ఎన్నికల ఫలితాలపై ప్రజలలో నిరాసక్తత

 ఎన్నికల ఫలితాలపై ప్రజలలో నిరాసక్తత

భూమిపుత్ర,జాతీయం:
కరోనా సంక్షోభాన్ని, సెకండ్‌ వేవ్‌ తీవ్రతను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఎవరి సత్తా ఏమిటో ఆదివారం తెలియబోతున్నది. ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం జరుగబోతున్నది. పశ్చిమబెంగాల్‌,తమిళనాడు, అసోం,పాండిచ్చేరి,కేరళ రాష్ట్రాల ఎన్నికతో పాటు తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు తేనున్నాయి. అయితే ఈ ఎన్నికల తరవాత వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తుంటే బిజెపికి ఎక్కడా పెద్దగా ఆశాజనకంగా ఫలితాలు ఉండకపోవచ్చని అంటున్నారు. అలాగే ప్రజలు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్రమంలో ఎన్నికలు, ఫలితాలపై పెద్దగా ఆసక్తిగా లేరనే చెప్పాలి. ముఖ్యంగా అధికారంలో ఉంటూ గత ఏడేళ్లుగా ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన మోడీ ద్వయానికి ఈ ఫలితాలు పరీక్షగానే నిుస్తాయి. కరోనా తీవ్రంగా విస్తరించి ప్రజలు ప్రాణమో భగవంతుడా అని అంటున్న తరుణంలో పట్టుబట్టి మరీ ఎన్నికలు నిర్వహించిన ఘనత ఓ రకంగా మోడీదే అని చెప్పుకోవాలి.

ప్రజలకు ఆక్సిజన్‌ అందక, వైద్యం దొరక్క ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్న తరుణంలో పాలకులు తమ పైశాచిక ఆనందం తమదే అన్నట్లుగా వ్యవహరించారు. హైకోర్టు,సుప్రీం కోర్టు హెచ్చరిస్తున్నా ఎన్నిక నిర్వహణే అంతిమ లక్ష్యంగా కేంద్రంలోని పెద్దలు వ్యవహరించారు. బిజెపి అధికారంలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తుందని అనుకున్న భ్రమలు తొగిపోయాయి. వాజ్‌పేయ్‌, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, సుష్మాస్వరాజ్‌ లాంటి నేతలున్న పార్టీ ఇప్పటి బిజెపి కాదు. మొత్తంగా బిజెపి తన సిద్ధాంతాలను విడిచి ప్రయాణిస్తోంది. నెలన్నరపాటు దఫదఫాలుగా జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలపై జనంలో గతంతో పోలిస్తే ఆసక్తి తగ్గింది. బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న కృతనిశ్చయంతో వున్న బీజేపీ అందుకు తగినట్టు భారీ స్థాయిలో ప్రచార యుద్ధం సాగించింది. ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వంటి హేమాహేమీలు సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అన్నిచోట్లా భారీయెత్తున జనం హాజరయ్యారు. కరోనా వైరస్‌ విజృంభణను పట్టించుకోకుండా, దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యూహాలు రూపొందించకుండా బెంగాల్‌పైనే మోదీ దృష్టి సారించారన్న విమర్శలు కూడా వచ్చాయి. మమత సైతం బీజేపీకి దీటుగా ముందుకురికారు. ఇంత సుదీర్ఘమైన పోలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అనేకసార్లు తప్పుబట్టారు. చివరి మూడు దశలనూ ఒకే దశగా మార్చి ఎన్నికలు నిర్వహించాని డిమాండ్‌ వచ్చినా సంఘం పెద్దగా స్పందించలేదు. బెంగాల్లో 8వ విడత 29న ఆఖరి దశ పోలింగ్‌ పూర్తయ్యాక యధావిధిగా వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తుంటే అధికార బిజెపికి ఆశాజనకంగా లేదనే చెప్పాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిదో దశ పోలింగ్‌తో అక్కడి సుదీర్ఘ ఎన్నిక పక్రియ ముగియడంతో కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కరోనా మహమ్మారి దేశమంతా స్వైర విహారం చేస్తూ, పౌరుల ప్రాణాలు తోడేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మునుపటిలా ఫలితాపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి కానరావడం లేదు. మొదటినుంచీ అందరూ అనుకుంటున్నదే దాదాపుగా ఈ సర్వే లు కూడా చెప్పాయి.

పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరుంటుందని, తమిళనాట డీఎంకే, అస్సాంలో బీజేపీ, కేరళలో వరసగా రెండోసారి వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డీఎఫ్‌) విజయం సాధించవచ్చని జోస్యం చెప్పాయి. పుదుచ్చేరిలో తొలిసారి ఎన్‌డీఏకు అధికారం దక్కబోతున్నదని అంచనా వేశాయి. అంకెల్లోనే కాస్త వ్యత్యాసాున్నాయి. అయితే చివరి రెండు దశల పోలింగ్‌నాటికి దేశం నలుమూలలా కరోనా పర్యవసానంగా నెలకొన్న విషాదకర పరిస్థితులు బెంగాల్‌ను ఏమేరకు ప్రభావితం చేసివుంటాయన్నది వేచిచూడాలి. తమిళనాడులో నేతలు పాల్గొన్న సభల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ లు ధరించడం వంటివి లేకున్నా అది పట్టించుకోలేదని, ఫలితంగా కరోనా కేసులు పెరిగాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎన్నిక సంఘానికి కనువిప్పు కావాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికలు నిర్వహించడం సరైందికాదు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నాయకులు కట్టు తప్పినప్పుడు కూడా ఇలాంటి ఆదేశాలు వచ్చివుంటే బాగుండేది. పార్టీలతో నిమిత్తం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా తగిన చర్యలకు ఉపక్రమిస్తే మరింత బాగుండేది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికల బహిరంగ సభను కరోనా విజృంభణ కారణంగా రద్దు చేసుకున్న తీరు అభినందనీయం. ఈసీ కూడా ఆ దిశగా ఆలో చించి ప్రచారపర్వాన్ని కుదించడం, ఆంక్షలు విధించడం వంటివి చేసివుంటే బాగుండేది.

ఇకపోతే ఫలితాలు ఎలా ఉన్నా ఒరిగేదేవిూ లేదు. మరో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినా పెద్దగా ప్రజలకు ఒనగూరే లాభం ఉండదు. వివిధ రాష్ట్రాల్లో బిజెపి పాలన నానాటికి తీసికట్టుగా మారింది. ప్రజలెప్పుడూ కూడబలుక్కున్నట్టు ఒకే మాదిరి ఓటేస్తారు. కానీ వ్యక్తులుగా ఎవరికి వారు విజేతల గురించి అయోమయంలో వుంటారు. ఫలితాలు వెలువడినప్పుడు ఆశ్చర్యపోతారు. పోలింగ్‌ రోజున సర్వే చేసేవారిని ముప్పుతిప్పలు పెడతారు. ఓటేసింది ఒకరికైతే మరొకరి పేరు చెబుతారు. వారిని మాటల్లోపెట్టి ఎటువైపు మొగ్గుందో తెలుసు కోవడం అంత సులభమేమీ కాదు. ఆదివారం ఎటూ వాస్తవ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గరగా ఉన్నాయా లేదా అన్నది చూడాలి. అలాగే ప్రజలు కూడా కరోనా వేళ ఎలా స్పందించారన్నది కూడా తేలనుంది. అయితే దేశంలో ప్రజలు మాత్రం ఈ ఫలితాలపై పెద్దగా ఆసక్తిగా లేరన్నది మాత్రం నిజం. కేవలం స్థానిక ప్రజలు మాత్రమే వీటిపై స్పందించే అవకాశాలు ఉన్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *