గాంధీజీ స్ఫూర్తిగా స్వఛ్ఛబాట పట్టాలి

 గాంధీజీ స్ఫూర్తిగా స్వఛ్ఛబాట పట్టాలి

భూమిపుత్ర, సంపాదకీయం:

స్వచ్ఛ గ్రామాల కలలు ఇంకా సాకారం కావడం లేదు. గ్రామాల స్వయం సమృద్దికి ఇవి అవరోధంగా మారుతున్నాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. గ్రామాలు బాగుపడితేనే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుందని గాంధీజీ బలంగా నమ్మారు. రాజకీయమంటే అంకిత భావంతో గ్రామాలను అభివృద్దిలో బాగస్వామ్యం చేయడమన్న సంకల్పంతో ముందుకు సాగడం ద్వారా గాంధీజికి నివాళి అర్పించాలి. ప్రజలను గ్రామాల అభివృద్ది కోసం ప్రభావితం చేయగలగాలి. అభివృద్ది అన్నదే నినాదంగా గ్రామస్థాయి రాజకీయాలు కావాలి. అప్పుడే గ్రామాల్లో అసమానతలు తొలగి, అభివృద్ది కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. అలాగే యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా అభివృద్దికి బాటలు వేయాలి. మెచ్చుకోలు ప్రసంగాలతో కాకుండా పక్కా ప్రణాళిక, అందుకు తగ్గట్లుగా కార్యాచరణ లక్ష్యంగా గ్రామపాలన సాగాలి.

స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబురాలు అట్టహాసంగా జరుపుకుంటున్నా ఇంకా ఆకలి,నిరక్షరాస్యత, అనారోగ్యాలు, పర్యావరణ సమస్య లు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అధికారం అప్పగించినప్పుడు సరైన దారిలో పాలకులు నడవకపోవడం వల్లనే ఈ దౌర్భాగ్యం మనలను వెన్నాడుతున్నాయని గుర్తించాలి. గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటి సమస్యలు, మరుగుదొడ్ల సమస్యలు, పర్యావరణ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకునే అధికారాలు లేకుండా పోయాయి. సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌పైనా ఆంక్షలు ఉన్నాయి. నిర్ణయాలన్నీ రాజధాని లో తీసుకుంటున్నారు. ఏ గ్రామంలో ఏ పనిచేయాలన్నా ఆయా సర్పంచ్‌లకు అధికారం లేకుండా పోతున్నది. భారతదేశంలో గ్రామస్వరాజ్యం రావాలని గాంధీజీ కలలు కన్నప్పటికీ నేటికీ అది సాధ్యపడలేదు. గ్రామాల్లో నిర్ణయాలు జరిగి అవి అమలయితేనే ఇది సాధ్యం అవుతుంది.

గ్రామాల్లో పాలకమండలి తీసుకునే నిర్ణయాలు అమలు కావాలి. గ్రామాలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. ఇలాంటి ఆలోచనలు చేసిన బాపూజీ నిర్ణయాలు ఆయన సారథ్యం వహించిన కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని అర్ధ దశాబ్దం పాలించినా సాకారం కాలేదు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం…అధికారాల బదలాయింపు.. ఆర్థికగా పరిపుష్టం అన్న సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. అన్నింటికి మించి రాజకీయ జోక్యాల కారణంగా గ్రామాలు స్వయం సమృద్దిని సాధించలేక పోతున్నాయి. గాంధీజీ కలలు కన్న భారత్‌లో కనీసం ఒక్కశాతం గ్రామాలు కూడా ఇలా ముందుకు సాగడం లేదు. అయితే అనేక గ్రామాల్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. అలాగే అనేక గ్రామాల్లో యువత ముందుకు వచ్చి గ్రామాల సర్పంచ్‌లుగా,వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. మనలను మనం పాలించుకుంటున్న ఈ కాలంలో గ్రామహితం కోరి పాలకులు అడుగు వేయాలి.ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేలా గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్న దాఖలాలు కనబడడం లేదు. ప్రజలు ఉపాధి కోసం గ్రామాలను వదిలి పట్టణాలకు వలసలు పోతున్నారు. దీనికి కారణం ఏంటన్నది ఆలోచన చేయాలి. అభివృద్ధి చెందిన గ్రామాల కలసాకారం చేసుకోవాలంటే కఠినశ్రమ తప్పదు.

మన గ్రామాలను యువత మున్ముందుకు తీసుకువెళ్లాలన్న గాంధీజీ ఆకాంక్ష మేరకు పాలకులు నడవాలి. తమ కలలు, ఆకాంక్షలు, ఆదర్శాలను సాకారం చేసుకోవాలన్న కసిని యువతలో రగిలించాలి. వారిలో నిరాశా నిస్పృహలు వస్తే దేశానికి ప్రమాదం. అలాకాకుండా వారు నిరుద్యోగులగా మిగలకుండా, కనీసం స్వయం ఉపాధి పొందేలా ప్రణాళిక ను అమలు చేయాలి. స్వాతంత్రోద్యమ నేతలు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించ డానికి మనం పాటుపడదామన్న పిలుపు మేరకు పాలకులు ఇప్పటికైనా తమ పంథా మార్చుకోవాలి. ఐదేళ్లూ అధికారంలో ఉన్నామన్న దానికన్నా ఎన్ని మంచి పనులతో గ్రామాలను ముందుకు తీసుకుని వెళ్లామన్నదిప్రతి గ్రామ సర్పంచ్‌ లక్ష్యం కావాలి. టెక్నాలజీ దూసుకుని వస్తోంది. అందుకు అనుగుణంగా డిజిటల్‌ ఆర్థిక రంగం, రోబోటిక్స్‌, యాంత్రికీకరణకు తగ్గట్టుగా సర్పంచ్‌లు తమ విధానాలను, గ్రామాలను మార్చుకోవాలి. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నేటికీ గ్రామాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయి.

జన సంక్షేమమే అంతిమ ఎజెండాగా పనిచేసే వారే నిజమైన పాలకులు అని మహాత్మాగాంధీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా పాలకులు నిరంతరం శ్రమిస్తేనే పథకాలు సాకారం అవుతాయి. వ్యవస్థ బాగుపడాలన్న సంకల్పంతో ఉపయోగపడే పనులకు తొలి ప్రాధాన్యమిస్తూ ,గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత కొత్త సర్పంచ్‌లపై ఉంది. కుంటి సాకులతో కాలం వెళ్లదీయడం ద్వారా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచు కోరాదు. గ్రామాలను పరిపుష్టం చేసే దిశగా అనేక కార్యక్రమాలు సాగుతున్న దశలో సర్పంచ్‌ల తోడ్పాటు ఆదర్శం కావాలి.ఇలాంటి కార్యక్రమాలను సర్పంచ్‌లంతా పోటీ పడి ముందుకు తీసుకుని వెళ్లాలి. అప్పుడే గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యాని సాధించవచ్చు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అంతో ఇంతో గ్రామాల పురోభివృద్దికి కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రజలు కూడా గ్రామాభివృద్దిలో భాగస్వామ్యం కావాల్సిందే. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించుకోగలమని గుర్తించాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *