ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడమెలా?

 ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడమెలా?

భూమిపుత్ర, సంపాదకీయం:

కరోనా మహమ్మారితో దాపురించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు పెద్ద కసరత్తునే చేయాల్సి వస్తోంది. భారీగా నష్టపోయిన కారణంగా కొన్ని రాష్ట్రాలు బాగా చితికిపోయాయి. దీనికితోడు ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఎక్కడినుంచి ఎలా డబ్బులు వస్తాయో తెలియడం లేదు. ప్రభుత్వాలు ఆదాయా మార్గాల్లో ఉంటే ప్రజలు కూడా అంతకు మించిన ఆపదలో ఉన్నారు. వారికి ఉపాధి మార్గాలు పోయాయి. ఉద్యోగాలు పోయాయి. కొత్తగా ఉపాధి, ఉద్యోగాల కోసం పోటీ పెరిగింది. అలాగే మార్కెట్‌లో నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం భారీ కసరత్తు చేయడం ద్వారా ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టాల్సి ఉంది.

నిరుద్యోగం పెరిగి పోకుండా ఉపాధి అవకాశాలు పెంచేలా నిత్యావసర వస్తువులు ధరలు దిగివచ్చేలా ఆదాయం పెంచుకు నేలా కసరత్తు చేయాల్సి ఉంది. కేంద్రం మాత్రం కేవలం ఆదాయం పెంచుకునే పనిలో మాత్రమే దృష్టి సారిస్తోంది. ఉపాధి, ఉద్యోగాల సంగతిని పట్టించుకోవడంలేదు. పెరుగుతున్న ధరలపై పట్టింపు లేకుండా పోయింది. ఆయా రంగాలు బాగా దెబ్బతిన్నా వాటి గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం పెట్రో ధరలు పెంచడం జిఎస్టీ వసూళ్లు పెంచుకోవడం..ఇతర రంగాలను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడమొక్కటే మార్గంగా ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. అలాగే నిరర్థక ఆస్తుల పేరుతో ఆయా సంస్థలను అమ్ముకోవాలని చూస్తున్నది. ఇందుకు విశాఖ ఉక్కులాంటి ఎన్నో సంస్థలు బలికాక తప్పకపోవచ్చు. మరోవైపు భారీ మొత్తాల్లో రుణాలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. రాష్ట్రాలు కూడా వారు తమ పరిధిలో ఉన్న విధంగా డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డాయి.

 తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా డబ్బులు సమకూర్చుకోవాలని చూస్తోంది. అనేక పథకాలు ముందుకు సాగాలంటే ముందుగా ఖజనా నిండుగా ఉండాలి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ 4100కోట్ల ఆదాయం కోల్పో యిందని ఆర్థికమంత్రి హరీష్‌ రావు జిఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో స్పష్టం చేశారు. తమకు రుణపరిమితిని పెంచాలని అన్నారు. నిజానికి జిఎస్టీ బదలాయింపుల్లో కేంద్రం కూడా రాష్ట్రాలను మోసం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే ప్రైవేటీకరణలో భాగంగా విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కామ్‌)ను ప్రైవేటీకరిస్తే రాష్ట్రాలకు అదనపు రుణం తీసుకునే అవకాశం కల్పిస్తామని కేంద్రం గతంలోనే షరతు విధించింది. మాంద్యం, కరోనా విలయం, కేంద్ర సహాయ నిరాకరణలతో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరింతగా ఆర్థికంగా అవస్థలు పడుతోంది. ఈ సమయంలో పొదుపుతో ఉన్నంతలో జాగ్రత్తలు పాటించాల్సిన ఏపి సర్కార్‌ పప్పు బెల్లాల్లా ఖజానాను గుల్ల చేస్తోంది. మరోవైపు రాష్ట్రాలపై కేంద్ర బలవంతపు పెత్తనం రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా మారింది. రాష్ట్రాలు తమ స్థూలోత్పత్తి అంటే జిఎస్‌డిపిలో 0.5 శాతం అదనంగా అప్పు చేయాలనుకుంటే తప్పనిసరిగా తాము ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలు అమలు పర్చాలని కేంద్రం లేఖలు రాసిన విషయం గుప్పుమంది. డిస్కామ్‌ల అమ్మకం, వ్యవసాయ పంపుసెట్లకు విూటర్ల బిగింపు, వినియోగదారుల రాయితీల నగదు బదిలీ, పరిశ్రమలకు కారుచవకగా విద్యుత్‌ సరఫరా వంటి కండిషన్లు కొన్ని మాత్రమే. అయితే ఇది మొత్తంగా ఉచిత విద్యుత్‌ ఎత్తేస్తే కుట్రగా రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయం సంక్షోభంలో ఉంది.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోవిడ్‌ కష్టాలతో రాష్ట్రాలు ఆర్థికంగా దివాళా తీసాయి. ఈ దశలో ఆర్థిక పటిష్టతకు కేంద్రం,రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ దేశంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు కానరావడం లేదు. ఇకపోతే ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న ఆశలను కరోనా 2.0 వమ్ము చేసింది. ఆర్‌బీఐ అంచనా వేసిన 9.5 జీడీపీ వృద్ధి రేలు సాధించినా, రెండేళ్ల క్రితం వృద్ధి రేటుతో పోలిస్తే అది తక్కువే అవుతుంది. కోవిడ్‌ నేపథ్యంలో ధేశంలో దనికులు,పేదల మధ్య ఆదాయ అసమానతలు పెరిగి పోతున్నాయని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక రికవరీ అన్ని రంగాల్లో సమానంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రస్తుత స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు సూచిక అన్నారు. రాబోయే కాలంలో వృద్ధి అవకాశాలనూ ఇవి దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు.

కొవిడ్‌ రెండో ఉధృతి నేపథ్యంలో మరిన్ని అప్పులు చేయాలన్న సూచనలు సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రుణభారం పెరిగి పోయిన విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని పెట్టుబడి వ్యయాల్ని తగ్గించడం ద్వారా, ఆ నిధుల్ని కొవిడ్‌ ఖర్చులకు ఉపయోగించడం మేలన్నారు. ఇంకా అవసరమైతే కంపెనీల లాభాలు, మూలధన లాభాలపై ఒకసారికి వర్తించేలా పన్ను విధించే విషయం పరిశీలించాలని సూచించారు. ఇకపోతే రాష్ట్రాలు కూడా తమపరిధిలో ఉన్న వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడులపై ఆధారపడకుండా ఎక్కువగా మానవ వనరులను ఉపయోగించడంలో శ్రద్ద చూపాలి. అనుత్పాదక రంగాలకు కేటాయింపులను తగ్గించాలి. అలాగే సంక్షేమం పేరుతో చేసే దుబారాకు బ్రేక్‌ వేయాలి. వివిధ పథకాల పేరుతో చేస్తున్న పంపకాలను పక్కన పెట్టకుంటే రాష్ట్రాల ఆర్థిక భారం మరింత కాగలదు. ఖజానా పూర్తిగా నిండుకోకుండా చూసుకోవాల్సిన అసవరం ఉంది. కొన్ని పథకాలను అవసరమైతే పక్కన పెట్టాలి. ఓటుబ్యాంక్‌ కోసం ఉద్దేశించిన పథకాల జోలికి వెళ్లకుండా డబ్బులను ఆదా చేసుకోవాలి. లేకుంటే రాష్ట్రాలు మరింతగా ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *