ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైపోతున్న ప్రజలు

 ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైపోతున్న  ప్రజలు

ఈ కార్టూన్ ఫేస్‌బుక్ నుండి సేకరించబడినది

భూమిపుత్ర,సంపాదకీయం:
గతేడాది కరోనా కారణంగా నిరంకుశంగా వ్యవహరించి లాక్‌డౌన్‌ విధించి దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రధాని మోడీ సెకండ్‌వేవ్‌ వస్తోందని తెలిసినా నిర్లిప్తంగా వ్యవహరించడం ద్వారా కరోనా ఉధృతికి కారణమయ్యారనే చెప్పాలి. గతంలో ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా ఆకస్మిక లాక్‌డౌన్‌ ప్రకటించి దేశాన్ని స్తంభింపచేయడం చెప్పలేని సమస్యలకు దారితీసింది. వ్యాపార పారిశ్రామిక సంస్థలు దివాళా తీశాయి. ఆర్ధిక వ్యవస్థ కూడా తలకిందులైంది. రెండవ దశ విజృంభిస్తోందని తెలిసీ లాక్‌డౌన్‌ ఆఖరి అస్త్రంగా వుండాలని మోడీ సెలవిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ బాధ్యత కూడా లేకుండా పోతుంది. వాస్తవంలో మార్కెట్లు దుకాణాల నుంచి థియేటర్ల వరకూ మూత పడుతున్నస్థితిలో పనులు లేకుండా పోతాయి. పనిచేసినా జీతాలు రావు. ఇప్పటికే అనేక కుటుంబాల్లో మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కరోనా మలిదెబ్బ ఊహించిన దానికంటే తీవ్రంగా వుంటోంది. ఇది ఇంతటితో ఆగిపోతుందన్న నమ్మకం లేదు. ఎందాక వెళుతుఉందో తెలియడం లేదు. కేంద్రమంత్రులు, రాష్ట్రాల సీఎం లూ కరోనా బారిన పడ్డారు. అనేకులు చనిపోతున్నారు. చనిపోతున్న వారి లెక్కలు సరిగా చెప్పడం లేదు. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దోపిడీ పర్వం యధేచ్ఛగా సాగుతోంది. ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి సెకండ్‌వేవ్‌ కేసులు, మరణాలే నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇంత జరుగుతున్నా ఎన్నికల విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే మాత్రం వాటి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండడం తప్ప మరో మార్గం లేని పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయి. గతంలో చప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగించి చేతులు దులుపుకున్న ప్రధాని మోడీ ఇప్పుడు వ్యాక్సినేషన్‌, కరోనా చికిత్సల్లో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. ప్రజలు మళ్లీ స్వస్థలాలకు వెళ్లడం గతేడాది పరిస్థితిని గుర్తు చేస్తున్నాయి. కోవిడ్‌ 19 మలిదాడి తీవ్రమవుతున్న వేళ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు పేలవంగా ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల పరిమిత లాక్‌డౌన్లు కర్ఫ్యూ ఇతర ఆంక్షలు విధిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు అంతుచిక్కడం లేదు. కరోనా వ్యాక్సిన్ అందడం లేదు. అయినా స్పందించడం లేదు. ధరలు పెంచి అమ్ముతున్నా కిమ్మనడం లేదు. దేశం మొత్తానికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రాల నెత్తిన వేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో మోడీ కరోనా సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారంటే దేశమంతా చెవులు రిక్కించి వినేది. టీవీ సెట్ల ముందు జనం గుమికూడే వారు. కాని ఇప్పుడు రెండవసారి కరోనా దాడి తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. కేవం జాగ్రత్తలు పాటించాని ఉపదేశించారు. అయితే ఎన్నికల నిర్వహణలో భాగంగా నిర్లక్ష్యంగా ప్రచారంలో పాల్గొంటు న్నారు. ఇటీవల సాగర్‌ ఉప ఎన్నికలో పాల్గొన్న అందరికీ కరోనా సోకింది. సిఎం కెసిఆర్‌ కూడా కరోనా బారిన పడ్డారు. అయినా నాయకుల్లో మార్పు కానరావడం లేదు. దీనిని మోడీ ఎందుకు పాటించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజుకు రెండున్నర లక్షలకు దాటిపోవడం ఒకటైతే మరణాలు కూడా దాదాపు రెండు వేలకు చేరువయ్యాయి. అంతర్జాతీయంగా బ్రెజిల్‌ తర్వాత స్థానంలో వున్న భారత్‌ ఇప్పుడు దాన్ని దాటేసి అమెరికా తర్వాత రెండో ప్రమాద దేశంగా మారింది. మరోవైపు వైరస్‌ నిరోధానికి టీకాలు గాని, కరోనాబారిన పడ్డ వారి చికిత్సకు అవసరమైన మందులు గాని అందుబాటులో లేవని అంతటా చూస్తున్నాం. జనవరి ఆరంభంలో బ్రిటన్‌ నుంచి సెకండ్‌ వేవ్‌ వస్తోందని వచ్చిన హెచ్చరికను పట్టించుకోక పోవడం వల్లనే ఇలా జరిగిందనడంలో సందేహం లేదు. ముందు జాగ్రత్తలు తీసుకుని వుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి వుండేది కాదు. ఈ ఏడాది మార్చి9న కూడా ఆరోగ్యమంత్రి హర్షవర్థన్‌ కరోనాపై పోరాటంలో విజయం సాధించామని ప్రకటించారు. మన విజయగాధ ఉత్తేజకరమైందని ప్రధాని ప్రశంసించారు. ప్రజలు మాస్కు పెట్టుకోకపోవడం వల్ల ఈ ముప్పు వచ్చిందని ఇప్పుడు నిందిస్తున్నారు. వాక్సిన్‌ తయారీపైన ప్రధాని మోడీ హడావుడి అంతాఇంతాకాదు. ప్రపంచంలో అమెరికా తర్వాత వాక్సిన్‌ ఎక్కువగా చేసింది మనమే గాని జనాభా రీత్యా అది ఎనిమిది శాతం మందికి కూడా చేరలేదు. మే1 నుంచి 18 దాటినవాళ్లందరికీ అందచేస్తామని అంటున్నా, ఉచితంగా ఇచ్చే విధంగా ప్రణాళికలు చేయడం లేదు. ఇకపోతే కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ఎంత అవసరమో, కరోనా చికిత్సలు కూడా అంతే అవసరం. ఇప్పుడా పనిపై దృష్టి పెట్టాలి. ఆస్పత్రులను బలోపేతం చేయడంపై దృష్టి అసవరం. ఆక్సిజన్‌, మందులు, బెడ్లు బాధితులు అందరికి అందుబాటులోకి రావాలి. టీకాపై గుత్తాధిపత్యం ప్రైవేటుకే ఇవ్వడం వల్ల కార్పోరేట్‌ పెత్తనంలో టీకా ఉండిపోతుంది. వాక్సిన్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేయడం తప్పు కాదు గాని వాటి తయారీకి కావలసిన ముడిసరుకు అమెరికా నుంచి తెప్పించుకోవడంలో విఫలమయ్యాం. కరోనాపై పోరుకు 35వే కోట్ల నిధులు వున్నా, పిఎం కేర్స్‌లో మరో పదివేల కోట్లు వున్నా ఈ దుస్థితిని ఎందుకు నివారించలేకపోయారన్న దానికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. అన్నిటికన్నా కీలకం ప్రభుత్వ వైద్యశాలను పెంచాలన్న క్ష్యం కూడా నెరవేరడంలేదు. గతేడాది తాత్కాలిక ఆస్పత్రుల గురించి ప్రధాని మోడీ హడావిడి చేశారు. ఇప్పుడు సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్నా అలాంటి వాటిపై మాట్లాడడం లేదు. ప్రజ అజాగ్రత్త ఎంత నిజమో..ప్రభుత్వాల నిర్లక్ష్యం అంతకు మించి ఉందనడంలో సందేహం లేదు. ప్రధానితో సహా రాజకీయ నేతలు భారీ ఎన్నిక సభలు జరిపి కరోనా వ్యాప్తికి కారణ మయ్యారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ విజృంభణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ప్రజలు కూడా భాగస్వాములే. అయితే చివరగా బాధితులు మాత్రం ప్రజలే.

Related News

Leave a Reply

Your email address will not be published.