సామాజిక విప్లవ పితామహుడు- మహాత్మా జ్యోతిబా ఫూలే

 సామాజిక విప్లవ పితామహుడు- మహాత్మా జ్యోతిబా ఫూలే

మహాత్మా జ్యోతిబా ఫూలే

సామాజిక విప్లవానికి ఆద్యుడు జ్యోతిబా పూలే
170 ఏళ్ల క్రితమే సంఘసంస్కర్తగా అనేక విప్లవాత్మక పనులు
మహిళా విద్య, బాలికా విద్య, వితంతు వివాహాలకు ప్రోత్సాహం
ఆధిపత్య బ్రాహ్మణీకంపై పోరాటంలో విజయం

భూమిపుత్ర, బ్యూరో:
మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే గొప్ప సామాజిక విప్లవకారుడు. ఓ రకంగా చెప్పాలంటే తను అనుభవించిన కష్టాలు…సామాజిక అవమానాలు ఇతరులు పడకూడదన్న భావనతో సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహామనిషి. ఓ రకంగా అంబేడ్కర్‌ కంటే పూర్వమే ఆయన అనేక రకాలుగా కులవిక్షను ఎదుర్కొని సమాజంలో ధీరుడిగా నిలిచాడు. కుల వ్యవస్థపై తిరగబడి ’క్రాంతి సూర్య’గా పేరుబడ్డ సంస్కర్త. ఆదిమ సమాజం నుండి ఆధునిక నాగరిక సమాజం వరకు మానవజాతి వికాసానికి ప్రధాన కారణం విద్య. విద్య ప్రాధాన్యతను, దాని విశిష్టతను, మానవాభివృద్ధిలో దాని పాత్రను తెలిపిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే. నవభారత నిర్మాణానికి, అసమానతలు, వివక్ష రహితమైన సమాజానికి నాంది పలికిన మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప తొలి సామాజిక విప్లవకారుడు. 170 సంవత్సరాల క్రితం వర్ణ, కుల, లింగ వ్యవస్థ పునాదుల మూలాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి మర్మాన్ని బట్టబయలు చేసి ప్రజలను చైతన్య పరిచిన క్రాంతి దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే. ఒకరోజు బ్రాహ్మణ మిత్రుని పెండ్లి ఊరేగింపులో జరిగిన అవమానపు సంఘటన జ్యోతిబా జీవిత గమనాన్ని మార్చేసింది. ఈ దుస్సంఘటనతో సామాజిక అసమానత వల్ల ఒక వ్యక్తికి జరిగిన వివక్ష, అవమానం యావత్‌ జాతికి అవమానంగా ఆయన భావించారు. తన జాతి పురోగతికి అడ్డుగోడుగా ఉన్న సనాతన హిందూ సామాజిక వ్యవస్థలోని వివిధ వివక్ష రూపాలలో ఉన్న అసమానతలను కూకటివేళ్లతో పెకలించానే ఒక సృజనాత్మక మేధోమధనానికి అంకురార్పణ పడింది. రాజకీయ దాస్యం కంటే సామాజిక దాస్యం పైనే పోరాడాని కృత నిశ్చయానికి వచ్చారు. థామస్‌ పెయిన్‌ రాసిన ’రైట్స్‌ ఆఫ్‌ మెన్‌’ అన్న గ్రంథంతో ఉత్తేజితుడయ్యాడు. భారతదేశం వెనుకబడటానికి దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు విద్య లేకపోవడమేనని గుర్తించిన పూలే, తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలుగా తీర్చిదిద్ది పూణె లోని బుధవార పేట ఖీడే గృహంలో తొలిసారిగా బాలికల కోసం పాఠశాలను ప్రారంభించాడు. 3, జూలై 1851న బుధవారపేటలో దళిత బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను నెకొల్పారు. అనాధల కోసం ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది.  జ్యోతిరావు పూర్వీకులు మహారాష్ట్ర సతారా జిల్లా ఖాతావ్‌ తాలూకా కట్గూన్‌ గ్రామానికి చెందిన మాలి కులస్తులు. గోవింద్‌, చిమనాబాయి దంపతులకు జ్యోతిరావు ఎప్రిల్‌ 11న జన్మించారు. ఆ కాలంలో బ్రాహ్మణుల పాఠశాలల్లో తమ కులస్తులకే చదువు చెప్పేవారు. దళితులను రానిచ్చినా వేరుగా కూర్చోబెట్టేవారు. సావిత్రి బాయితో, నాటి ఆచారం ప్రకారం అతి చిన్న వయసులో, జోతిబా పెళ్లి అయింది. జోతిబా ఉత్సాహం గమనించిన పర్షియన్‌ పండితుడు మున్షీ గఫార్‌ బేగ్‌, బ్రిటిష్‌ ఉద్యోగి లిజిత్‌ సాహబ్‌ లు అతని బంగారు భవిష్యత్తుకు చదువు అవసరమని తండ్రికి నచ్చజెప్పారు. 1841లో మూడేళ్ల విరామం తర్వాత 14 ఏళ్ల వయసులో జోతిబా స్కాటిష్‌ మిషనరి బడిలో చేరాడు. అక్కడ ఏడవ తరగతి వరకు చదివాడు. బడిలో, ఆంగ్లో అమెరికన్‌ రాజకీయ సిద్దాంతవేత్త, తాత్వికుడు, విప్లవకారి థామస్‌ పెయిన్‌ పుస్తకం ’మనిషి హక్కు’ చదివారు. ఈ పుస్తకం ఆయనలో సామాజిక పరివర్తనా దృష్టి కలిగించింది. కైస్త్రవ మిషనరీ పరిచయంతో ఫూలే జ్ఞానం పెరిగింది. 1848 లోనే దళిత బాలికలకు, స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించారు. బాలికలకు, స్త్రీలకు, దళితులకు పాఠశాలలు ప్రారంభించిన తొలి భారతీయుడు జ్యోతిరావు. జోతిబా దంపతులి వితంతు వివాహాలను ప్రోత్సహించారు. దేవదాసీ, సతీ సహగమన దురాచారాలకు వ్యతిరేకంగా, రైతు పన్నుల రద్దుకు, సాగునీటి కాలువల నిర్మాణానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నడిపారు. బ్రాహ్మణ వితంతువులకు గుండు గీయవద్దని క్షురకుకు నచ్చజెప్పారు. వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడకుండా రైతులను చైతన్య పరిచారు. మానభంగాలకు గురయిన వితంతు గర్భవతుల సురక్షిత ప్రసవాలకు, వారి పిల్లల సంరక్షణకు ’శిశు హత్య నిరోధక కేంద్రాలు’ ప్రారంభించారు. వితంతువు, నిరాధార బాల పోషణకు ఆశ్రమాలు ప్రారంభించారు. విద్యా హక్కు గురించి ప్రచారం చేశారు.  బడి మానేసిన పిల్లల సంఖ్య తగ్గించడానికి విద్యార్థులకు భోజన, గృహ వసతులు కల్పించారు. విద్యార్థి వేతనాలు ఇచ్చారు. పోషకాహార లోపాలు అరికట్టడానికి పిల్లలకు సమతుల ఆహారం అందించారు. తమ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు చిత్రలేఖనం, కళలు నేర్పారు. తల్లిదండ్రులు,`ఉపాధ్యాయుల సమావేశాలు జరిపారు. పిల్లల మానసిక వికాసంపై దృష్టి కేంద్రీకరించారు. రైతులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారు, వారి పిల్లలు, కార్మికుల కోసం రాత్రి బడులు ప్రారంభించారు. దళితుల కోసం 1850లో రెండు విద్యా సంస్థలు స్థాపించారు.  బ్రాహ్మణత్వ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమా నిర్మాణానికి ఫూలే 1873లో ’సత్యశోధక సమాజ్‌’ను స్థాపించారు. ఇది బ్రాహ్మణత్వ ఆచారాలు, ఛాందస భావాలు, విగ్రహారాధన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా శూద్రులను చైతన్య పరిచింది. సాంస్కృతిక నిరసనను, కట్న కానుకలు, పూజారులు, మంత్ర శ్లోకాలు లేని నిరాడంబర పెళ్ళిళ్ళను, కులాంతర, వితంతు వివాహాలను ప్రోత్సహించింది. జోతిబా తన సంపాదనంతా విద్యాలయాలకు, సేవా సంస్థలకు, సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. చివరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ఆరోగ్య చికిత్సకు కూడా డబ్బు లేదు.  ’ తాను ఆచరించే ’సత్య మతం’ మానవతావాద మతమని ప్రశంసించారు. ’బ్రాహ్మణాధిపత్య సంస్థలను తీవ్రంగా విమర్శించారు. దళితులకు సభ్యత్వం ఇవ్వని సార్వజనిక సభ, కాంగ్రెస్‌ కోరుతున్న పరిపాలన బ్రాహ్మణీయతకు దారి తీస్తుందని తన రచనల్లో హెచ్చరించారు. మన అంటరానితనాన్ని అమెరికా జాత్యహంకారంతో పోల్చిన జోతిబా అనారోగ్యంతో 1890 నవంబర్‌ 11న మరణించారు.అశేష జన బాహుళ్యానికి విజ్ఞాన వెలుగులు నింపాలని, లింగ, కుల, మత వివక్ష అసమాన ఆచరణకు వ్యతిరేకంగా సమానత్వం కోసం ఆచరణాత్మక పోరాటాలను, ఉద్యమాలను నిర్మించి ఫలితాలను సమాజంలోని అట్టడుగు, నిమ్న వర్గాలకు అందించిన క్రాంతి దార్శనికుడు మహాత్మ జ్యోతిబాపూలే.

Related News

2 Comments

 • Excellent initiation Srihari…
  Good and informative ,particularly useful to students and persons preparing for special examinations..current affairs..
  I just read mahatma jyothirao poole story now.
  Really 👏 fantastic and the matter is reliable …
  Expecting more updates and important breaking news instantly…
  Anyways it is informative..
  Wish you all the very best srihari..👍

  • మీ అమూల్యమైన స్పందనకు హృదయపూర్వక ధన్యవాదములు ప్రియమిత్రమా. మీ అందరి సహాయ సహకారములతో, ప్రోత్సాహంతో మన వెబ్ సైట్ ను మరింత మందికి ఉపయుక్తంగా తీర్చిదిద్ది మీ లాంటి శ్రేయోభిలాషులందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.