గుంటూరు డాక్టర్ల మెడకు ఉచ్చు బిగుసుకోనున్నదా?

 గుంటూరు డాక్టర్ల మెడకు ఉచ్చు బిగుసుకోనున్నదా?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్‌:

వైసీపీ అసమ్మతి ఎంపీరఘురామ కృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఆయనకు షరతుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాదప్రతివాదనలు హోరాహోరీగా సాగాయి. ఎంపీ రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. రఘురామ వ్యవహారం గుంటూరు వైద్యుల మెడకు బిగుసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఏపీ హైకోర్టు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపీ రఘురామ ఆరోగ్యంపై నివేదిక అందజేయాలని చెప్పిందని ఆయన తరఫు లాయర్‌ ముకుల్‌ రోహత్గీ అన్నారు. అనంతరం రమేష్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోర్టు చెప్పిందని న్యాయస్థానానికి విన్నవించారు.

అయితే గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల టీమ్‌ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన రిపోర్టులో ఆయనకు గాయాలయ్యాయని ఎముక విరిగినట్లు నివేదికలో ఉందని అన్నారు.గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ భర్త వైసీపీ లీగల్‌ సెల్‌లో కీలక నేతగా ఉన్నారని అందుకే తప్పుడు నివేదిక ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను జీజీహెచ్‌ చెకప్‌ అనంతరం రమేష్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా పట్టించుకోకుండా జైలుకి తరలించారని న్యాయస్థానానికి విన్నవించారు. ఎలాంటి గాయాలు లేవని తప్పుడు నివేదిక ఇవ్వడంతో పాటు అందుకు కారణమైన పోలీసులు, వైద్యులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరడం సంచలనంగా మారింది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారని.. కోర్టుకు తప్పుడు నివేదిక సమర్పించారని సుప్రీం కోర్టులో వాదనలు జరగడంతో ఎంపీ రఘురామ వ్యవహారం గుంటూరు వైద్యుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *