ఫీజుల దోపిడీకి కళ్ళెం వేయాలి!!

 ఫీజుల దోపిడీకి కళ్ళెం వేయాలి!!

భూమిపుత్ర,తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌:

విద్యా,వైద్యరంగాలను అభివృద్ది చేసుకోవాల్సిన ఆవశ్యకతను కరోనా సందర్భంగా మరోమారు పరిస్థితులు రుజువు చేశాయి. అదే సమయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులపైనా, విద్యాసంస్థలపైనా అజమాయిషీ ఉండాలని, వారి దోపిడీపై దృష్టి పెట్టాలన్న అవసరాన్ని కూడా సూచించింది. కోర్టులు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చాయి. ఈ యేడాది ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు. జూలై 1నుంచి విద్యాసంవత్సరం ప్రాంభించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అయినా ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం తమ ఫీజుల వసూళ్లను ఆపడం లేదు. కించిత్‌ సిగ్గూ లజ్జా లేకుండా పూర్తిస్థాయిలో తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేసేలా ఫీజులు వసూలు చేసే పనిలో పడ్డాయి. హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీ గురించి ఎత్త తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.

ఓ కార్పోరేట్‌ స్కూల్లో మొదటితరగతి విద్యార్థికి లక్షాయాభై వేల కనీస ఫీజును వసూలు చేస్తున్నారు. అలాగే పుస్తకాలు, డ్రెస్సులు, ఇతరత్రా ఖర్చులు అదనం. సామాన్య ఉద్యోగికి వచ్చే జీతం మొత్తంగా ఉంటోందీ ఫీజు. దీనిపై నియంత్రణ లేకుంటే మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడతారు. గతేడాది ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించినా పూర్తిస్థాయిలో ఫీజులను మాత్రం వదులుకోలేదు. అలాగే టీచర్లకు మాత్రం జీతాలు ఇవ్వకుండా మొహం చాటేశాయి. ఇలా జరగడానికి ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రైవేట్‌ విద్యాసంస్థలన్నీ రాజకీయ నాయకులు చేతుల్లో ఉండడమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. జీతాలు ఎందుకు ఇవ్వలేదని ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలను నిలదీయ లేదు. ఇకపోతే డిజిటల్‌ ఆన్‌లైన్‌ విద్యా విధానం బడి అనే సంస్థకు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని కరోనా పాఠాలు నేర్పింది. బడికి ఒక సామాజిక కోణం ఉంది.

విద్య నేర్పించడమే కాకుండా పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చే ప్రదేశమే పాఠశాల. వాళ్లు హాయిగా ఆడుకోవడానికి, నవ్వుకోవడానికి బడి ఒక మహత్తర నెలవు, ఒక అపూర్వ అవకాశం. బాలలకు భద్రత కల్పించేది, ఆరోగ్యాన్ని పరిరక్షించేది, సామాజిక భావాలను పెంపొందించేది, వారిలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేది, చదువులతో పాటు ఆటా పాటా నేర్పేది, భావి పౌరులకు సహజీవన మాధుర్యాన్ని, తోటివారి పట్ల సహానుభూతిని నేర్పేది కేవలం బడి మాత్రమే. ఇకపోతే గతేడాది ఆన్‌లైన్‌ తరగతులని, టీవీ తరగతులని కొన్నిరోజులు హడావిడి చేసినా పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆ హడావిడి కూడా అంతగా కన్పించడం లేదు. తమకు దక్కని చదువును తమ పిల్లలకు అందించడానికి పలు త్యాగాలు చేస్తున్న తల్లిదండ్రులు అసంఖ్యాకంగా ఉన్నారు. కరోనా సంక్షోభం ఒక్కసారిగా వారి జీవితాలను అతలాకుతలం చేసింది.

ఈ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వమూ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలూ పిల్లలు చదువులకు దూరం కాకూడదనే భావనకు వచ్చాయి. తత్ఫలితంగానే ఆన్‌లైన్‌ ద్వారా కొన్ని తరగతుల విద్యార్థులకు బోధనా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ బోధన అంటే టీవీ లేదా స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ ఉండాలి. వీటితో పాటు అతి వేగవంతమైన ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. అవి లేని కుటుంబాల లో పిల్లలూ, వారి తల్లిదండ్రులూ చాలా ఇబ్బందులు పడుతున్నాయని అనేక వార్తలు పుంఖానుపుంఖానుగా వచ్చినా పట్టించుకోలేదు. టీవీ ఉంటే రీచార్జ్‌ లేక, స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే డేటా చార్జింగ్‌ చేయించలేక, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందరికీ స్మార్ట్‌ఫోన్‌లు కొనలేక తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.

ఇక అన్నీ ఉండీ డిజిటల్‌ పాఠాలు వింటున్న పిల్లలకు స్క్రీన్‌ టైమ్‌ ఎక్కువ కావడంతో తల నొప్పి రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఉన్న అసమానతలకు తోడు డిజిటల్‌ అసమానతలు మన ముందుకు వస్తున్న ప్రమాదకరమైన పరిస్థితిని దేశవ్యాప్తంగా చూశాం. లక్షలాదిమంది పిల్లలకు తోటి పిల్లలతో పోటీపడే అవకాశాలు కోల్పోతున్నామనే భావన కలుగుతోందని గుర్తించాలి. ఆన్‌లైన్‌ విద్యాబోధన విషయమై రాష్ట్ర విద్యాశాఖ రోజువారీగా సమాచారం సేకరిస్తూనే వచ్చినా ప్రభుత్వ పరంగా చికిత్స మాత్రం చేయలేదు. ఈ సమాచారం ఎంతవరకు సరైనదో వారికే తెలియాలి. ఎంతో మంది టీచర్లు బయటకు చెప్పకపోయినా ఈ ఆన్‌లైన్‌ తరగతుల పట్ల సంతృప్తిగా, సుముఖంగా లేరని తేలిపోయింది. గతేడాది టీచర్లను బడులకు వెళ్ళి, విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డా వారు భయంగానే పాఠశాలలకు వెళ్లారు.

పిల్లలు కూడా అలాంటి భయాలతోనే వెళ్లారు. అలా కొందరు కరోనా బారిన పడ్డారు. అయితే పిల్లలు లేని, వారి అల్లరి లేని, పాటలు లేని, ఆటలు లేని, గంట విన పడని బడి మనకు అనుభవంలోకి వచ్చింది. చడీ చప్పుడూ, సందడి లేని ఆ బడులు కళ కోల్పోయాయనడంలో సందేహం లేదు. కొన్ని బడులలో మోకాలు లోతు గడ్డి మొలిచింది. శుభ్రం చేసే వాళ్ళు లేక మధ్యాహ్న భోజన సామగ్రి బూజు పట్టి పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభించే ముందు సర్కార్‌ బడులను సంస్కరిస్తూనే ప్రైవేట్‌ పాఠశాలల భరతం పట్టాలి. ఫీజుల విషయంలో తల్లిదండ్రలుకు వెసలుబాటు కల్పించాలి. ఆన్‌లైన్‌ క్లాసుల పట్ల, టీవీ క్లాసుల పట్ల ఉపాధ్యాయులు ఏ మాత్రం సుముఖంగా లేరని కూడా తేలిపోయింది. అంతే కాకుండా బడి ప్రాధాన్యాన్ని, విద్యాబోధనలో దాని పాత్రను టీచర్లు ఇప్పుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతున్నారు. బడులు ఎప్పుడు తెరుస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న టీచర్లు ఎందరో!

ప్రభుత్వ టీచర్ల పట్ల సమాజంలో, చదువు చెప్పరనే ఒక అపప్రథ ఉంది కదా. దానికి తోడు ఈ కరోనా తరుణంలో జీతాలు అప్పనంగా తీసుకుంటూ పాఠాలు చెప్పడం లేదనే అపవాదును ప్రభుత్వ టీచర్లు మోయవలసివస్తోంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడే ఏకైక మార్గం బడులు తెరవడమే అని చాలామంది అంటున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ బడులను తెరవాలని పాలకులు నిర్ణయించడం మంచిదే. అలాగే తల్లిదండ్రుల సంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు కూడా బడులు తెరవాలని ఒక స్పష్టమైన ప్రతిపాదన చేస్తున్నాయి. 9, 10 తరగతుల పిల్లలకు పూర్తికాలం బడి నడపాలని 6, 7, 8 తరగతుల పిల్లలకు ఒంటిపూట బడి నడపాలని, 3,4,5 తరగతుల బాలలకు వారంలో రెండు లేదా మూడు రోజులు తరగతులు నడపాలని ప్రతిపాదిస్తున్నాయి.తరగతుల నిర్వహణలో ప్రభుత్వానికి సహకరించేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పష్టమైన ప్రతి పాదనలను సిద్దం చేయాలి. కరోనా పాఠాలు నేర్పిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు తెరిచేం దుకు సంసిద్దం కావాలి. అలాగే ప్రైవేట్‌ దోపిడీని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. ఫీజు స్టక్చ్రర్‌ను నిర్దేశించాలి. ప్రైవేట్‌ విద్యాసంస్థలేవీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. వాటికి కళ్ళెం వేసేందుకు వెనకాడకూడదు. కరోనాతో సంపాదన కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రైవేటు బడుల్లో ఫీజులు భారం కాకుండాచూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పాలకులు గుర్తించి, అందుకు తగ్గట్లుగా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *