చర్చ లేకుండానే సాగుచట్టాల రద్దు

 చర్చ లేకుండానే సాగుచట్టాల రద్దు

సభ్యలు గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం

చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టినా పట్టించుకోని స్పీకర్‌ ఓం బిర్లా

భూమిపుత్ర,న్యూఢిల్లీ:

సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజే వివాదాస్పద సాగుచట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నుంచి బయటికి వచ్చి, తమ తమ స్థానాల్లో కూర్చుంటే చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభ కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా సభ్యులు సహకరించాలని కోరారు. అయితే దీనిపై విపక్షాలు సహకరించకపోవడంతో సాగుచట్టాల రద్దు బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. చట్టాలను ఎంత హడావిడిగా తెచ్చారో అంతే హడావిడిగా రద్దుకు పూనుకోవడం గమనార్హం. సాగుచట్టాల పై రైతులకు అవగాహన కల్పించలేకపోయామన్న ప్రధాని మోడీ రద్దుచేసే ముందు  మంచేంటో చెప్పే ప్రయత్నం చేయలేదు.సోమవారం సభ ప్రారంభం కాగానే దివంగత సభ్యులకు సభ సంతాపం తెలిపింది. అనంతరం సభ్యులు తమ వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గందరోగళానికి తెరతీసారు. ఈ క్రమంలో సభను 15 నిముషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

వాయిదా అనంతరం ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. చర్చ జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌, నిరసనల మధ్య కీలకమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. గత ఏడాది మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చర్చ లేకుండా మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయడంతో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. అయితే చర్చను చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పిన స్పీకర్‌ బిర్లా.. ఆ గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ ఆవరణలో ఆ పార్టీ నేత సోనియా గాంధీ నేతృత్వంలో ఎంపీలు నిరసన చేపట్టారు.

Related News

Leave a Reply

Your email address will not be published.