ప్రముఖ కథా రచయిత కారా మృతి

 ప్రముఖ కథా రచయిత  కారా మృతి

భూమిపుత్ర, శ్రీకాకుళం:

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. జిల్లాలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్‌ను కారా మాస్టారు అందుకున్నారు. 1996లో కారా మాస్టారు సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాస్టారు ఈరోజు కన్నుమూశారు. దీంతో తెలుగు సాహితీలోకం తీవ్ర దిగ్భ్రాంతి లో మునిగిపోయింది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారుల నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

కథకు చిరునామాగా, ’కథానిలయం’ పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు. రామారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.కారా మాస్టారు తన దైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన వేలాది మంది శిష్యులు, అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా1964లో వ్రాసిన యజ్ణం కధా రచయితగా తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయనది. ఫ్యూడల్‌ వ్యవస్థలోని దోపిడి కి అద్దంపడుతుంది. అందుకే ఈ రచన రష్యాలో అనువదింపబడి ప్రపంచ గుర్తింపు పొందింది. భావితరాలను దృష్టిపెట్టుకుని ఫిబ్రవరి 22, 1997లో శ్రీకాకుళంలో కధానిలయం స్థాపించారు. కేంద్ర సాహిత్య అకాడవిూ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆరంభమైన ఈ కథా నిలయం లక్ష పుస్తకాలతో అలరారుతుండటం విశేషం.

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సరళమైన రచన శైలితో వేలాది అభిమానులను ఆకట్టుకున్నారు. కుట్ర, రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన రచనలూ ఆదరణ పొందాయి. సాహిత్య అకాడవిూ గ్రహీత, కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సంతాపాన్ని తెలియజేశారు. కారా మృతిపట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ’ కారా ’ చిరస్మరణీయులన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాస్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని కృష్ణదాస్‌ చెప్పారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *