చదువుల తల్లి , తొలి మహిళా ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి పూలే

 చదువుల తల్లి , తొలి మహిళా ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి పూలే

భూమిపుత్ర,సామాజికం:

మనిషిని మనిషిగా గుర్తించకుండా మనిషికీ మనిషికీ మధ్య అంతరాలు సృష్టించిన కులతత్వం, మతతత్వం యొక్క వికృత అరాచకత్వంపై యుద్ధం ప్రకటించి, ఆధునిక భారతదేశంలో ఆధిపత్య భావజాలం తిరస్కరించిన అణగారిన ప్రజల ఉద్ధరణకు, అంటరాని వారికి విద్య అనే ఆయుధాన్ని అందించి, వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించేందుకు కంకణబద్ధులైన పుణ్య దంపతులు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే దంపతులు. జ్యోతిరావు పూలే సహభాగిగా, ఉద్యమ జీవితంలో తోడుగా నిలుస్తూనే తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, సాహితీ బోధన పటిమను రూపొందించుకున్నారు. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ గ్రామంలో జన్మించారు. ఆనాటి సాంప్రదాయాల మౌఢ్యం వలన తొమ్మిదవ ఏటనే వివాహం జరిగింది. భర్త జ్యోతిరావు పూలే తన నుండే సంఘ సంస్కరణకు సమాయత్తం అయినప్పుడు అడ్డు చెప్పలేదు. భర్త ద్వారా చదువు – శిక్షణ పొంది 17 సంవత్సరాల వయసు వచ్చేనాటికి అన్ని విధాలా సాధించింది.ఎవరూ గుర్తించని ముఖ్య విషయం ఏమిటంటే భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం స్థాపకుడు ‘కార్వే’ పుట్టకమునుపే సావిత్రిబాయి పూలే టీచర్ అయింది.

భారత దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దాడు జ్యోతిరావు పూలే. ఇది జ్యోతిరావు పూలే సాధించిన చారిత్రక విజయం. తగ్గట్టుగానే అధ్యాయంతో కూడిన ఆచరణతో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఆమె ప్రతిభాపాటవాల ముందు పీష్వాల, ఆధిపత్య భావజాల పండితుల కుట్రలు, కుయుక్తులు అన్ని బలాదూర్ కాకమానలేదు.భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848లో అంటరాని కులాల బాలికల కోసం మొట్టమొదట “అహిల్యాశ్రమ్” పేరుతో పాఠశాలను ప్రారంభించారు. అనగా అస్పృశ్యుల పిల్లల కోసం నెలకొల్పబడ్డ మొదటి పాఠశాల అహిల్యాశ్రమ్. ఈ సంఘటనతో చాందసవాదుల్లో ఆక్రోశం, విద్వేషం పెల్లుబికింది. అడుగడుగునా అడ్డంకులతో ఇబ్బంది కలిగిస్తున్నా, ఎదిగి వచ్చినప్పుడు, ఎదురు నిలిచినప్పుడు దాడులు చేస్తున్నా సహనంతో ఓర్చుకున్నది. ఏమాత్రం వెరవకుండా సమసమాజం కొరకు తనదైన రీతిలో బాటను సుగమం చేసుకున్న స్ఫూర్తి ప్రదాయిని సావిత్రిబాయి పూలే. అనేక అంక్షలు కలిగిన జీవితాలను బాగు చేయాలనుకున్నప్పుడు అనేకానేక సవాళ్లను ఎదుర్కొని వాటికి కారణమైన  ఆధిపత్యంపై తిరుగుబాటు చేసింది. స్వయంగా గొప్ప సామాజిక విప్లవ ఉద్యమ నాయకురాలుగా తనదైన ముద్ర వేసింది. ఎన్నో అవరోధాలు అధిగమించిన సృజనశీలి సావిత్రిబాయి పూలే.

1849లో పూణే, సతారా, అహ్మదాబాద్ లలో పాఠశాల స్థాపనలో భాగస్వామిగా నిలిచింది. ఇదే సంవత్సరం అస్పృశ్యులకు విద్యనందించేందుకు భర్తతో పాటు అత్తవారిల్లు వదిలి బయటకు వచ్చిన కార్యశీలురాలు సావిత్రిబాయి పూలే. కార్మికుల కోసం రైతుల కోసం రాత్రి బడులు స్థాపించి చదువు నేర్పారు. సంఘ బహిష్కృతులైన తల్లి పిల్లల కోసం శరణాలయాలను స్థాపించారు. పురుషులకు తమ ఇంటిలో గల బావి నుండి మంచి నీరు అందించి దాహం తీర్చారు. మంచి నీటి చెరువు తవ్వించడంలో పాలుపంచుకుంది కోర్టులు, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూల్లో సహితం బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని గమనించిన జ్యోతిరావు పూలే “సత్యశోధక సమాజం” స్థాపించారు. క్రియాశీలక పాత్ర నిర్వహించారు సావిత్రిబాయి పూలే. జ్యోతిరావు పూలే మరణానంతరము సత్యశోధక సమాజానికి సావిత్రిబాయి పూలే అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో సంభవించిన కరువు ప్రాంతాల్లో సత్యశోధక సమాజ కార్యకర్తలతో కలిసి  సహాయ కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు.

సావిత్రిబాయి పూలే ఎదిగిన ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు. స్వయంగా ప్రకాశంగా… ఎదిగిన కవయిత్రి కూడా. మానవాభ్యుదయం అంచుల కూడా తాక నిరాకరించిన బ్రాహ్మణీయ సాహిత్యానికి ప్రత్యామ్నాయ సాహిత్య మార్గానికి పాదులు వేశారు జ్యోతిరావు పూలే సావిత్రి బాయి పూలే దంపతులు. ప్రాచీన కాలము నుండి అహంభావ జాతి కబంధ హస్తాల్లో బంధించబడిన భారతీయ సాహిత్యాన్ని తమ రచనలతో ఒక్క కుదుపు కుదిపాయి వీరి రచనలు. కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై కలంతో యుద్ధం ప్రకటించిన తొలి వీరులు పూలే దంపతులు. భారతీయ మానవులందరినీ బ్రాహ్మణీయ కుల చట్రాల నుండి, పితృస్వామ్య ఆధిపత్యం నుండి విముక్తి చేయాలని జ్యోతిరావు పూలే స్వప్నం తన భార్య సావిత్రిబాయి పూలే నెరవేర్చింది. ‘పరివర్తన అను ప్రశాంత విప్లవానికి నిరంతర స్ఫూర్తి ప్రదాయిని’గా నిలిచింది.

సామాజిక అంతరాలు నిర్మూలించే దిశగా ఉద్యమాలు నిర్మించడంలో భర్తకు బాసటగా ప్రముఖమైన పాత్రను కొనసాగించింది. పూలే సహభాగిగా కొనసాగుతూనే సామాజిక విప్లవ ఉద్యమంలో ఆచరణాత్మక కార్యాచరణ సాహిత్యానికి పునాదులు వేసిన వైతాళికురాలు సావిత్రిబాయి పూలే. శాసించి, ఆశించే ఆశలు ఉన్న సమాజంలో భార్య భర్తలు ఇరువురు ఓకే స్పందనలా, ఒకే ఆలోచనలా రెండు పాదాలు కలిసిన ఒకే అడుగు వేసిన ఆమె ప్రత్యామ్నాయ విలువలకు ప్రతిరూపంగా సామాజిక సాంస్కృతిక ఎజెండాగా సాహిత్య సేద్యం చేయనారంభించింది. అసమ వ్యవస్థ చీకట్లను చీల్చుకుంటూ మెరుపు ప్రళయంగా కవిత్వమై జ్వలించింది. ఆధునిక భారత తొలి ఉద్యమ కవితా వైతాళికురాలుగా చరిత్రలో స్థిరంగా నిలిచిపోయింది. వచన కవిత్వం, పాటలు, వ్యాసాలు, ఉత్తరాలు వంటి బహుళ ప్రక్రియల్లో రచనలు కొనసాగించింది. సూటిగా, సరళంగా అలతి అలతి పదాలతో ఆమె కవిత్వం సాధారణ ప్రజలను ఆకట్టుకున్నది. మరాఠీ భాషలో గల జానపద కవిత్వ ప్రక్రియ ‘అభంగ్’ను తన కవిత్వ రచనకు అనువైన రూపకంగా ఎన్నిక చేసుకున్నది.

అశేష పీడిత ప్రజలను అక్షరాల వెలుగునీడలో నడిపించేందుకు చిత్తశుద్ధితో చదివే ఆయువుగా నిరంతరం కృషి సల్పిన నిబద్ధురాలు.

‘శ్రమించి పని చెయ్యండి
శ్రద్ధగా అధ్యయనం చేయండి
మంచి మార్గంలో నడవండి…’

అనే ఉపదేశాన్ని నినాదాలుగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళింది. పదే పదే ‘విద్య – శ్రమ’ మానవాభివృద్ధికి అవసరమైనవిగా గుర్తించి నొక్కి చెప్పింది. ప్రకృతి వర్ణనలతో పాటు విద్య, కుల వ్యవస్థ, ప్రజలపై అణచివేత వంటి అంశాలన్నింటినీ కవిత్వంగా రాసింది. విద్యా చైతన్యం తప్ప మనకు మరో మార్గం లేదంటూ లక్ష్యాన్ని హితబోధ చేసింది.
‘చదువుదాం మన బిడ్డల చదివిద్దాం
విజ్ఞానంతో వివేకంతో బతుకు చక్కదిద్దుకుందాం…’

అన్న కవితా హితోక్తులు నేటికీ చాలామంది నిరక్షరాస్యత కలిగిన పిల్లల తల్లిదండ్రులకు ప్రేరణగా నిలుస్తాయి. వారికి ఉన్న దారిద్ర్యాల్నీ తొలగించే మాత్రలుగా పనిచేస్తాయి.

‘సోమరిగా గడప వద్దు
విద్య కొరకు కదులు ముందు
బాధితుల బహిష్కృతుల
కడగండ్లను రూపుమాపు’

మంటూ విద్య పట్ల ఆసక్తిని కలిగించింది. విద్య యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజెప్పింది. బతుకు పట్ల ఆశ ఆకాంక్షలను అవగాహనతో పెంపొందింప చేసింది. అంతటితో ఆగకుండా’నీకు లాగా బ్రతికిన దీనుల చేరదీసి ,వారిని విముక్తుల్ని చేయు’ మంటూ మార్పు తెచ్చేందుకు సమాయత్త పరిచింది. కష్టాలు తొలగిపోవాలంటే, మన రాజ్యం సిద్దించాలంటే విద్య తప్ప మరో మార్గం లేదంటుంది.’సువర్ణావకాశ మొక్కటి నీ ముందున్నది తెలుసుకోకుల వ్యవస్థ సంకెళ్లను తెంచి విద్య నందుకో, బ్రాహ్మణీయ శాసనాల ధిక్కరించు వెంటనే’ అనడం, కవిత్వంగా చెప్పడం ఆనాడు ఒక సాదాసీదా మహిళకి సాధ్యపడని ముచ్చట. అంధకారాన్ని అధిగమించుటకు అక్షరమే జ్ణాన ఖడ్గంగా పదును పెడుతూ కదిలిన ఉక్కు సంకల్పం సావిత్రిబాయి పూలేది. కనుకనే ఆ రోజుల్లో సహితం సాహసించ గలిగింది. ధైర్యంగా రాయ గలిగింది. పదునుగా బ్రాహ్మణీయ కుల వ్యవస్థని తిరస్కరిస్తూ సుదీర్ఘమైన కవిత్వం రాసింది.

ఆంగ్లభాషను భారతదేశంలో గల అస్పృశ్యుల విముక్తికి ఒక సాధనంగా గుర్తించారు పూలే దంపతులు. ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని గుర్తించిన తొలితరం భారతీయ విద్యావేత్తల్లో సావిత్రిబాయి పూలేది ప్రత్యేకమైన దృక్పథం. ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని పీడితులకు చెప్పేటందుకు సాహిత్యాన్ని ప్రచార సాధనంగా ఎన్నుకున్న విలక్షణ విద్యావేత్త. ఆంగ్ల విద్య నిద్ర నుండి మేలుకొల్పుతుందని ప్రకటించింది. ఆంగ్ల విద్య యొక్క అవసరాన్ని ఆ రోజుల్లో చాలా విరివిగా ప్రచారంలోకి తెచ్చింది. ఇక్కడే ఆమెలో గల దూరదృష్టి, భవిష్యత్ తరాలకు బాటలు వేసిన ముందుచూపు ఆవిష్కృతమవుతుంది.

కుల దోపిడి, మత దోపిడీ దాహానికి ఆంగ్ల విద్య వలన పొందిన పరిజ్ఞానంతో ప్రజలు ఎలా అడ్డుకట్ట వేయాలో వారి ముందుంచింది.
‘మోసగించి, చిన్న బుజ్జి, దోచుకున్న వాళ్లంతాఆంగ్ల మాత రాకతో చెల్లాచెదురయ్యారు’ అంటూ ఆంగ్ల విద్య వల్ల దేశ సమాజంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, చైతన్యం నాటీ, నేటి తరాలకు అందించింది. ఆనాటి తరానికి ఆంగ్ల విద్య వల్ల సంఘంలో వచ్చే ఆత్మాభిమానం, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర కాంక్షలు దొరుకుతాయని చాటి చెప్పింది. నేటికీ సావిత్రిబాయి పూలే చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా నిలిచిపోయాయి.

ఆంగ్ల భాషని ఎత్తుకోవడం అంటే మాతృభాషను తిరస్కరించడం అన్న ఉద్దేశంలో చూడకూడదన్న స్పృహని వ్యతిరేకించే బ్రాహ్మణీయ వ్యవస్థకి అందించిన పటిమ ఆమె సొంతం. ఈనాటికీ మాతృభాష పేరుమీద అభివృద్ధిని అపహాస్యం చేస్తున్న స్థితిని ఎలా ఎదుర్కోవాలో తాత్విక బీజాల్ని నాటింది.
‘దుర్మార్గం – సంకుచితం మనువాదుల మార్గం, ఆంగ్లమాత చెంత మనువు విగత జీవుడయ్యడు’అంటూ ఒకవైపు మనువును వాడి ధర్మాన్ని, రెండోవైపు మను వాదులను నిందితులుగా రుజువు పరిచి చెంప కాయలు, మొట్టికాయలు వేసింది. నేలకేసి తొక్కుడు బిల్లాడుకున్న కవయిత్రి. సాహసి. మనువాద వారసుల మానవ ప్రగతి నిరోధక కులతత్వపు సాహిత్యాన్ని, దాని భావజాలాన్ని తిరస్కరించి కలంతో నరకడం నేర్పిన పరివర్తకురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచిపోయారు.

‘అచ్చమైన జ్ఞాన నిధిని అందించిందీ ఆంగ్లమాత
అణగారిణ జనావళికి ప్రేమను పంచింది’ అంటూ నూట డెబ్బై సంవత్సరాల కంటే మునుపు ఆంగ్ల భాషను తల్లిగా భావించి కవితలల్లిన తల్లి సావిత్రిబాయి ఫూలే. పీష్వా లు, బ్రహ్మణుల పెత్తనం కాలిబూడిదవ్వాలంటే ఆంగ్లభాష అధ్యయనం యొక్క అవసరాన్ని గుర్తించింది. ప్రజలను ఆ వైపు చైతన్య పరచి ప్రేమను పంచిన ప్రేమమయి. అలా తన సామాజిక ఉద్యమానికి ప్రజలని సమాయత్త పరిచింది.

సావిత్రిబాయి పూలే రాసిన మొదటి కవితా సంపుటి ‘కావ్యఫూలే’ను 1854 లో ప్రచురించింది. ఇందుట్ల 41 కవితలు ఆనాటి భారతీయ సామాజిక స్థితిగతులను తన కవిత్వంతో ముందు తరాలకు అందించారు. రెండో కవితా సంపుటి ‘భావన్ కషి సుబోధ్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. జ్యోతిరావు పూలే చేసిన ప్రసంగ పాఠాలను సావిత్రిబాయి ఫూలే తన సంపాదకత్వంలో “జ్యోతిభా భాషణే” పేరుతో నాలుగు సంపుటాలు వెలువరించింది. 1892లో “సావిత్రి బాయి భాషణే వాగనీ” (సావిత్రిబాయి ఉపన్యాసాలు, పాటలు) పుస్తక రూపంలో వచ్చాయి. ఆమె రాసిన ‘కర్జ్’ (అప్పు) అనే వ్యాసం అమాయక పేద ప్రజలు, ఆర్థిక స్థితి గతులకు భిన్నంగా పండుగలప్పుడు అప్పుల పాలయ్యే తీరును విమర్శిస్తూ రాసింది. ఆనాడు సమాజంలో నెలకొని ఉన్న తీవ్రమైన కుల వ్యవస్థయే గాక అనేక సమస్యల పట్ల, రుగ్మతల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ విస్తృతమైన సాహిత్యాన్ని అందించింది. అవన్నీ వెలుగు చూడాల్సిన అవసరమున్నది.

జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి పూలే దంపతుల్నీ ఒకరి నుండి ఒకరిని వేరుచేసి చూడలేము. స్థానిక విద్యా వ్యవస్థలో మార్పుల నిమిత్తం “హంటర్ కమీషన్”కు రిపోర్టు తయారు చేయటంలో కీలక నిర్ణయాలు తీసుకోవటంలో జ్యోతిరావు పూలేకు సహాయం అందించిన విద్యావేత్త. ఆదర్శ దంపతులుగా సమాజంపట్ల మానవతా దృక్పథం కలిగిన నిబద్ధతగల జీవితాలను గడిపారు. తమకు పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందనీ సమాజానికి సేవచేయలేమని పిల్లల్ని వద్దనుకున్నారు. ఒక బ్రాహ్మణ సంతానం యశ్వంత్ ను దత్తత తీసుకున్నారు. వృద్ధాప్యంలో సహితం ప్లేగు వ్యాధి బాధితులకు సేవచేస్తూ అదే వ్యాధి సోకి 1897 మార్చి 10న కన్నుమూసింది.
ఆనాటి సమాజంలో సావిత్రిబాయి ఫూలే ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఈనాటి సమాజానికీ అంతే ప్రాముఖ్యత కలిగిన దార్శనికురాలు. సామాజిక నియమాలు, మత విశ్వాసాలు, సాంప్రదాయిక విధానాలకు వ్యతిరేకంగా ప్రావిత్రిబాయి ఫూలే చేసిన పోరాటం, వేసిన ప్రతీ అడుగు అత్యంత ప్రాముఖ్యమైనది. బ్రాహ్మణీయ భావజాల పునాదులు బీటలు వారించిన ఘనత సావిత్రి బాయి పూలేది. స్త్రీలకు విద్య నేర్పడం, స్త్రీ శిరోముండనకు వ్యతిరేకంగా ఉద్యమం నడపటం, పాటుగా వితంతు వివాహాలను ప్రోత్సహించిన తొలితరం సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే.
అంతిమంగా  ప్రధాన స్రవంతి మేధో ప్రపంచమంతా బ్రాహ్మణీయ భావజాలాన్నే చొప్పించటంతో  సాహిత్యంలో మళ్ళీ-మళ్ళీ, కొత్త-కొత్తగా పునరుత్పత్తి అవుతున్నది బ్రాహ్మణిజం. బ్రాహ్మణీయ సంప్రదాయపు ఆధునికీకరణ ప్రక్రియనే భారత సంప్రదాయపు ఆధునికీకరణ పేరిట చలామణిలో కొనసాగుతూ వస్తున్నది. అది సాహిత్యపరంగా మరింత దూకుడుగా వృద్ధి చెందుతున్నది.ఇట్లాంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే జీవితం, సాహిత్యం యొక్క ప్రాముఖ్యత ఈనాటికీ అనుసరణీయం, ఆచరణీయం, స్ఫూర్తిదాయకం.

తాత్వికురాలిగా, నాయకురాలిగా, కవయిత్రిగా, ఉపాధ్యాయురాలిగా, చతురత కలిగిన గొప్ప వక్తగా, సంఘ సంస్కర్తగా, సేవకురాలుగా, కార్యకర్తగా ఆమె ఉదార స్వరూపిణి. ఆమె నుండి ప్రేమ, సమానత్వ భావనను మనం నేర్చుకోవాలి. సావిత్రి బాయి జీవిత చరిత్ర, సాహిత్యాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరమున్నది. సావిత్రి బాయి పూలే జన్మదినాన్ని భారత ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాల్సిన అవసరమున్నది . ‘భారత రత్న’ అవార్డుకు అన్నీ అర్హతలున్న మేటి, మేలిమి పరివర్తకురాలు. పాటుగా సావిత్రి బాయి ఫూలే పేరుతో విశిష్టమైన సాహిత్య పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.

(జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా…)

– డప్పోల్ల రమేష్, 9550923323

Related News

Leave a Reply

Your email address will not be published.