కార్మికులకు అండగా కడదాకా నిలబడిన బాబా సాహెబ్ అంబేద్కర్

 కార్మికులకు అండగా కడదాకా నిలబడిన  బాబా సాహెబ్ అంబేద్కర్

భూమిపుత్ర,చరిత్ర:

మే డే ప్రపంచ కార్మికుల పండగ. కార్మికుల శ్రమ ద్వారా అపార సంపద పోగేసుకుంటున్న పెట్టుబడిదారులు వారిని కనీసం మనుషుల్లాగా కూడా చూడని దారుణమైన రోజులవి. అప్పట్లో రోజుకు 16 గంటల వరకు కార్మికులు పనిచేసేవారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇందులో ముఖ్యమైంది రోజుకు ఎనిమిది గంటల పని హక్కు. ఈ హక్కు కోసం కార్మికులు పోరాడి విజయం సాధించారు. ఈ పోరాటంలో భాగంగా వందలాది మంది కార్మికులు ప్రాణాలర్పించారు. 1886 మే మూడో తేదీన చికాగో లోని హే స్వ్కేర్ దగ్గర పోలీసు కాల్పుల్లో ఒక వైపు రక్తం చిందుతుంటే మరో వైపు ఆ రక్తంలో తడిసిన ఎర్రబట్టను తమ జెండాగా కార్మికులు పైకెత్తి చూపారు

“ఇండియాలో భిన్నమైన పరిస్థితులు”
ప్రపంచ కార్మికులు దేశాలకు, జాతులకు, భాషలకు అతీతంగా ఏకమై హక్కుల కోసం నినదిస్తుంటే, ఇండియాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జాతీయ వనరులను ఇక్కడి కార్మికుల శ్రమ ద్వారా ముడి సరుకుగా మార్చి ఇంగ్లాండుకు తరలించి, వాటి ద్వారా తయారైన ఉత్పత్తులను మళ్లీ ఇండియాలో అమ్ముతూ దేశసంపదను కొల్లగొట్టింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో దేశీయ ఉత్పత్తి రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. అయినప్పటికీ ఇక్కడి కార్మికులలో చలనం రాలేదు. తిరుగుబాటు వైఖరి లోపించింది. దీనికి కారణం కార్మికుల అనైక్యత. కొన్ని వేల ఏళ్లుగా భారతదేశ సమాజాన్ని పీడిస్తున్న కులవ్యవస్థ. దీని ప్రభా వంతో కార్మికులు కులాలుగా విడిపోయారు. కార్మికులంతా ఒకటే అనే భావన ఏర్పడలేదు. చివరకు రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో పెట్టు బడిదారీ వర్గాల మీద కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకువచ్చి తమ హక్కులు సాధించుకున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం హక్కుల సాధనకు కార్మికుల్లోని అనైక్యత అడ్డుగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో కార్మిక సమాజానికి కొండంత అండగా నిలిచారు బాబా సాహెబ్ అంబేద్కర్.
1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా లభించిన అవకాశాలను కార్మికుల అభివృద్ధికి వాడుకునే ఆలోచనతో 1936 ఆగస్టులో ‘ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ’ (ఐఎల్ పీ) స్థాపించారు. 1937 ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించి బ్రిటిష్ ప్రభుత్వం ముందు కార్మికుల గొంతు బలంగా వినిపించారు. కార్మికులకు కనీస వేతనాలు, మోడర్న్ టెక్నాలజీ పై శిక్షణ వంటి అనేక కార్మిక శ్రేయస్సు విధానాల అమలు కోసం ఇండియన్ లేబర్ పార్టీ కృషి చేసింది. 1942 జులై ఏడో తేదీన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్ గా బాబా సాహెబ్ అంబేద్కర్ పాల్గొనడం భారత కార్మిక హక్కుల చరిత్రలో ఒక మైలురాయిగా భావించాలి. కార్మికుల జీవన ప్రమాణాల పెంపుకోసం అనేక రకాల చట్టాలు తీసుకురావడానికి అంబేద్కర్ తీవ్రంగా కృషి చేశారు. కార్మిక, యాజమాన్య సమస్యల పరిష్కారం కోసం కార్మిక వివాదాల చట్టం సహా అనేక చట్టాలు తీసుకువచ్చిన ఘనత బాబా సాహెబ్ అంబేద్కర్ దే. ఇండియాలో కార్మికుల సంఘటితం కాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఇన్ని హక్కులు, సదుపాయాలు వారికి దక్కాయంటే అది అంబేద్కర్ కృషి ఫలితమే.

డా॥ బి.ఆర్ అంబేద్కర్ జీవిత పర్యంతం స్వేచ్ఛ, సమానత్వం ప్రాతిపదికగా నవ భారత సమాజ నిర్మాణానికై రాజీలేని పోరాటం చేశాడు. అంబేద్కర్ పోరాటాలు, ఉద్యమాల్లోని బహుముఖ కోణాల్లో అనేకం అందరికీ తెలుసు కానీ డా॥ అంబేద్కర్ ఆర్థిక సిద్ధాంతాలు, కార్మిక కర్షక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర విషయాల్లో వెలుగులోకి వచ్చినవి చాలా తక్కువ. ‘కులం అనేది శ్రమ విభజననే కాక శ్రామికుల విభజన కూడా’ అని అంబేద్కర్ అన్నాడు. ఏ నాగరిక సమాజంలోనూ ఈ అసహజ శ్రామిక విభజన లేదనీ పేర్కొన్నాడు. అస్పృశ్యత నాపాదించి కొన్ని కులాల వారిని ప్రధాన స్రవంతి నుండి వేరు చేసి ఉత్పత్తి, మార్కెట్టు రంగాల్లో వివక్ష చూపారనీ, అస్పృశ్యత బానిస వ్యవస్థకన్నా హీనమైనదనీ పేర్కొంటూ అంబేద్కర్ అస్పృశ్యత నియంత్రణలేని ఆర్థిక దోపిడీ విధానమని అందుకే కుల నిర్మూలనకై ఉద్యమించాలని అంబేద్కర్ ఉద్ఘాటించాడు.

మహారాష్ట్రలోని శేఠ్‌ల, భట్‌ల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన మహాత్మా ఫూలే, బ్రాహ్మణ, బనియాలను అధిక్షేపించిన లోఖండే పోరాటాల స్ఫూర్తికి అంబేద్కర్ నిర్దిష్ట రూపమిచ్చాడు. కార్మిక, కర్షక ఉద్యమాల సారథిగానేకాక, వారి ఉద్దరణ, ప్రగతికై అనేక బిల్లులను తీసుకువచ్చాడు.ఆది నుండీ అంబేద్కర్ తను చేపట్టిన ఉద్యమాల్లో కార్మిక, కర్షక సమస్యల్ని అంతర్భాగంగా చేశాడు. 1924 జూలై 20న అంబేద్కర్ స్థాపించిన తొలి సంస్థ బహిష్కృత హితకారిణీ సభ ద్వారా శూద్రాతిశూద్ర కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఖండించాడు. దళితులు, వెనుకబడిన వర్గాల కార్మికుల్ని సమీకరించి ఐక్యపోరాటాన్ని ప్రారంభించాడు. 1927లో సైమన్ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలోనూ ఆ కమిషన్ సభ్యుడైన అట్లీతో సమావేశంలో కూడా, జౌళిమిల్లుల్లో పనిచేసే దళిత కార్మికుల నియమకాలపట్ల చూపిస్తున్న వివక్షను వెల్లడించాడు. 1928లో కమ్యూనిస్టు ఆధ్వర్యాన బొంబాయిలో జరిగిన జౌళి కార్మికుల సమ్మెలో అంబేద్కర్ పాల్గొనలేదు. కుల సమస్యను తమ పోరాటంలో చేర్చాలన్న అంబేద్కర్ కోర్కెను కమ్యూనిస్టులు అంగీకరించకపోవడమే దీనికి కారణం. 1935లో జరిగిన ఐదవ కమ్యూనిస్టు మహాసభలో జార్జి డిమిట్రోబ్ ఆయా దేశ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని, కమ్యూనిస్టుల ఒంటెద్దు పోకడ సరికాదనీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. కానీ కమ్యూనిస్టులు సమీకరించిన కార్మిక వర్గంలో అధికులు దిగువ కులాలవారే. సామ్రాజ్యవాద, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా వర్గపోరాటా న్ని చేపట్టిన కమ్యూనిస్టులు ఆ కాలంలో అంబేద్కర్ వాదనకు ప్రాధాన్యత ఇవ్వలేదు.సుదీర్ఘ కాలంగా దళితుల్లో మార్కిజంపై చర్చలు జరుగుతూ ఉండేవి. అంబేద్కర్ మార్కిజంపై విశేష పరిశోధన చేశాడు. అతని సహచరుడు, కమ్యూనిస్టు నాయకుడు మోరే కార్మికులను సంఘటిత పర్చేవాడు. దళిత మేధావి రావుసాహెబ్ కాప్టే, కమ్యూనిస్టులు అంబేద్కరీయుల లక్షం ఒకటే అనీ, వారు ఉమ్మడిగా ఐక్య పోరాటం చేయాలని తన గ్రంథం ‘అంబేద్కర్ మార్స్’లో పేర్కొన్నారు. అంబేద్కర్ కూడా ప్రపంచ చరిత్ర యావత్తు వర్గపోరాట చరిత్రే అనీ, వర్గంలోనే కులం ఇమిడి ఉందని పేర్కొనడం ఆయనపై మార్కిస్టు దృక్పథ ప్రభావాన్ని తెల్పుతుంది. కార్మిక హక్కులను పరిరక్షించడానికై అనేక సార్లు కమ్యూనిస్టులతో కలిసి అంబేద్కర్ ఐక్య పోరాటాల్ని చేశాడు. 1928లో బొంబాయిలో టెక్స్‌టైల్ కార్మికుల సమ్మెలో అంబేద్కర్ స్వయంగా పాల్గొన్నాడు.

తాను నడిపిన మూరే నాయక్, బహి ష్కృత భారత్ పత్రికల ద్వారా కార్మికులను చైతన్యపర్చేవాడు. 1930లో బహిష్కృత భారత్‌ను జనత పత్రికగా మారుస్తూ చేసిన ప్రకటనలో అంబేద్కర్ విప్లవ స్ఫూర్తి కన్పిస్తుంది. 1936లో తాను ప్రారంభించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ఐఎల్‌పి) లక్షం సోషల్ డెమోక్రాటిక్ సమాజ స్థాపన అని అంబేద్కర్ జనత పత్రికలో పేర్కొనడం కార్మిక ఉద్యమాలపట్ల ఆయన నిబద్ధతను స్పష్టం చేసింది. పరిశ్రమలను ప్రభుత్వాధీనం చేయటం, కార్మికుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ, కనీస వేతనాల చెల్లింపు, బోనస్ పెన్షన్ పథకాలకై చట్టాలను ప్రవేశపెట్టాలని లేబర్ పార్టీ ఉద్దేశాలను ప్రకటించింది. అవేకాక బీమా పథకాల అమలు, కౌలుదార్లను భూస్వాముల నిర్బంధం నుండి బేదఖలు మొదలైన వాటికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నది. బొంబాయిలోని కొంకణ్, విదర్భ, మధ్య పరగణా ప్రాంతాల్లోని భోటీ, తాలూక్దారీ జమీందారీ వ్యవస్థ రద్దుకై చట్టం తెస్తామని హామీనిచ్చింది. అంబేద్కర్ సారథ్యాన జనత పత్రిక భూస్వాముల దురాగతాలను ఎండగట్టేది. కార్మిక, రైతులకు వాహికగా నిలిచేది. బొంబాయిలో 1937 ఎన్నికల్లో గణనీయమైన విజయాలు పొంది, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అంబేద్కర్ అనేక కార్మిక, రైతు ఉద్యమాలకు సారథిగా నిలిచాడు. వాటిలో ప్రధానమైనవి భోటీ, భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేక పోరాటాలు.
1934 డిసెంబర్ 16న అనంతరావు చిత్రే జరిపిన రైతు సభకు అంబేద్కర్ అధ్యక్షత వహించాడు. బొంబాయిలో 1937లో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైన ఎస్‌ఎ డాంగేతో కలిసి రైతు యాత్ర నిర్వహించాడు అంబేద్కర్. అక్టోబర్ 17, 1937లో చరీలో జరిగిన చరీ ర్యాలీలో రైతులు ఎర్రజెండాలు ధరించి పాల్గొన్నారు. బి.టి. రణదివె, జి.ఎస్. సర్దేశాయ్ వంటి కమ్యూనిస్టు నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 1938 జనవరి 12న 20 వేల మంది రైతులు బొంబాయి కౌన్సిల్ హాల్‌కు అతిపెద్ద ఉరేగింపు నిర్వహించారు. “భోటీ వ్యవస్థ రద్దు చేయండి” డా॥ అంబేద్కర్ వర్దిల్లాలి లాంటి నినాదాలు మిన్నంటాయి. ఈ సభలో అంబేద్కర్ మార్కిజం అనుకూల ప్రసంగాన్ని చేశాడు. మార్కిజాన్ని మన సామాజిక పరిస్థితులకు అన్వయిస్తే, రష్యా విప్లవానికి పట్టినంత సమయం కూడా పట్టదని కమ్యూనిస్టు సిద్ధాంతం తనకు సన్నిహితమైనదనీ పేర్కొన్నాడు.1938 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని మన్మాడ్‌లో అంబేద్కర్ దళిత కార్మికుల సమావేశాన్ని నిర్వహించాడు. కార్మిక వర్గానికి రెండు శత్రువులనీ అవి ఒకటి బ్రాహ్మణిజం రెండు పెట్టుబడీదారీ విధానమన్నాడు. 1938లో బొంబాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బిల్లు”ను నిరసిస్తూ ఐక్యపోరాటాన్ని నిర్వహించాడు. సమ్మెను చట్ట వ్యతిరేకం చేయడాన్ని దుయ్యబట్టాడు. ఈ చట్టం పౌర హక్కుల నిషేధ చట్టమనీ పేర్కొన్నాడు. కమ్యూనిస్టులు, అంబేద్కరీయులు నవంబర్ 7 1938న సమ్మెకు పిలుపు నిచ్చారు. లక్షల మంది పాల్గొన్న ఈ సమ్మెను రెండువేల సమతా సైనిక్ దళ్ వాలెంటీర్లు పర్యవేక్షించారు. చివరకు సమ్మె పోలీసు జోక్యంతో హింసాయుతంగా మారి కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంస్మరణ సభలో అంబేద్కర్ డాంగేలు పోరాటం ఆగదని ఉద్ఘాటించారు.

వైశ్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా అంబేద్కర్ చేరాడు. ఆయనకు కార్మిక శాఖను అప్పగించారు. 1942 నుండి 1946 వరకు కార్మిక మంత్రిగా అంబేద్కర్ చేపట్టిన కార్మిక విధానాలు, చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రాత్మకమైనవి. 1942 ఆగస్టు 7న న్యూఢిల్లీలో జరిగిన సంయుక్త కార్మిక సభలో పలుకీలక నిర్ణయాలు తీసుకొన్నాడు. కార్మిక విధానాల్లో ఏకరూపత, యాజమాన్యంతో సమానంగా కార్మికుల జాయింట్ లేబర్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేశాడు. ఈ సర్వప్రతినిధుల స్థాయీ సంఘం ఏర్పాటు అప్పటి అఖిల భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వి.వి.గిరి హర్షం వ్యక్తం చేశాడు. 1942 డిసెంబర్ బొంబాయిలో ఆకాశవాణిలో అంబేద్కర్ చేసిన ప్రసంగంలో కార్మిక శక్తి ప్రాధాన్యతను ఉద్ఘాటించాడు. కార్మికులు కేవలం ట్రేడ్ యూనియన్లకే పరిమితం కాకూడదనీ, దేశానికి నాయకత్వం అందించే సామర్థం వారికి ఉన్నదని, ప్రత్యక్ష పోరాటంలో దిగి నూతన సమాజ స్థాపనలో పాలు పంచుకోవాలని, జాతిని నిర్దేశించే గురుతర పాత్ర తీసుకోవాలని ఉద్బోధించాడు. కార్మిక మంత్రిగా ఉన్న కాలంలోనే ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌లను ఏర్పరిచి కార్మికులకు ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం చేశాడు. నిరుద్యోగం అణగారిన వర్గాల పాలిట శత్రువని భావించేవాడు. కేంద్ర ప్రభుత్వంలో శూద్ర కార్మికులకు 6 శాతం రిజర్వేషన్లు తీసుకురాగలిగాడు. అణగారిన వర్గాల విద్యార్థులు విదేశాల్లో సాంకేతిక విద్య అభ్యసించడానికి సౌకర్యాలనేర్పర్చాడు.1945లో ప్రాంతీయ లేబర్ కమిషన్ సభలో మాట్లాడుతూ అంబేద్కర్ పారిశ్రామిక, వ్యవసాయ కార్మికుల సౌకర్యాలు, ప్రావిడెంట్ ఫండ్, భద్రత, నష్ట పరిహారం, జీవిత ఆరోగ్య బీమా సౌకర్యం అమలు చేయాలని కోరాడు. అంతేకాక వీటన్నిటి అమలుకు తగిన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేశాడు. అంబేద్కర్ చేసిన కృషిలో ప్రధానమైనవి గని కార్మికుల భద్రతకై చేపట్టిన పథకాలు. 1944 బొగ్గుగని కార్మిక సంక్షేమ ఆర్డినెన్స్ ద్వారా బొగ్గుగని కార్మిక సంక్షేమ నిధి ఏర్పాటు, ఆరోగ్య రక్షణ బీమా సౌకర్యాల్ని కల్పించడమైంది. 1946లో కార్మికుల పనివేళలు వారానికి 60 గంటల నుండి 48 గంటలకు తగ్గిస్తూ ధన్‌బదే బొగ్గు గనిని స్వయంగా సందర్శించి వారి సాధక బాధకాల్ని తెలుసుకొని కార్మికుల సంక్షేమ పథకాల్ని రూపొందించాడు. బొగ్గు గనుల్లో భూగర్భంలో స్త్రీల పని నిషేధం సమయంలో వారికి ప్రత్యామ్నా య ఉద్యోగాలు కల్పించేలా చేశాడు. స్త్రీలకు వేతనంతో కూడిన ప్రసూతి సవరణ బిల్లును ప్రవేశపెట్టాడు. అంతేగాక, మైకా గనుల్లో పనిచేస్తున్న కార్మిక సంక్షేమాభివృద్ధి నిధి సమకూర్చే బిల్లును 1946లో ఆమోదింప చేశాడు.1944 ఫిబ్రవరి 12న భారత ప్రభుత్వం నియమించిన కార్మిక దర్యాప్తు కమిటీ పంపిన 35 నివేదికలో 20 నివేదికల్ని అంబేద్కర్ శాసన సభలో ప్రవేశపెట్టాడు. మొత్తం మీద కార్మిక సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని అంతర్జాతీయ రంగంలో ఉన్న ప్రమాణాలను విధిగా పాటించేలా చేశాడు అంబేద్కర్. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో మార్పులను తన స్టేట్ సోషలిజంలో ప్రస్తావించాడు. భారతదేశంలోని వ్యవసాయ సమస్యలకు పరిష్కారం భూమిని జాతీయం చేయుటమేనని సూచించాడు.

వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి సహకార సాగును ప్రోత్సహించాలన్నాడు. ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ సామ్యవాదం అవసరమని అంబేద్కర్ భావించాడు. ఒకే వ్యక్తి ఒకే విలువ సూత్రంపై ప్రజాస్వామ్యం ఉండాలనీ, రాజ్యాంగం ద్వారా జాతీయ సామ్యవాదాన్ని ప్రాథమిక హక్కుల్లో పొందుపర్చాలని అంబేద్కర్ కోరిక రాజ్యాంగ పరిషత్తులో ప్రతిఘటనతో తీరలేదు. కార్మిక ఉద్యమ నేతగా, ఇంటిపెండెంట్ లేబర్ పార్టీ నాయకునిగా, వైశ్రాయ్ కౌన్సిల్‌లో కార్మిక మంత్రిగా, రాజ్యాంగ నిర్మాణ సారథిగా ప్రవేశపెట్టిన, ప్రతిపాదించిన విధానాలు అంబేద్కర్ భారత దేశ కార్మికోద్యమంలో నూతన శకాన్ని సృష్టించారు.
ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ఫలితాలను కార్మిక వర్గం నేటికీ పొందుతోంది.లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రాలకు విఘాతం కలిగిస్తుందని అంబేడ్కర్ చెప్పారు. వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమాన్యాలు నిర్దేశిస్తాయని, అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు.
‘కుల వ్యవస్థ పనినే కాదు, కార్మికులనూ విభజిస్తుంది’
భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబేడ్కర్, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు.

కుల వ్యవస్థ పని విభజనకు సంబంధించినదనే వాదనను ఆయన తిరస్కరించారు. ఈ సమాజం పనినే కాకుండా కార్మికులను కూడా విభజించి చూస్తోందని, ఇది అసహజమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. కార్మికుల విభజనను హిందూ సమాజ నిర్మాణమే ఆమోదించి, కొనసాగిస్తోందని, ఈ విభజనలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే వర్గీకరణ ఉందని చెప్పారు. కార్మికులను ఇలా చూసే పని విభజన మరే దేశంలోనూ లేదన్నారు.పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్ వివరించారు. వ్యక్తి తన సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు.
అణగారిన వర్గాలు ముఖ్యంగా కార్మిక వర్గాలు ఆర్థిక, సామాజిక దోపిడీకి గురవుతుండటంపై అంబేడ్కర్ ఆవేదన చెందారు. ఈ వర్గాలకు విముక్తి కల్పించేందుకు అప్పటి సైద్ధాంతిక వాదనలను సవాలు చేశారు.వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో 1942 జులై నుంచి 1946 జూన్ వరకు అంబేడ్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వం ఆయన నాయకత్వంలో, కార్మిక సమస్యలు, పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించింది. కార్మికులందరికీ సరైన వేతనాలు, సరైన పరిస్థితులను హక్కుగా కల్పించింది.స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడ్డ తొలి కేబినెట్‌లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. 1923 నాటి కార్మికుల పరిహార చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1943 నాటి కర్మాగారాల చట్టంలలో కార్మికులకు అనుకూలంగా సవరణలు తీసుకొచ్చేందుకు వివిధ స్థాయుల్లో అంబేడ్కర్ చర్యలు చేపట్టారు. పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకించారు. బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు.
కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా అంబేడ్కర్ కృషితో వచ్చిన నిబంధనలు, మారిన/తెచ్చిన చట్టాలు ఇవీ…
1. పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు
2. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం
3. వేతన చెల్లింపు చట్టం
4. కనీస వేతనాల చట్టం
5. ఉద్యోగుల వేతన సవరణ చట్టం
6. భారత కర్మాగారాల చట్టం
7. భారత కార్మిక సంఘ చట్టం
8. కార్మికుల పరిహార చట్టం
9. కార్మికుల రక్షణ చట్టం
10 ప్రసూతి ప్రయోజనాల చట్టం
11. కార్మిక రాజ్య బీమా(ఈఎస్ఐ) చట్టం
12. మహిళలు, బాల కార్మికుల రక్షణ చట్టం
13. బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్ చట్టం
14. మహిళా కార్మికుల సంక్షేమ నిధి
15. బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ
16. వేతనంతో కూడిన సెలవులు
17. సామాజిక భద్రత
ఆయా నిబంధనలు, చట్టాలు కాల క్రమంలో మారుతూ వస్తున్నాయి.
పనిగంటలను 12 నుంచి ఎనిమిదికి తగ్గించాలని 1942 నవంబరు 27న దిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్ తొలిసారిగా ప్రతిపాదించారు. 1945 నవంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు కర్మారాగాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సదస్సులో కేంద్ర, ప్రావిన్షియల్ ప్రభుత్వాలు, యాజమాన్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు అంబేడ్కరే
విధాన స్థాయిలోనే కాకుండా రాజకీయ స్థాయిలోనూ అంబేడ్కర్ కార్మిక సంక్షేమానికి కృషి చేశారు. కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే.1936 ఆగస్టులో అంబేడ్కర్ ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ఐఎల్‌పీ)’ని స్థాపించారు. తమది కార్మికుల పార్టీ అని ఐఎల్‌పీ ప్రకటించుకొంది. కార్మిక వర్గాల సంక్షేమమే పరమావధిగా కలిగిన కార్మిక సంస్థగా ఐఎల్‌పీ 1937లో వెలువరించిన విధానపత్రంలో తనను తాను అభివర్ణించుకొంది.1937లో జరిగిన ప్రావిన్సియల్ ఎన్నికల్లో ఐఎల్‌పీ 17 స్థానాల్లో పోటీచేసి, 14 చోట్ల విజయం సాధించింది. పోటీచేసిన 13 రిజర్వుడు స్థానాల్లో 11 చోట్ల, పోటీచేసిన నాలుగు జనరల్ సీట్లలో మూడు చోట్ల గెలిచింది.ఐఎల్‌పీ కార్మికులు, చిన్నరైతుల కోసం పెద్దయెత్తున అనేక పోరాటాలు చేసింది.

కార్మిక దినోత్సవం నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంత చేసిన ధీరోధాత్తుడికి శ్రామిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరి తరపున నివాళులు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *