విద్యారంగ సంక్షోభంపై విస్తృత అధ్యయనం జరగాలి !!

 విద్యారంగ సంక్షోభంపై విస్తృత అధ్యయనం జరగాలి !!

భూమిపుత్ర,సంపాదకీయం:

కరోనా వైరస్ మూలంగా ప్రైవేట్‌ విద్య గగన కుసుమంగా మారింది. ఆన్‌లైన్‌ విద్యకు కూడా ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. టీచర్లకు జీతాలు చెల్లించకున్నా పైసా ఖర్చు లేకున్నా విద్యార్థులు మాత్రం డబ్బులు చెల్లించకుంటే ఆన్‌లైన్‌ తరగతుల నుంచి లాగిన్‌ కావడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల వసూళ్లపై ఆందోళనలు చేస్తున్నా, కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ దశలో విద్యార్థులకు అండగా ప్రభుత్వాలే నిలవాలి. లక్షలాదిగా ఉన్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ఆదుకోవాలి. వీరందరితో పాఠశాల విద్యను బలోపేతం చేయాలి. ఇకపోతే ఫీజులతోనే బతుకీడ్చే వేలాది చిన్ని పాఠశాలలు చితికి పోయాయి. అందులో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. ఇలా పెనవేసుకుని ఉన్న అనేక సమస్యలపై కేంద్రం అధ్యయనం చేయాలి. ఆదుకునే విదంగా పథకరచన చేయాలి.

దీనికితోడు ప్రజలు థర్డ్‌వేవ్‌ హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్ల కరోనా ముప్పు మళ్లీ ముంచుకుని వచ్చే ప్రమాదం ఏర్పడిరది. ఈ కారణంగా మళ్లీ అంతా ఇంటికే పరిమితం కావడం, లేదా కొందరు ఆస్పత్రి పాలు కావడం తప్పనిసరి అనివార్య పరిణామంగా కనిపిస్తోంది. పిల్లలు ఇప్పటికే స్కూళ్లు లేకపోవడంతో మానసికంగా కృంగి పోతున్నారు. ఆన్‌లైన్‌ చదవుల తో పిల్లల్లో మానసిక వికాసం జరగడం లేదు. ఆన్‌లైన్‌ విద్య అందరికీ అందుబాటులో లేకపోయినా కొంత వరకు విద్యను కొనసాగించడానికి మాత్రమే అవకాశంగా చూడాలి. దీని మూలంగా ఇళ్లే పాఠశాలగా, తల్లిదండ్రులే ఉపాధ్యాయులుగా అవతారం ఎత్తారు. అయినప్పటికీ విద్యార్థి నైపుణ్య శిక్షణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఐదు నుండి పదకొండేళ్ల వయసు గల పిల్లలు స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కు పోతూ వివిధ ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటున్నారు.

ప్రధానంగా కంటిచూపు సమస్య వస్తోందని తల్లిదండ్రులు అంటు న్నారు. గతంలో అడిగినా సెల్‌ఫోన్‌ అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడేమో బలవంతంగా సెల్‌ఫోన్‌ ఇచ్చి కూర్చో బెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వయసు విద్యార్థులు కూడా పాఠాలను అర్థం చేసుకోవడం లో తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ తరగతులు నిర్వహించడానికే కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఫోన్లు, ట్యాబ్‌లు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు వంటి స్మార్ట్‌ గాడ్జెట్‌లను కొనుగోలు చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారు. ఇంకా కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా పెట్టే ఒక్క పూట భోజనం కోల్పోయారు. అలాగే గత ఏడాదిన్నరగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతికంగా తరగతి గదిలో కలుసు కొనే అవకాశమే లేకుండా పోయింది. అయినప్పటికీ విద్యాబోధన ఏదోలా ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో ఇందులో భాగస్వాములైన అన్ని పక్షాలూ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి.

భౌతికంగా తరగతి గదిలో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల నుండి మధ్యస్థ పాఠశాలకు వచ్చేసరికి రాయడం, మాట్లాడటం, చదవడం, వినడం వంటి నైపుణ్యా లను ఒంటబట్టించుకొనే వారు. విద్యతో పాటు శారీరక శ్రమ, ఆటల పోటీలు, సాంస్కృతిక ఉత్సవాలు, విహార యాత్రలు విద్యార్థులలో జీవిత నైపుణ్యాలను పెంపొందించేవి. వీటికి ఇప్పుడు ఎంతమాత్రమూ వీలు లేకుండా పోయింది.తరగతి గదిలో విద్యార్థుల వైఖరులు, ప్రవర్తనలను గమనిస్తూ వారిని సక్రమమైన దారిలో మార్గనిర్దేశం చేసి విద్యార్థులను సామాజిక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషిస్తారు. వాస్తవానికి, చాలా మంది టీచర్లు నల్లబల్ల, సుద్దముక్కను ఉపయోగించి బోధించే నైపుణ్యం గలవారు. ఆన్‌లైన్‌ టీచింగ్‌ మోడ్‌ చాలా మంది ఉపాద్యాయులకు కొత్తది. ప్రత్యేకించి కంటెంట్‌ను సిద్ధం చేయడానికి, కంటెంట్‌ను పంచుకోవ డానికి, ఉపన్యాసం ఇవ్వడానికి, అది విద్యార్థలుకు అర్థమయ్యేలా చేయడం ఇబ్బందికర విధానంగానే చూడాలి.

అలాగే ఈ తరహా బోధనను అర్థం చేసుకోవడంలో విద్యార్థులకు కూడా కొత్తే కావడంతో అటు టీచర్లు, ఇటు విద్యార్థులు కూడా తికమక పడక తప్పడం లేదు. ఇలా బోధనతో పాటు మూల్యాంకనాలను రూపొందించడానికి ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌ బోధనలో విద్యార్థి పనితీరును అంచనా వేయడం వంటి వాటికి మాత్రమే టీచర్ల పాత్ర పరిమిత మైంది. మెంటర్స్‌, గైడ్స్‌ మొదలైన ఇతర ముఖ్య పాత్రలను నిర్వర్తించలేకపోతున్నారు. కరోనా అనుభంతో తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ పాఠశాలల కంటే త్వరగా పాఠశాలలు తెరవాలని కోరుకుంటున్నారు. ఇంట్లో వారిని కంట్రోల్‌ చేయడం అంత సులభం కాదన్న విషయం వారు గుర్తించారు. నేరుగా స్కూలుకు వెళ్లే విద్యా విధానంలో అందరూ సంతోషంగా ఉండేవారు. పిల్లలు రోజుకు ఎనిమిది గంటలు ఇంటి నుండి దూరంగా ఉండేవారు. దీనికి తోడుగా, కొంతమంది తల్లి దండ్రులు వారిని స్పోర్ట్స్‌, ఫిజికల్‌ ఫిట్నెస్‌, డ్రాయింగ్‌, సంగీతం మొదలైన క్లాసులలో చేర్పించడం ద్వారా బహుముఖ ప్రజ్ఞ పొందేలా చేసేవారు.

అయితే కరోనా మహమ్మారి ఇలా ప్రతి విద్యార్థినీ ఇళ్ళలోనే ఉండేలా కట్టడి చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్‌ తరగతులు, హోం వర్క్‌, అసైన్‌మెంట్‌లు, కనెక్టివిటీ సమస్యలతో సతమతమ వుతున్నారు. వారు పిల్లలతో పాటు తరగతులకు హాజరు కావాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా, చాలామంది తల్లిదండ్రులు తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా అనేక మంది ఆదాయం కోల్పోయారు. ఈ క్రమంలో పిల్లలను ప్రైవేట్‌ పాఠశాల్లో చేర్పించేందుకు అవసరమైన డబ్బును కట్టలేక పోతున్నారు. ఇలా ఆన్‌లైన్‌ తరగతుల చుట్టూ అనేక సమస్యలు పెనవేసుకుని వచ్చాయి. అలాగే పిల్లల విద్య కొనసాగింపు ప్రశ్నార్థకమైంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు అనువుగా ఉన్న వృత్తిలో ఉండే ఫార్మసీ షాపులు, కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపులు, చిల్లర దుకాణాలు మొదలైన వ్యాపారాలలో సహాయం కోసం తీసుకుని వెళ్తున్నారు.

అలాగే కార్పోరేట్‌ తరహాలో కాకుండా గల్లీల్లో స్కూళ్ళు నడిపే వారు కూడా ఆదాయం కోల్పోయారు. వారికి ఆదాయం పడిపోయింది. దీంతో ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహించలేని స్కూళ్లు అనేకం ఉన్నాయి. ఇలాంటి పాఠశాలలను నిర్వహించే వారుఅనేక ఆటుపోటులను ఎదుర్కోవడం వలన పాఠశాల నిర్వహణ కష్టసాధ్యం అవుతోంది. ఫీజులు రాకపోవడంతో బోధన, బోధనేతర సిబ్బంది జీతాలను చెల్లించ లేక పోయారు. ఇలాంటి చిక్కుముడులు ఇప్పుడు అనేకం కనిపిస్తున్నాయి. ఇది విద్యావ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించే అంశంగా చూడాలి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించడంతో పాటు, స్వయం ఉపాధికి భంగం కలిగించిన కారణంగా ఈ రంగాన్ని ఆదుకోవాలి. ఇందుకోసం విస్తృత అధ్యయనం జరిగితే తప్ప చిక్కుముడుల నుండి బయటపడలేము.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *