కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై జిఎస్టీ తగ్గింపు

 కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై జిఎస్టీ తగ్గింపు

కౌన్సిల్‌ సమావేశానంతరం వెల్లడించిన నిర్మలా సీతారామన్‌

భూమిపుత్ర,న్యూ‌ ఢిల్లీ:

కరోనా పై పోరాటంలో భాగంగా వినియోగిస్తున్న ఔషధాలు, కొన్ని ఆస్పత్రి పరికరాలు, ఇతర వస్తువులపై కేంద్రం పన్నును తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో శనివారం 44వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. కరోనా టీకాలు, బ్లాక్‌ ఫంగస్‌ మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సీవిూటర్లు, శానిటైజరు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఉష్ణోగ్రతలు కొలిచే పరికరాలపై పన్నులు తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో ఈ విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఇందులో ఏకాభిప్రాయం రాకపోవడం తో దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రుల బృందాన్ని నియమించారు. ఆ బృందం తమ నివేదికను గత సోమవారం ఆర్థిక శాఖకు సమర్పించింది.

దీనిపైనే శనివారం కీలక చర్చలు జరిగాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మంత్రుల బృందం చేసిన సిఫారసుల ఆధారంగా ఈ పన్నులను తగ్గించినట్లు జిఎస్‌టి కౌన్సిల్‌ తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వినియోగించే టోసిలిజుమాబ్‌, యాంఫోటెరిసిన్‌ బి వంటి ఔషధాలకు పన్ను వసూలు చేయకూడదని జిఎస్‌టి కౌన్సిల్‌ వెల్లడించింది. ఈ పన్నుల తగ్గింపులు సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటాయని అనంతర పరిణామాల దృష్ట్యా ఈ తగ్గింపులను పొడిగించవచ్చని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌లపై 5 శాతం జిఎస్‌టి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వసూలు చేస్తున్న ఆర్‌టి-పిసిఆర్‌ పరికరాలపై 18 శాతం జిఎస్‌టి రేటులో మార్పులేదని ప్రకటించింది.

కరోనా టెస్టింగ్‌ కిట్‌ ముడిపదార్థాలపై కూడా గత పన్ను రేట్లు కొనసాగనున్నాయి. అయితే కరోనా టెస్టింగ్‌ కిట్‌లపై 12 శాతంగా ఉన్న జిఎస్‌టిని ఐదుశాతానికి తగ్గించినట్లు కౌన్సిల్‌ తెలిపింది.కరోనా చికిత్సలో వినియోగించే హెపారిన్‌, రెమిడెసివిర్‌లపై జిఎస్‌టిని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. అలాగే కరోనా చికిత్స కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన ఏ ఔషధంపైనైనా ఐదు శాతం జిఎస్‌టి వుండనున్నట్లు కౌన్సిల్‌ ప్రకటించింది. మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, వెంటిలేటర్‌ కాన్సన్టేట్రర్‌లపై 12 శాతంగా ఉన్న జిఎస్‌టిని ఐదు శాతానికి తగ్గించింది.అంబులెన్స్‌ లపై ఉన్న 28 శాతం జిఎస్‌ టిని 12 శాతానికి కుదించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం శనివారం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రాల తరపున ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్‌, ఆక్సీవిూటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గుర్తించి చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విూడియాతో మాట్లాడారు. జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కరోనా మెడిసిన్స్‌, పరికరాలపై పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. కొత్త ధరలు సెప్టెంబర్‌ నెలఖారు వరకు అమల్లో ఉంటాయి అని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *