గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్ లో భారత్ సేవలకు ప్రశంసల జల్లు

 గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్ లో భారత్ సేవలకు ప్రశంసల జల్లు

వెబినార్‌లో ఆంథోనీ ఫౌచీ ప్రశంసలు

భూమిపుత్ర,అంతర్జాతీయం:

గ్లోబల్‌ సైంటిఫిక్‌ నాలెడ్జ్‌కి భారత దేశం అందిస్తున్న సేవలను జో బైడెన్‌ వద్ద అత్యున్నత స్థాయి మెడికల్‌ అడ్వయిజర్‌ ఆంథోనీ ఫౌచీ ప్రశంసించారు. భారతీయుల విజ్ఞానం కోవిడ్‌-19 నిరోధం, తదనంతర సంరక్షణలో ఇప్పటికే ఉపయోగపడుతోందన్నారు. ఆరోగ్య రంగంలో పరస్పర సహకారంపై యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం వెబినార్‌లో ఆయన మాట్లాడారు. భారత దేశం ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు రాక ముందు, కొద్ది నెలల క్రితం అమెరికా కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొందని చెప్పారు. ఇటువంటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైన్స్‌ పాత్ర అత్యధికమని చెప్పారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐఏఐడీ) భారత దేశంలోని సంబంధిత సంస్థలతో కలిసి పని చేయడం చాలా కాలం నుంచి జరుగుతోందని, ఈ సమష్టి కృషికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పారు.

వ్యాక్సిన్‌ కార్యాచరణ ప్రణాళికపై భారత్‌ అమెరికా దీర్ఘకాలిక ప్రాతిపదికపై పని చేస్తున్నాయన్నారు.సరికొత్త వ్యాక్సిన్లకు సంబంధించిన పరిశోధనలో భారత దేశంతో కలిసి పని చేస్తామన్నారు. కోవిడ్‌ 19 థెరప్యూటిక్స్‌ భద్రత, సమర్థతలను మూల్యాంకనం చేయడం కోసం గ్లోబల్‌ ట్రయల్స్‌లో ఇండియన్‌ ఇన్వెస్టిగేటర్స్‌ను, వారి విజ్ఞానాన్ని వినియోగించుకోవడం కోసం తాము ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. అమెరికా-భారత దేశం భాగస్వామ్యం వల్ల గతంలో కూడా ప్రజారోగ్య రంగంలో అనేక సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌), భారత దేశంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) మధ్య భాగస్వామ్యం వల్ల గతంలో సైంటిఫిక్‌, పబ్లిక్‌ హెల్త్‌ రంగాల్లో చాలా ముఖ్యమైన ప్రగతి సాధించినట్లు తెలిపారు. గ్లోబల్‌ సైంటిఫిక్‌ నాలెడ్జ్‌కి భారత దేశం అందిస్తున్న సేవల గురించి అందరికీ తెలుసునన్నారు. భారత ప్రభుత్వం గట్టిగా మద్దతివ్వడంతోపాటు శక్తిమంతమైన ప్రైవేటు బయోఫార్మా రంగం భారత దేశంలో ఉందన్నారు. వీటి విజ్ఞానం వల్ల ఇప్పటికే కోవిడ్‌-19 మహమ్మారి నిరోధం, తదనంతర సంరక్షణలో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు మాట్లాడుతూ, కోవిడ్‌-19 మహమ్మారితో పోరాటంలో భారత్‌-అమెరికా మధ్య సహకారం చాలా ముఖ్యమైనదని తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *