సబ్సిడీ వేరుశనగ విత్తనాలకు రైతులు దూరం

 సబ్సిడీ వేరుశనగ విత్తనాలకు రైతులు దూరం

భూమిపుత్ర,అనంతపురం:

ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన సబ్సిడీ వేరుశనగ విత్తనాల పట్ల రైతుల్లో అనాసక్తి వ్యక్తం అవుతోంది. నలభై శాతం రాయితీ ఇచ్చాక కూడా రైతులు నికరంగా తమ జేబుల్లో నుండి పెట్టుకోవాల్సిన సొమ్ము కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)తో సమానంగా ఉండటం, నాణ్యత లేమి, తమ పంటను తమకే విత్తనాలుగా ఇవ్వడం, ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు బదులు మూడు మూటల కాయలే ఇవ్వడం, కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఉధృతి, ఇత్యాది కారణాల వల్ల సబ్సిడీ విత్తనాలపై ఆసక్తి చూపించట్లేదు. సీజన్‌ సవిూపిస్తున్నప్పటికీ సిద్ధం చేసిన విత్తనాల అమ్మకాల్లో మందగమనంపై సర్కారు ఆరా తీస్తోంది. ఇప్పటికే రైతులు విత్తనాలు తీసుకోవట్లేదంటూ కలెక్టర్ల నుండి ప్రభుత్వానికి అభిప్రాయాలు, నివేదికలు అందినట్లు తెలిసింది.

రెడీ చేసిన సీడ్‌ పంపిణీ ప్రారంభించి 12 రోజులైనా సగం కూడా రైతులు తీసుకోకపోవడంపై వ్యవసాయశాఖ, ఎపి సీడ్స్‌లో ఆందోళన అధికమైంది. వ్యవసాయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనాలు వేసేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె), మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సర్కారు నెలకొల్పిన వ్యవసాయ సలహా సంఘాల్లో సబ్సిడీ విత్తనాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాలని యోచిస్తున్నారు.వేరుశనగను రాయలసీమ జిల్లాల్లోనే రైతులు సాగు చేస్తారు. అనంతపురంలోనే 80 శాతం సాగవుతుంది. మొత్తవ్మిూద 4.5 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక వేశారు. ఒక్క అనంతపురంలో 3 లక్షల క్వింటాళ్ల పంపిణీ టార్గెట్‌. దాదాపు 2.90 లక్షల క్వింటాళ్లు సేకరించగలిగారు.జూన్ నెల 17న ఆర్‌బికెల ద్వారా విత్తనాలుపంపిణీని మొదలు పెట్టారు. అంతకు వారం ముందు నుండి రైతుల పేర్ల నమోదు ప్రారంభించారు. కాగా ఇప్పటికి 1.50 లక్షల క్వింటాళ్లకే రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాటిలో 1.20 లక్షల క్వింటాళ్లకు నాన్‌-సబ్సిడీ అమౌంట్‌ చెల్లించారు. అమౌంట్‌ చెల్లించిన దాంట్లో లక్ష క్వింటాళ్లే రైతులకు చేరాయి.

రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారిలో 30 వేల క్వింటాళ్లకు నాన్‌-సబ్సిడీ అమౌంట్‌ను చెల్లించనందున నిబంధనల ప్రకారం విత్తనం ఇవ్వలేదు. వాళ్లు తమ వాటా డబ్బు కడతారో లేదో తెలీదు. విత్తనాల పంపిణీకి ఇంకా రెండు వారాల గడువు ఉన్నప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకున్నాక మహా అయితే మరో 50 వేల క్వింటాళ్లు సేల్‌ కావడం గగనమని జిల్లా అధికారులు అంచనా వేశారు. రెడీ చేసిన సీడ్‌లో కనీసం లక్ష క్వింటాళ్ల వరకు సేల్‌ అయ్యే పరిస్థితి లేదని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇదే.అనంతపురం, ఇతర వేరుశనగ పండే జిల్లాల్లో రైతులు ఆ పంట నుండి వేరే పంటలకు మళ్లుతున్నారని (క్రాప్‌ డైవర్శిటీ) సాకు వెతికారు. అందుకే విత్తనాలను రైతులు తీసుకోవట్లేదని నివేదికలు తయారు చేస్తున్నారు. వ్యవసాయ సలహా మండళ్లల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. అనంతపురం కలెక్టర్‌ టెలి కాన్ఫరెన్స్‌ పెట్టి అధికారులకు సూచించారని తెలిసింది. మిగతా జిల్లాలూ అదే బాట పడుతున్నాయంటున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *