పీకే ప్రకటనతో కాంగ్రెస్‌ లో చిగురించిన ఆశలు

 పీకే ప్రకటనతో కాంగ్రెస్‌ లో చిగురించిన ఆశలు

భూమిపుత్ర, బ్యూరో:

ఒక్కో సందర్భంలో అవకాశం తొంగి చూస్తుంది. అపాయమూ పొంచి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. అధికారానికి బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి అవకాశమూ, అపాయమూ రెండు కలగలిసి కనిపిస్తున్నాయి. 2014 నుంచి ప్రారంభమైన పార్టీ పతనం తాజాగా సాగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పతాక స్థాయికి చేరింది. దీంతో సొంతంగా అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ అధిష్ఠానం లోకువై పోయింది. అగ్రనాయకత్వం మాటలను పెడచెవిన పెట్టి తమకు గిట్టని వారిని పూర్తిగా అణచివేసేందుకు ముఖ్యమంత్రులు స్వయంగా పూనుకుంటున్నారు. దీని ప్రభావం పార్టీలో తీవ్రస్థాయి అసమ్మతికి దారి తీస్తోంది.

ఈ సందర్బాన్ని ఏఐసీసీ నాయకత్వం సద్వినియోగం చేసుకుంటే కాంగ్రెసు పార్టీ ప్రక్షాళన సాధ్యమవుతుంది. ఒకవేళ బ్యాలెన్స్‌ తప్పితే ఆయా ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదమూ ఉంది.నాయకులు తల ఎగరవేసే ధోరణి కాంగ్రెసులో ఈ రోజు కొత్త కాదు. ఐరన్‌ లేడీ ఇందిరాగాంధీకే ఈ సమస్య తప్పలేదు. జనతాపార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెసు పాలించేది. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన అధినేత్రికి కనీస మన్నన దక్కకుండా అప్పటి కాంగ్రెసు ముఖ్యమంత్రి వ్యవహరించారనేది పార్టీలో ఇప్పటికీ చెప్పుకుంటారు. తాజాగా పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రులు కూడా అధినేత్రి సోనియా గాంధీని చిన్న చూపు చూస్తున్నారనేది పార్టీ వర్గాల సమాచారం.

ముగ్గురు ముఖ్యమంత్రులనూ అసమ్మతి వెంటాడుతోంది. సీఎం ల నియంతృత్వ ధోరణి ఇందుకు కారణమనేది ఎక్కువ మంది అంగీకరిస్తున్న సత్యం. అయినా వారు లెక్క చేయడం లేదు. సమన్వయంతో పనిచేయమని అగ్రనాయకత్వం చెబుతుంటే ముఖ్యమంత్రులు బేఖాతరు చేస్తున్నారు. దీనిని అధిష్టానం ఎలా సరిదిద్దుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.నిజానికి ముగ్గురు ముఖ్యమంత్రులు పాత తరానికి ప్రతినిధులే.అమరీందర్‌ సింగ్‌, అశోక్‌ గెహ్లాట్‌, భూపేశ్‌ బాఘెల్‌ ముగ్గురూ తాము పట్టిన కుందేటి కి మూడే కాళ్లంటున్నారు. అసమ్మతిని అదుపు చేయడమో , లేదా సొంత ముఖ్యమంత్రులపైనే చర్యలకు ఉపక్రమించడమో చేస్తే తప్ప ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు చక్కబడేలా కనిపించడం లేదు.ఏపార్టీకి అయినా పవర్‌ లో లేని సమయం పరీక్షా కాలం.అధికారంలో ఉంటే అంతా మాట వింటారు. లేకపోతే తోక జాడిస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.

కాంగ్రెసు పార్టీకి ఇంతకంటే పోయేదేవిూ లేదు. కఠినంగా వ్యవహరించి కట్టుతప్పిన వారిపై వేటు వేయడం మొదలు పెట్టాలని కాంగ్రెసు వాదులు కోరుకుంటున్నారు. అప్పుడే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం పంపినట్లవుతుంది. ఇటువంటి వ్యవహారాల్లో ఇందిర చాలా దృఢంగా వ్యవహరించేవారు. కాంగ్రెసు సీనియర్‌ నాయకుల సిండికేట్‌ ను ఆమె ఒంటి చేత్తో తుత్తునియలు చేశారు. ఆ తర్వాత పార్టీలో ఎన్ని వర్గాలున్నా ఆమె మాటను జవదాటే పరిస్థితి ఉండేది కాదు. ఆ స్ఫూర్తిని తీసుకుంటూ పార్టీలో పునర్వ్యవస్థీకరణకు పూనిక వహించాలనేది పార్టీలో వినవస్తున్న డిమాండ్‌. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పెద్ద నాయకుడే కానీ వృద్ధతరం. తాను చెప్పినట్లు వినాలనే తత్వం. ఇదే అతని చివరి పదవీకాలం కావచ్చు. ఇంకా పార్టీలో పాత తరంపైనే ఆధారపడి గెలవాలనుకోవడం అత్యాశ. అలాగే రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కూడా పాత తరం ప్రతినిధే.

నూతన నిర్మాణం కోసం త్యాగాలు చేసేందుకు వారిరువురూ సిద్దంగా లేరు. పైపెచ్చు తమకు పోటీదారులు అనుకున్నవారిని అణచివేసే యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ సైతం సహచర మంత్రి దేవ్‌ సింగ్‌ తో గిల్లికజ్జాలతో అధిష్ఠానాన్ని చికాకు పరుస్తున్నారు. అధిష్టానం చూస్తూ ఊరుకుంటే పరిస్థితి చేజారిపోవచ్చు. వీరితో పడలేని వారంతా బీజేపీ, ఇతర ప్రత్యర్థి పార్టీలను ఆశ్రయిస్తే కాంగ్రెసులో ఎదగాల్సిన భవిష్యత్‌ నాయకులకు కొరత ఏర్పడుతుంది.ఇతర పార్టీల నుంచి కాంగ్రెసుకు ఇప్పుడిప్పుడే సంకేతాలు వస్తున్నాయి. 2024 నాటికి ఎన్డీఏకు వ్యతిరేకంగా బలమైన కూటమి నిర్మించేందుకు అంతా కలవాలనే ప్రతిపాదనలు మొగ్గ తొడుగుతున్నాయి.

అయితే నాయకత్వ బాధ్యత కాంగ్రెసుకు అప్పగించేందుకు కొన్ని సమస్యలున్నాయి.ప్రతిపక్షాల్లో ఉన్న మమత, పవార్‌ వంటి నాయకులు ఈ సందర్భాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెసును వేదికగా వాడుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆ పార్టీకి సారథ్యం ఇవ్వాలనుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే జట్టుకు అనుసందాన కర్తగా కాంగ్రెసు ఉంటే చాలనుకుంటున్నారు. దీనికి కాంగ్రెసు అధిష్ఠానం త్యాగాలకు సిద్దం కావాలి. ముందుగా పార్టీని బలోపేతం చేసుకుంటే మిగిలిన పార్టీలు కాంగ్రెసు చుట్టూ చేరకతప్పదు. 2023నాటికైనా పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేసుకుని రాష్ట్రాల్లోనూ యువనాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే కాంగ్రెసుతో జత కూడేందుకు ప్రాంతీయ పార్టీలు ఉత్సాహ పడతాయి.

ఏదేమైనా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అధికారిక బాధ్యతలు ఉండవు.సాహసిస్తే పార్టీ పునర్నిర్మాణానికి ఇదే సరైన సమయం. ఇందిరాగాంధీ తన కాలంలో ఇటువంటి సాహసోపేత నిర్ణయాలకు పెట్టింది పేరుగా నిలిచారు. అనేక మంది పెద్ద నాయకులను పక్కన పెట్టి తన విధేయులకు పీఠం వేశారు. పక్కాగా ఫలితాలనూ రాబట్టారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని ఎన్నికల వ్యూహకర్త గా విజయపరంపరను కొనసాగిస్తున్న ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయతీరాలను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అందుకు ప్రశాంత్ కిషోర్ కూడా సానుకూలంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *