కమనీయం..రమణీయం..రామయ్య కళ్యాణం

 కమనీయం..రమణీయం..రామయ్య కళ్యాణం

నేడు సీతారామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు

భూమిపుత్ర ,భద్రాచలం:

జగదభిరాముడు శ్రీరాముడి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా వేదోక్తంగా జరిగింది. పండితుల వేదమంత్రాల ఘోష మధ్య సీతారామచంద్రుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కొందరి ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. అభిజిత్‌ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగల్య ధారణ జరిగింది. ఈ కమనీయ వేడుక రామభక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాను మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌ దంపతులు సమర్పించారు. ఏటా అత్యంత వైభంగా సాగాల్సిన కళ్యాణోత్సవం వరుసగా రెండో యేడు కూడా పరిమిత భక్తుల మధ్యనే అంతరంగికంగా జరిగింది. ప్రజలంతా టీవీల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా దీనిని వీక్షించారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణానికి భారీగా ఏర్పాట్లు చేశారు. నవమి కల్యాణాన్ని ఏటా అంగరంగ వైభవంగా మిథిలా స్టేడియంలోని శిల్ప కళాశోభిత కల్యాణ వేదికలో నిర్వహిస్తుండగా కరోనా విజృంభణతో గత సంవత్సరం తొలిసారి రామయ్య కల్యాణం అంతరంగికంగా నిత్యకల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సారికూడా కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి కారణంగా రామయ్య కల్యాణాన్ని అంతరంగికంగా నిర్వహించారు. ఇందుకోసం నిత్య కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. కరోనా మహమ్మారి వల్ల భక్తజనుల సందడి లేకుండానే కల్యాణ వేడుకను నిర్వహించారు. బుధవారం కల్యాణం ముగియడంతో గురువారం శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనుంది. కొవిడ్‌ కారణంగా పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు. భద్రాచల క్షేత్రంలో ఏడాదికి ఓ సారి సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడు కరోనా నిబంధనల దృష్ట్యా… శ్రీరాముల వారి కల్యాణ వేడుకను భక్తులు లేకుండానే నిర్వహించారు. మెట్లు, ఆలయ ప్రాంగణం, మండపాలను సుందరంగా రంగురంగుల పుష్పాలతో, తోరణాలతో అలంకరించారు. ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలను రాములవారికి సమర్పించారు.

మరో మంత్రి పువ్వాడ అజయ్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా గురువారం సీతారామస్వామికి మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. వేడుకల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య దంపతులు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎస్పీ సునీల్‌ దత్‌, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాసాని, ఎండోమెంట్‌ కవిూషనర్‌ అనీల్‌ కుమార్‌ దంపతులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, సరస్వతి ఉపాసకుడు డైవజ్ఞశర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. కల్యాణ ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, దేవస్థానం అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో సీఎం కేసీఆర్‌ త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ద్వారా ప్రజాపరిపాలన సాగాలని ఆకాంక్షించారు. పోస్టాఫీసు ద్వారా తలంబ్రాలు, ప్రసాదం పంపడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భద్రాచలం విచ్చేసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, దేవస్థానం ఈవో బి.శివాజీ ఇతర అధికారులు స్వాగతం పలికారు. నవాహ్నిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి భద్రాద్రిలో సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను పల్లకి పై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో రామచంద్రుడు, సీతమ్మను ఎదురెదురుగా ఆసీనులను చేశారు. రామచంద్రుడి వైపు అదర్వ వేద పండితులు, ఉపప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారణాచార్యు, సీతమ్మ వైపు స్థానాచార్యులు కేఈ స్థశాయి వివరించారు. ఈ సమయంలో అయోధ్య నుంచి రాముడు, మిథిల నుంచి సీతమ్మ తల్లి వచ్చినట్లుగా వర్ణించారు. అనంతరం మంగళ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ మాలా పరివర్తన కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రులను పక్క పక్కన ఆసీనులను చేసి ప్రత్యేక హారతిని సమర్పించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *