత మంత్రి అయ్యేందుకు సహకారం అందించాడు. 1976 జరిగిన ఆంధ్రప్రదేశ్ హరిజన మహాసభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. 1977లో మార్చి 6న గుంటూరులో జరిగిన సభలో పాల్గొన్నాడు. ఆ సభకు మూడు లక్షల మంది ప్రజలు వచ్చారని పరిశీలకుల అంచనా. ఇలా దేశమంతా తిరిగుతూ నిరంతరం దళిత, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన మహోన్నతమైన నేత డా.బాబూ జగ్జీవన్ రామ్.

రచయిత – వక్త:
డా.బాబూ జగ్జీవన్‌ రామ్‌ గొప్ప సమ్మోహనశక్తిగల వక్త. బహుభాషా కోవిదుడు. తన ప్రసంగాలు స్వరాజ్య సంగ్రామానికి మరింత ఉధృతిని పెంచాయి. చట్టసభల్లో ఆయన గొంతు ప్రత్యేకమైనది. సామాజిక, సమానత్వ పోరాటాల్లో చైతన్య పూరిత ప్రసంగాలు చేసేవాడు. ప్రజలు ఏకమై విజయ తీరాలకు నడిపించడంలో ఆయన ప్రసంగాలు బలమైన హేతువులయినాయి. విస్తృత అధ్యయనశీలి. ఆయన గొప్ప దార్శనికత, అనుభవం వున్న రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లీషులో రచనలు చేశాడు. ‘భారత దేశంలో కులం సవాళ్ళు’, ‘జీవన సరళి’ వ్యక్తిత్వ వికాసం అను రెండు విశిష్ట గ్రంథాలను డా.బాబూ జగ్జీవన్‌ రామ్‌ రాశాడు. డా.అంబేడ్కర్ రచించిన Who ware the shudras (శూద్రులు ఎవరు?) పుస్తకానికి ముందుమాట(అలభ్యం) రాశాడు. వాటిని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.

ప్రధాని కాకుండా అడ్డు పడ్డ కుల అందలం:
ఆయన విశ్వసించదలుచుకోని ఏ దారిలోనూ దారితప్పి ప్రయాణించలేదు. సేవాభావం, అంకితభావం గల నేతగా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు డా. జగ్జీవన్ రామ్. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ దేశ రాజకీయాల్లోని కుల వికృతాన్ని చూసి కలత చెందాడు. భారత దేశ ప్రధాని అయ్యే పూర్తి అవకాశమున్నా కుల అందలం ఆయన్ను అడ్డుకుంది. కుల ఆధారిత ఆధిపత్య సమాజం ఆయనను ప్రధాని కాకుండా చేసింది.

డాక్టరేట్స్ ప్రధానం:
డా.బాబూ జగ్జీవన్‌ రామ్‌కు ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాలయం 1967లో ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 1968లో కాన్పూర్‌ విశ్వవిద్యాలయం ఆయన సేవలకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1973 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం అతని పేరుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రజలు డా.బాబూ జగ్జీవన్‌ రామ్‌ను ప్రేమగా ‘బాబూజీ’ అని పిలిచేవారు.

నిర్యాణం:
1986 జూలై 6వ తేదీన బాబూజీ నిర్యాణం చెందాడు. డా.బాబూ జగ్జీవన్ రామ్ యొక్క జీవితం, వ్యక్తిత్వం, ఆయన చేసిన కృషిని దేశవ్యాప్తంగా భారత ప్రజలు నిరంతరం తెలుసుకోవడానికి దారితీశాయి. ఆయన వారసత్వాన్ని గౌరవించటానికి దహన స్థలాన్ని ‘సమత స్థల్’ అనే స్మారక చిహ్నంగా నిర్మించబడింది. దేశం స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం, కుల వివక్ష మరియు వివిధ రకాల సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన నిరంతర పోరాటాన్ని మరియు సంక్షేమం మరియు సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేస్తూ దేశం ఆయన పుట్టినరోజును ‘సమాన దినం’ లేదా ‘సమతా దివాస్’ గా జరుపుకుంటుంది.ప్రధానంగా డా.బాబూ జగ్జీవన్ రామ్ గారిని ఆయన కేంద్రంగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత భారతీయ మేధావులు, రచయితలపై ఉన్నది. ఏ చారిత్రక పురుషుని గురించైనా చెబుతున్నప్పుడు మనకున్న బావదారిద్ర్యాల వైపు నుండి చూడడం అవగాహన లేమి అవుతుందే తప్ప మరొకటి కాదు. ఆయనకు లేని మరో ప్రపంచాన్ని అన్యాయంగా ఆపాదించి చూడగలిగే ధోరణి వల్ల మరేమి ప్రయోజనం ఉండదు. వేటగాళ్లు చెప్పిందే చరిత్రగా స్వీకరించడమంటే స్వీయా చలనాన్ని చంపుకోవటమే అవుతుంది. వ్యక్తిని – వ్యవస్థను, వ్యక్తిని – వ్యక్తిని గురించిన దృక్పథాల ధోరణులు వేరు వేరు అనే స్పృహతో డా.బాబూ జగ్జీవన్ రామ్ విషయంలో పునర్మూల్యాంకనానికి పూనుకోవాలి. సైద్ధాంతిక ఆచరణ వాదం, కార్యాచరణ వాదం పేరుతో ఆయన వ్యక్తిత్వానికి మచ్చతెచ్చే చర్యలకు పాల్పడటం ఏపాటి సంస్కారమో తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సమ భావన విలువలు లేకుండా సమసమాజ సమతా రాజ్యం స్థాపన అసాధ్యం అన్న యివురం బోధపడాలి. అంగీకారం లేని కంగారు తనపు కలంకాల అలంకరణలతో ఆయన దీక్షా దక్షతలు మరుగు పరచలేమనే సత్యాన్ని గుర్తించాలి. గనుక సత్యాన్వేషణకు స్వాగతం పలుకుదాం రండి…

డప్పోళ్ళ రమేష్.,
ఫోన్: 95509 23323

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *